'నా మిత్రుడు శ్యామ్‌లాల్ కానుక ఇది. తనను మరచిపోకుండా ఉండటానికని దీనినెప్పుడూ వేలికి పెట్టుకొమ్మని చెప్పాడు. తన వేలికున్న ఉంగరాన్ని అందరికీ చూపిస్తూ అన్నాడు దేవేంద్ర.
పరమేశ్వర్ ఆ ఉంగరం వైపు చూసి నవ్వుతూ అన్నాడు- ''కానుకల ప్రస్తావన వచ్చింది కనుక, మీకు నేనో విచిత్రమైన రసవత్తరమైన యదార్థ గాథ చెప్తాను. నమ్మటం, నమ్మకపోవటం మీ ఇష్టం. నేను చెప్పేదంతా నిజం. ఎందుకంటే ఈ కథలో నా పాత్ర కూడా ఉంది. మీకేం తొందర పనుల్లేవంటే చెబుతాను''
అందరూ ముక్త కంఠంతో 'తొందరేం లేదు, చెప్ప'మని అన్నారు.
పరమేశ్వర్ మొదలుపెట్టాడు-
''రెండేళ్ల నాటి సంగతి. మా కంపెనీ బ్రాంచి మేనేజర్‌గా ఢిల్లీ వెళ్లాను. మా బంగళా పక్కన ఒక కాటేజీ ఉంది. అందులో ఒకామె ఉంటోంది. పేరు యామినీదేవి. ఏదో స్కూల్లో ప్రధానాధ్యాపకురాలిగా పనిచేస్తోంది.
సాయంకాలం నేను వాహ్యాళి కెళ్ళినపుడు కన్పించేది. ఇద్దరి చూపులు కలిసేవికాని పరిచయం లేనందున మాట్లాడుకోలేదు.
ఒకరోజు షికారుగా దగ్గరలో ఉన్న పార్కుకెళ్లాను. అక్కడ ఒక పూలమొక్క దగ్గర యామినీదేవి నిలబడి ఉంది. నన్ను చూస్తూనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. నెమ్మదిగా వెళ్తున్న ఆమెననుసరించాను నేను. మధ్య మధ్యన ఆమె వెనక్కు తిరిగి చూసేది. నడుస్తుండగా ఆమె చేతి రుమాలు పడిపోయింది. పడిపోయిందనే కంటే పడేసింది అనటం సబబు. ఆమె దాన్ని కిందకు జారవిడవడం నేను స్పష్టంగా చూశాను.
ఆ రుమాలు తీసి ఆమెకివ్వటం నా కర్తవ్యం కదా. అలాగే చేశా. చిరునవ్వుతో ఆమె నాకు ధన్యవాదాలు తెలిపింది.
''మీరిక్కడే ఎక్కడో ఉంటున్నట్లున్నారు. మిమ్మల్ని చాలాసార్లు చూశాను''
''ఔనండి మీ పక్క బంగళాలోనే ఉంటున్నాను. ఈమధ్యే ఇక్కడికి వచ్చాను''
''అలాగా! ఐతే మీరు మా పొరుగునే ఉంటున్నారన్నమాట. అంత దగ్గరగా ఉండి కూడా మనిద్దరం అపరిచితులుగా ఉన్నామంటే వింతగా లేదూ?''
''పొరుగు వాళ్లని పరిచయం చేసుకోవాలని అనుకొన్నాను. కొందరు పరిచయమయ్యారు కూడా. కాని ఆడవారని మీ దగ్గరకు రాలేకపోయాను''
యామినీదేవి పకపకా నవ్వింది. ''ఓహో, మీకు ఆడవాళ్లంటే భయమా. నిర్భయంగా మీరు మా యింటికి రావచ్చు. స్త్రీలు అబలలు. సుకుమారులు. వాళ్లంటే భయపడటం హాస్యాస్పదం''
ఆమె తియ్యని నవ్వు, వాక్చాతుర్యం నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. నాలుగు పదుల వయసు, సామాన్యమైన రూపం, ఎర్రగా, బొద్దుగా ఉంది. పెద్ద కళ్లు, గుండ్రని మొహం. ప్రింటెడ్ జార్జెట్ చీర కట్టుకొని ఉంది. మొదటిసారి ఆమెను ఆపాదమస్తకం పరికించి చూశాను. అది గమనించి ఆమె కొద్దిగా సిగ్గుపడి నవ్వుతూ అంది- ''మా ఇంటికెప్పుడొస్తారు?''
''రేపు సాయంత్రం ఐదింటికి వస్తాను. మీరు ఇంట్లోనే ఉంటారుగా?''
''మీరొస్తానంటే ఉంటాను. లేకపోతే రోజూలా షికారుకెళ్తాను''
యామినితో నా స్నేహం హద్దులు దాటింది. నాకు పెళ్లయిందని మీకూ తెలుసు. నా భార్య అందగత్తె. ఇల్లాలిలో లేని వింత ఆకర్షణ ఏదో యామినిలో ఉంది. ప్రతిరోజూ ఆమెను కలుసుకొంటున్నాను. ఒక్కోరోజు రాత్రంతా అక్కడే ఉంటున్నాను.
ఒకరోజు ఉదయం నిద్ర లేచేసరికి కొద్దిగా తలనొప్పనిపించింది. లేచి చూశాను. యామినిగది అది. ఆమె స్నానం చేస్తున్నట్లుంది. రాత్రి చాలాసేపు మేల్కొన్నందున తలనొప్పి వచ్చింది. ఉదయం ఎనిమిది గంటలయింది. డ్రస్సింగ్ టేబుల్‌కున్న అద్దం లో మొహం చూసుకొన్నాను. కళ్లు ఎర్రగా ఉన్నాయి. మొహం వాడిపోయి ఉంది.
నా దృష్టి అనుకోకుండా డ్రస్సింగ్ టేబుల్‌కంటించి వున్న లేబుల్ మీద పడింది. ఇంగ్లీషులో దానిమీద ప్రకాష్ అని రాసి ఉంది. ఈ ప్రకాష్ ఎవరనుకొంటూనే పక్కనే వున్న యామిని వానిటీ బాక్స్ చూశాను. తెరచి చూడాలనిపించింది. ఆడవాళ్ల అలంకరణ సామాగ్రి ఉంది అందులో. దానిలో ఒక మూలన రమేష్ అని రాసి ఉన్న కాగితం అంటించి ఉంది. హార్మోనియం వాయించాలనే కోరికతో దాని దగ్గరకెళ్తే దాని కంటించిన చీటీలో ఆత్మారామ్ ఉన్నాడు. మౌనంగా డ్రస్ వేసుకొని బూట్ల కోసం మంచ కిందకు వంగి చూశాను. మంచం కోడుకు ఇక్బాల్ పేరు రాసి ఉన్న చీటీ అంటించి ఉంది.
గదిలో వున్న సామానులు అన్నింటిని పరిశీలనగా చూడ టం ప్రారంభించాను. అన్నిటిమీద చిన్నచిన్న లేబుల్స్ అం టించి ఉన్నాయి. వాటి మీద చక్రవర్తి, విలియం, మెహతా, రామనాథ్,రామేశ్వర్, కాశీరామ్ లాంటి ఎన్నో పేర్లున్నాయి.
యామిని స్నానం ముగించుకొని వచ్చింది ''ఇవాళ ఆలస్యంగా లేచారే పరమేశ్వర్ గారూ'' అంటూ ఒక నవ్వు నవ్వింది.
''లేచి చాలా సేపయింది. నువ్వు స్నానం చేస్తుండగా నేనొక అనుచితమైన పనిచేశాను. క్షమించు''
ఆమె నా దగ్గరకు వచ్చి ప్రేమగా నా చేయి పట్టుకొని ''మనిద్దరి మధ్య ఈ క్షమాపణలు అవసరమంటారా?'' అనడిగింది.
''ఐనా కోరటం నా విధి. నేనొక విషయం అడుగుతాను. నిజం చెప్తావా?''
''మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు''
''కాదు నిజమే చెప్తానని మాటివ్వు''
నా మెడ చుట్టూ చేతులేసి ఊగుతూ, ''మాటిస్తున్నాను'' అంది.
''నీ గదినంతా పూర్తిగా పరిశీలించాను. అలా చేయటం తప్పని తెలుసు. కాని కుతూహలం నన్ను జయించింది. నీ గదిలోని వస్తువులన్నింటి మీద ఒక్కో మగవాడి పేరుతో చీటీలు అంటించి ఉన్నాయి. ఒక్కో వస్తువు మీద ఒక్కో పురుషుడి పేరుంది. ఎంత తల బద్దలు కొట్టుకున్నా ఈ రహస్యాన్ని నేను ఛేదించలేకపోయాను. ఆ రహస్యాన్ని నీవే విప్పాలి''
యామిని కోమల స్వరంతో నవ్వుతూ అంది. ''ఆ రహస్యాన్ని అలాగే ఉండనివ్వండి. మీరు తెలుసుకోకుండా ఉండటమే మంచిది. తెలిస్తే మీకు బాధ కలగొచ్చు. కోపం రావచ్చు''
''నేను బాధపడను. కోపగించుకోను''
యామిని కూర్చుంది. ''పరమేశ్వర్ బాబూ! ఈ రహస్యమే నా బలహీనత. ఈ వస్తువులన్నీ నా ప్రేమికులిచ్చిన కానుకలు. నేనొక్కో ప్రేమికుడి నుంచి ఒక్కొక్క వస్తువు మాత్రమే తీసుకున్నాను. ఆ కానుకలు ఎక్కువైపోయి వాళ్ల పేర్లు గుర్తుండటం లేదు. అందుకని వాటిమీద ఆ ప్రేమికుడి పేరుతో చీటీ అంటించాను. ఆ వస్తువు వాడినపుడు ఆ ప్రేమికుడి తాలూకు మధురస్మృతులు మదిలో మెదులుతాయి. నా మనసు చాలా సున్నితం. నేను నా ప్రేమికులను మరిచిపోలేక పోతున్నాను.''
''ఇలా మొత్తం ఎన్ని కానుకలున్నాయి?''
''తొంభై ఏడు''
''అమ్మో, అన్ని కానుకలా!'' అంటూ ఆశ్చర్యంతో అరిచినంత పనిచేశాను.
''ఔను, చాలా ఎక్కువే'' ఆమె స్వరం గంభీరంగా ఉంది. ''పరమేశ్వర్ బాబూ, నాకు పెళ్లి కాలేదు. పెళ్లి చేసుకోవాలనే కోరిక నాలో చాలా బలీయంగా ఉండేది. నా జీవితంలోకి అడుగిడిన ప్రతి వ్యక్తీ భవిష్యత్తు పట్ల నాకు ఆశలు కల్పించేవాడు. నేనతణ్ణి నా భర్తగా ఊహించుకొనేదాన్ని. కానీ జరిగింది మరొకటి. ప్రతివాడూ నాకు కానుకనిచ్చేవాడు కాని, భార్యగా స్వీకరించేవాడు కాదు. నేను దానికి అలవాటు పడ్డాను. జీవితం నాకొక ఆటగా మారింది. జీవితం విలాసవంతమైన ఒక ఆట. దాన్ని మనసారా అనుభవించటమే మన కర్తవ్యం. ఇదే నా కథ''
''మామూలు మనుషులకిది బాగుండవచ్చు'' నేను సంకోచిస్తూ అన్నాను.
''మామూలు మనుషులకే కాదు, మీ నంబరు తొంభై ఎనిమిదవుతుంది''యామిని పకపకా నవ్వుతూ అంది.
మిత్రులారా! అప్పుడు నేనొక దార్శనికుడిగా మారాను. వేదాంతానికీ నాకూ చుక్కెదురు. ఆమె కథ విన్నాక నాలో మార్పు వచ్చింది. నేనామెతో అన్నాను-
''ఔను, జీవితం ఒక ఆటే. మనలో ఆడేశక్తి ఉన్నంతవరకు బాగానే ఉంటుంది. దుర్బలులమైనపుడు ఈ జీవితమే నరకంగా మారుతుంది. నువ్వు వర్తమానం గురించి ఆలోచిస్తున్నావు. నేను నీ భవిష్యత్తు గురించి చింతిస్తున్నాను. నీకూ వృద్ధాప్యం వస్తుంది. గత స్మృతులు నిన్ను కాటేస్తాయి. నీకు నా అనే వారెవరూ ఉండరు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన నువ్వు డబ్బూ వెనకేయలేవు. ఈ ఆట ముగిశాక వృద్ధాప్యం, రోగాలు నిన్ను చుట్టుముడతాయి. భూతకాలం నిన్ను భయపెడ్తుంది. అందుకని నేను నీకొక అమూల్యమైన కానుక ఇస్తాను. అది నీకు నిస్సహాయస్థితిలో బాసటగా ఉంటుంది. నీ ఈ కానుకలు విలువైనవి. పదేళ్ల తర్వాత నేను నీ కానుకలన్నింటిని పాతికవేలకు కొంటాను. శాపగ్రస్తమైన ఈ స్మృతి చిహ్నాలన్నీ నీ ముందు నుంచి తొలగిపోతాయి. నీవప్పుడు కృష్ణా రామా అనుకొంటూ ఆ డబ్బుతో నిశ్చింతగా కాలం గడపొచ్చు''
''ఆ మాట వినగానే ఆమె నిన్ను నౌకరుతో బైటకు గెంటించలేదా'' నేను పరమేశ్వర్‌ని అడిగాను.
పరమేశ్వర్ నవ్వాడు ''లేదు. కొంచెంసేపు ఆలోచించాక 'మీరు చెప్పినవన్నీ నాకు నచ్చాయని అనను. వృద్ధాప్యంలో గడపటానికి అవసరమైన ఏర్పాట్లేమీ చేసుకోలేదని మాత్రం ఒప్పుకొంటున్నాను. నేనీ వస్తువులన్నీ మీకు అమ్మేస్తాను. ఒప్పందం మీద సంతకం చెయ్యండి' అంది.''
నేను సంతకం చేశాను. రెండేళ్లయింది. మొన్నే యామిని నుంచి ఉత్తరం వచ్చింది. ఇప్పుడు ఆమె వద్ద ఉన్న వస్తువుల సంఖ్య నూట పదమూడు అయ్యాయట.
Thursday, September 27, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment