చేతిలో వెండి పొన్నుకర్రగల ఆ మధ్యవయస్కుడు దుకాణాలు కట్టేసి, ఇళ్ళకి వెళ్లే పనివాళ్ళ మధ్యకి గబగబ నడుస్తూ వచ్చాడు. అతను వేసుకున్న కోటు ఏప్రిల్ నెల చలిని ఆపేలాగానే ఉంది. అతను దుకాణాలకున్న గ్లాస్ కిటికీల్లోంచి యాథాలాపంగా చూస్తూ యూనియన్ అండ్ మేడిసన్ మూలకి వచ్చేదాక నడకనాపలేదు. మిడ్ టౌన్ డైమండ్ ఎక్స్‌ఛేంజ్ దుకాణం ముందు కొద్దిక్షణాలు సందేహిస్తూ ఆగాడు. ఎవరూ లేరని నిర్ధారణ చేసుకునేందుకా అన్నట్లుగా అటు ఇటు చూశాడతను. తర్వాత తన చేతిలోని వెండి పొన్ను కర్రతో దాని అద్దాల కిటికీని బద్దలు కొట్టాడు.
గ్లాసు పగిలిన శబ్దం, షాపులోని అలారం మోగే శబ్దంతో కలిసిపోయింది. ఆయన ఆ కిటికీ దగ్గరికి చేరుకున్నాడు. దారినపోయే పాదచారులు అతడి చర్యకి ముందు కొద్దిగా విస్తుపోయారు. అతడు పారిపోతుండగా యూనిఫాంలో ఉన్న ఓ పోలీస్ తన చేతిలోని తుపాకిని ఆడిస్తూ గట్టిగా అరిచాడు.
''ఆగక్కడ''
దగ్గరనించి వినబడ్డ ఆ హెచ్చరికకి అతను కొద్దిగా ఉలిక్కిపడి తన చేతిలోని కర్రని తిప్పాడు. ఆ ప్రమాదాన్ని ఊహించినవాడిలాగా పోలీసు పక్కకి తప్పుకున్నాడు. అయితే రెండో ప్రయత్నంలో ఆ కర్ర పొన్ను వెళ్ళి పోలీసు తలని తాకడంతో చిన్నగా అరిచాడు, తత్తరపడుతూ అడుగులేశాడు.
పారిపోతున్న అతణ్ణి చూస,ి డైమండ్ ఎక్స్‌ఛేంజ్ తలుపు దగ్గర వున్న ఒకతను గట్టిగా అరిచాడు,
''అతణ్ణి పట్టుకోండి. దొంగతనం చేశాడు''
తలనించి కారే రక్తంతో నేలమీద చతికిలపడ్డ ఆ పోలీసు లేచి నిలబడాలని ప్రయత్నించి, చేతకాక మళ్ళీ నేలమీద కూర్చున్నాడు. జనాల్లోంచి ఒకడు పారిపోయే ఆ దొంగని పట్టుకోడానికి పరిగెత్తాడు. వేగంగా పరిగెత్తి అతను దొంగని వెనకనుంచి పట్టుకున్నాడు. ఆ మధ్యవయస్కుడు తిరిగి తన చేతిలోని పొన్ను కర్రని పైకెత్తాడు. కాని ఆ వ్యక్తి ఒడుపుగా తప్పించుకున్నాడు. అంతేకాదు ఆ దొంగని కింద పడేశాడు. వాడి పట్టునించి తప్పించుకుని చేతి కర్ర లేకుండానే ఆ దొంగ లేచి మళ్లీ పరిగెత్తసాగాడు. దగ్గర్లో ఉన్న పోలీస్ పెట్రోల్ కారు ఈ గొడవను చూసి అక్కడికి వచ్చి ఆగింది.
అందులోంచి దిగిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు రివాల్వర్లు తీశారు. ఓ చీకటి సందులోకి పరిగెత్తుతున్న దొంగని చూసి, ''ఆగు. లేదంటే కాల్చేస్తాను'' అంటూ అరిచాడోఅధికారి.హెచ్చరికగా రివాల్వర్‌ని గాల్లోకి ఓసారి పేల్చారు. ఆ శబ్దానికి సందు మొదలుకు చేరుకున్న ఆ దొంగ ఠక్కున ఆగాడు. చేతులు రెండూ ఎత్తి వెనక్కి తిరిగి పోలీసులతో అన్నాడు.
''కాల్చకండి, నా దగ్గర తుపాకీ లేదు''
రెండో పోలీస్ దొంగ చేతులకు బేడీలు వేసేదాక మొదటి పోలీసు తన రివాల్వర్‌ని అతనికి గురిపెట్టి ఉంచి, తర్వాత దాన్ని తిరిగి హోల్‌స్టర్‌లో దోపుకున్నాడు.
* * *
లెఫ్టినెంట్ ఫ్లెచర్ పేపర్‌కప్పులో తెచ్చిన లేత గోధుమ రంగు కాఫీని చూసి హోమిసైడ్ అండ్ వయొలెంట్ క్రైమ్స్ స్క్వాడ్ కెప్టెన్ లియోఫోర్డ్ కోపంగా అడిగాడు.
''మెషీన్‌లోని కాఫీయేనా ఇది?''
''అవును సార్. ఆ యంత్రం పాడైంది. దాన్ని రిపేర్ చేసే వ్యక్తి కోసం కబురు చేశాను''.
లియోఫోర్డ్ గొణుగుతూ ఆ కాఫీని ఓ గుక్క తాగి, దాన్ని డస్ట్‌బిన్‌లో పడేసి అన్నాడు, ''నాకో కోలా తెచ్చిపెట్టు ఫ్లెచర్''.
ఫ్లెచర్ కోలా తెచ్చిచ్చాక లియోఫోర్డ్ అడిగాడు, ''ఫిల్ బెగ్లర్ ఇంకా హాస్పిటల్‌లోనే ఉన్నాడా?''
అవునన్నట్లు తల ఊపాడు ఫ్లెచర్.
''పూర్తి రిపోర్ట్ మీ టేబుల్ మీద ఉంది. మిడ్‌టౌన్ డైమండ్ ఎక్స్‌ఛే´ంజ్ నుంచి కొన్ని వజ్రాలను దొంగిలించిన వ్యక్తిని ఫిల్ పట్టుకునేందుకు ప్రయత్నించగా, ఆ దొంగ చేతిలోని కర్రతో ఫిల్‌ని తలమీద కొట్టి పరిగెత్తాడు. ఆ దొంగ పట్టుబడ్డాడు కాని, ఫిల్ ఇంకా హాస్పటల్‌లోనే ఉన్నాడు''
''నేనోసారి వెళ్ళి చూడాలి. ఫిల్ చాలా మంచి వ్యక్తి'' అన్నాడు కెప్టెన్ లియో. వజ్రాల దొంగని న్యూయార్క్‌కి చెందిన రూడీ హాఫ్‌మేన్‌గా గుర్తించాడు. కిటికీలు పగలకొట్టి ఇలాంటి దొంగతనాలు ఎన్నోచేసిన దొంగ వాడు.
''ఫిల్‌ని అతను గాయపరచడం కూడా ఓ విధంగా మంచిదే. దానివల్ల వాడిని చాలాకాలం కటకటాల వెనక పెట్టొచ్చు''
''కాని, ఈ కేసు విషయంలో ఓ సమస్య వచ్చి పడింది''అన్నాడు ఫ్లెచర్.
''ఏమిటది?''
హాఫ్‌మేన్‌ని దొంగతనం చేసిన దుకాణం నుంచి నూటాఏభై అడుగుల దూరంలోనే పట్టుకున్నారు. మన పెట్రోల్‌కారు వచ్చేలోగా ఓ యువకుడు ఆ దొంగతో పోట్లాడి అతణ్ణి ఆపే ప్రయత్నం చేశాడు. హాఫ్‌మేన్ ఏభై ఎనిమిదివేల డాలర్ల విలువ చేసే వజ్రాలను దొంగిలించాడు. ఆ తర్వాత పోలీసులు అతణ్ణి అరెస్ట్ చేసేదాకా ఆ దొంగ ప్రతీ క్షణం కనీసం ఓ సాక్షి కనుసన్నల్లోనే ఉన్నాడు. కాని ఆ వజ్రాలు అతడి దగ్గర లభ్యం కాలేదు. అవి ఏమయ్యాయో తెలీడం లేదు''
''వాడు వాటిని వీధిలో పడేసి ఉండచ్చు''
''వీధంతా వెదికారు. అతణ్ణి అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లిన పెట్రోల్ కారుని కూడా పూర్తిగా వెదికారు. వజ్రాలు లేవు''
''వాటి గురించి అతణ్ణి ప్రశ్నించలేదా?''
''వాడు పెదవి విప్పడం లేదు''
''సరే, వాణ్ణిక్కడికి తీసుకురండి. వాడినెలా మాట్లాడించాలో మీకు చూపిస్తాను'' కోపంగా అన్నాడు లియోఫోర్డ్.
తెల్లజుట్టు గల రూడీ హాఫ్‌మేన్ వయసు నలభై, నలభై అయిదు మధ్య ఉంటుంది. ఎక్కువ కాలం జైల్లో ఉండటంతో సూర్యరశ్మి తాకని తెల్లటి చర్మం. బెదురుగా చూసే కళ్లు. తరచు కింద పెదవిని నాకడం అతనికలవాటు.
''ఆ వజ్రాలు ఎక్కడ దాచావు?'' ప్రశ్నించాడు లియో.
''నాకేం తెలీదు. లాయర్ లేకుండా నేనేం మాట్లాడను. నా హక్కులు నాకు తెలుసు. లాయర్ లేకుండా మీరు నన్నేం అడగకూడదసలు'' అన్నాడు.
లియోఫోర్డ్ అతనికెదురుగా ఉన్న కుర్చీమీద కూర్చుని అతని వంక నిశితంగా చూస్తూ అన్నాడు.
''ఈసారి కిటికీ పగలకొట్టి దొంగతనం చేసిన నేరం కాదిది. నువ్వు తల పగలకొట్టిన పోలీసు చావొచ్చు. జీవితాంతం నువ్వు ఊచలు లెక్కపెట్టాల్సిందే''
''గార్డ్స్ మాట్లాడేది నేను విన్నాను. తల చర్మం చిట్లిందంతే...''
''అయినప్పటికీ మారణాయుధంతో ఎదుర్కోవడం అనే నేరం చేశావు. నీకున్న నేరచరిత్రతో అది చాలు. ఆ వజ్రాలని దాచిపెట్టి నిన్ను నువ్వు రక్షించుకుంటున్నాననుకుంటున్నావేమో? అవి దొరక్కపోయినా నువ్వు హత్యాప్రయత్నం నేరం చేశావు''
రూడీ హాఫ్‌మేన్ చిన్నగా నవ్వాడు.
''ఆ వజ్రాలు మీరెప్పటికీ కనుక్కోలేని చోట వున్నాయి. ఆ విషయం మాత్రం క చ్చితంగా చెప్పగలను''
లియోఫోర్డ్ కోపంగా లేచి, రూడీ హాఫ్‌మేన్ వంక ఉగ్రంగా చూసి బయటకి నడిచాడు.
ఫ్లెచర్ లియోఫోర్డ్‌ని అనుసరిస్తూ అన్నాడు- ''చెప్పాగా, వాడు ఆ విషయంలో నోరు మెదపడం లేదని''.
''నేను వాటిని కనుక్కుని తీరతాను. కిటికీ అద్దం పగిలినప్పటి నుంచీ ఏం జరిగిందో వివరంగా చెప్పు'' అడిగాడు లియోఫోర్డ్.
''వీణ్ణి పట్టుకోడానికి ప్రయత్నించినవాడు స్టేట్‌మెంట్ ఇవ్వడానికి ముందు గదిలో ఉన్నాడు. వాడు జరిగింది మొత్తం చూశాడు'' అని ఫ్లెచర్ వెళ్లి, నైల్‌క్వార్ట్‌ని తీసుకువచ్చాడు. జరిగింది చెప్పాడతను.
''రంగు వేసేపని పూర్తిచేసుకుని నేను ఆఫీస్‌నించి రాత్రి తొమ్మిదింటికి ఇంటికి వెళుతున్నాను. డైమండ్ ఎక్స్‌ఛేంజ్ దగ్గర ఈ దొంగ చేతికర్రతో కిటికీని పగలకొట్టడం చూశాను. కానీ అతడికి దూరంగా ఉండడం వల్ల పట్టుకోలేకపోయారు. ఈలోగా ఓ పోలీసు అతని వెంటపడడం, అతను పోలీసు తల మీద తన కర్రతో బాదడం చూశాను. పోలీసు కింద పడగానే నేను వాడిని పట్టుకోడానికి వెంట పడ్డాను. మేమిద్దరం కలియబడ్డాం. వాడు తన చేతికర్రతో నన్నూ కొట్టాలనుకున్నాడు. కానీ, నేను దాన్ని లాగేసుకున్నాను. తర్వాత వాడు లేచి పారిపోతుంటే పోలీసులు వచ్చారు. ఒకరు గాల్లోకి తుపాకి పేల్చగానే వాడు లొంగిపోయాడు''
''ఆ దొంగ నీకు ఎంతసేపు కనబడకుండా ఉన్నాడు?'' ప్రశ్నించాడు లియోఫోర్డ్.
''ఒక్క క్షణం కూడా వాడు నాదృష్టి నుంచి దాటిపోలేదు.వాడు పోలీసుని కొట్టి పడేయగానే నేను వాడికోసం పరిగెత్తాను''
''వాడు వీధిలోకి ఏదైనా విసిరేయడం చూశావా?''
''లేదు''
''రివాల్వర్ కాల్పులు వినగానే చేతులెత్తినప్పుడు విసిరేసి ఉండొచ్చా?''
''లేదనుకుంటాను''
''పోలీసులు వాణ్ణి ఓ సందు మొదట్లో అరెస్టు చేశారు. ఆ సందులోని ప్రతీ అంగుళం వెదికారు. అయినా ఆ వజ్రాలు దొరకలేదు'' చెప్పాడు ఫ్లెచర్.
''వాడు దొంగతనం చేసిన ఆ వజ్రాల గురించి మేం వెదుకుతున్నాం. వాడు వాటినెలా మాయం చేసి ఉంటాడో నువ్వేమైనా చెప్పగలవా?'' ప్రశ్నించాడు లియోఫోర్డ్.
''తెలీదు. కాకపోతే మేం కలియబడినప్పుడు ఖాళీ అట్టపెట్టెల మీద పడ్డాం''
''అవన్నీ వెదికారు. నిన్న రాత్రంతా పోలీసులు అక్కడ ఒక్క అంగుళం కూడా వదలకుండా గాలించారు. హాఫ్‌మేన్ బట్టలు కూడా వెదికారు. ప్రయోజనం లేకపోయింది. హాఫ్‌మేన్ వాటిని మింగాడేమోనని ఎక్స్‌రే కూడా తీయించారు. కడుపులో నూ లేవవి'' చెప్పాడు ఫ్లెచర్.
''సరే, ఈ సంఘటన జరిగిన చోటికి వెళ్లి చూద్దాం, పద'' అన్నాడు లియోఫోర్డ్, టోపీ అందుకుంటూ.
* * *
మిడ్‌టౌన్ డైమండ్ ఎక్స్‌ఛేంజ్‌లో పగిలిన కిటికీకి కొత్త అద్దం వేయించారు. గత రాత్రి దొంగతనం జరిగినప్పుడు ఆ దుకాణంలో ఉన్న అసిస్టెంట్ మేనేజర్ పీటర్ ఆర్నాల్డ్‌ని కలిశాడు లియోఫోర్డ్.
''ఏం జరిగిందో ఏదీ వదలకుండా చెప్పండి'' అడిగాడతణి-్ణ లియోఫోర్డ్.
''తొమ్మిది దాటాక సేల్స్‌మేన్ బయటకి వెళ్లారు. నేను దుకాణం కట్టేస్తుండగా కిటికీ అద్దం పగిలిన చప్పుడు వినిపించింది. చూస్తే, ఆ దొంగ విండో షోకేస్‌లోని వజ్రాలని అందుకుంటున్నాడు''
''ఆ షోకేస్‌లో ఎన్ని వజ్రాలున్నాయి?''
''డజన్లకొద్దీ. ఉట్టి వజ్రాలు, ఉంగరాల్లో బిగించిన వజ్రాలు. వాటి మొత్తం విలువ ఏభై ఎనిమిది వేల డాలర్లు. కొద్ది క్షణాలు ఆగివుంటే, నేను వాటిని అక్కడ నుంచి తీసేసి ఐరన్ సేఫ్‌లో ఉంచేవాణ్ణి. ఆ దొంగ పారిపోతుండగా పోలీస్ ఆఫీసర్ బెగ్లర్ కనిపించాడు''
ఫిల్‌బెగ్లర్ ఆ ప్రాంతంలో గత నాలుగైదేళ్లుగా పనిచేస్తున్నాడు. కాబట్టి అతను అందరికీ సుపరిచితుడే.
లియోఫోర్డ్ ఆ కిటికీ దగ్గరకి వెళ్ళి చూశాడు. ఖాళీ ట్రేలు కనబడ్డాయి.
''నాలుగు ఉంగరాలు మాత్రం వదిలేశాడు'' చెప్పాడు ఆర్నాల్డ్.
అతనికి రూడీ హాఫ్‌మెన్ ఫొటో చూపించి అడిగాడు.
''ఇతన్ని ఇదివరకెప్పుడైనా చూశారా?''
''లేదు'' పెదవి విరిచాడతను.
లియోఫోర్డ్ గొంతు తగ్గించి సాలోచనగా ''వజ్రాలకోసం వెదికిన మనవాళ్లే వాటిని కాజేశారేమో, ఫ్లెచర్?'' .
''నో సర్. వాళ్ళంతా నిజాయతీపరులే'' చెప్పాడు ఫ్లెచర్.
పోలీస్‌స్టేషన్‌కి వెళ్ళి లియోఫోర్డ్ హాఫ్‌మేన్ దుస్తులనేకాక, కట్టుడు పళ్ళు, విగ్ లాంటివి ఉంటే వాటిలో దాచాడేమోనని వెదికాడు. కాని అలాంటివేం లేవు.
లియోఫోర్డ్‌కి పోలీస్ ల్యాబ్‌నుంచి ఫోన్ వచ్చింది. హాఫ్‌మేన్ ఉపయోగించిన చేతికర్రని కూడా ఎక్స్‌రే తీశారు. అందులోనూ ఎలాంటి వజ్రాలు లేవు.
మెమోరియల్ హాస్పిటల్‌కి వెళ్ళి లియోఫోర్డ్ కోలుకుంటున్న బెగ్లర్‌తో అరగంట గడిపి ఇంటికి వెళ్ళాడు.
* * *
తెల్లవారుజామున మూడున్నరకి పోలీస్ కారు ఓ ఇంటి బయట ఆగింది. అందులోంచి దిగిన లియోఫోర్డ్, ఫ్లెచర్ ఎదురుగా ఉన్న ఆరో అంతస్తులోని అపార్ట్‌మెంట్ నంబర్ సిక్స్-బికి వెళ్లి తలుపు తట్టారు. నాలుగైదు నిముషాల తర్వాత ఓ కంఠం వినిపించింది.
''ఎవరది?''
''పోలీస్, తలుపు తీయి''
''ఇప్పుడు టైం ఎంతో తెలుసా? రేపు ఉదయం...'' విసుగ్గా తలుపు తీశాడు నైల్‌క్వార్ట్.
''ఆ వజ్రాలెక్కడ ఉన్నాయి?'' ప్రశ్నించాడు లియోఫోర్డ్.
''మీకేమైనా పిచ్చా? ఆ వజ్రాల గురించి నాకేం తెలుసు?'' అడిగాడు నైల్ ఆవులిస్తూ.
''హాఫ్‌మేన్ వజ్రాలు దొంగతనం చేశాక అతడి సమీపానికి వెళ్ళింది నువ్వొక్కడివే. నువ్వు, హాఫ్‌మేన్ మిత్రులు. ఆ వజ్రాలు నీకిచ్చాడు. వాటిని నువ్వే మాయం చేశావు''
''ఆ దొంగ నాకు మిత్రుడు కాడు. పోలీసులు నన్ను సోదా చేశారు. నా దగ్గరే ఉంటే అప్పుడే అవి దొరికేవిగా. నాకు వాటి గురించి తెలీదు'' చెప్పాడు నైల్‌క్వార్ట్.
''వాటిని నువ్వు మూడో వ్యక్తికి ఇచ్చి పంపావు. ఎవరా వ్యక్తి?''
''నేను ఎవరికీ ఏ వజ్రాలూ ఇవ్వలేదు''
నిజానికి నలుగురు సాక్షులు జరిగిందంతా చెప్పారు. వారికి ఒకరితో మరొకరికి సంబంధం లేదు. ఆ నలుగురు చెప్పింది ఏమాత్రం తేడా లేకుండా ఒకేలా ఉంది. నైల్ ఎవర్నీ కలవలేదు.
లియోఫోర్డ్, ఫ్లెచర్ నైల్ గంటసేపు ఫ్లాట్ మొత్తం గాలించారు. అతను అభ్యంతరం చెప్పకుండా టీ కూడా పెట్టిచ్చాడు.
ఎక్కడా వాళ్ళకి ఆ వజ్రాలు కనబడలేదు.
ఇంటికి తిరిగి వెళ్తూ లియోఫోర్డ్ విసుగు, కోపం ధ్వనించే స్వరంతో స్వగతంగా అనుకుంటున్నట్లు అన్నాడు, ''హాఫ్‌మేన్ ఆ వజ్రాలు ఎలా మాయం చేశాడు? వాటిని అతను ఎవరికీ ఇవ్వలేదని, ఎక్కడా దాచలేదని సాక్షులు చెప్పిందాన్నిబట్టి తెలుస్తోంది. మరి రెక్కలొచ్చినట్లు ఎలా ఎగిరిపోయాయవి?''
ఫ్లెచర్ మౌనంగా ఉండిపోయాడు.
లియోఫోర్డ్ ఇంటికి చేరుకునేదాకా ఆ విషయంమీదే మనసు నిలిపి ఆలోచిస్తున్నాడు. అకస్మాత్తుగా కారు బ్రేక్ వేసి, అరిచాడు.
''ఆ వజ్రాలు ఎలా మాయమయ్యాయో తెలిసింది''
''ఎలా?'' అడిగాడు ఫ్లెచర్ విస్మయంగా అతణ్ణి చూస్తూ.
''చెప్తాను. రేపు ఉదయం నువ్వు అర్జెంట్‌గా కొంత సమాచారం సేకరించాలి. నువ్వేం చేయాలంటే...'' అని ఫ్లెచర్‌కి ఏం చేయాలో చెప్పాడు లియో.
* * *
మిడ్‌టౌన్ డైమండ్ ఎక్స్‌ఛేంజ్ దుకాణంలోని సేల్స్‌మేన్ ఓ కస్టమర్‌కి బంగారు ఉంగరాలు చూపిస్తుండగా లియోఫోర్డ్, ఫ్లెచర్ లోపలికి వచ్చారు.
''పీటర్ ఆర్నాల్డ్ ఏడీ?'' అడిగాడు ఫ్లెచర్.
అతను మౌనంగా అసిస్టెంట్ మేనేజర్ అని రాసివున్న కేబిన్ తలుపువైపు చూపించాడు. ఇద్దరూ ఆ గదిలోకి వెళ్ళారు.
''రండి. వాడు వజ్రాలని ఎక్కడ దాచాడో కనుక్కున్నారా?'' శాండ్‌విచ్ తినబోతున్న ఆర్నాల్డ్ ఆగి, ఆసక్తిగా అడిగాడు.
''అవెక్కడున్నాయో తెలిసింది'' అన్నాడు లియోఫోర్డ్.
''వెరీగుడ్. ఎక్కడ దాచాడు వాటిని?''
''దానికన్నా ముఖ్యం 'ఎలా తెలుసుకున్నాం' అన్న సంగతి. అది నువ్వు తెలుసుకోవాలి'' నవ్వుతూ అన్నాడు లియోఫోర్డ్ ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంటూ.
''ఎలా తెలిసింది?''
''హాఫ్‌మేనే చెప్పాడు''
''ఏమని?''
''మీ ఇద్దరి మధ్య గల ఒప్పందం''
క్షణకాలం ఆర్నాల్డ్ మొహం పాలిపోయింది. అంతలోనే తేరుకుంటూ ''నాకర్థం కాలేదు'' అన్నాడు.
''నీది చాలా తెలివైన పథకం మిస్టర్ ఆర్నాల్డ్. ఆ రాత్రి నీ కింద పనిచేసే సేల్స్‌మెన్ వెళ్ళిపోయాక, నువ్వు కిటికీ షోకేస్‌లోని వజ్రాలన్నిటినీ తీసేసుకున్నావు, నాలుగు ఉంగరాలు తప్ప. ప్లాన్ ప్రకారం ఆ తర్వాత తొమ్మిదింటికి హాఫ్‌మేన్ వచ్చి కిటికీ అద్దాన్ని పగలకొట్టాడు తప్ప, వజ్రాలు దొంగతనం చేయలేదు. మీ పథకం సరిగ్గా ఫలించి ఉంటే, హాఫ్‌మేన్ పారిపోయేవాడు. వాటినితనే మాయం చేశాడనుకునే వాళ్లం. కాని మీ పథకంలో ఎదురుచూడని పాత్ర ఆఫీసర్ బెగ్లర్. అనుకోకుండా ఆ సమయంలో అక్కడికి వచ్చి హాఫ్‌మేన్‌ని పట్టుకోబోయాడు. పట్టుబడితే తన దగ్గర వజ్రాలు లేవని పోలీసులు తెలుసుకుంటారని, ఈ పథకం పాడవుతుందని హాఫ్‌మేన్ అతడి తలమీద కొట్టి పారిపోయాడు. హాఫ్‌మేన్ గతంలో ఎప్పుడు పట్టుబడినా ఎవరి మీదా, ఎలాంటి హింసక పాల్పడలేదని రికార్డులు చెప్తున్నాయి. హాఫ్‌మేన్‌ని పట్టుకోవడానికి నైల్ అతడితో కలబడ్డ సమయంలో నీ దగ్గరే ఆ వజ్రాలున్నాయి. వాటినేం చేశావో నువ్వే చెప్పాలి.''
''అబద్ధం. హాఫ్‌మేన్ చెప్పింది శుద్ధ అబద్ధం'' లేచి నిలబడి అరిచాడు ఆర్నాల్డ్.
''హాఫ్‌మేన్ ఈ నిజం చెప్పడానికో కారణం వుంది. ఇందాక బెగ్లర్ హాస్పటల్లో మరణించాడు. దాంతో హాఫ్‌మేన్ హంతకుడయ్యాడు. ఆ సంగతి తెలియగానే తను చంపాలనుకుని అతన్ని కొట్టలేదని, ఎందుకు కొట్టాల్సి వచ్చిందో చెప్పి, తన నేరాన్ని ఒప్పుకున్నాడు''
పీటర్ ఆర్నాల్డ్ మొహం మరోసారి పాలిపోయింది.
''దీనికి సాక్ష్యం వుందా అని నువ్వు అడగొచ్చు. ఉంది, హాఫ్‌మేన్ రాకమునుపు నువ్వు వాటిని తీసి నీ జేబులో వేసుకోవడం రోడ్డుమీంచి చూసిన సాక్షి ఉన్నాడు. ఆర్నాల్డ్, నీ గురించి మొత్తం విచారించాం. నువ్వు ఆర్థికంగా చితికిపోయావు. నీ భార్య నీ గుర్రప్పందాల పిచ్చిని భరించలేక విడాకులిచ్చేసింది. ఆమెకి నీ జీతంలో సగం నెలనెలా భరణంగా వెళ్తోంది. నువ్వు అప్పుల్లో ఉన్నావు''
పీటర్ ఆర్నాల్డ్‌కు ముచ్చెమటలు పోశాయి.
''నీ అంతట నువ్వు నేరం ఒప్పుకుంటే, తక్కువ శిక్ష పడుతుంది. లేదా కటకటాలను ఎక్కువ కాలం లెక్కపెట్టాల్సి వుంటుంది''
యూనిఫాంలో వున్న ఓ పోలీస్ కాన్‌స్టేబుల్ తలుపు తెరుచుకుని లోపలికి వచ్చి, సెల్యూట్ చేసి లియోఫోర్డ్ చెవిలో ఏదో చెప్పాడు.
లియోఫోర్డ్ చిన్నగా నవ్వుతూ అన్నాడు.
''సెర్చ్ వారంట్ లేకుండా వెదికినందుకు సారీ. వజ్రాలు మాకు దొరికాయి''
వెంటనే ఆర్నాల్డ్ తల వంచుకున్నాడు.
''పట్టుబడ్డాక దబాయించి ప్రయోజనం లేదు. మీరు చెప్పినవన్నీ నిజాలే. నా తప్పు ఒప్పుకుంటున్నాను''
పోలీస్ కారులో ఎక్కాక ''నా కారు స్టెఫినీలో దాచిన వజ్రాలని ఎవరూ కనుక్కోలేరనుకున్నాను. ఎలా కనుక్కున్నారు?'' పీటర్ ఆర్నాల్డ్ అడిగాడు.
''పోలీసుల్ని తప్పుగా అంచనా వేశావంతే'' సన్నగా నవ్వాడు లియోఫోర్డ్.
టైప్ చేసిన కన్ఫెషన్ పేపర్లని ఆర్నాల్డ్ ఓసారి చదివి సంతకం చేశాక, అతణ్ణి సెల్‌లోకి తీసుకెళ్లారు.
''బాస్, ఆర్నాల్డ్‌తో ఎంత అలవోకగా ఎన్ని అబద్ధాలాడారు? హాఫ్‌మేన్ మనకి ఒప్పందం గురించి చెప్పాడని, బెగ్లర్ మరణించాడని, వజ్రాలు దొరికాయని...'' ఫ్లెచర్ ఆశ్చర్యంగా అడిగాడు లియోఫోర్డ్‌వంక చూస్తూ.
''అసలు హాఫ్‌మేన్ వజ్రాలను దొంగిలించలేదన్న ఆలోచన నాకు మెరుపులా తట్టాక- టైం లేక హాఫ్‌మేన్ వాటిని తీసుకోకపోయినా ఆ దొంగతనం అతడి మీదకే వెళ్తుందనే ఉద్దేశంతో ఆర్నాల్డ్ వాటిని దొంగిలించి వుంటాడని- అనిపించింది. కాని తను దొంగతనం చేయలేదన్న సంగతి హాఫ్‌మేన్ మనకి చెప్పొచ్చుగా? చెప్పలేదంటే అందుకు బలమైన కారణం వాళ్లిద్దరూ తోడుదొంగలు కావడమే అనిపించింది. నువ్వు ఆర్నాల్డ్ గురించి విచారించడంతో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసింది. హాఫ్‌మేన్ స్వయంగా జరిగిందంతా చెప్పాశాడంటే ఆర్నాల్డ్ కాదనలేడనిపించి, అలా గాల్లోకి ఓ రాయి విసిరా. దొంగిలించిన వజ్రాలని తన కేబిన్‌లో దాచడనుకున్నా ముందు. అదృష్టవశాత్తూ ఆర్నాల్డే ఆ రహస్యం కూడా చెప్పేశాడు. వజ్రాలు దొరక్కపోతే, ఆర్నాల్డ్ మీద కేసు బనాయించలేం కదా?'' అంటూ వివరించాడు లియోఫోర్డ్.
''నిజమే. మిగిలినవాళ్లు ఎంత నిజాయితీగా పరిశోధన చేసినా అంతుచిక్కని కేసు, మీరు ఆడిన అబద్ధాలతో ఇట్టే తేలిపోయింది'' మెచ్చుకోలుగా అన్నాడు ఫ్లెచర్.
''సమయం అనుకూలిస్తే తప్ప, అన్నిసార్లూ ఇలా కుదరదు. కాబట్టి నిజాయితీయే ఎప్పటికీ సరైన దారి'' నవ్వుతూ చెప్పాడు లియోఫోర్డ్.
Thursday, September 27, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment