''క్యాంపస్ అంతటా హఠాత్తుగా ఈ మృత్యు వాతావరణమేమిటి?'' బస్సు దిగిన మరుక్షణం స్నేహితురాల్ని అడిగిందామె.
''ఏమిటి?! నీకు తెలియదా...?''
వాతావరణమంతా గంభీరంగా కనిపిస్తోంది.
''తెలీదు''
''నిన్న తసనీమ్ అహరబర్ నీటి ప్రవాహంలో పడి కొట్టుకుపోయింది''
చూస్తూ వుండగానే స్నేహితురాళ్లిద్దరూ క్యాంపస్ మధ్యలో మూర్తీభవించిన శోకమూర్తులయిపోయారు. తొలి యువతి కళ్లు అందమైన యూనివర్సిటీ సెంట్రల్ బ్లాక్‌లో తసనీమ్ కోసం వెదకసాగాయి. 'ఆమె అక్కడెక్కడో దాక్కున్నదా?' అన్నట్టుగా-
ఏడాది క్రితం తసనీమ్ మంచి మార్కులతో ఎం.ఎ. పాసై, 'ఉర్దూ సాహిత్యంలో స్త్రీల స్థానం' అనే అంశంపై రీసెర్చ్ చేస్తోంది.
''ఇంత సౌందర్యరాశి, కల్లాకపటం లేని ప్రతిభాశాలి అయిన ఈమెను ఆ దేవుడు ఇంత చప్పున తన దగ్గరికి ఎందుకు పిలిపించేసుకున్నాడో! ఒక్కోసారి అతని న్యాయం మీద సందేహం కలుగుతూ వుంటుంది'' అంది మొదటి అమ్మాయి. ఆమె కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి.
''ఈ చిక్కుముడులనే మనిషి విప్పలేకపోతున్నాడు! ఆ పైవాడి దగ్గర అంతా చీకటే తప్ప మరేంలేదని నాకు అనిపిస్తూ వుంటుంది''
''పూర్ గర్ల్...! ఎన్ని కలలు... ఎన్ని కలలు కంటూ వచ్చిందో! 'ఇప్పుడిది చేస్తాను... తర్వాత అది చేస్తాను. సమాజాన్ని పతనం నుంచి బయటపడెయ్యటానికి నేను యుద్ధం చేస్తాను. స్త్రీ విముక్తి కోసం నా జీవిత సర్వస్వాన్ని ధారబోస్తాను. నైతిక విలువలను పునరుద్ధరించేందుకు నడుం బిగిస్తాను....' ఆమె మాటలు వింటూంటే తాను విధాత దగ్గర్నుంచి దీర్ఘాయుష్షుని రాయించుకువచ్చిందా? అన్నట్టుగా అనిపించేది... ఇప్పుడు చూడు... షీ యీజ్ నోమోర్...!''
దాల్ సరస్సు ఒడ్డునున్న హజరత్‌బల్ దర్గాని ఆనుకొని, ఎన్నో ఎకరాలలో వ్యాపించిన ఆపిల్ చెట్ల సముదాయంతో ఉన్న యీ విశాలమయిన క్యాంపస్ ఈవేళ ఎంతో మౌనంగా వుంది. సాధారణంగా ఏప్రిల్- మే నెలల్లో ఆపిల్ చెట్ల కొమ్మలు పళ్లతో వంగి ఉన్నప్పుడు క్యాంపస్ అంతటా ఉల్లాసభరిత వాతావరణం వ్యాపించి వుండేది. ఆ ప్రకృతి సౌందర్యానికి వసపిట్టల్లా వదరుతూ, గోలగోలచేస్తూ ఆ అందాలరాశులు మరింత వన్నె చేకూర్చేవారు. చాలా తడవలు, ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన ఎవరో ఒక ఉత్సాహవంతుడయిన పైలట్ తన హెలికాప్టర్‌తో ఈ అందమైన సుందరాంగుల తలల మీద నుంచి పల్టీలు కొడుతూ ఆనందించేవాడు. అయితే ఈనాటి వాతావరణమే పూర్తిగా మారిపోయింది. క్యాంపస్ అంతా వల్లకాడులా మారిపోయినట్టు అనిపించసాగింది.
''యా ఖుదా! పాపం! ఆ రిజవాన్ మనసు ఎంతలా అల్లకల్లోలమయిపోయి వుంటుందో గదా! అతనికి తసనీమ్ అంటే పంచప్రాణాలు''అంది తొలి యువతి మళ్లీ.
''అదేమిటీ! అతను ఆమెతోనే వున్నాడుగదా! కింకర్తవ్య విమూఢునిలా చూస్తూ వున్నాడే తప్ప, ఏమీ చేయలేదు. హూఁ! గొప్ప అథ్లెట్! గత ఏడాది ఈత పోటీలో బహుమతి గెలుచుకున్నాడు... నీటి ప్రవాహంలో తసనీమ్ మునుగుతూ, తేలుతూ, కాళ్లూ చేతులూ కొట్టుకుంటుంటే, అతను చూస్తూ వున్నాడు. అలా చూస్తూనే నిలుచున్నాడు ఏమీ చేయకుండా!'' రెండో అమ్మాయి ఆవేశంతో చెప్పుకొచ్చింది జరిగిన సంఘటన గురించి.
''నిన్న నా ఒంట్లో బాగోక, నేను పిక్నిక్‌కి రాలేకపోయాను. నువ్వు చూశావుకదా, నీ కళ్లతో సంఘటనంతట్నీ?''
''ఆఁ! నేను వెళ్లేను! ఈ పాపిష్టి కళ్లతోనే అంతా చూసేను'' రెండో యువతి కంఠం రుద్ధమయ్యింది.
''విధిరాత ఎవరు తప్పించగలరు? బహుశా ఇది దైవేచ్ఛ కావచ్చు!'' తొలియువతి ఓదార్పుగా అంది. మొత్తం ఈ విషాద సంఘటన గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనే తపన ఆమె కళ్లలో ద్యోతకం కాసాగింది. రెండో యువతికి అర్థమయిపోయింది. మనసు చిక్కబట్టుకొని, జరిగిన సంఘటనంతా వివరించింది.
''ఉదయం ఎనిమిదింటికి మేమంతా ఎక్స్‌ఛేంజ్ స్క్వేర్ నుంచి యూనివర్సిటీ బస్సుల్లో ప్రయాణమయ్యాం. స్టూడెంట్స్ అందరూ ఉదయాకాశంలో ఎగిరే పక్షుల్లా ఒకటే పకపకలూ, వికవికలూ. బస్సులు ఒక దానివెంట ఒకటి పరుగులు తీస్తున్నాయి. ఒకరితో ఒకరం మాటాడుకుందామన్నా ఒకరి కంఠం ఒకరికి వినబడని పరిస్థితి. అలవాటు ప్రకారం తసనీమ్ తన హేండ్‌బ్యాగ్ తెరిచి, ఇంగ్లీషు నవలని బయటికి తీసి చదవబోయింది. ఇంతలో రిజవాన్ వచ్చి తసనీమ్ పక్కన కూచున్నాడు. ఆమె చేతిలో పుస్తకం చూసి చికాకు పడ్డాడు. ఆవేళ ఆమెతో సంతృప్తిగా మాట్లాడాలనుకున్నాడు. తసనీమ్ చూస్తే తన ధోరణిలో తాను వుంది. అతను పెంకితనానికి దిగాడు.
''తసనీమ్ ఎప్పుడు చూసినా పుస్తకమేనా! ఇది చదువుకునే సమయమా? కనీసం ఈవేళైనా నవలని బ్యాగ్‌లో వుండనియ్''
ఆమె పెదాలమీద చిరునవ్వు లాస్యం చేసింది. రిజవాన్ అభిప్రాయాన్ని గౌరవించటానికా అన్నట్టు, ఆమె చదువుతున్న నవలని మూసేసి బ్యాగ్‌లో పెట్టేసింది.
''ఆఁ! ఏం చెబుతున్నారు?''
''గత ఆదివారం నువ్వు బహుమతుల ప్రదానోత్సవానికి రాలేదేం?''
''నాకేమయినా బహుమతి ఇస్తారా? అలాంటప్పుడు అక్కడికి నేను వచ్చి చేసేదేమిటి?ఐ హావ్ నో ఇంటరెస్ట్ ఇన్ అథ్లె టిక్స్! ఆవేళ ఏమయినా ప్రత్యేకత జరిగిందా?'' ఆమె ఏమీ ఎరుగని దానిలా అడిగింది అతణ్ణి.
''నీకు బహుమతి రాలేదు. నిజమే! ఇతరులను ప్రోత్సహించటానికైనా రావచ్చుగదా. ఈ ఏడాది కూడా నాకు మూడు బహుమతులు లభించేయి - రెండు ఈతలోనూ, ఇంకోటి లాంగ్ జంప్‌లోనూ''
''అవి కూడా కంచువిగదా! ఏ రోడ్డు సైడు దుకాణంలోనో కారుచౌకకి కొని తెచ్చివుంటారు'' అందామె వెటకారంగా.
''బంగారు పతకాలు లభించలేదనుకుంటున్నావా? నేను వాటికి అనర్హుణ్ణనుకుంటున్నావా?''
''అబ్బే! కాదు... కాదు! నీకు కోపం వచ్చినట్టుంది. నేను వూరికినే అన్నాను. నువ్వు బంగారు పతకాలు గెలుచుకున్న విషయం నాకేం తెలుసు?''
''తసనీమ్ నిజం చెప్పాలంటే... ఒక లోటు నిజంగానే నన్ను బాధపెట్టింది. అది అభినందించేవారు లేకపోవడం''
''అలాగేం! అయితే నువ్వు ఏ రాజకీయ మిత్రుడికో చెప్పి వుండాల్సింది - అతను ఆవేళకి రెండు, మూడు ట్రక్కుల్లో చప్పట్లు కొట్టేవారిని పంపించి వుండేవాడు''
''అంతెందుకు, రిజవాన్ మాకు కబురు పెట్టి వుంటే, మేం ఏ డబ్బూ అవసరం లేకుండానే వచ్చేసేవాళ్లం'' పక్క సీటులో కూచున్న శల్కా నవ్వుతూ అంది.
ఎదురు సీటులో కూచున్న రోశీ, శల్కా మాటని ఖండిస్తూ అంది, ''శల్కా! ఎవరి మాటల్లో కొట్టుకుపోతున్నావ్. రిజవాన్‌కి సాగితే మనచేత చప్పట్లూ కొట్టించేవాడు, పేమెంటూ ఇప్పించేవాడు.''
ఆమె మాటకి అందరూ పకపకమని నవ్వేశారు. రోశీ రిజవాన్‌ని ఎంతగానో ప్రేమిస్తోంది. రిజవాన్ మాత్రం ఆమెవేపు కన్నెత్తయినా చూడడు. మనసులో ఆమె ఉడుక్కుంటుంది. అడపాదడపా అయిష్టంగానైనా అతణ్ణి తిట్టుకుంటుంది.
బస్సులు పాంపూర్ చేరగానే గానాబజానా ప్రారంభమయింది. విద్యార్థినీ విద్యార్థుల్లో ఎక్కువ మంది తమ కళలను పరిచయం చేయసాగారు. మహమ్మద్ రఫీ, మన్నా డే, కిశోర్, లతా, ఆశాభోన్‌స్లే- అందరూ సిద్ధమయ్యారు. మేం మాత్రం చప్పట్లు చరుస్తున్నాం. బస్సులు అన్నీ గోల! గోల!
ఇంతలో సోమనాథ్ లేచి నిలబడి, గొంతు చించుకొని అరిచాడు. ''భాయీ! కాస్సేపు మౌనంగా వుండండి. నేను చెణుకులు విసురుతాను''
అంతా పకపకలతో అతనికి స్వాగతం పలికారు. అతని రూపం జోకర్ రూపంలా ఉంటుంది. బాగా పొట్టిగా వుంటాడు. పెద్ద పొట్టా, వాడూను. లోతుకుపోయిన కళ్లు. వాటి మీద గుండ్రని ఫ్రేమ్ కళ్లజోడు. నూనె వోడుతున్న తల వెంట్రుకలు- అతని వాలకం చూస్తుంటే ఏ పద్దెనిమిదో శతాబ్దపు పురోహితుడో కాడు గదా అనిపిస్తుంటుంది.
మొదటి చెణుకు విసిరాడు సోమనాథ్.
బస్సులో పెద్ద పెట్టున నవ్వులు.
రెండో చెణుకు
మళ్లీ పకపకలు...
మూడో చెణుకు
తిరిగి పకపకలు...
ఆ తర్వాత అతను వెళ్లి తన సీటులో కూచున్నాడు.
కొద్ది క్షణాల్లో ఆ మితభాషి అయిన యువకుడు వాతావరణమంతా పకపకలమయం చేసేశాడు. కొంతమంది ప్రపంచమంతటిలో చిరునవ్వులు పండించటానికే పుట్టారనిపిస్తుంది. దానికోసం వారేమైనా చేస్తారు.
పన్నెండింటికి బస్సులు అహర్‌బల్‌కి చేరుకున్నాయి. స్టూడెంట్స్ అంతా తమ తమ టిఫిన్ కారేజీలు, పేకెట్లూ తీసుకొని బస్సులు దిగారు. జలపాతానికి కాస్త దూరంగా చిన్న చిన్న గుంపులుగా విడిపోయి, గడ్డిలో కూచున్నారు.
జలపాతాన్ని చూసినవారెవరికైనా గుండెలు గుబగుబలాడతాయి. ఆకాశమంత ఎత్తు నుంచి కిందకి పడుతున్న జలరాశి ఒక పెద్ద దుప్పటిలా తెల్లటి నురగ వ్యాపింపచేయసాగింది. పార్శ్వంలో నీలాకాశం, మంచు కప్పిన పర్వతశ్రేణులు దర్శనమిస్తున్నాయి. ఎత్తు నుంచి కిందకి ధారగా నీరు పడటం వల్ల ఆర్కెస్ట్రా వాయిద్యాలన్నీ ఒక్కసారిగా వినిపిస్తున్నట్లుగా పెద్ద శబ్దం వినిపిస్తోంది.
మొదట టిఫిన్లు, టీలు ముగించుకున్నారు. తర్వాత ఆటలూపాటలూ, నాట్యం చేయడాలూ, పాటలు అందుకోవడాలూ, చివరిగా లంచ్. మాంసాహారంలో పలురకాలు ఒకవేపు. శాకాహారం వేరొక వేపు. అన్నీ పరిచివున్నాయి.
అక్కడ అన్నీ- అంతా పంచుకొని తిన్నారు. ఆ దృశ్యాన్ని చూసిన వాళ్లెవరయినా, మనిషి వర్గాలుగా, జాతులుగా విడిపోయాడని చెప్పలేడు, నమ్మలేడు.
కాసేపు విశ్రాంతి. అనంతరం సినీ గీతాలు, లలిత గీతాలు పాడుకోసాగారు. రోశీ షకీల్ రాసిన రెండు గజల్స్ వినిపించింది. తసనీమ్ జిగర్ మలిపోఖాదీ రాసిన అద్భుతమయిన ఓ గజల్ పాడింది. మరి కొందరు యువతీ, యువకులు కూడా పాటలు పాడేరు. అయితే విచిత్రమేమిటంటే, అన్ని పాటలు విషాద భరితమయినవే! ఎందుకో చెప్పలేను, నా మనసులో ఏదో తెలీని భయం పీకుతోంది. ఇంతకీ అంతమందీ ఎందుకిలా హృదయ విదారకమైన పాటలు, గజల్స్ పాడుతున్నారు. వీరు నవ్వించే, కేరింతలు కొట్టించే గీతాలు పాడరాదా.
'సంతోషం విషాదానికి రెండో పార్శ్వం. వాస్తవానికి విషాదమే జీవిత యధార్థం. అటువంటపుడు ఈవాస్తవ పరిస్థితి నుంచి మనం పారిపోవడం ఎలా?' అంటూ నా మనసు నాకు ఎదురు చెబుతోంది.
'ఆనందోల్లాసాలతో గడపాల్సిన క్షణాలని ఎందుకు మనం విషాదభరితం చేసుకుంటామో గదా' నాలో నేనే ప్రశ్నించుకోసాగాను.
''ఈ మనసుల్ని పిండే విషాద గీతాల్లోని మధుర సంగీతమే మనకి అసలైన సంతోషాన్ని కలిగిస్తుంది. అందుకే మనం యీ సంగీతం కోసం అన్వేషిస్తూ ఉంటాం'' నా మనసులోంచి వినిపించిందో కంఠం.
నెమ్మది నెమ్మదిగా సూర్యుడు పశ్చిమానికి సాగిపోతున్నాడు. చినార్ వృక్షాల నీడలు నేల నలుచెరుగులకూ విస్తరిస్తున్నాయి. జలపాతం నుంచి పడుతున్న నీళ్లు పల్చని నీలం రంగుని సంతరించుకున్నాయి. విద్యార్థులంతా చల్లని నీటిలో పాదాలను ముంచి, వువ్వెత్తున లేచి పడ్తున్న అలల్ని చేతులతో కొడుతూ, ఒకరి మీదికొకరు నీళ్లు చల్లుకుంటున్నారు. చాలామంది తీవ్రంగా ప్రవహించే నీటిని లెక్క చేయకుండానే దగ్గర్లో రాళ్ల మీద కప్పలకి మల్లే కుప్పిగంతులు వేస్తున్నారు''
మాట్లాడుతున్న స్నేహితురాలు ఒక్కసారిగా మౌనంవహించింది... తర్వాత సంఘటనని ఎలా చెప్పాలా అని మధనపడసాగింది. మాటలు ఆమె గొంతులో చిక్కుకుపోయాయి. కళ్లలోంచి అశ్రువులు ధారాపాతమయ్యాయి. చివరికి మనసు చిక్కబరచుకొంది-
''ఇంతలో ఎక్కడనుంచో ఓ ఆర్తనాదం వినిపించింది. దానితోపాటుగా లెక్క లేనన్ని గొంతులు అరిచాయి.''
''రక్షించండి...! రక్షించండి...! రక్షించండి...!'' అక్కడకి వచ్చిన వారందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకోసాగారు. అందరి కళ్లల్లోనూ కొట్టవచ్చినట్టు తాండవిస్తున్న నైరాశ్యం.
ప్రవాహ ఉద్ధృతికి తసనీమ్ కొట్టుకుపోసాగింది.ఆ అభాగ్యురాలు రెండు చేతులూ పైకెత్తి సాయం చెయ్యమని అభ్యర్థిస్తోంది. నీటి ప్రవాహంలో కొట్టుకొనిపోతూ ఏమీమాట్లాడలేని స్థితిలో వుంది.
రోశీ బితుకుబితుకుమంటూ రిజవాన్ వేపే చూడసాగింది.ఒక్కరొక్కరుగా యువ కులంతా నది వొడ్డున మౌనంగా నిలబడ్డారు తప్ప, ఏమీ చేయటంలేదు.
హఠాత్తుగా నీటిలో దబ్బున ఏదో పడిన శబ్దమయింది!
సోమనాథ్ నదిలోకి దూకి, తసనీమ్ దగ్గరికి చేరే ప్రయత్నం చేశాడు. బిడియస్తుడైన అతడు జీలం నది ఒడ్డున ఈత నేర్చుకున్నాడు. అంతేగాని, నది మధ్యలో ఈదే సాహసం ఎన్నడూ చేయలేదు. అలాంటిది ఈనాడు అలలతో పోరాడుతున్నాడు.
చివరికి సోమనాథ్ తసనీమ్ వేలు దొరకపుచ్చుకున్నాడు. ఆమె చెయ్యి అందుకొనే ప్రయత్నం చేయసాగాడు. ఇద్దరూ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. తిరిగి ఇద్దరూ విడిపోయారు.
అయినా అతను ధైర్యం కోల్పోలేదు. ఈదుకుంటూ తిరిగి తసనీమ్ వేపు వెళ్లే ప్రయత్నం చేశాడు. చివరికి ఆమె దగ్గర కు వెళ్లి, ఆమె ఎడమ భుజం గట్టిగా పట్టుకున్నాడు. తసనీమ్‌లో శక్తి లేకపోయింది. అప్పటికే ఆమె నీళ్లు తాగెయ్యడం వల్ల బరువెక్కిపోయింది. సోమనాథ్ శక్తినంతట్నీ ఉపయోగించి, తసనీమ్ నడుము పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇంతలో ఉవ్వెత్తున అల వచ్చింది. ఎదురుగా మొసలికి మల్లే పెద్ద సుడిగుండం. ఇద్దరూ ఆ సుడిగుండంలో చిక్కుకొని మునిగిపోయారు.
* * *
ఇద్దరు స్నేహితురాళ్లూ ఆర్ట్స్ బ్లాక్ దగ్గరకి వచ్చేశారు. అప్పటికే అక్కడకి విద్యార్థులూ, అధ్యాపకులూ అంతా చేరుకున్నారు. చాలామంది ఆ ఇరువురికీ శ్రద్ధాంజలి ఘటించారు. ఆ భయంకరమైన దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన వారి కళ్లలో ఇంకా కన్నీరు కారుతోంది. మాట్లాడుతున్న వారి కంఠాలు తడార్చుకుపోయాయి. ఇంతలో అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన ఓ యూనియన్ లీడరు- విశ్వంభరనాథ్ స్టేజీపైకి వచ్చాడు- అతడు ఈ దుర్ఘటన గురించి కేవలం విని వున్నాడు. కళ్లతో చూసింది లేదు. అయినా అతను అక్కడికి వచ్చి తాను తన కళ్లతో చూసినట్టుగా- ఆ సంఘటనని వర్ణించసాగాడు.
అతని కళ్లు చెమ్మగిల్లాయి. అతని మాటలు విని శ్రోతల మొహాల్లో విషాదం తాండవించసాగింది.మాట్లాడుతూ, మాట్లా డుతూ అతను వాక్ప్రవాహంలో కొట్టుకుపోసాగాడు. అతనిలోని మానవీయ భావాల మీద అతని యూనియన్ లీడర్‌షిప్పే విజయం సాధించింది. 'సోమనాథ్ చేసిన ఈ మహా బలిదానం ధర్మనిరపేక్షతకి సజీవమైన ఉదాహరణ' అనే మాటలు అతడి నోటివెంట వెలువడి నలువైపులా ప్రతిధ్వనించాయి! ఆ మాటలు శ్రోతల్లో విచిత్రమయిన అశాంతిని నెలకొల్పింది. నాకయితే, 'ఆ ఇరువురి ఆత్మలకీ ఇదొక పచ్చి బూతు తిట్టు' అనిపించసాగింది.
'సోమనాథ్ ధర్మనిరపేక్షతకి ఓ ఉదాహరణగా నిలిచేందుకే తన జీవితాన్ని త్యాగం చేశాడు' అన్న మాట నాకు మింగుడు పడటంలేదు. అతను ఓ క్షణంలో ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకోగలడు? అతను ఓ యువతి అలల్లో కొట్టుకుపోవడం చూసి, తనని తాను నిలువరించుకోలేకపోయాడు.వెంటనే నదిలోకి దూకాడు. యూనియన్ లీడరు కంఠస్వరం బల్లెంలా పవిత్రమైన ఆత్మల్ని గాయం చేసింది.
Thursday, September 27, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment