Thursday, September 27, 2007

దీపానికి కిరణం

బాహ్య రూపాన్ని తీర్చిదిద్దడంలో కొంత అశ్రద్ధ వహించిన ఆ విరించి, లలిత హృదయంలో మూలమూలలా దయ, సానుభూతి, విశాల దృక్పథం, మానవీయత అనే విలువైన ఆదర్శాలను పొదిగి, సొబగులను ఒనగూర్చాడంటే అతిశయోక్తి కాదేమో!

అదే నన్ను ముగ్ధుడ్ని చేసింది.

లలిత చదువుకున్నది కేవలం డిగ్రీ... కాని ఆమెలో సాహితీ సంపద అపారం. ఆమె మనో మథనానికి సాక్ష్యాలుగా కథలు... నవలలూ నిలిచాయి.

నేను సాహితీ ప్రియుడిని కావటంవల్ల ఆమెను తరచూ కలుస్తుండేవాడిని...

లలితలో వైకల్యం నేను చూడలేదు. ఆమెలో ఓ సమాజం కనిపించింది. ప్రపంచ ఆవిష్కర్తగా ప్రతిబింబించేది. తను రాతకే పరిమితం కాలేదు. చేతలకూ ప్రాధాన్యమిచ్చేది... తను సంపాదించిన పారితోషికాలతో పేద పిల్లలకి ఫీజులు కట్టేది. బట్టలు కొనేది... అభాగ్యులను ఆదుకోటానికి ఆయత్తమయ్యేది...

ఎక్కడో గుజరాత్‌లో భూకంపం వచ్చి అతలాకుతలమైపోతే లలిత మనసెంతగానో గుంజాటనకు గురయ్యేది. సునామీ సంభవించినప్పుడు ఎందరో అనాథలయ్యారు. అప్పుడామె పేగు కలుక్కుమనేది. ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా విలవిల్లాడిపోయేది.

ఆ స్పందనతో జనంలోకి వెళ్లేది... జోలె పట్టుకొని తిరిగేది. పోగుచేసిన విరాళాలను సంబంధిత అధికారులకు పంపేది. ''నీ గురించి నువ్వు ఆలోచించుకోకుండా అందరి గురించి ఆలోచిస్తావేం?'' అంటూ ఇంట్లో వాళ్లడిగినా పట్టించుకునేది కాదు.

''ఈ సొట్టపిల్ల పెళ్లి పెటాకులు లేకుండా అందరి గురించి వీధుల్లో బరితెగించి తిరుగుతోందిరా'' అంటూ నిష్ఠూరమాడేవారు కొందరు.

ఆ వ్యాఖ్యలు నా చెవిన పడి గుండె కలుక్కుమనేది.

పుట్టుకతో ఏర్పడిన వైకల్యాన్ని వేలెత్తి చూపటానికి ప్రయత్నించే ఈ మనుషులు- లలిత మంచి మనసుతో పదుగురికి మేలుచేసే మానవతను ప్రశంసించరేం?

వారి అజ్ఞానం చీకటిలా అలముకొన్నది... ఆ చీకటిని ఛేదిస్తూ సాగాలన్న ఆశయం లలితది. ఆ సాధనకు ఆమె చేపట్టిన ఆయుధం నిర్విరామ కృషి.

లలిత ఆదర్శ భావాలతో నేను ఏకీభవించేవాడిని. ఆమె పట్ల నా ఆరాధన భావం క్రమేపీ వృద్ధి చెందింది. ఆమె సంస్కారంపై క్షుణ్ణమైన అవగాహన ఏర్పడింది.

సాయం వేళల్లో మా వ్యాహాళి... ప్రేమ సమాజంవైపో, అనాథ శరణాలయాలవైపో, బాధిత కుటుంబాల దరికో సాగేది.

అనాథ బాలలు లలితను చూడ్డంతోనే 'మా అక్కొచ్చింది' అంటూ చుట్టుముట్టేవారు. తన వెంట తెచ్చిన పుస్తకాలు, పెన్నులు వారికి పంచేది... కల్లాకపటమెరుగని ఆ పిల్లల కళ్లలో కోటి కాంతిరేఖలు నిండేవి.. వారందరినీ కూర్చోబెట్టి మంచిని బోధించేది. నీతి శతకాలు విడమరచి చెప్పేది.

ఎక్కడికి వెళ్లినా, ఏది చేసినా మేమిద్దరమే.

అమ్మ, నాన్నలకి సుతారాం ఇష్టముండేది కాదు.

''ఒరే నువ్వు ఒక్కడివే మాకు... పైగా నాన్నగారు పలుకుబడి ఉన్న మనిషి. నువ్వా పిల్లతో చెట్టాపట్టాలేసుకు తిరగటం నాకెంత మాత్రం నచ్చలేదు... ఊరంతా కోడై కూస్తోంది...'' అమ్మ నిలదీసింది.

నీకా అవిటి పిల్లతో స్నేహమేంట్రా... బుద్ధి, జ్ఞానం ఉన్నాయా లేవా!'' కోపం ప్రదర్శించారు నాన్న.

నిజాలు తెలుసుకోని వారి నైజం నాలో ఎనలేని చిరాకును సృష్టించింది. లలిత పవిత్రమైన ఆలోచనలు, పరిపూర్ణమైన మానవత్వం, శీల సంపద ఎంత సుసంపన్నమైనవో తెలియజేశాను.

''మరి నీ మీదనే ఆశలు పెట్టుకొన్న పద్మ మాట...'' అన్నారు.

చోద్యమనిపించింది... ఎప్పుడో మేమిద్దరం కూడా పుట్టక మునుపు చేసుకున్న వాగ్దానాలకు బలయ్యేది మేమా...!

పద్మను నా పెళ్లాంగా ముద్ర వేసుకున్నా, ఆమె మీద నాకా భావం లేనే లేదు. ఈ విషయం వాళ్లకు తెలిసినప్పటికీ పద్మను తమ కోడలంటూ దగ్గర పెట్టుకొన్నారు. నా ఎదురుగా ఉంటే ఆమె పట్ల నేను ఆకర్షణ పెంచుకొని సుముఖుడిని అవుతానని వారి వెర్రి ఆశ... కాని నేను లొంగలేదు...

అయితే నేను లలితతో పెంచుకున్న అనుబంధం ముందు పద్మ పెంచుకున్న ఆశలు తృణ ప్రాయమయినాయి.

నా ధ్యేయానికి పద్మ భావాలకీ చుక్కెదురు. ఆమెకి అలగావారంటే అసహ్యం. అనాథలంటే విసుగు. బద్ధకానికి ప్రతిరూపం.

అటువంటి పద్మ కూడా నా మీద ధ్వజమెత్తడానికి వెనుకాడలేదు. నేనేదో ఆమెకి అంకితమైపోయి పడి ఉండాలని అనుకుంటుంది. నేనెప్పుడు తిరిగి ఇంటికి వచ్చినా నిరసన గళం వినిపించేది.

''బావా! నీకిది ధర్మం కాదు. నన్నిలా అన్యాయం చేయటం తగదు. నా పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తునావు'' అంటూ బుడిబుడి రాగాలు తీసేది.

వాటి వేటికీ నేను చలించలేదు.

''మీ నాన్నను వేరే ఎవరినైనా చూడమని చెప్పు'' అని నిర్ద్వంద్వంగా అనేసరికి దిమ్మెరపోయింది. ఈ విషయం మామయ్యకు తెలిసి హుటాహుటిన దిగాడు. ఛర్రుమంటూ నా మీద ఎగిరాడు.

''నీ మీద కోటి ఆశలు పెట్టుకున్నాన్రా! మా పద్మ ముందర ఆ అమ్మాయి పెద్ద అందగత్తెనా? పైగా అవిటి పిల్ల. ఆమె రచయిత్రి అయితే ఆమె రచనలను ఆరాధించు, అంతేగాని ఆమె మత్తులో పడి మా అమ్మాయిని దగా చేయకు... అయినా ఆ పిల్ల నీకేం సాయం చేయగలదని. నువ్వే జీవితాంతం చాకిరీలు చేయాలి తప్ప!!'' అనేసి నోటికొచ్చినట్లు వాగాడు.

అది విన్న నేను సహించలేకపోయాను...

''ఆమె సమాజసేవ నన్ను ఆకర్షించింది. నాకు సేవ చేయకపోయినా ఫర్వాలేదు'' అనేశాను.

మా ఇరువురి వాదనల మధ్య అమ్మనాన్నలు దూరారు. అయినా నా మనోనిశ్చయం నిశ్చల తటాకమైంది.

రెండు రోజుల తరువాత లలితను కలిశాను.

''ఇకనుంచీ నన్ను కలవటానికి ప్రయత్నించవద్దు. ప్లీజ్‌!'' అనేసింది లలిత నిర్మొహమాటంగా.

విభ్రమంగా చూశాను.

''నీ మీద ఆశలు పెట్టుకున్న అమ్మాయిని అన్యాయం చేసినవాడిగా నీ వ్యక్తిత్వం నాకు నచ్చలేదు. అయినా నాలో ఏముందని? నేనో అవిటిదాన్ని. నన్నిలాగే బతకనీ. సమాజసేవ నా కిష్టమైన పని. దానికి నేనంకితమయ్యాను. దయచేసి నన్ను...'' నిష్కర్షగా అనేసింది.

ఒక్కసారిగా మ్రాన్పడిపోయాను.

''అదికాదు లలితా! పద్మను నేను మరో భావంతో ఏనాడూ చూడలేదు... నాకు బలవంతంగా కట్టబెట్టాలని వారి ప్రయ త్నం... మనిద్దరి స్నేహం అరమరికలు లేనిది. అది అర్థం చేసుకోనివాళ్లనే మాటలకి నన్ను దూరం చేసుకోవద్దు, ప్లీజ్‌'' అర్థింపుగా అన్నాను.

లోనుండి లలిత తల్లి అమ్మాజీ వచ్చింది.

''అది కాదయ్యా! మీకూ మాకూ చాలా అంతరం. మా అమ్మాయి అవిటిదని తెలిసీ నువ్వెందుకయ్యా వెంటపడ్డం...! నీ మీద ఆశలు పెంచుకున్న నీ వారి నెందుకయ్యా అన్యాయం చేస్తున్నావు...? దయచేసి మా అమ్మాయిని వదిలేసిపోవయ్యా!'' దీనంగా వేడుకుందామె.

''చూడు బాబూ! మా బతుకులు మేం బతుకుతున్నాం. మేం సుఖంగా ఉండటం నీకిష్టంలేదా! లలితకు తెలిసిన విద్య కాగితాలు కరాబు చేయటం. తోటివారికి సాయపడ్డం. అదో పిచ్చిదనుకో. దాంతో నీకేంటయ్యా. వెళ్ళు బాబూ!'' దణ్ణం పెట్టేశాడు లలిత తండ్రి రామ్మూర్తి.

లలిత కుటుంబంలో ఎన్నడూ లేని ఆ కృత్రిమ వాతావరణం నేను భరించలేకపోయాను. దీని వెనుక కారణాలు నేను తేలిగ్గానే ఊహించగలను.

నా ఊహ నిజమే అయింది. అమ్మా నాన్నలు, మామయ్య నేరుగా వెళ్ళి లలిత ఇంటిమీద విరుచుకు పడ్డారుట. ఇకపై ఎటువంటి పరిస్థితుల్లో నాతో సంబంధం పెరగటానికి వీల్లేదని హెచ్చరించారుట.

ఇదంతా తెలిశాక మా వాళ్లందరి మీద అలవిగాని ఏహ్యత... నేనింటికి చేరటంతోటే వాళ్ళు చేసిన ఘనకార్యాన్ని తూర్పారబట్టాను. చెడామడా దులిపాను.

''ఔన్రా నువ్వు చేసిన పని మాకే మాత్రం నచ్చకనే మేం అలా ప్రవర్తించాం. నిన్నెలా దారిలో పెట్టాలో మాకు అర్థం కాలేదు. నువ్వెలా ఆమెనిష్టపడ్డావో తెలీదు. పద్మలా అందగత్తె కాదు. ఎటువంటి లోపం లేకుండా సవ్యంగా ఉందాంటే అదీ లేదు'' మామయ్య వేడింకా చల్లారలేదు.

''నిజానికి నువ్వు ఎవరినయినా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకో దలిచావే అనుకో... మేమూ హర్షించేవాళ్ళం. అదీ ఎటువంటి వైకల్యం లేనప్పుడు'' నాన్న నిప్పుల వర్షం కురిపించారు. ''నువ్వు ప్రేమించే పిల్ల అవిటిదయినా నువ్వు భరించగలవేమో కాని... ఓ కుంటిదాన్ని కోడలిగా నేను భరించలేనురా...'' తెగేసి చెప్పింది అమ్మ.

''చాలా బాగుందమ్మా. మీ ఆలోచన పదేపదే ఆమెను వేలెత్తి చూపుతున్న మీ సంస్కారానికి నేనేం చెప్పాలో అర్థం కావటం లేదు... ఆమెకు అవిటితనం లేకుంటే మీరు నెత్తిన పెట్టుకునేవారా! వైకల్యంతో ఉన్న ఆమెది గొప్ప మనసైనా మీకు చేదా?!''

''ఔను... నువ్వు చేసుకునే పిల్ల ఎంతో గొప్పది కావచ్చుకాని, అవిటిది కాకూడదంతే...'' ఖండించి పారేశారందరూ.

మరింక వారి సమక్షం నాకు ఇచ్చగించలేదు.

జరిగినదానికి నేనెంతగానో మధనపడసాగాను.

ఆరోజు నేనాఫీసులో పేపర్‌ చదువుతుండగా... నా కళ్ళు ఒక వార్త దగ్గర అతుక్కుపోయాయి.

ఒక్కసారిగా నా యోచనల్లో కొత్త ధోరణి... నేను చూసే కోణంలో ఎటువంటి అపసవ్యత లేదు.

నేనాచరించే కర్తవ్యం అందరికీ జవాబు కావాలి... నా ధ్యేయానికి తోడు నిలిచి చేయూతనందిస్తుందనే కొండంత ఆశతో లలితను కలిశాను.

బస్సు ప్రమాదంలో గాయపడ్డ పాఠశాల బాలబాలికలకు సేవ చేస్తున్నది లలిత. ఆ దృశ్యం చూసి విచలితుడైన నేను ఆ సేవా తత్పరతలో నిమగ్నమయ్యాను.

తరువాత లలిత తన మానాన తాను వెళ్ళబోయింది. ఆపి, విషయమంతా వివరించాను. చాలాసేపు ఆలోచించింది. సంశయాత్మకంగా ఉండిపోయింది.

''నన్నిలాగే ఉండిపోనీ... ఇది నాకు అవరోధం కాదు'' ఉన్నట్టుండి అనేసింది.

''లేదు లలితా! నేను చేయబోయే ఈ పని నీ మనసుకెంతో ఊరట నిస్తుంది. నన్ను కాదనకుండా అంగీకరించు. ప్లీజ్‌'' నా అభ్యర్థన ప్రభావం లలితమీద పడింది.

వెంటనే నన్ను అనుసరించింది. మా ప్రయాణం తిరుపతికి సాగింది.

కొంతకాలం తర్వాత నేను, లలిత తిరిగి వచ్చేశాం. మా తొలి అడుగులు లలిత ఇంటివైపు సాగాయి.

మమ్మల్ని చూస్తూనే అంతెత్తున లేచారు లలిత అమ్మ, నాన్నలు... వారిని లోనికి తీసుకెళ్ళి అంతా చెప్పింది లలిత.

బయటకు వచ్చిన లలిత తండ్రి రామ్మూర్తి- ''ఇంతకాలం మీరిద్దరూ కనిపించకపోతే మేమూ అందరిలాగే తప్పుగా ఊహించుకున్నాం. కాని లలితకి నువ్విలా కొత్త జీవితం ప్రసాదిస్తావనుకోలేదు'' నా చేతులు పట్టుకున్నాడు.

''మీ వాళ్ళంతా మా మీదకు దాడికి దిగారయ్యా! పోలీసులు కూడా వేధించారు... ఇదంతా మనమంతా కలిసి ఆడిన నాటకమట... మా పిల్లను చెల్లగొట్టడానికి వేసిన పథకం అన్నారయ్యా! వెంటనే నీవెళ్ళి వారికి జవాబు చెప్పండి'' అన్నది కళ్ళు తుడుచుకుంటూ ఆవిడ.

మేమిద్దరం ధైర్యంగానే మా వాళ్ళకి ఎదుటపడ్డాం.

''ఛీ! సిగ్గు లేదురా నీకు, అలా చెప్పాపెట్టకుండా పారిపోటానికి. ఇంతకాలం కనిపించకుండా పోయింది.. దీంతో కులికి రావటానికా! ఇంతకీ ఎక్కడ తగలడ్డారని'' గయ్యిమన్నది అమ్మ.

''తిరుపతి వెళ్ళాం...అక్కడే ఉన్నాం...''

''అంటే ఆ దేవుడి సాక్షిగా అంతా చక్కపెట్టేసుకొచ్చారన్నమాట...'' మామయ్య నోరు నొక్కుకున్నాడు.

''ఈ అవిటిదాన్ని కట్టుకోడానికి అంతదూరం పోయావన్నమాట...'' అన్నాడు క్రోధంతో నాన్న.

''మాట మాటకీ 'అవిటి' 'అవిటి' అనే మీ నోళ్ళని శాశ్వతంగా మూయించటానికి మీరన్నట్లు 'ఆ వెంకన్న సాక్షిగా' తిరుపతినే ఆశ్రయించాం'' ధైర్యంగా అన్నాను.

''దీన్ని కట్టుకుని మాకు శాశ్వతంగా శోకం మిగల్చటానికా...''

''కాదు మీ వంకర మనసులను సరిచేసేందుకు''

''ఏమిటి నువ్వనేది?'' కోపంగా అన్నాడు నాన్న.

''ఔను ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిని ఆకర్షించటానికి కేవలం ఆ మనిషి మనసు చాలునన్నది సత్యం... కాని, అది గ్రహించని మీరంతా అవిటితనం అడ్డంకిగా తలిచారు. లలితపై నా ప్రేమను మీరు అంగీకరించకపోవటానికి కారణం ఆమె వైకల్యం. ఈ విషయం గురించే నేనాలోచిస్తున్న సమయంలో పేపర్లో పడ్డ వ్యాసం నన్ను ఆకర్షించింది. తిరుపతిలో బర్డ్స్‌ ఆసుపత్రిలో ఎటువంటి అంగవైకల్యం ఉన్నా సరిచేసి వారి జీవితంలో వెలుగులు నింపుతారని తెలుసుకుని లలితను నాతో తీసుకువెళ్లాను. ఆమె మామూలు మనిషయింది...'' భావోద్వేగంగా అన్నాను.

లలిత మామూలుగా కావటం వారందరికి చాలా చిత్రంగా అనిపిస్తుంది.

''మీరనుకున్నట్లుగా లలిత తన స్వార్థం కోసం నాతో రాలేదు. మూడు ముళ్లు వేసి తీసుకురావటానికి నేనూ ప్రయత్నించలేదు. మీ ముందుకు వైకల్యంలేని లలితను తీసుకురావాలన్నది నా ఆశయం... ఇప్పుడు మీరే చెప్పండి? ఎటువంటి లోపం లేని పిల్లనయితే తప్పకుండా మేమంతా అంగీకరించివుండేవాళ్లం అన్నారుకదా. మరి మీరీరోజు ఆశీర్వదిస్తారా! అందుకే మీ ఎదుటికి వచ్చాం...'' సాభిప్రాయంగా చూశాను.

మా సామీప్యంలో వారి మౌనం ఎంతసేపు రాజ్యమేలిందో చెప్పలేను.

కొంతసేపటి క్రితందాకా ద్వేషభావంతో అట్టుడికిపోయిన వారి వైఖరిలో క్రమంగా ఏదో మార్పు.

మేం వెనుదిరగబోయేసరికి అమ్మా నాన్నలు మా ముందుకు వచ్చారు.

''మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాం... మీ ఇద్దరివీ ఒకేరకం భావాలు... అవి కలిశాయి... ఇది తెలిసినా మీ ఇద్దరి మధ్య వైకల్యం అనే అడ్డుగోడను సృష్టించి వేరుపరచాలని చూశాం... అయితే ఆ అడ్డుగోడను సైతం కూల్చేసి మీరు మా ముందుకు రావటం ఎంతో సంతోషంగా ఉంది...'' అన్నారు నాన్న.

''వంకరనేది శరీరానికి కాదు, మనసుకి ఉండకూడదన్న సంగతి మాకు తెలిపి మా కళ్లు తెరిపించావు బాబూ!'' అంది అమ్మ...

''కేవలం శరీరాలు ఒకటవటం కాదు. మనసులు ఒకటి కావాలి అన్న విషయం గ్రహించేలా చేశావు బాబూ!'' మామయ్య కూడా బాధపడ్డాడు.

వాళ్లందరి మొహాల్లో సుప్రసన్నత దేదీప్యమానంగా వెలుగొందింది.

ఆ వెలుగులే పెళ్లి పందిరిలో విరాజిల్లాయి.

భూదేవంత పీట... ఆకాశమంత పం దిరి వేయకున్నా- శుభాక్షతలు జల్లి వారి ఆశీర్వచనాలు మాపై కురిపించటంతో మా మనసులెంతగానో ప్రఫుల్లమయినాయి.

ఇది జరిగిన తరువాత ఒకరోజు- మిగతా కార్యక్రమాలు అన్నీ రద్దుచేసుకొని సరదాగా గడపాలని నిశ్చయించుకున్నాను.

అయితే లలిత- ''చూడు నువ్వు నాలో వైకల్యం తొలగేలా చేసి నన్నో మనిషిగా చేశావు... నేను అదే స్ఫూర్తితో ప్రస్తుతం అంగవైకల్యంతో బాధపడుతూ సమాజంలో చిన్నచూపుకు గురవుతున్న ఎందరో అభాగ్యులను తలెత్తుకునేలా చేయాలనే ఈ కొత్త కార్యక్రమం చేపట్టాను... ఇదిగో ఈ గుడిసెలో చిన్నారిని రేపే తిరుపతి బర్డ్స్‌ ఆసుపత్రిలో జాయిన్‌ చేయటానికి తీసుకెళుతున్నాను. నువ్వు నాకు పెట్టిన భిక్షను నేను మరింత మందికి పంచి వారిలో ఆనందాన్ని చూడాలని కోరుకుంటున్నాను'' చాలా కృతనిశ్చయంగా అన్నదా మాట.

ప్రస్తుతం లలిత సేవాకార్యక్రమం కొత్తరూపు దిద్దుకుని వెలుగులు నింపి పలువురి ప్రశంసలకి పాత్రమైంది.

'దీపానికి కిరణం ఆభరణం'అన్నాడోకవి.

దీపమంటి లలితకు కిరణంలాటి గొప్ప మనసు ఓ దివ్యమైన ఆభరణం.

ఆ ఆభరణం ఇప్పుడు నా సొంతమైందన్న ఆనందం నాలో అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తోంది.

అదే అనుభూతితో ఆమె వెంట నా అడుగులు పడుతున్నాయ్‌..

No comments: