ధర్మాత్ములయ్యేందుకు రెండు సహజ మార్గాలున్నాయి. మొదటిది నిద్ర, రెండోది చీకటి! నిద్ర అంటే దీర్ఘనిద్ర. అంటే చనిపోవడమన్నమాట. చనిపోయిన తర్వాత చాలామంది ధర్మాత్ములు అవుతూ వుంటారు. పరోపకారులు కూడా అవుతూ వుంటారు. వార్తా పత్రిక సత్యానికి నోరు లాంటిది. అంచేత మృత్యు సమాచారం వార్తా పత్రికలో శోక ప్రకటనగా అచ్చయితే అతడు ధర్మాత్ముడై పోయినట్టుగానే భావించాలి. ధర్మాత్ములు కావాలని అందరికీ కాంక్ష వుంటుంది. అందుకోసమని మొదటి మార్గాన్ని అనుసరించడం కష్టం.
ఇంక రెండో మార్గం చీకటి. అంటే భ్రమ, భ్రాంతి. ఈ మార్గాన్ని పట్టుకొని చాలామంది తమని ధర్మాత్ములుగా భావిస్తూ ఆత్మతృప్తి పొందుతున్నారు. భ్రమ మార్గాన్ని తమ తర్వాతి తరం వారికి కూడా తెరిచివుంచి సుగమం చేస్తున్నారు. చాలా పురాతన కాలం నుంచి, మానవుని మనస్సులో ధార్మిక భావన పుట్టిన నాటి నుంచి ఈ రెండో మార్గం ద్వారానే తరతరాలుగా ధర్మాత్ముల ఆగమనం జరుగుతూ వచ్చింది. ధర్మాత్ములు, భ్రమాత్ములు ఒకటేనని భావింపబడుతూ వచ్చారు.
ఒక మంచి ముహూర్తంలో ఒకానొక ధర్మాత్మునితో రవిబాబుకి పరిచయం కలిగింది. ఆ ధర్మాత్ముడు అద్దెఇల్లు కోసం తిరుగుతున్నాడు. కొత్తగా ఈ టౌన్‌కి ట్రాన్స్‌ఫర్ మీద వచ్చేడు. స్కూటర్ వెనక భార్యని కూర్బోబెట్టుకొని ఇల్లు కోసం టౌనంతా తిరుగుతున్నాడు. అద్దె గురించి సమస్య లేదు. కాని వాళ్ల అవసరాల దృష్ట్యా ఈ టౌనులో ఇల్లు దొరకడం అంత తేలిక కాదు. సుయోగబాబు లాభదాయకమైన డిపార్ట్‌మెంట్లో, లాభదాయకమైన పోస్టులో పనిచేస్తున్నాడు. అతని జీతం మూడు వేలు. కాని ఇంటద్దె మాత్రం పదిహేనువందల వరకు ఇవ్వగలడు. ఆ తర్వాత అతని సంసారం ఎలా గడుస్తుందనే ప్రశ్న మనకు మనమే వేసుకొంటే చిన్న నవ్వొకటి పెదవుల మీదికి వచ్చి అక్కడ్నుంచి ముఖమంతా వ్యాపించేస్తుంది.
పదిహేను వందలు అద్దె ఇస్తామంటే ఇల్లు దొరకడం కష్టమేమీ కాదు. కాని అయ్యగారికి మాత్రం మిగతా అవసరాలతో బాటు వేరేగా మరి రెండు గదులు వుండాలి. ఒకటి కుక్కల కోసం, మరొకటి దేవుడి కోసం. బెడ్రూమ్ తగ్గినా ఫర్వాలేదు. కాని ఈ రెండు గదులు మాత్రం తప్పనిసరిగా వుండాలి.
ఈ మహానుభావుడికి ఒకేసారి ఇటు దైవభక్తి, అటు కుక్కల మీద ప్రేమని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. మహానుభావుడు గొప్ప ధర్మాత్ముడు. అతని భార్య భాగ్యవతి కూడా గొప్ప ధర్మపరాయణురాలు. అంచేత దేవుడికి, కుక్కలకి మధ్య నూలు పోగంత ఎడం వుంచారు. జడ పదార్థాల్లోను, జీవుల్లోను భగవంతుడున్నాడు. అలాంటప్పుడు కుక్కలంటే అసహ్యమెందుకు! ట్రాన్స్‌ఫర్స్ ఉండే ఉద్యోగమాయె. ముగ్గురు పిల్లలు. రెండు ట్రక్కుల సామాను. దేవుడి విగ్రహం, పటాలు. దేవుడి పూజకు పాత్రలు, పూజా సామాగ్రి. వీటన్నింటితో బాటు రెండు కుక్కలు. ఒకటి పెద్దది అల్సేషియన్, రెండోది చిన్నది టిబెటియన్. వీటన్నిటి మూలాన పెద్ద ఇల్లు ఉండడం అవసరం. ప్రస్తుత రోజుల్లో దేవుడు, కుక్క మాత్రమే రక్షకులు. మానవుడికి మానవుడే శత్రువు.
చివరికి రవిబాబు ఇంటికి దగ్గర్లో అతగాడికి ఇల్లు దొరికింది. సామానంతట్నీ మూడు ట్రక్కుల్లో వేశారు. కుటుంబమంతా ఒక ట్రాక్టర్లో బయలుదేరి ఇంటికి చేరుకున్నారు. నిజంగా చూడదగిన దృశ్యమది. మూడువేలు జీతం తీసుకుంటున్న అయ్యగారి దగ్గర లేనిదనగా ఏముంటుంది. వీళ్ళ దగ్గర ఏమిటున్నాయో లెక్కిస్తే పెద్ద లిస్టు తయారవుతుంది. అంచేత ఈ విషయాన్ని వదిలేద్దాం. వాళ్ళకి కారు వుంది. సెకెండ్ హేండ్‌ది. గేరేజ్‌లో వుంది. అంచేత ట్రాక్టర్ నుంచి దిగిన వెంటనే అతని భార్య భాగ్యవతీదేవి తమనే కుతూహలంతో చూస్తున్న ఇరుగుపొరుగు వారిని చూసి వాళ్ళు వినాలనే ఉద్దేశంతో అంది, ''ఏం ట్రాక్టరో బాబూ. అందులో కూర్చోవడం ఎంత యమయాతనో ఎవరికి తెలుస్తుంది?! కారు గేరేజిలో వున్నందువల్ల ఈ శిక్ష అనుభవించవలసి వచ్చింది''.
మహానుభావుల సామాను చూసి ఇరుగు పొరుగువారికి కళ్ళు చెదిరిపోయాయి. కాని ఆ తర్వాత మార్బుల్‌తోను, కర్రతోను, ఇత్తడితోను తయారైన భగవంతుడి విగ్రహాలు చూడగానే వాళ్ళంతా ఆశ్చర్యంతో రెప్పవేయడమే మర్చిపోయారు. దేవాలయాల్లో కూడా ఇంత పూజా సామాగ్రిని వాళ్లు చూడలేదు. ఇదంతా చూడగానే సహజంగానే జనాలందరికీ వీళ్ళమీద భక్తిభావం కుదిరిపోయింది. ఇలాంటి ధర్మ పరాయణులైన దంపతులుండటం కష్టం. నిజానికి వాళ్ళది మణికాంచన సంయోగం.
రవిబాబు భార్య అప్పుడప్పుడు పొరుగు మహానుభావుని భార్యతో మాట్లాడుతూ వుంటుంది. రవిబాబు అంటాడు, 'ధార్మికులైన ఇలాంటి వారితో సంపర్కం పెట్టుకోవడం మంచిది' అని. ఎందుకంటే వీళ్ళ సాన్నిథ్యంలో మంచి జరుగుతుంది. మేలు కలుగుతుంది. నేటి కాలంలో ధర్మమనగా ఎక్కడుంది? ధర్మపరాయణులైన ఇలాంటి వారి వల్లనే ఈ భూమి నిలబడి వుంది!
భగవంతుడి సేవ, కుక్కల సేవ స్వయంగా భార్యాభర్తలిద్దరూ తమ చేతులతో చేస్తారు. ఈ పనిలో వాళ్ళకి నౌకర్ల అవసరం వుండదు. వాళ్ళ ముగ్గురు పిల్లలు కూడా తమ పనులు తాము చేసుకొంటూ చదువుకొంటారు. తల్లిదండ్రుల మీద ఆధారపడరు.
భగవంతుని పూజలో ఎంతో సమయాన్ని గడిపే ఆమె, ఇంట్లోని మిగతా పనులకి కాలాన్ని కేటాయించలేకపోతోంది. ఆ ఇంట్లో పన్నెండు నెలల్లోనూ పదమూడు పండుగలు జరుపుతారు. దేవాలయాల్లో పూజలు జరుగుతున్నట్లుగానే వాళ్ళ ఇంట్లోనూ అన్ని ఏర్పాట్లూ జరుగుతాయి. సాయంకాలం హార్మోనియం వాయిస్తూ, తల్లిదండ్రులు, పిల్లలు భజన కీర్తనలు పాడతారు. దాంతో రాత్రి వంటగాని, పిల్లల చదువుగాని ఏదీ వాళ్లకి గుర్తుండదు. అన్ని పనులూ ఆగిపోతాయి. భజన కార్యక్రమం పూర్తి అయ్యాక వంట, భోజనం గురించి వాళ్లకి ఏ దిగులూ ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎదురుగుండా ఉన్న నాలుగు రోడ్ల సెంటర్లో ఆదర్శ హిందూ హోటల్ ఉంది. అక్కడి నుంచి భోజన పదార్థాలు తెప్పించుకుంటారు. అంతే, పని అయిపోతుంది. భాగ్యవతీదేవి ఎంతో రాత్రి వరకూ కుక్కల సేవ చేస్తూనే ఉంటుంది. అయ్యగారు వాలుకుర్చీలో కూర్చొని సిగరెట్టు కాలుస్తూ కుక్కలతో మాట్లాడుతూ ఉంటారు.
రవిబాబు భార్య భాగ్యవతీదేవితో అంటుంది, ''అమ్మగారింకా నిద్రపోలేదా?''
భాగ్యవతి వాత్సల్యం నిండిన గొంతుతో అంటుంది, ''పాపం, ఇవి నోరులేని జీవులు గదా. అంచేత వీటి సంరక్షణంతా జాగ్రత్తగా చూడాలి''
రవిబాబు అంటాడు, ''వీరి నుంచి నేర్చుకో. ఎంతటి ఔదార్యం. ఇలాంటివారిని చూడాలంటే ఎక్కడోగాని కనిపించరు''
కుక్కల్ని శుభ్రం చేస్తూ పిల్లలకు దోమతెర వేయడం కూడా ఆమె మర్చిపోతుంది. తెల్లవారేకా చూస్తే పిల్లల శరీరాలు దోమకాట్లతో ఎర్రగా ఉంటాయి. తల్లి, పిల్లలు ఉదయం ఎనిమిదింటికిగాని లేవరు. వాళ్ళ నాన్నకి తొమ్మిదవాలి. పిల్లలకి స్కూలు ఉదయం ఆరున్నరకి. పిల్లలు వెళ్ళలేకపోతున్నారు. ఆ స్కూలు పెద్ద మాస్టారు సాయంకాలం ఇంటికి వచ్చి పిల్లలకి పాఠాలు చెబుతారు.
టిఫిన్ చేసి టీ తాగుతూ పెద్ద మాస్టారు వాళ్లకి ఊరట కలిగించేలా ''మీరేం విచారించవలసిన అవసరం లేదు. పిల్లలు ఎప్పుడు ఇష్టపడితే అప్పుడే స్కూలుకి వస్తారు. అందరి పిల్లలతో మీ పిల్లలు సమానమెందుకవుతారు?'' అంటారు.
అంచేత వీళ్ళ పిల్లలు నిద్ర లేచిన తర్వాతనే స్కూలుకి వెళతారు. భజన కీర్తనల తర్వాత భార్యాభర్తలు కొంచెం సోమరసం పానం చేస్తారని వినికిడి.
రవిబాబు భార్య స్నేహలత భాగ్యవతి గారింటికి ఎప్పుడు వెళ్ళినా ఆ ఇల్లంతా దుమ్ము ధూళితో అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. భాగ్యవతి మాత్రం ఏం చేయగలదు? ఒక్కతే ఇంట్లో పని చేయాలి. నౌకర్లు వగైరా లేరు. భగవంతుని పూజలోను, కుక్కల సంరక్షణలోనూ చాలా టైమ్ గడిచిపోతుంది. ఇంటి పనుల మీద దృష్టి సారించటానికి ఆమెకి తీరుబడెక్కడిది!
స్నేహలత ఒకనాడు అంది, ''చిన్న అబ్బాయిని పెట్టుకొంటే ఇంటి పని వాడికి అప్పగించచ్చు గదా. మీరొక్కరే ఎంతని చేయగలరు?''
భాగ్యవతిదేవి అంది, ''అయ్య బాబోయ్... ఈ కాలంలో ఎవ్వర్నీ నమ్మలేం. అంచేత నేనెవ్వర్నీ ఇంటి లోపలికి రానివ్వను''.
''ఎవర్నీ నమ్మలేమనేది నిజమే లెండి. అయితే మీరొక పనిమనిషిని పెట్టుకోండి. రెండుపూటలా వచ్చి ఇంట్లో పనులన్నీ ఆమే చేసుకుంటుంది''.
భాగ్యవతి తన పెద్దపెద్ద కళ్ళని గుండ్రంగా తిప్పుతూ అంది,
''ఈ ఇంట్లోకి ఒక ఆడమనిషిని తీసుకొచ్చి నేను పాపం మూటగట్టుకోనా? చూస్తున్నారుగదా, మా ఇంట్లో ఎంతమంది దేవుళ్ళున్నారో?''
స్నేహలత మరి మాటాడలేదు. పాపం, పుణ్యం, ధర్మం, అధర్మం వీటి విషయమై స్నేహలత భావాలకి, భాగ్యవతి భావాలకి ఎంతో భేదం ఉంది. భాగ్యవతి అంది, ''మేం ఎన్నో తరాల నుంచి నియమ నిష్ఠల్ని పాటిస్తూ వస్తున్నాం. మా అత్తగారు ఇలవేల్పు శివలింగాన్ని నా చేతుల్లో పెట్టారు. అంతేకాకుండా జగన్నాథుడు, శ్రీకృష్ణుడు, విఘ్నేశ్వరుడు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి- ఈ దేవుళ్ళందరికీ పూజలు చేస్తాను. నిష్టతో మనం నడవకపోతే అశుభం కలుగుతుంది. ఒకసారి ఏమయిందంటే తక్కువజాతి అబ్బాయినొకడ్ని ఇంటిపని కోసం పెట్టుకున్నాం. వాడివల్ల మేం చాలా కష్టాలు అనుభవించేం. ప్రాయశ్చిత్తం చేసుకున్నాం. దేవుడ్ని మళ్ళీ ప్రతిష్ఠించుకున్నాం. మీకో విషయం చెప్పాలి. మా పిల్లలు స్కూలు నుంచి వస్తారా, వెంటనే వాళ్ళ బట్టలు మార్పించేస్తాను''.
స్నేహలత ఆశ్చర్యంగా అడిగింది, ''అదేం?''
భాగ్యవతి ముక్కు ముడుచుకొని అంది, ''ఈనాడు స్కూళ్ళలో తక్కువజాతి పిల్లలు చదువుతున్నారు. పిల్లలకి ఇప్పటి నుంచే ధర్మకర్మల గురించి తెలియజేయకపోతే ఆ తర్వాత వాళ్ళకేం తెలుస్తుంది? అంచేతనే ఈనాడు దేశంలో హింసాకాండ, హత్యలు లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. తల్లిలాంటి ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులే హత్య చేసేశారు. దీనికి ఒకే ఒక కారణం. ప్రజల దృష్టిలో పాపపుణ్యాలు, ధర్మ అధర్మాల మధ్య భేదం లేకుండా పోయింది.''
ధర్మానికి సంబంధించి భాగ్యవతీదేవికి ఉన్న తప్పుడు భావాలు దేశంలో ఉన్న మూడువంతుల భావి నాగరికుల్ని తప్పుడు మార్గంలోకి తీసుకువెళుతున్నాయి. అంతేకాదు, దేశ భవిష్యత్తుని అంధకారమయం చేస్తున్నాయి. ఈ విషయం ఆమెకు ఎవరు చెబుతారు?
మూఢ నమ్మకంలో మునిగిన ఈ మహిళకు కొంచెం బోధపర్చాలన్న ఉద్దేశంతో స్నేహలత నవ్వుతూ అంది, ''భగవంతుడు శివుడు, జగన్నాథుడు, శ్రీరాముడు, లక్ష్మీదేవి- ఏ దేవుడైనా, వాళ్ళకి ఏదైనా జాతి వుందా? శివుడు శ్మశానంలో ఉంటాడు. శ్మశానంలో జాతిని గురించి ఎవ్వరూ అడగరు. జగన్నాథుడు శబరి ఇంట్లో ఆశ్రయం పొందాడు. శబరి ఎంగిలి పళ్ళనే తిన్నాడు శ్రీరాముడు. లక్ష్మీదేవి ఛండాలుని ఇంట్లో ప్రసాదాన్ని స్వీకరించింది. మీ రెందుకు జాతి, ప్రాంతాల భేదాన్ని పాటిస్తున్నారు?''
భాగ్యవతి నాలుక అడ్డంగా కొరుకుతూ అంది, ''బావుంది, రాజుగారు పిడికెడు మురీలు తిన్నారని అవే అతనికి భోజనంగా పెడతామా? నిష్ఠలేని దైవారాధనకు ఏ విలువా ఉండదు. చాలామంది తమ ఇళ్ళల్లో దేవుడి విగ్రహాలు పెట్టుకుంటారు. వాళ్ళంతా నియమ నిష్ఠలతో ఆరాధన, పూజలు చేస్తున్నారా? అందరిచేతి పూజల్నీ భగవంతుడు స్వీకరించడు. అలాగే జరిగితే, రకరకాల కష్టాలూ అవీ ఎందుకొస్తున్నాయంటారూ?''
స్నేహలత అంది, ''అలాగయితే మీ ఇంట్లో మాంసం, చేపలు వగైరా వండరా? మీరు దేవాలయంలో కంటే ఎక్కువగా నియమ నిష్ఠలు పాటిస్తుంటారు కదా!''
భాగ్యవతి అంది, ''మేమూ మాంసం, చేపలు, గుడ్లు వగైరా తింటాం. బట్టలు మార్చుకొని కొంచెం నీళ్ళు తలమీద చిలకరించుకొంటే సరి, ఆత్మశుద్ధి జరుగుతుంది. ఈనాటి కాలంలో ఎవరైనా గుండెమీద చేయివేసి చెప్పగలరా- తెలిసో తెలియకో తనవల్ల ఏ పాపమూ జరగలేదని. అంచేత మేమిద్దరం భార్యాభర్తలం ఏడాదికొకసారి తీర్థయాత్రలు తప్పక చేస్తాం. అంతేకాదు, ప్రతిరోజూ సాయంకాలం మా ఇంట్లో పూజ, ఆరాధన జరుగుతుంది. శాస్త్రాల్లో కూడా ఇదే రాసేరు. ఎవరు ఎన్ని పాపాలు చేసినా సరే, భగవంతుని నామస్మరణాన్ని చేయాలి. లేదా తీర్థయాత్రలు చేయాలి. లేదా తీర్థజలాల్లో స్నానం చేయాలి. అప్పుడే ఆ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ఏమీ చేయకపోయినా కనీసం ఒక గంటసేపు భగవంతుడి నామాన్ని జపిస్తే చాలు. అజామీళుడి కథ మీరు వినలేదా?''
స్నేహలత మనస్సులో బాధపడింది. ఆలోచించింది. శాస్త్రకారులు పాపానికి సంబంధించిన నాలుగు రోడ్ల కూడలిని ఏ ప్రతిబంధకమూ లేకుండా స్వేచ్ఛగా వదిలేస్తే ఈ కలియుగంలో మానవుడు పాపాలు చేయక మరేం చేస్తాడు? చికిత్సగాని, మందుగాని లేని జబ్బుని చూస్తే మానవుడు భయపడతాడు. ఆ రోగం నుంచి రక్షణ పొందడానికి ఆరోగ్య సంబంధమైన నియమనిష్ఠల్ని పాటిస్తాడు. అలా కాకుండా రోగానికి చికిత్స, మందులు ఉన్నప్పుడు మానవుడు ఆ రోగమంటే భయపడడు. ప్రలోభాల నుంచి దూరంగానూ వుండడు.
పొరుగున వున్న ఈ అయ్యగారి ధర్మపరాయణత్వం మీద స్నేహలతకి సందేహం కలగసాగింది. అయితే ఈ విషయం ఎవరితో చెప్పాలి? లోకమంతా వీళ్ళని ధర్మపరాయణులైన దంపతులుగా భావిస్తున్నారాయె. వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడే వాళ్ళకి గౌరవ సత్కారాలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు వాళ్ళు లాన్‌లో పెద్దపెద్ద జంబుఖానాలు పరిపించి భగవంతుడి పూజా కార్యక్రమం మొదలెడతారు. భజన కార్యక్రమం తర్వాత భోజనాల ఏర్పాటు వుంటుంది. ఇందుకోసం ఆఫీసులోని పరదాలు, కంబళీలు, షామియానా, డబ్బు వాడుకుంటే మాత్రం ఎవరడుగుతారు? వాళ్ళేం తమ కొడుకు, కూతుళ్ళ బర్త్‌డే పార్టీలు చేస్తున్నారు గనకనా? వాళ్ళేం చేస్తున్నా భగవంతుడి కోసమేగదా చేస్తున్నారు. ధర్మాన్ని ప్రచారం చేయాలనేగదా చూస్తున్నారు. అంచేత వాళ్ళని భ్రష్టాచారులనిగాని, లంచగొండులనిగాని అనే సాహసం ఎవరికుంటుంది?
ఆవాళ స్నేహలత తన కొడుకు జన్మదిన సందర్భంగా పొరుగున వున్న అయ్యగారి పిల్లల్ని పిలవడానికి వెళ్ళింది. అప్పుడు భాగ్యవతి అంది, ''ఇంత ఆడంబరంగా పిల్లల బర్త్‌డే పార్టీలెందుకు చేస్తున్నారు? ఇంట్లో భజనలు, సంకీర్తనలు ఏర్పాటుచేసి పిల్లలకింత ప్రసాదం పెడితే బావుండును గదా. అలాగయితే భగవంతుడు ప్రసన్నుడవుతాడు. ఎవ్వరూ ఏమీ అనడానికి ఆస్కారమూ వుండదు''
స్నేహలత ఆశ్చర్యపోతూ అంది, ''నేనే ఆడంబరమూ చేయటంలేదు. ఉదయం పది పన్నెండుమంది అనాథబాలల్ని పిలిచి భోజనం పెడతాం. సాయంకాలం సత్యనారాయణ వ్రతం చేస్తాం. పిల్లల స్నేహితులు అయిదారుగుర్ని పిలిచి ప్రసాదం పెడతాం. ఈ పనిలో మా ఆనందం కంటే పిల్లలకే ఎంతో ఆనందం కలుగుతుంది. ఏడాదికొకసారి వచ్చే ఆ రోజు ఎంతో ఆనందదాయకంగా వుందని వాళ్ళు భావిస్తారు. ఈ లోకంలో ఏదో చేసి చూపించడానికే వాళ్ళు జన్మించారు. అంతేగాని వాళ్ళు ఏ పనీపాటా చేయకుండా, కర్మ చేయకుండా కేవలం భగవంతుని నామాన్ని జపిస్తూ కూర్చుంటే దానివల్ల వాళ్ళకీ మేలు జరుగదు, సమాజానికీ జరగదు. అదీకాకుండా ఈ రోజుల్లో దానధర్మాలు ఎవరు చేస్తున్నారు? అంచేత సంవత్సరానికి ఒకసారి, అదీ పిల్లల పుట్టినరోజున కొంతమంది అనాథ బాలలకు తృప్తిగా భోజనం పెట్టగలిగితే అంతకుమించిన సంతృప్తి ఇంకేముంటుంది? తాను తినడంలోను, ఇతరులకి అన్నం పెట్టి తినిపించడంలోనూ గల భేదాన్ని తెలుసుకుంటారు. ఆ ఆనందానుభవాన్ని వ్యక్తం చేయలేం''అంది.
భాగ్యవతి లోగొంతుతో తన ఉపన్యాసం ప్రారంభించింది ''మన ఇద్దరి భావాలు వేరువేరుగా వున్నాయి. మేం మాత్రం మా ఇంటికి పిలిపించి ఎవ్వరికీ కప్పు కాఫీ కూడా ఇవ్వం. ఈ రోజుల్లో ఎవరూ ఇంకొకరి అభివృద్ధి చూసి ఓర్వలేరు. ఇంటికి వచ్చి కడుపునిండా తిన్నవాళ్ళే బయటికి వెళ్ళేక చెడ్డగా మాట్లాడతారు. వీళ్ళకి ఇంత డబ్బు ఎలా వచ్చింది? వీళ్ళ జీతం ఎంతో అనీ, వీళ్ళింత మర్యాదలు చేశారుగదా, ఇదంతా వీళ్ళ కష్టార్జితంతోనే చేశారా? ఇలాగే ఏవేవో అంటారు. అంచేతనే మేం భజన కార్యక్రమాలు చేస్తాం. పెద్ద పెద్ద వాళ్ళని పిలుస్తాం. వాళ్ళు ఇంటి లోపలికీ రారు, ఇలాంటి చిన్న చిన్న విషయాలమీద దృష్టీ పెట్టరు. వాళ్ళ దృష్టి ఎంతసేపూ పైకే వుంటుంది. తోటి ఉద్యోగులు, కింది ఉద్యోగుల దృష్టి మాత్రమే ఎప్పుడూ మన సుఖాల మీద ఉంటుంది. ఆకలితో వున్నాడుగదా అని అన్నం పెడితే ఆ స్వార్థపరుడు సహించలేడు. వెంటనే మీ వెనకే వుండి అన్ని విషయాలూ ఆరా తీస్తాడు. అంతేకాదు. ఈనాడు దొంగలు, దోపిడీదారులు, పనిదొంగలు, మోసగాళ్ళు, దుర్మార్గులు, జేబుదొంగలు, విశ్వాసఘాతకులు ఎంతోమంది వున్నారు. అంచేత పేదవాళ్లని, ఇబ్బందుల్లో వున్నవాళ్లని గుర్తించడం కష్టంగా వుంది. కనుకనే భగవంతుడికి భోగం చెల్లించి అతని ఆత్మని శాంతింపజేస్తే లోకంలో వుండే దుఃఖితుల, దరిద్రుల ఆత్మలకు శాంతి లభిస్తుంది. మీరు మహాభారత కథని చదివే వుంటారు. పాండవుల అక్షయపాత్రలో మిగిలిన అన్నం మెతుకుని శ్రీకృష్ణుడు తినగానే అసంఖ్యాకమైన బ్రాహ్మణుల ఆత్మలకు తృప్తి కలిగింది. వాళ్ళ కడుపులు నిండి, ఆకలి తీరింది. మీరు పురాణాలు చదవరనిపిస్తోంది'' అంటూ ఆత్మానందంతో నవ్వింది.
స్నేహలత ఆలోచనలో పడింది. శాస్త్రానికి సంబంధించిన తన దృష్టిని భాగ్యవతి దృష్టితో పోలిస్తే విరుద్ధంగా కనిపిస్తోంది. మానవుడి ఆత్మకి తృప్తిని కలిగిస్తే భగవంతుడు తృప్తిపడతాడు అనేది తన నమ్మకం. ఎవరు తప్పో, ఎవరు ఒప్పో ఆలోచిస్తూ స్నేహలత ద్వంద్వంలో పడిపోయింది. అంతేగాని ఏ ఒక్కరి ధర్మపరాయణతలోని లోపాల్నీ చూపించే మాటలాడదు. ప్రశ్నలూ వేయదు. మానవుడ్ని కాదని, అతన్ని దూరం చేసుకొని ఏ వ్యక్తి అయినా భగవంతుడి సాన్నిధ్యాన్ని చేరుకోగలడా అని ఆమె ఆలోచిస్తోంది.
పొరుగున ఉన్న మహానుభావులు కొన్నాళ్ళకు పల్లెనుంచి ఒకబ్బాయిని నౌకరుగా తీసుకువచ్చేరు- ఇంట్లో పనులు చేయించుకోడానికి. స్వజాతీయుడే అయినప్పటికీ ఆ అబ్బాయిని ఇంటి లోపలికి రానీయరు. ఎంతసేపూ బయటే పనులు చేస్తాడు. వరండాలో తింటాడు. అక్కడే నిద్రపోతాడు. అయ్యగారు తన భార్యాబిడ్డల్ని తీసుకొని సర్కారు వారి పనిమీద టూర్లు వెళ్లేటప్పుడు ఇంట్లోవున్న కుక్కల్ని ఎవరు చూస్తారు? కేవలం వాటికోసమే ఆ అబ్బాయిని తీసుకువచ్చేరు. అయినా వాళ్ళ మనస్సుల్లో ఆ అబ్బాయి మీద సందేహమే. 'కుక్కలకి పెట్టమని ఇచ్చిన గుడ్లు, పాలు వగైరా వాటికి పెట్టకుండా ఈ అబ్బాయే తినేస్తాడేమో. దేవుడికి పెట్టిన ప్రసాదం ఎవరికీ తెలియకుండా తీసుకొని మింగేస్తాడేమో' అని. వీళ్ళు కేంప్‌లో ఉన్నన్నాళ్ళూ భగవంతుడికి భోగం ఉండదు. సాయంకాలం మాత్రం అగరుబత్తీ వెలిగించమంటారు. కుక్కలు గుడ్లు తినవు, పాలు తాగవు. అయితే అన్నం, రొట్టెలు తింటాయి. ఇంట్లో ప్రతి గదికీ తాళం వేసేశారు. ఈ అబ్బాయిని చూస్తే పాపం మనకి దుఃఖం కలుగుతుంది. పిల్లాడి ముఖం అమాయకంగా వుంటుంది. ఆ ముఖంలో పాపచింతన కనిపించదు. నిర్మలంగా కోమలంగా వుంటాడు. మౌనంగా తన పని తాను చేసుకొంటాడు. ఏ అభ్యంతరమూ పెట్టడు, ఏ ఫిర్యాదూ చేయడు, యంత్రంతో నడిచే బొమ్మలాగ.
స్నేహలత ప్రేమతో ''మంచి పిల్లవాడు. మనలాంటి ఇళ్ళల్లో వుంటే ఆనందంగా, ఆరోగ్యంగా పెరుగుతాడు. పేదవారి ఇంట్లో పుట్టి పాపం కూలీ నాలీ చేసుకోవవలసి వస్తోంది'' అంటుంది.
భాగ్యవతి ముఖం అటు తిప్పుకుని ''హుఁ, ఏం మంచో. వీళ్ళు మంచిగా వుంటారా! పూర్వజన్మలో చేసుకొన్న పాప ఫలితంగా పేదవాళ్ళుగా పుడతారు. కొందరు పేదవారింట్లోను మరికొందరు ధనవంతుల ఇంట్లోను ఎందుకు పుడతారంటారు? ఇదంతా పూర్వజన్మలో చేసుకున్న కర్మఫలమే. మీరు శాస్త్రాలు చదవరు కాబోలు. గత జన్మలో పాపాత్ములైన వాళ్ళు ఈ జన్మలో ఎన్నడైనా బాగుపడతారా? అంచేతనే నేను వీళ్ళని ఇంటి లోపలికి అడుగు పెట్టనివ్వను. వీళ్ళంతా మూగదయ్యాలు. ఎప్పుడు దెబ్బకొట్టి పారిపోతారో ఎవరు చెప్పగలరు?'' ముఖంమీదికి తిరస్కార భావం, అసహ్యం తెచ్చుకొని అంది.
''పోరా, అటుపో. ఇక్కడ నిల్చొని ఏమిటి వింటావు?'' అంటూ భాగ్యవతి ఆ పిల్లాడ్ని కసురుకుంది.
* * *
ఆవేళ శివరాత్రి. దేవాలయంలో భక్తులు ఎంతో ఎక్కువగా ఉన్నారు. దైవదర్శనం కోసం భక్తులు బారులు తీరి నిల్చున్నారు. స్నేహలతకి ఆ క్యూలో ఇంక నిల్చోడానికి ఓపిక నశించింది. కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. ఆ జనంలో వూపిరి సలపకుండా వుంది. అలా ఎంతోకాలం గడిచింది. ఇంతలో ఇంటి వద్ద పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని పట్టుచీర కట్టుకొన్న భాగ్యవతి దేవాలయానికి వచ్చింది. ఆమెతో ఆమె భర్త కూడా పట్టుధోవతి కట్టుకొని వచ్చాడు. వీళ్ళని చూడగానే నున్నగా గుండులా మెరుస్తూన్న తెల్లని బ్రాహ్మణుడు దైవదర్శనానికి వచ్చిన భక్తుల్ని ఇటూ అటూ తోసేస్తూ వీళ్ళిద్దర్నీ లోనికి రాడానికి దారి ఏర్పరిచాడు. వీళ్ళు క్యూలో నిల్చోలేదు. నేరుగా దేవుడి ముందుకి వెళ్ళిపోయేరు. పూజ, అర్చన వగైరా అయ్యాక బహుమతి రూపంలో పూజారి చేతిలో ఓ నోటుపెట్టారు. సగర్వంగా బయటికి వస్తూ క్యూలో నిల్చొని వున్న రవిబాబుని, స్నేహలతని చూసి ''ఇవాళ స్వామి భజన. పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు'' అన్నారు.
''తమవంటి ధర్మాత్ముల్ని లైన్‌లో నిల్చోబెట్టి ధర్మ కార్యానికి ఆటంకమవుతానా?'' అన్నాడు పూజారి.
పిల్లలకి వార్షిక పరీక్షలొచ్చాయి. ఇటు చూస్తే ఈ మహానుభావులు తీర్థయాత్రలకు సపరివారంగా బయలుదేరారు. స్నేహలత అడిగింది, ''పిల్లలికి పరీక్షలు గదా''
భాగ్యవతి గళం పొంగించి అంది, ''హెడ్మాస్టరు మా పిల్లలకి ట్యూషన్ చెబుతున్నారు. అతను పరీక్ష తేదీని పొడిగించారు. యాత్ర సందర్భంగా ఏవేవో వస్తువులు కొనమని మాకొక లిస్టు ఇచ్చేరు''.
మిగతా పిల్లల తల్లిదండ్రులు పరీక్ష తేదీల మార్పు గురించి హెడ్మాష్టర్ని అడిగితే ''ఒక వ్యక్తి ధర్మాన్ని ఆర్జించడానికి వెళ్తున్నాడు. అతన్ని ఆటంకపరిచి నేను పాపాన్ని మూట కట్టుకుంటానా? తీర్థయాత్రలకు వెళ్ళగలిగే అదృష్టం, భాగ్యం నాకెలాగూ లేవు. ఎవరో వెళ్తే వెళ్ళనీ. తీర్థప్రదేశాల పవిత్ర జలం, మట్టి నాకు వారి ద్వారా లభిస్తాయి గదా. అయినా మూడు, నాలుగు తరగతుల పిల్లల పరీక్షలే కదా. ఒకటి రెండురోజులు ఆలస్యంగా జరిగి నంత మాత్రాన ఉద్యోగాలు పోవడానికి, ఇవేమైనా ఇంటర్వ్యూలా?''అని ఎదురు ప్రశ్నించాడు.దీన్ని ఓ పద్ధతిలో అర్థం చేసు కొన్న తల్లిదండ్రులు మరింకేమీ అనలేదు.
ఇంటిని కాపలాకాసే బాధ్యత దేవుడు, నౌకరు, కుక్కలమీద పడింది. తీర్థయాత్రకు ఏడురోజులు పట్టింది. బళ్ళు, బస్సుల ప్రయాణాల గురించి ఎవరు చెప్పగలరు. నాలుగురోజులనుంచి వర్షాలు పడుతున్నాయి. నౌకరుకి మూడురోజులకు మాత్రమే తిండి ఏర్పాట్లు చేసింది. మూడురోజులు గడిచాక పిండి మిగిలితే రొట్టెలు చేసి కుక్కలకి పెట్టేడు. బొప్పాయి చెట్టు నుంచి పళ్ళు తీసుకొని కడుపు నింపుకొన్నాడు. ప్రతి సాయంకాలం తుపాను వర్షం. అటు నౌకరుకి జ్వరం. లేవడానిక్కూడా వాడికి శక్తిలేదు. దానికితోడు వరండాలో పడి ఉండడం. ఈ అబ్బాయి విషయం ఎవరికి తెలుస్తుంది? ఇరుగు పొరుగువాళ్ళు ఎవరి వ్యాపకాలలో వారు మునిగి ఉన్నారు. అయినా వీళ్ళు యాత్రకి బయలుదేరి వెళ్తూన్నప్పుడు ఎవ్వరితోనూ చెప్పి వెళ్ళలేదు. ఈ మహానుభావులు తీర్థభ్రమణం చేసి, పాపాల్ని విసర్జించి పుణ్యాన్ని ఆర్జించిన తర్వాత ఇంటికి తిరిగివచ్చా రు. నౌకరు కుర్రవాడ్ని తెలివి తప్పివున్న పరిస్థితిలో హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. వంట పాత్రలో ఉడకబెట్టిన బొప్పాయికాయ ముక్కలున్నాయి.
భాగ్యవతి ''లోభం వలన పాపం, పాపం వలన మృత్యువు లభిస్తాయి. కుక్కలకి తినడానికి పెట్టకుండా వాడే తినేశాడు. కప్పకి నెయ్యి ఇముడుతుందా?'' అంది.
మూడురోజుల తర్వాత ఆ పిల్లవాడు హాస్పిటల్లో చనిపోయాడు. లోభం వలన మృత్యువు వస్తుందనేది నిజం. ఈ విషయంలో ఎవరికీ సందేహం ఉండదు. కాని 'నియమం తప్పినందువల్ల నౌకరు పిల్లవాడు చనిపోయాడు' అనే విషయాన్ని ఈ ధర్మాత్ములకు వ్యతిరేకంగా ఎవరు చెప్పగలరు? మీదుమిక్కిలి ఇంటిలో జరగరానిది జరిగినందువల్ల భారీగా, జోరుగా భజనకీర్తనలు జరిగాయి. ఎందుకంటే భగవంతుడి నామాన్ని ఉచ్ఛరించగానే పాపాలన్నీ పటాపంచలవుతాయి.
'పాపాత్ముడు కూడా చేయలేనన్ని పాపాలు కృష్ణుని నామస్మరణతో నాశనమవుతాయి'- ఈ విషయం ఎవరికి తెలియదు? ఈ నౌకరు పిల్లవాని అకాల మృత్యువువలన సుయోగ్యబాబు పరోక్షంగా పాపంలో భాగస్వామి అయినా సరే, కృష్ణనామ సంకీర్తనతో ఆపాపం అతని నుంచి దూరమవుతుంది. పాపనాశక మహాఔషధాన్ని గురించి తెలిసిన జ్ఞాని పాపానికి భయపడతాడా? నౌకరు ఆత్మకి సద్గతి కలగడం కోసం సుయోగ్యబాబు చేసిన నామ సంకీర్తన ధర్మాత్మునిగా అతనికి మరింత ప్రతిష్టని చేకూర్చింది.
స్నేహలత ద్వంద్వంలో పడి ఆలోచించనారంభించింది. ఇతడేగాని ధర్మాత్ముడనిపించుకొంటే ఇతన్ని 'ధర్మాత్ముడు' అనేవాళ్ళని 'భ్రమాత్ములు' అనాలేమో. ధర్మాత్ముడికి భ్రమాత్ముడికి మధ్య భేదం ఉందా లేదా అనేది స్నేహలతకి అర్థం కాకుండా ఉంది. ఈ సందేహాన్ని నివృత్తి చేసుకొనేందుకామె గురువును అన్వేషించడంలో పడింది.
Thursday, September 27, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment