అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న జనంలో ఒక్కసారిగా కలకలం మొదలయింది! 'రాజరెడ్డి ఏషమచ్చింది... రాజరెడ్డి ఏషమచ్చింది!' అనుకుంటూ జనమంతా అలాయిగుండంవైపు పరుగులు తీశారు.
మంచి నగిషీలు చెక్కిన పట్టెమంచం- దాని మీద వరిగడ్డితో చేసిన సుఖాసనం. ఆ సుఖాసనంపై, కాషాయ బట్టలు కట్టుకొని- నుదుట విభూతిరేఖలు దట్టంగా పూసుకొని సుఖాసీనుడైనాడు అవాల్‌పురం రాజరెడ్డి! జనపనారతో చేసిన మీటరు పొడుగు గడ్డాన్ని ఒక శిష్యుడు పెద్ద దువ్వెనతో దువ్వుతున్నాడు. మరో శిష్యుడు పిచ్చుకలగూడులాంటి తలలో అదేపనిగా పేలు కుక్కుతున్నాడు. జనాలు తోసుకుంటూ తోసుకుంటూ పల్లకి వెంట నడుస్తున్నారు.
ముందుగా పల్లకి పీర్ల బంగళా ముందర ఆగింది. రాజరెడ్డి దిగివచ్చి హసన్, హుసేన్ పీర్ల ముందు మోకాళ్ళ మీద మోకరిల్లాడు. పూజారి ఉద్దాన్‌లో గుప్పెడు ఊదు వేసి పీరీలను ఆవాహన చేసి, ఊదు పొగ (సాంబ్రాణి పొగ)ని రాజరెడ్డి వైపుకి నెమలి ఈకల కట్టతో పారించాడు. మొహర్రంలో వేషం కట్టిన ప్రతివాడూ ముందుగా పీరీల 'దువా' తీసుకోవడం ఆనవాయితీ.
అవాల్‌పురం రాజరెడ్డి ఈ వూళ్లోనే పుట్టి పెరిగినవాడు. ఎరువుల వ్యాపారం చేస్తూ, పక్కనున్న టౌన్‌లో స్థిరపడిపోయాడు. చిన్నప్పుడు సరదాకి వేషం కట్టినా- ఆనవాయితీ తప్పకుండా, ఇప్పుడు కూడా మొహర్రం చివరి రోజున ఊరుకు వచ్చి వేషం కడ్తాడు. వేషం కట్టడమే గాకుండా, చుట్టుపక్కల ఊళ్ళనుండి మొహర్రం వేడుకలు చూడటానికి వచ్చే భక్తులకు భోజన వసతితో సహా అన్ని ఏర్పాట్లు రాజరెడ్డే దగ్గరుండి చేయిస్తాడు. హసన్, హుసేన్ దయవల్లనే తనకు అంతా మంచి జరుగుతుందని నమ్ముతాడు. రాజరెడ్డిలాంటి వాళ్ళు అలా నమ్మబట్టే, ఇంకా ఇలాంటి పండుగలు తమ పూర్వవైభవాన్ని కోల్పోకుండా గ్రామగ్రామాన ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.
రాజరెడ్డి మళ్ళీ పల్లకి ఎక్కి కూర్చున్నాడు. రాజరెడ్డి ఎక్కిన పల్లకిని మోయడానికి యువకులు పోటీ పడుతున్నారు. అలాయిగుండం చుట్టూ తిరిగిన పల్లకీ, అక్కడే వున్న ఎత్త్తెన అరుగు ముందర ఆగింది! అరుగు మీద సామీజీ సుఖాసీనుడై, శిష్యులకు సైగ చేశాడు. ఒక శిష్యుడు మొదలుపెట్టాడు.
''ఓ అమ్మలారా, అక్కలారా- అమ్మక్కలారా! ఇనుండ్రి! ఓయ్ బామ్మర్దుల్లారా, మేనమామల్లారా, మరుదులారా, మరదండ్లారా! ఇనుండ్రి! మీ వూరుకు రాకరాక మా సామిజీ అచ్చిండు! ఇగ మల్లరాడు! మల్ల దొరకడు! గిదే మోకా! మీరు ఏదడిగితే అదిస్తడు! కోరింది కోరినట్లు జరగనిది జరిగేటట్లు వరమిస్తడు!''
''మీ సామీజీ ఏదడిగితే అదిస్తడా!'' గుంపులోనుండి ఎవరో అరిచారు.
''ఆవ్, ఇస్తడు! ఒక్కళ్ళు ఒక్కటే అడగాల! ఈడికచ్చి కోరిక అడిగి వంగి నిలబడాల! మా సామి ఎడమకాలు నెత్తిమీద పెడ్తడు! కుడికాలుతోని యెనుక ఒక్క తన్నుదంతడు! బస్! ఆ దెబ్బకు మీ కోరిక తప్పక దీరుతది!''
''మళ్ళ ఇంకోసారి ఇంకేమీ అడగకుంట అయిపోతరు బిడ్డా! రాండ్రి! రాండ్రి!'' జనంలో కుతూహలం. కానీ ఎవరూ ముందుకు పోవడం లేదు!
''అరే! ఓళ్ళస్తలేరు! మొన్న మన ఊళ్ళెకు ధనపిశాచానందస్వామి అచ్చినపుడు, పైసలిచ్చి తన్నిపిచ్చుకున్నరుగదా!- ఈడ పుక్యం తందామంటే ఓళ్లస్తలేరు!''
కొన్నాళ్ల కింద ఆ వూళ్ళో ఓ స్వామీజీ తిష్ఠవేసి, రకరకాల పూజలూ, యజ్ఞాలూ నిర్వహించి, పట్నంలో పెద్ద గుడి కడుతున్నానని అందినకాడికి దోచుకున్నాడు. ఇవ్వని వాళ్ళని, స్వాములను ఉత్తచేతులతో పంపితే మహాపాపమని భయపెట్టి మరీ వసూలు చేశాడు. ఊళ్ళో చేపట్టే మంచి పనులకు ఎన్నడూ పైసా కూడా విదల్చని పిసినారులంతా ఆ ధనపిశాచానందస్వాముల వారికి అయినకాడికి సమర్పించుకున్నారు. వారిని ఎత్తిపొడిచేదే రాజరెడ్డి స్వామీజీ వేషం ప్రహసనం!
ఒక యువకుడు కుంటుతూ, కుంటుతూ, బొంగురు గొంతుతో, 'జరుగుండ్రి, జరుగుండ్రి!' అంటూ ముందుకు వస్తున్నాడు. ఆ యువకుడు ఎవరిని అనుకరిస్తున్నాడో జనాలకి తెలిసేపోయింది! ఆ వూరి అత్యంత పీనాసి మోతుబరి ఆసామీ అనుకరణ అది!
ఈ లోపున స్వామీజీ శిష్యులు. స్వామీజీ తలలో నుండి పేలు ఏరుకుంటూ నోట్లో వేసుకొని కరకర నముల్తూ 'అబ్బ! ఏం కమ్మగస్తున్నయి!' అంటూ జనాలని ఊరిస్తూ, తెగ నవ్విస్తున్నారు.
''స్వామీ! నీ పట్నం గుడికి పదివేలిస్తా! నేను ముట్టింది ముత్యం గావాల! పట్టింది బంగారం గావాల సామీ!'' ఇందాకటి యువకుడు బొంగురు గొంతుతో అడిగాడు.
''బునాదులు దవ్వంగ, రాగి బిందెల దొరికిన బంగారం సాలలే దార్రరా!'' గుంపులో నుండి ఎవరో అరిచారు.
''ఇట్ల అంగి నిలబడు! సామి ముందట!'' శిష్యుడు చెప్పాడు. పక్కనున్న వెదురు బుట్టలకెల్లి తట్టెడు బూడిద తీసి వాడిమీద గుమ్మరించాడు! వాడి అవతారమే మారిపోయింది! 'బంగారమడిగితే బూడిద ఇచ్చిండ్రే' అని ఏడుపు నటిస్తున్నాడు ఆ యువకుడు.
''ఇంటికి వొయి - పదిరోజుల దాకా రోజూ పిల్లికి బిచ్చం బెడుతూ ఉండు! గంతే! ఆడికెల్లి- నువ్వు ముట్టింది మురికవుతది! పట్టింది పామే అయితది! ఫో!'' అని సామీజీ గట్టిగా వాడికి సందేశమిచ్చాడు!
ఇలాంటి ప్రహసనాలు దినమంతా జనాలను అలరిస్తూనే ఉన్నాయి!
పండగనాడు పల్లెకు రెక్కలు మొలుస్తాయి! పల్లె ఒక స్వేచ్ఛావిహంగమై - తన స్వీయ సృజనాత్మక భావనా ప్రపంచ గగనంలో హాయిగా విహరిస్తుంది! అక్కడ ముందే సిద్ధం చేసిన స్క్రిప్టులుండవు! డైలాగుల్ని తెగ ప్రాక్టీసు చేసి, జీవితంలో కూడా నటించే నటులుండరు! మనుగడ కోసం పోరాడుతున్న జీవితాలు తప్ప- వడ్డించిన విస్తళ్లుండవు!
అంతా సహజం! సంతోషం- దుఃఖం- ప్రవర్తనా అన్నీ సహజమే! మొహాలు కూడా- 'మనుషుల్లా'- సహజంగా ఉండటం- పల్లెవాసులకు మాత్రమే లభించిన వరం!
దశ్మి మొహం కూడా చాలా సహజంగా ఉంటుంది. పధ్నాలుగేళ్ల అమ్మాయి ఎంత ముగ్ధగా ఉండాలో అంత సహజంగా ఉంటుంది. దశ్మి ఓ గడ్డిపూవే అయినా- విచ్చుకొనబోయేముందు మొగ్గకు ఉన్నంత అందం కనిపిస్తుంది దశ్మి మొహంలో!
కానీ- ఈ రోజు దశ్మి మొహం చాలా అసహజంగా ఉంది! ప్రతి సంవత్సరం తూనీగలాగా స్నేహితులతో కలిసి మొహరం జాతరను చుట్టేసి వచ్చే దశ్మి, ఈసారి మాత్రం చాలా దిగులుగా దుకాణంలో కూర్చుంది.
దశ్మి దూదేకుల హుసేన్ పెద్ద కూతురు. మొన్ననే తొమ్మిదవ తరగతి ప్యాసై పదవ తరగతిలో చేరింది. దశ్మి చిన్నప్పట్నుండీ క్లాస్‌లో ఫస్టే. నిరుపేద కుటుంబానికి చెందినదైనప్పటికీ, చదువులో అందరికన్నా ముందుంటుందని టీచర్లందరికీ దశ్మి అంటే అభిమానమే!
అయితే నిన్న జరిగిన సంఘటనతో దశ్మి బాగా భయపడిపోయింది! చెప్పలేని దిగులు పట్టుకుంది. అసలు మొహంలో కళనే లోపించింది. ఏదో ఒకరోజు అలా జరుగుతుందని- దశ్మి పసిమనసు ఎన్నడూ ఊహించలేదు! రాత్రి బాగా ఏడ్చింది.
''దశ్మీ!... నువ్వు గుసున్నవు!... నూరక్క ఏదే?'' కాపోల్ల భూమవ్వ అడిగింది.
''భూమత్తా! అవ్వకు బాగా జరమచ్చింది! మూడొద్దులాయె! లేస్తనే లేదు!''
''గందుకా! పెచ్చవారీ (పెద్దపేరీ) కాడ జమాల్ తాత ఉంటడు. గింత ఊదు మంత్రిచ్చి ఇస్తడు. రాత్రికి దీస్కపోయి పొగ ఎయ్యు! ఇంటున్నవా!''
''అట్లనే అత్తా!'' దశ్మి తలూపింది.
మొహర్రం పండుగ అయిదు రోజులూ దశ్మి తల్లి నూర్జహాన్ దుకాణం పెడుతుంది. పీరాలకు మొక్కులు దీర్చుకునేందుకు వచ్చే భక్తులకు కావలసిన పూజా సామాగ్రి అంతా నూరక్క దుకాణంలో దొరుకుతాయి. నూర్జహాన్‌ను ఆ వూరంతా నూరక్కా అనే పిలుస్తారు.
మొహర్రం పండుగలో భక్తులు ఫకీర్లవుతారు. ఫకీరు దీక్ష తీసుకునే ముందు నూరక్క దుకాణంలో అయిదు రంగుల దారాలతో పేనిన నాడా (మాల)ను తీసుకొని దానిని పీరీల ముందు పెట్టి ఊదుపొగ వేయించి, ఆ తర్వాత మెడలో వేసుకుంటారు. దీక్ష తీసుకున్న ఈ అయిదురోజులు ఫకీర్లు చాలా నియమనిష్ఠలతో గడుపుతారు.
అయిదు రోజులు దీక్ష చేయలేనివారు, చివరి ఒక్క రోజైనా ఫకీర్లవుతారు. నూరక్క దుకాణంలో ఎక్కువగా అమ్ముడుపోయేవి ఈ దారాల నాడాలే!
వంశపారంపర్యంగా హుసేన్ కుటుంబం ఈ దారాల నాడాలను తయారుచేస్తోంది! దైవపూజకు ఉపయోగించే దారం కాబట్టి- చేతికదురు మీద, తిథి, వార, నక్షత్రాలను చూసుకొని మంచి ముహూర్తాన ఈ దారం తీయడం మొదలుపెడ్తారు. అందుకని ఈ నాడాలు కేవలం హుసేన్ కుటుంబం వద్దే దొరుకుతాయి. ఇప్పుడు హుసేన్ కుటుంబానికి ఇవే ప్రధాన జీవనాధారం. అయితే ఈ నాడాలు సంవత్సరానికి అయిదు రోజులు మాత్రమే అమ్ముడుపోతాయి. అయిదు రోజుల సంపాదన మూడొందల అరవైరోజులు తినాలి- సరిపోదు- కాపోల్ల పొలాల్లోకి పత్తి ఏరడానికో, మిరపకాయలు తెంపడానికో కూలీకి పోతుంది నూరక్క. జొన్న కోతకో, వరి కోతకో హుసేన్ పోతాడు. దాంతో బొటాబొటిగా రోజులు గడుస్తున్నాయి!
''ఓ దశ్మీ! ఎటు జూస్తున్నవే పోరీ. మీ అవ్వకేమయిందే నువ్వు గుసున్నవు దుకాణంమీద'' ప్రేమగా, చనువుగా అడిగింది గొల్ల ఊశక్క.
''అవ్వకు పానం మంచిగలేదు. మంచిగున్నవా లచ్చిమక్కా'' ఊశక్క కొత్త కోడలును పలుకరించింది దశ్మి. అవునంటూ తలూపింది ఆ కొత్త కోడలు.
''దశ్మీ మంచి కుడుకలు గట్టిన శేరీల దండ ఇయ్యు, ధట్టీ, ఊదు, నాడా అన్నీ దేనికదే కట్టియ్యు బిడ్డా''
''ఇగో ఇస్తున్నా ఊశత్తా'' చకచకా అన్నీ కట్టి ఇచ్చేసింది దశ్మి.
''ఎంతియ్యాల్నే పిల్లా?''
''అవ్వకు ఎంతిస్తుంటివో గంతే ఇయ్యు''
''సాలుకొక్క దినమే దశ్మీ. నువ్వు గుసున్నవుగదా దుకాణంమీద. మీ అవ్వకు ఇచ్చేదానికంటే రెండ్రూపాలు ఎక్కువిస్తున్న దీసుకో. ఇవ్విటితోటి ప్యాలాలు, పుట్నాలు గొనుక్కో'' ఎంతో ఆప్యాయంగా ఊశక్క దశ్మి చేతిలో డబ్బు పెట్టింది.
అడిగిన దానికన్నా పిసరంత ఎక్కువే ఇచ్చే అసలైన గ్రామీణ మూలాల సంస్కారానికి నిలువెత్తు ప్రతీక- గొల్ల ఊశక్క. కులాలు వేరైనా- ఏ చుట్టరికం లేకపోయినా- వరుసలు కలుపుకొని, ఆప్యాయంగా పిలుచుకొని- మనిషికీ, మనిషికీ మధ్య ఏదో ఒక బంధం ఉండి తీరుతుందని నిరూపిస్తారు వీళ్ళు. మనిషి, మరో మనిషి ఉనికిని కూడా ఓర్చుకోలేని స్థితి- వారి ఊహకు కూడా అందదు!
''అగో ఇమాం ఖాసింసాబ్‌ను లేపినట్లున్నరు. దప్పుల సప్పుడు ఇనిపిస్తున్నది. మనం ఈన్నే నిలబడుదాం. అటుమంది బాగున్నరు. ఒత్తుడు, దొబ్బుడు అవుతది'' అని గొల్ల ఊశక్క కోడలితో సహా దశ్మి దుకాణం పక్క గోడవారన నిలబడింది.
ప్రత్యేకమైన డప్పుల దరువు వినంగానే 'ఇమాంఖాసిం మజ్‌మా శురూ అయింద'ని జనాలకు తెలిసి ఆ వైపుకు వెళ్తున్నారు.
ఈ సంవత్సరం ఇమాంఖాసిం పీరీ పూజలో ఒక ప్రత్యేకత వుంది. అదేమిటంటే మొహరంకన్నా పదిరోజుల ముందే వడ్ల ఆశన్న కలలో ఖాసింసాబ్ కన్పించి, పూజా పద్ధతి చెప్పినాడట. ఎవరూ కాగితాలల్లగానీ, ప్లాస్టిక్ సంచులల్లగానీ, మలీదలు, నైవేద్యం తీసుకరావద్దు. బొంగుతోటి అల్లిన బుట్టి గుల్లలో మలీద నైవేద్యం- మట్టి కడముంతలో పచ్చిపాలు అర్పించాలని చెప్పినాడట. ఆ సంగతి ఊరు మొత్తానికి అదేరోజు డప్పు చాటింపు వేసి చెప్పేశారు. ఆ వూళ్ళోని వయసుమళ్ళిన పాత పెద్ద మనుషులంతా సంతోషించారు. ఒకప్పుడు పాటించిన సాంప్రదాయాన్ని మళ్ళీ గుర్తు చేసినందుకు, ఇమాంఖాసింకు మనసులోనే దండం పెట్టుకున్నారు. పదిరోజుల నుండి ఆ వూళ్ళో వేల సంఖ్యలో వెదురు బుట్టీలు, మట్టి కడముంతలు తయారవుతూనే ఉన్నాయి. అమ్ముతూనే వున్నారు. మేదరివాళ్ళూ, కుమ్మరివాళ్ళూ రాత్రింబగళ్ళు పనిచేస్తూనే వున్నారు.
ఇమాంఖాసిం పీరీని వడ్ల ఆశన్న ఎత్తుకుంటాడు. వారి తాత ముత్తాతల కాలం నుండీ వస్తూన్న ఆచారం అది. పీరీని ఎత్తుకునే మనిషి తన జీవితాంతం చాలా నియమనిష్ఠలని పాటించాల్సి వుంటుంది. వడ్ల ఆశన్న చాలా ఖచ్చితంగా నియమాలని పాటిస్తాడు. ఇమాంఖాసిం పీరీకి ముడుపుగడ్తే తమ కోరిక తప్పక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. దాని ఫలితమే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనుషుల పేర్లు హసన్, హుసేన్ పీరీల పేర్లతో కలిసి ఊశన్న, ఆశన్న, ఊశమ్మ, ఆశమ్మ అని ఎక్కువగా ఉంటాయి.
ఇమాంఖాసిం పీరీ దశ్మి దుకాణం వైపు రానే వస్తున్నది. పీరీ తలమీద వెండితో చేసిన చిలకల గొడుగు తళతళా మెరుస్తున్నది. మధ్యలో బంగారంతో జేసిన యంత్రం పలక. మెడలో రంగురంగుల ధట్టీలు- పట్టుశెమలలు, రంగురంగుల పూలబుట్టలు, కాగితం పూలతో ఎంతో కళాత్మకంగా జేసిన శేరీలు. వాటికి కుడుక ముక్కలు. పీరీని చూడగానే భక్తి భావం కలిగేంత సుందరంగా అలంకరించారు. ఉత్సవమూర్తిని అలంకరించడంలో పల్లెవాసుల సౌందర్య దృష్టి ప్రపంచంలోని ఎంత పెద్ద కళా విమర్శకులనైనా అబ్బుర పరుస్తుంది. ఆ వాతావరణం- ఆ సంగీతం- ఆ రంగులు- ఒకదానిలో ఒకటి కనపడకుండా కలసిపోతాయి.
''ఇమాంఖాసిం పీరీ దగ్గరకు రాగానే చేతులు జోడిచ్చి పబ్బతిపట్టు. నీ అసుంటి కొడుకు పుట్టాల అని మొక్కు. ఆ కొడుకు పుట్టెంటుకలు, మంచి మ్యాకపోతు తోటి కందోర్‌జేసి నీ దగ్గరనే తీస్తా అని మంచిగ మొక్కు. ఇనిపిస్తున్నదా లచ్చిమీ. ఖాసిం పీరీ నాటికాలం సంది లావు సత్తెమున్నది. ఏదడిగితే అదిస్తది'' ఊశక్క కోడలికి చక్కగా బోధిస్తున్నది. ఆ మాటలు విని దశ్మి నవ్వుతున్నది.
''ఊశత్తా. మా అక్కకు లావు జెప్తున్నవు. ఖాసింసాబ్ ఏదడిగితే అదిస్తడా. బాగా పైసలు గావాలని అడిగితే ఇస్తడా. బగ్గ బంగారం గావాలని అడిగితే ఇస్తడా'' దశ్మి కొంత ఎగతాళిగా అంది.
''అట్లనకే దశ్మీ, కండ్లుపోతయి. నీకేం దెలుస్తదే, నిన్నగాక మొన్న పుట్టిన పోరివి. మంచి బుద్ధితోటి అడగాల. ఇగ నువ్వు దుష్టబుద్ధితోటి బంగారం- పైసా- నాశిరి అడిగితే ఇస్తడా'' అని భక్తిగా చేతులు జోడించి పీరీ వస్తున్నవైపుకి దండం బెట్టింది.
దశ్మికి నిన్న తండ్రి అన్నమాటలు గుర్తుకు వచ్చాయి. మళ్లీ మొహం రంగు మారిపోయింది. దశ్మి ఈరోజు అలా నిస్తేజంగా ఉండటానికి కారణం తండ్రి హుసేన్ ప్రవర్తనే. దశ్మికి ఒక్కసారిగా బుర్రలో మెరుపు మెరిసినట్లనిపించింది. ఆ మెరుపు ఆలోచనతో ఒళ్ళు జలదరించింది. 'అవును... ఇమాంఖాసిం సాబ్‌ను అడగాలి... మంచి కోరిక ఏది కోరుకున్నా తప్పక తీరుస్తడట. ఊశత్త ఇప్పుడే జెప్పింది.'' దశ్మికి భక్తి భావంతో ఒక కొత్త పులకరింత కలిగింది. నిన్నటినుండి తను అనుభవిస్తున్న వేదనకి కొంత తాత్కాలిక ఉపశమనం లభించినట్లనిపించగానే దశ్మికి ఎక్కడలేని హుషారు వచ్చేసింది. వెంటనే ఒక కాగితంలో ఊదు కట్టింది. మంచి కుడుకల శేరీలదండ తీసింది. ఆకుపచ్చరంగు సిల్కు ధట్టీని రెండు మడతలు పెట్టింది. అన్నింటినీ పట్టుకొని ఊశక్కతోబాటే నిలబడింది. కొంచెంసేపటికి- ఇమాం ఖాసిం పీరీ రానే వచ్చింది. ముందుగా ఊశక్క దగ్గర ఆగింది.
యథావిధిగా పూజ చేసిన తర్వాత, ఊశక్క కోడలు చెప్పిన మాటల్ని సహాయకులు పీరీని ఎత్తుకున్న వడ్ల ఆశన్నకు వినిపించారు. అయిదు వారాలు నిష్ఠగా ఉపవాసం చేయమని, కోరిక నెరవేరుతుందని చెప్పాడు. వెంటనే ఊశక్క కోడలు, పీరీ దారికి అడ్డంగా పడుకున్నది. పీరీ ఆమెపై నుండి దాటి అటువైపు వెళ్ళి, మళ్ళీ దాటి ఈవైపుకి వచ్చింది. పీరీ ముందుకు కదలబోతుండగా, దశ్మి చేతిలో శేరీల దండ చూసిన సహాయకులు ఆమె ముందుకు పీరీని తెచ్చి కొద్దిగా వంచారు. దశ్మి ఇచ్చిన ఊదుపోట్లాంని ఊద్దాన్‌లో వేసి, నెమలి ఈకల కట్టతో పొగను పీరీకి పారించి, ధట్టీని, శేరీని అలంకరించారు. సహాయకులు ఆశన్నతో చెప్పారు దూదేకుల హుసేన్ బిడ్డ- దశ్మి- ధట్టీ సమర్పించిందని.
''ఏమన్నా అడుగుకోమను'' చెప్పాడు ఆశన్న.
''దశ్మీ! ఏమన్నా అడిగేదున్నదా''.
''ఆవ్ అడిగేదున్నది'' భక్తిగా అన్నది దశ్మి. పీరీల దగ్గర వరాలు అడిగే తతంగమంతా దశ్మి చిన్నప్పటినుండి చూస్తున్నదే.
''నాకు సదువుకోవాలని ఉన్నది. నాకు బాగా సదువురావాలని 'దువా' అడుగుతున్న''. ఆ సహాయకుడికి స్పష్టంగా అర్థం కానట్టుంది.
''ఏందో మళ్ళా జెప్పు''
''నాకు సదువుకోవాలని ఉన్నదిగానీ- మా బాబా సదిపియ్యడట. నన్ను సదువుకునేటట్లు జెయ్యిమని దువా అడుగుతున్న''. దశ్మి ఈసారి గట్టిగా అన్నది. నిన్నటినుండి తన కడుపులో దాచుకున్న బాధనంతా ఇమాం ఖాసిం ముందు కక్కేసింది.
పీరీ ఏమీ చెప్పలేదు. ముందుకు వంగి దశ్మి నుదురును తాకి దువా ఇచ్చి ముందుకు సాగిపోయింది.
'దశ్మి సదువు బాగా రావాలని మొక్కింది' అని చుట్టుపక్కల జనాలు అనుకుంటూ మజ్‌మాలో కలిసిపోయారు.
దశ్మికి కొంత అయోమయంగా ఉంది. తనకు ఈ ఆలోచన ఎలా తట్టిందా అని ఆశ్చర్యపోతున్నది. నిన్నటి సంఘటన తీవ్రత దశ్మిని అలా చేయించింది. దశ్మికి కళ్ళముందు విసిరేయబడిన తన పుస్తకాలు మెదులుతున్నాయి.
నిన్న తను పుస్తకాలు పట్టుకొని బడికి వెళ్లడానికి బయటకు వచ్చింది. బాబా వచ్చి కోపంతో, పుస్తకాలు లాగి విసిరి పారేశాడు. ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. అమ్మీ మంచంలో నుండి చెప్తున్నా వినిపించుకోలేదు. బడి మానెయ్యమని బాబా తనకు చాలా రోజులుగా చెప్తున్నా తనకు అస్సలు ఇష్టంలేదు. తను చదువుకోవాలి. తమ క్లాస్ టీచర్ వసుంధర మేడంలాగా పిల్లలకు పాఠాలు చెప్పాలి. అందరితో మంచి టీచర్ అనిపించుకోవాలి. ఇంతే - తన కోరిక. కానీ బాబా బడి మానేసి అమ్మీ వెంట మిరపతోటలోకి, పత్తి చేండ్లోకి కూలీకి వెళ్లమంటున్నాడు. ఇప్పుడైనా - సెలవులొచ్చినపుడు, అమ్మీతో కలిసి కూలీకి వెళ్తూనే వుందికూడా. అంతేగాదు - ఇంట్లో తమ్ముళ్ల, చెల్లెళ్ల ఆలనా పాలనా కూడా చూస్తూనే వుంది. అయినా బడి మానేయమని అంటున్నాడు బాబా. 'ఇప్పుడు బాబాకి ఎవరు జెప్తే వినాల. ఇమాంఖాసింసాబ్ ఏం జెప్పి తన బాబా మనసు మారుస్తడు? బాబాకు కలలో కన్పించి, నీ బిడ్డను సదిపియ్యకపోయినావో- సూసుకోమరి- అని బాగా భయపెడ్తే బాగుండు'.
దశ్మి తన మేధస్సు పరిధి మేరకు, తను చిన్నప్పట్నుంచీ పీరీల మహిమలు విన్నమేరకు ఫలితాన్ని ఊహించే ప్రయత్నం చేస్తోంది.
* * *
మొహరం సంబరాలు అయిపోయి వారం గడిచిపోయింది. మరొక పండుగ వచ్చేదాకా, ఆవూరి జనాలు, ఆ సంబరాల తీపి జ్ఞాపకాలను కథలు కథలుగా చెప్పుకుంటూనే వుంటారు.
నూర్జహాన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. ఆమె మంచంలో ఉన్నన్ని రోజులు దశ్మి బడి మాటెత్తలేదు.
''నూరీ, ఈసారి మన దుకాణం గిరాకీ హర్‌సాల్ కన్నా డబల్ అయింది. దశ్మి మంచిగా గిరాకీ జేసింది''.
''నా బిడ్డ దశమంతురాలు. అది యాడుంటే ఆడ బంగారం మొలుస్తది'' నూరి బిడ్డను తలుచుకొని సంబరపడుతూ చెప్పింది.
ఇంతలో దశ్మి పుస్తకాలు పట్టుకొని బయటకు వచ్చింది. కదురుపై దారం పేనుతున్న హుసేన్ చూశాడు.
'నిన్ననే పుస్తకాలు ఇసిరి పారేసినా మళ్లా ఇయ్యాళ తయారైంది' హుసేన్‌కు ఇవాళ కోపం రాలేదు. జాలి కలిగింది దశ్మిపై.
''బిడ్డ సదువుకుంటే ఎంత దశమంతురాలవునోగానీ- ఏంజెయ్యాల! వేలకువేలు పోసి సదిపియ్యాలంటే ఎట్లవుతది. ఆడపిల్ల పెండ్లి జేసుడే ఎంతో కష్టం.''
''దశ్మీ యాడికే, బడికేనా! బందుపెట్టమని సెప్తిగదా బిడ్డా. అమ్మీకి పానం మంచిగుంటలేదు. మరి ఎట్లా? తమ్ముడ్ని, సెల్లెండ్లను ఓళ్లు అర్సుకోవాల''
''నేను అమ్మీ ఏ పని జెప్తే ఆ పని జేసినంకనే బడికి వోతున్న- నేనింట్ల పనిగూడా సేస్త. సెయ్యనంటున్నానా. కానీ, బడికి మాత్రం వోతా... ఆ... నేను బడికి మాత్రం వోతా''. అలా అంటున్నప్పుడు దశ్మికి కన్నీళ్లాగలేదు. బడికి వద్దనంగానే లోపలున్న దుఃఖమంతా పైకి ఉబికి వచ్చింది. పుస్తకాలు అక్కడున్న మంచంలో పారేసి, పందిరి గుంజకు మొహం ఆనించి ఏడ్వసాగింది.
''బిడ్డనెందుకు ఏడిపిస్తవు? నీకు సదిపిచ్చేది లేకపోతే సదిపియ్యకు గానీ, పుస్తకాలు సంకన వెట్టుకొని పోతున్నప్పుడే బడి బంద్‌వెట్టు అంటవు. ఓళ్లకన్నా ఏడుపస్తది. మరి, మనమిప్పుడేం బిచ్చమడుక్కొని తింటున్నమా? ఇప్పుడే దాని లేత రెక్కలు ఓదిచ్చిన మెతుకులు దినాల్నా మనం? ఆడపిల్ల! ఎట్లన్నా అత్తగారింటికి వొయ్యేదే. ఆ పొయ్యేదాకనన్నా నీడపట్టున ఉండనియ్యవు దాన్ని''. తన పిల్ల ఎప్పటికైనా పరాయి ఇంటికి వెళ్లాల్సిందేనన్న నిజం గుర్తుకొచ్చి నూర్జహాన్ కూడా కళ్ళు తుడుచుకుంది.
''అట్లగాదే. నేనిప్పుడేమన్నా అని, ముక్కుజీదుతున్నారు నువ్వూ, అదీ కలిసి. బడికి పోవద్దు అని మెల్లగానే...'' హుసేన్ తన మాటల్ని ఇంకా పూర్తి చేయనేలేదు.
''ఉన్నావురా హుసేన్ బామ్మర్దీ. ఏందిరా లొల్లి?'' గంభీరమైన చిరపరిచిత కంఠాన్ని విన్న హుసేన్ వెనుకకు తిరిగి చూశాడు. ఒక్కక్షణం అవాక్కయ్యాడు!
వడ్ల ఆశన్న బావ. ఇమాంఖాసిం పీరీని ఎత్తుకునే ఆశన్న బావ, తనింటికి....!
''అరేరేరే ఆశన్న బావా... శణార్థి శణార్థి దా! దా!'' సంభ్రమంతో అంటూ పరుగుపరుగున మంచందీసి పందిరికింద వేశాడు హుసేన్.
వచ్చిందెవరో గమనించకుండానే దశ్మి కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వెళ్లిపోయింది.
నూర్జహాన్ 'ఎవరచ్చిండ్రా' అని తొంగి చూసి, ఒక్కపెట్టున ఆశ్చర్యపోయింది.
వెంటనే నెత్తిన నిండుగా కొంగువేసుకొని బయటకు వచ్చింది.
''ఆశన్న భాయీ! సలామ్ వాలేకోం! సలామ్ వాలేకోం!'' వంగి సలాం చేసింది.
''సలామ్! సెల్లే! సలామ్! మంచిగున్నవా? పానం మంచిగలేదని విన్నా''
''అవు, ఇప్పుడు గొంచెం మంచిగయింది. కానీ, గీ గరీబుగాళ్ళింటికి రాతందుకు నీకు తొవ్వెట్లా దొరికిందే అన్నా. ఎన్నేండ్లకస్తివి మా ఇంటికి'' నూర్జహాన్ తన స్వంత తోడబుట్టిన అన్న రానందుకు బాధపడినట్లుగా కళ్ళ నీళ్ళు తుడుచుకుంది.
''ఎందుకు రాను సెల్లే! గిట్లనే ఇగ పనులల్లవడి ఆలిసెమయితది.'' ఎంతో నియమనిష్ఠలని పాటించే ఆశన్న, అంత తొందరగా ఎవరింటికీ వెళ్ళడం జరగదు.
''బాబీ, పిలగాండ్లు మంచిగున్నరా అన్నా'' అడిగింది నూర్జహాన్. ఒక వూళ్ళోనే వుంటున్నా, వారి కలయికలో ఎంతో ఆప్యాయత. కల్మషం లేని కుశలప్రశ్నలు, ప్రతిఫలం ఆశించని పరామర్శలు. నాగరిక ప్రపంచానికి దూరంగా మారుమూల- 'మనిషి వాసనలూ'- మట్టి సువాసనలూ వెదజల్లే ఒక చిన్న ఊరు... ఒక చిన్న ఊరు, వారికి నేర్పిన సంస్కారం అది.
''మీ అన్నకు మంచి ఛాయ్ జేసుకరా పో'' అన్నాడు హుసేన్.
''ఒక్క పొద్దు ఉపాసముంటే అన్న మన చేత్తోని చాయ్ దాగడు, గందుకు అనుమానం జేత్తున్న''
''ఒక్క పొద్దు లేదు సెల్లే ఇయ్యాళ. కానీ పాల చాయ్ దాగను. సగం సగం కోపెడు డికాషన్ పెట్టుకరా పో.''
ఆశన్నకు తెలుసు, హుసేన్‌లాంటి వారి పరిస్థితి. చాయ్ జెయ్యాలంటే పాలు గావాల. ఒకపూట పాలు గొనుక్కొని చాయ్ దాగుడే కష్టం. దినమంతా ఇంట్లో పాలు ఉండవు. మళ్ళీ వెళ్లి ఎక్కడన్నా కొనుక్కు రావలసిందే. అది తెలిసే- పాల చాయ్ దాగను డికాషన్ మాత్రమే తాగుతానన్నాడు ఆశన్న.
చాలా సేపట్నుండి వినపడుతోన్న మాటలను విని ఇంతకూ వచ్చిందెవరా, అని దశ్మి తొంగిచూసింది. ఆశన్న మామ! ఇమాం ఖాసింను ఎత్తుకున్న ఆశన్న మామ! 'మా బాబా సదిపియ్యనంటున్నడు. నేను సదువుకుంటా' అని తను ఫిర్యాదు చేసింది. ఈ మామకే గదా. 'మీ దశ్మి ధట్టీ ఎక్కిచ్చి- గిట్ల అడిగింది' అని బాబాతో సెప్తడా ఏంది? బాబా మరింత తిడ్తడు గావచ్చు. దేవుడా, ఇప్పుడేంజేసేది?' దశ్మికి లోలోపల దడదడగా వుంది.
''మీ పెద్దపిల్ల ఏదీ కన్పిస్తలేదు. దాని పేరేదో వుండె'' ఆశన్న అడిగాడు. ''దశ్మి... దశ్మి... ఉన్నది. ఏయ్ దశ్మీ... మామకు సలాం జెయ్యవా?'' హుసేన్ పిలిచాడు. దశ్మి రాబోతుంటే, నూర్జహాన్ ఆపి, బిడ్డ చున్నీని తలనిండా కప్పి పంపించింది. ఇమాంఖాసిం పీరీని ఎత్తుకునే ఆశన్నను మొహర్రంనాడు ఎంత గౌరవిస్తారో మిగతా రోజుల్లో కూడా అంతే గౌరవిస్తారు.
''సలాం వాలేకోం మామా! సలాం!'' దశ్మి వంగి వినయంగా అంది.
''సలాం బిడ్డా. దశ్మీ మంచిగున్నవా. మరి బడియాల్లయింది. బడికి వోలే.''
దశ్మి గుండెలో గుభేలుమంది. బాబాకు చెప్పేస్తాడా? కలలో కన్పించి చెప్తేనే బాగుండేది.
''అవునొరే హుస్సేన్, మీ కులంలో దశ్మి పేరు యాడున్నదిరా? ఈ పేరెట్ల పెట్టినవు దీనికి''
''ఆ... ఏం లేదు బావా. ఇది తొలిసూలు బిడ్డగదా, పుట్టంగానే, మన బుకనర్సిములు కాక దగ్గరకువోయి, 'ఆడపిల్ల పుట్టిందే' అన్నా. తను పంచాంగం సూస్తడుగదా. ఇగ నర్సిములు కాక సేతుల మీద ఏదో లెక్కలు ఏసి సూసి ఖుషీకొద్ది నగిండు. 'ఇయ్యాళ దశమిరా హుసేనూ. నీ బిడ్డ మంచి దశమంతురాలవుతది' అని చెప్పిండు. ఇగ దశమినాడు పుట్టిందని దశ్మీ అని పిలిచినం. ఆకిరికి అదే పేరు ఖాయమయింది'' హుసేన్ వివరణ ఇచ్చాడు.
''మరి వోరీ, పేరయితే ఖాయం జేసినవుగానీ- దాని దశ మాత్రం ఖాయం జెయ్యలేకపోతున్నవేందిరా. అది దశమంతురాలు గావాలంటే ఇంట్ల కుసుంటే తెల్లారికల్లా అయిపోతదావురా. మన కోశిష్ మనం జెయ్యద్దా! మంచిగ సదిపిస్తే మంచి దశ వస్తది దానికి''
''ఇగ మన చేతుల ఏమున్నది బావా. దాని కిస్మత్ దానెంబడి. సదువుకొని పెద్ద కొలువులు జేసేదున్నదా. మరి సేస్తమన్నా మన గరీబ్‌గాళ్ళకు ఓళ్ళిస్తరు?''
''ఓరీ! గట్ల కాండి ఎత్తేసి మాట్లాడుతవేందిరా. నువ్వు సదిపిచ్చు సూడు. అది పెద్ద ఆఫీసర్ గావొచ్చు. పంతులమ్మ అయి నలుగురికి సదుజెప్పచ్చు. అట్లా అయిందంటే దాని దశనే గాదు దాని ఖాందాన్ (వంశం) దశనే మారిపోతది. ఆడపిల్ల సదుకున్నదంటే ఆదిశక్తే అవుతదిరా''
నూర్జహాన్ డికాషన్ తెచ్చి ఇచ్చింది.
''గొంచెం నువ్వన్నా చెప్పు ఆశన్న బొప్పా. ఊకె పిల్లని దిడుతున్నడు'' నూర్జహాన్ అంది.
''నీకు దెలందేమున్నది ఆశన్న బావా. యాడికెల్లి సదిపియ్యాల? ఏంబెట్టి సదిపియ్యాల? ఊళ్ళె సదువులంటే ఎట్లన్న ఒకట్ల సదిపిస్తిమి, పట్నంబొయి పెద్ద సదువులు సదవాలంటే మనసుంటోళ్లతోని అయితదా! మన గరీబోళ్ల మీద దయకచ్చి, పెద్ద సదువులు ఓళ్లన్నా పుక్యం జెప్తున్నరా? సర్కారు బళ్లె సదినా వెయిలకు వెయిలు రూపాలు గుమ్మరియ్యాల. పెద్ద సదువులు నీకు పుక్యం ఓళ్లు జెప్తరు?''
''మరి ఎట్లన్నా గొంచెం జమ వెట్టాల. ఏదన్నా ఉపాయం జెయ్యాల'' నూర్జహాన్ అంది.
''ఆశన్న బావకు ఎరుకలేదా. మునుపటి తిరంగ మన పని నడుస్తున్నదా? ఓళ్లడుగుతున్నరు మా పనిని? నలుగురు పోరగాండ్ల సిన్న కడుపులు నింపతందుకే మెండవుతున్నది. ఆడికీ- ఇంక- నేనూ, మీ సెల్లే కాపోళ్ల సేండ్లకు కైకిలి వోతున్నం. గొంచెం ఏదన్నా సాలుదప్పితిమా 'దూదేకులోడికి ఎగుసాయం ఏం దెలుస్తదిరా?' అని ఎత్తువాటు గూడా జెయ్యవట్టిరి. అలవాటులేని పనైనా అంగక తప్పుత లేదు.''
''అంగనే వడ్తదిరా బామ్మర్దీ. కాలం ఎటు వంపితే అటు వంగనేవడ్తది''
''మొన్న మొన్నటిదాకా ఊరు ఊరంతా నా పనికోసం నా ఇంటి సుట్టూ దిరిగేది. పుట్టిన పిలగాండ్లకు సన్నబొంతలు, ఉయ్యాల కోసం చిన్న పరుపులు, లగ్గాలకు, పల్సోనాలకు పట్టుపరుపులు, ముసలోళ్లకు బొక్కలు నొయ్యకుండ బూరుగు దూది పరుపులు, మెత్తలు, మొలదారాలు, జందెపుదారాలు, ఫకీర్ నాడాలు, తోపు చీరలకు ఏకులు- ఎన్ని పనులు! సాలు పొడూనా సేతికి తిరంలేకుండా పని. కడుపుకు ఎల్తి లేకుండా తిండి. ఇప్పుడు సేతినిండా పనిలేదు కడుపునిండా తిండిలేదు! ఏం జమానా అచ్చిందే బావా''
''జమానా నీ ఒక్కడికే అచ్చినట్లు అంటున్నవు, మా సంగతేందిరా? బొక్కలు తెరవడేదాకా కాపోల్ల అరకలు నింపినం. ఆళ్లింట్ల గాదెలు నింపినం. ఏం మిగిలింది మాకు. పప్పు రుద్దుకునే తెడ్డు కాడికెల్లి, బండిగారెల దాకా మేం జేసిచ్చినం. పుట్టిన పోరగాడు ఊగతందుకు ఉయ్యాల కాడికెల్లి, నడతందుకు గారెలబండి, ఆడుకున తందుకు బొంగరాలు మేం జేసినం. అరకవట్టే కాపోడికి ముల్లుగట్టెకల్లి, ఆడుతా పాడుతా అంటే కోలల జత మేం జేసిచ్చినం. లగ్గాలకయితే పందిరి కాడికెల్లి పట్టెమంచం దాకా మేమే జేస్తిమిగదా. ఇప్పుడేం మిగిలిందిరా మాకు. అప్పుడు ఊరు మొత్తం గలిసి మనల్ని పోషించుకుంటుండె! తక్కలు-ఎక్కలూ అన్ని ఆళ్ల జిమ్మేదారే ఉండె'' ఆశన్న కళ్లల్లో గత వైభవపు తాలూకు మెరుపు కనిపిస్తోంది.
''ఎటువొయిందే బావా గంత మంచికాలం. గంత మంచి జమానాను ఏ గండుకుక్క ఎత్తుకపాయ.''
''జమానా ఎటు వోలేదు. ఈ జమానా తోటి- ఈ కాలంతోటి సమానంగా నడతందుకు మనకు ధైర్యం గావాల. జమానా ఉరుకుతున్నది. మనం కుంటుతున్నం.''
''బావా, ఉరికే దాంతోటి ఉరికీ ఉరికీ ఉరివెట్టుకోమంటావే''
''పరాచికం గాదురా బామ్మర్దీ. నీకో సంగతి జెప్తా ఇనుకో. ఇప్పటిదాకా ఓళ్లకు జెప్పలే. మొన్న మొహరం కన్నా పందేసాల ముందు మ్యాదరి లచ్చన్న ఇంటి ముందరికెల్లి వోతున్న. లచ్చన్న పెండ్లాం, భోజక్క పిలిసింది. కుసుండవెట్టి కష్టాలు జెప్పవట్టె. రబ్బరు పరుపులూ, రబ్బరు మెత్తలూ అచ్చి నీపొట్ట గొట్టినట్లే, ప్లాస్టిక్ గుల్లలూ, బుట్టీలు, టబ్బులూ అచ్చి ఆళ్ల పొట్టగొట్టినయి. సేసిన పనిని అడిగెటోడు లేడు. బొంతల అంగడి వొయికుసుంటే పొద్దుందాక నాలుగు గుల్లలు అమ్మకపాయ. కడుపుకేం దిని బతకాల అని ఏడవట్టె. ఇంత కష్టమున్నప్పుడు, పెద్ద కాపులనో, కరణాలనో గాసం అడగచ్చుగదా, అని మాటవరుసకన్నా. భోజక్క ఇంకింత ఏడవట్టె. ఇంత బతుకు బతికి అడుక్కుతింటామా? సావనైన సస్తం గానీ ఒకళ్ల ఆకిట్లకు వొయి దేహీ అనేది లేదు'' అనవట్టె.
''రేషమున్నోళ్లూ అభిమానమున్నోళ్లూ గామాటనే అంటరు మరి.''
''ఇగ కుమ్మరోల్ల గతి ఏమున్నది. గంతే. ప్లాస్టిక్ బిందెలూ, మగ్గులూ, బకెట్లూ, టబ్బులూ అచ్చినయిగదా. పాత నీళ్లకుండలు లేవు. పెరుగుదుత్త లేదు. పప్పుదుత్త లేదు.
తానం బండకాడ గోలేలు లేవు. ఇండ్ల మీద కుమ్మరిగూనలు మాయమయినయి. ధాన్యం బొయ్యతందుకు పెద్ద కాగులు లేవు. పెండ్లిల అయిరేని కుండలు కనిపిస్త లేవు. ఆకిరికి దీపావళినాడు దీపంతలమ్ముకున్నా మూన్నెల్ల గాసమెల్లేది. ఆడగూడా నూనె దీపాల బదులు మోమ్ బత్తీలే పెడుతున్నరాయె. ఇగ యాడికెల్లి బతుకుతరు.''
''కాలంగిట్లయి పోయిందేమే. కులవృత్తులు జేసుకునేటోళ్ళు గింత అన్నేలమయిపోంగ ఓళ్ళకు సీమగుట్టినట్లు లేదు. ఇగ ఈ సర్కార్లెందుకు? ఈ హుకూమత్‌లెందుకు?'' హుసేన్ నిరాశగా అంటున్నాడు.
''ఇది సంధికాలం. పాతనీళ్ళల్లకు కొత్త నీళ్ళు సొచ్చుకస్తున్నయి. కొత్త నీళ్ళు సొచ్చినకొద్దీ ధార జోరువడ్తున్నది. ఆ ధారల మనం కొట్టుకపోకుండా ఉండాలంటే ఒకరిచెయ్యి ఇంకొకళ్ళకు అందియ్యాల. అయితేనే బలంగా ఉంటము. మనకోసం ఏ సర్కారు రాదు. ఏ హుకూమతు ఏం జెయ్యది! గందుకే మొన్న మొహర్రం పండుగల ఇమాంఖాసిం సాబ్‌కు మ్యాదరి బుట్టిలల్ల మలీదలు- మట్టికడముంతల పాలుదెమ్మని చెప్పినగదా! అందరూ ఎగవడి ఎగవడి కొనుక్కొని తెచ్చి నైద్యం బెట్టిండ్రు. మ్యాదరోళ్ళకూ, కుమ్మరోళ్ళకూ సాలుగాసం ఎల్లిపోయింది అండ్ల''
''అరే ఆవ్ బావా, నీకు ఇమాంఖాసింసాబ్ కలల కన్పిచ్చి సెప్పిండట గదా.''
''సెప్పిండో లేదో నాకైతే యాది లేదు. నేనైతే జెప్పిన. ఆకలితోటి ఉన్నోడి కడుపు నింపతందుకు అబద్ధమాడినా ఏం గాదు. మరి ఈ జనాలు ఉత్తగజెప్తే ఇంటరా. దేవుడు జెప్పిండు గిట్ల జెయ్యాల అంటే ఎంతటి సదువుకున్నోడైనా, నోరు మూసుకొని ఇంటడు, సేస్తడు. ఎన్ని జూస్తలేము.''
''మరి అబద్ధం జెప్తే ఇమాంఖాసింసాబ్ 'నారాజ్'గాడా నీమీద?''
''కానీ... నారాజ్‌గానీ... నా లెక్కదీసిన రోజు- నేను తప్పుజేస్తే ఏ శిక్షకన్నా ఖుబూలవుతా. అప్పుడు నా ఒక్కడికి బాధవుతది. కానీ ఇందరి బాధ తప్పుతది గదా!''
''లావు మంచిగ ఇచారం జేసినవే ఆశన్న బావా. ఆళ్ళ బతుకులు నిలవెట్టినవు.''
''ఓరీ, మనం బతకాల... ఇంకొకన్ని బతకనియ్యాల. అట్లగావాలంటే ఈ జమాన తోటి మారిపోయే ధైర్యం గావాల. ఆ ధైర్యం ఉత్తుత్తగ రాదు. సదువుకుంటే అస్తది. సదువు ఉద్యోగం కోసం కాదు. మారుతున్న ఈ కాలం మనసుల అంటే దిమాక్‌ల ఏమున్నదో తెలుసుకనేతందుకు గావాల. ఖాస్‌కర్ (ముఖ్యంగా) మనసుంటి పనోళ్ళకు సదువుగావాల. అయితేనే ముల్లును ముల్లుతోటే దీస్తం.''
ఆశన్న జెప్పిన అసలైన రహస్యం అర్థం గావడానికి హుసేన్‌కు కొంతసేపు పట్టింది.
''అట్లాగాదే బావా ఈ సదువుకున్నోళ్ళు లావు 'బెఇమాన్'గుంటరు. లావు మోసం జేస్తరు. గందుకు భయమేస్తది.''
''సదువు నేర్సుకున్నోడి బుద్ధిని బట్టి, ఆడి ఇగురాన్ని బట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్కటి నేర్పిస్తది. మోసం జేసుడు నేర్పిచ్చిన సదువే- మోసపోకుండా ఎట్ల ఉండాల్నో నేర్పిస్తదిరా హుసేనూ. నువ్వు, నేనూ, మన తరం గండ్లనే మునిగిపోయినం. సదువిచ్చే ధైర్యం మన దగ్గర లేకనే, మనం కులవృత్తి జేసెటి ఇసిరెలు (పనిముట్లు) మూలలకు పడేసి కుసున్నం. కొత్త దుష్మన్, మీద కొత్త తరీకల యుద్ధం జేయతందుకు కొత్త ఇసిరెలు ఇస్తదిరా సదువు. 'నేను యుద్ధం జెయ్య' అని బాణం కిందపడేసి కూలవడ్డ అర్జునుడికి, కృష్ణపరమాత్మ ఏం మంత్రం జెప్పిండో, లేసి యుద్ధం జేసిండు, గెలిసిండు. గసుంటి మంత్రమే మనకు ఈ సదువు జెప్తదిరా బామ్మర్దీ.
నిజంగానే హుసేన్‌కు, ఆశన్నలో శ్రీకృష్ణపరమాత్మ కనిపిస్తున్నాడు. ఇమాంఖాసిం సాబ్- తన ఎదుట నిలబడి కర్తవ్యబోధ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది హుసేన్‌కు.
''అచ్చే మొహర్రం నాటికి నీ సంగతి కూడా సూస్త. ఏంటికి భయపడతవురా బామ్మర్దీ. మన చేతుల ఉన్నంతదాకా, మనల్ని మనం ఎట్లన్న ఒకట్ల- ఇంటున్నవా, ఎట్లన్నా ఒకట్ల కాపాడుకోవాల. మన పోరగాండ్లకు ఈత నేర్పి, ధారల ఇడుసవెట్టాల. ఆ ఈతనే సదువురా'' ఆశన్న ముగించాడు.
''దశ్మీ, బడికి యాల్లయింది బడికిపో బిడ్డా''
హుస్సేన్ పిలుపు నోట్లోనే ఉండిపోయింది. అప్పటికే దశ్మి చక్కగా ముస్తాబై మొహంలో తన సహజమైన చిరునవ్వుని నింపుకొని, చంకలో పుస్తకాలు పొదువుకొని మెల్లగా బయటకు వచ్చింది.
''దశ్మీ, మామ కాళ్ళకు దండం బెట్టిపో'' వెనుకనుండి నూర్జహాన్ అంది.
''దశ్మీ! బడోంకా దువా లేకే జా, మేరీ బేటీ'' చెమరుస్తున్న కళ్ళతో హుసేన్ అన్నాడు.
దశ్మి భక్తిగా వచ్చి ఆశన్న కాళ్ళకు దండం బెట్టింది.
''దశ్మీ, మంచిగా సదువుకొని దశమంతురాలివిగా బిడ్డా'' ఆశన్న దీవించాడు. ఇమాంఖాసింసాబ్ దీవించినట్లే అనిపించింది దశ్మికి.
దశ్మి... తన దశ-దిశ మార్చే బడివొడిలోకి వడివడిగా అడుగులేసింది.
Wednesday, September 26, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment