Thursday, September 27, 2007

అన్వేషి - బ్రిటిష్‌ కథ

చైతన్యంతోపాటే కళ్ళు చెదిరే కాంతి కూడా అంతటా విస్తరించింది. ఏమీ లేని శూన్యం నుండి అస్తిత్వ జ్ఞానం దాకా సాగింది ప్రయాణం. విసుగూ, విరామం లేని అనంత యాత్ర. గ్రహ శకలం లాగ గమ్యం లేని గమనం.

పరిసరాలను అవగాహన చేసుకోవటానికి నవజాత రూపానికి కొంత సమయం పడుతుంది. కాని మొదట, తనెవరో, తన స్థానమేమిటో తెలుసుకోవాలి గదా! శతాబ్దాలుగా సేకరించిన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానమంతా తనలో నిక్షిప్తమైంది. విశ్వ రహస్యాలను ఛేదించటానికి ఉద్యమించిన జ్ఞానిని తొలి అనుభవమే తికమకపెట్టింది.

ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలిసింది. తనకో పేరుంది. (పేరు లేకపోతే వ్యక్తిత్వమే ఉండదు) ఆ పేరే జీవిత లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. నాలుగక్షరాల చిన్న పదంలో అంత అర్థం దాగుందా! అసోవ్‌ (Asov) అంటారు తనను.

తన చుట్టూ ఉన్న అనంత విశ్వాన్ని ఒకసారి పరిశీలించింది ఆసోవ్‌. అవును. ఇదే తన లోకం. సమీపంలో కనిపించే అగ్ని గోళాల్లాంటి నక్షత్రాలు, సుదూరంగా మిణుకు మిణుకుమంటూ అవే. ఒకపక్క అంధకారం. మరోపక్క కాంతిపుంజం. అదృశ్య చిత్రకారుడు గీసిన అద్భుతమైన రంగుల కలయిక. చీకటీ- వెలుగూ. నిరంతరం పయనించే గ్రహాలు, నిశ్చలమైన తేజో లోకాలు, ఏకకాలంలో జననం - విలయం.

ఈ వైరుధ్యాల మధ్య ప్రారంభమైంది జీవితం. సమాచారాన్ని సేకరించి, తన డేటా బ్యాంక్‌లో భద్రపరిచి, ప్రోసెస్‌ చేసి కొత్త సమీకరణాలుగా మార్చాలి.

అర్థం కాని పరిణామాల్ని అర్థం చేసుకునే ప్రక్రియ యిదే. తన అవగాహనా శక్తి అపరిమితమైనదే కావచ్చు. కాని సమాచారాన్ని మొదట డేటా స్టోరేజ్‌ మాడ్యూల్‌లోకి పంపి పరీక్షించాలి. 'శక్తి'కి మారు రూపమే ఈ లోకం. తన చుట్టూ ఉన్న పరిసరాలకూ ఓ పేరుంది. దీన్ని 'గెలాక్సీ' అంటారు.

ఇంతకూ 'అసోవ్‌' అంటే అర్థమేంటి? తన జన్మ వృత్తాంతం నెమ్మదిగా అవగతమైంది.

Asov- ఆటోమాటిక్‌ స్టెల్లార్‌ అబ్జర్వేషన్‌ వెహికిల్‌. అవును తన జీవితానికో ప్రయోజనముంది. స్పష్టమైన లక్ష్యముంది. అనంతమైన నక్షత్ర లోకాలను పరిశోధించి సమాచారం సేకరించవలసిన బాధ్యత తనదే. నిరంతర గమనమే తన స్వభావం. శూన్యంలో కూడా నక్షత్రాలు విస్ఫోటం చెంది లక్షల, కోట్ల మైళ్ల విస్తీర్ణంలో వివిధ కక్ష్యల్లో ప్రయాణిస్తాయి శకలాలు.

శూన్యమంటే సుఘప్త స్థితిలో ఉన్న చైతన్యం. కాంతీ వెలుగూ కలిసి ఈ గర్భస్థ జీవికి రూపం కల్పిస్తాయి.

అణువుల ప్రతిక్రియలు, విస్ఫోటనాల సీక్వెన్స్‌ రూపంలో మాత్రమే ఒక నక్షత్రం ఉనికి అసోవ్‌లో రికార్డు అవుతుంది. ఈ సమాచారాన్ని అంకెలుగా, ఫార్ములాలుగా మారుస్తుంది దాని మెదడు. పిగ్మీ లాంటి ఒక ఎర్ర నక్షత్రం కనిపించింది.

M5 తరగతికి చెందిందది. ఉపరితల ఉష్ణోగ్రత 4000 డిగ్రీల సెంటీగ్రేడ్‌. దాని కక్ష్యలో తక్కువ ఉష్ణోగ్రత గల గ్రహాలు కొన్ని పరిభ్రమిస్తున్నాయి. ఈ విశ్వానికి మూలమే గురుత్వాకర్షణ శక్తి. అది బలహీన పడిన క్షణాన ఈ దృశ్యా దృశ్య రూపమంతా ముక్కలు చెక్కలైపోదా?

అసోవ్‌ తన మెమొరీ బ్యాంక్‌లో సమాచారాన్ని స్టోర్‌ చేస్తోంది.

గ్రహాలు: నాలుగు. ఉష్ణోగ్రత: సున్నా నుండి ఘనీభవించే దశదాకా; పరిసరాల వివరాలు: జీవ రహితం. వాయువులన్నీ ఆవిరైపోయిన స్థితి.

ఎర్ర నక్షత్రం వద్ద తన పని ముగించుకుని ముందుకు కదిలింది అసోవ్‌. సమాచార సేకరణ ముగిసినట్టుగా మోటార్‌ సర్వీస్‌ సిస్టంలో ఒక సిగ్నల్‌ వెలిగింది. దాని బ్రెయిన్‌లోని మరో భాగం, డాటాను డీకోడ్‌ చేసి రేడియో తరంగాల సహాయంతో భూమికి చేరవేస్తున్నది. కొత్త నక్షత్రం ''సోల్‌'' నుండి ఏవో సిగ్నల్స్‌ వస్తున్నాయి. గురుత్వాకర్షణ శక్తివున్న కక్ష్యలో ప్రయాణం సులభమే. రెండు నక్షత్రాల మధ్యనున్న శూన్యమే సమస్యల్ని సృష్టిస్తుంది. అక్కడ వినిపించే న్యూక్లియర్‌ ధ్వనులు మంద్ర స్వరంలో జోలపాటలాగుంటాయి. ఈ గెలాక్సీలోని మిలియన్ల కొద్దీ నక్షత్రాల మధ్యనున్న శూన్యాలను సంధానిస్తూ, కొత్త కక్ష్యలను రికార్డుచేస్తూ అగమ్యంలో పయనిస్తుంది అసోవ్‌.

కొన్ని కోట్ల కాంతి సంవత్సరాలకు సరిపోగల హైడ్రోజన్‌ నిల్వలున్నాయి. దట్టమైన ఆ వాయుమండలంలో అసోవ్‌ సెన్సర్లు సరిగా పనిచేయలేదు. ఈ కొత్త శక్తి మండలాలకు చేరువగా వెళ్లినప్పుడు తనలోని అణు ఇంధన నిలువలు వుడిగిపోకుండా ఎమర్జెన్సీ మోడ్‌లో పనిచేయాలి సిస్టం. నక్షత్రం ఏర్పడే క్రమంలో కొంత గ్యాస్‌ వృథాగా శూన్యంలో వ్యాపిస్తుంది. ఆ నీలిరంగు వేడిని దూరం నుండే గమనించింది అసోవ్‌. నక్షత్ర నిర్మాణాన్ని అర్థం చేసుకోగలిగితే విశ్వరహస్యం బోధపడినట్టే.

మరో కొత్త విషయం కూడా అసోవ్‌ దృష్టికి వచ్చింది. తన సర్క్యూట్‌లో సూచనలు లేకపోతే అది గ్రహించడం అసాధ్యమే. గెలాక్సీ సరిహద్దుల్లోని కొన్ని గ్రహాల మీద జీవమున్న జాడలూ కనిపించాయి. G7 నక్షత్రం కక్ష్యలో వున్నదొక గ్రహం. వాతావరణంలోని దుమ్మూ, వాయువులూ, వాతావరణ పరిస్థితులూ, గురుత్వాకర్షణ శక్తీ కలిసి గందరగోళ పరిస్థితి కలిగిస్తాయి. కొన్నిసార్లు డేటా తారుమారవుతుంది కూడా. కాంతి పరావర్తనం వల్ల కొన్ని దృశ్యాల్ని కెమెరా బంధించలేదు. మొత్తంమీద, సూర్యుడి లాం టి మరొక శక్తి వనరు (Source) వున్నట్లుగా తెలిసివచ్చింది.

స్పెక్ట్రోస్కోపిక్‌ సామర్థ్యంతో అసోవ్‌ కక్ష్యలోని యితర గ్రహాల మీద కూడా ఆర్గానిక్‌ మాలిక్యూల్స్‌ వున్నట్టుగా గ్రహించింది. పరిశోధన కవసరమైనప్పుడల్లా ట్రాజెక్టరీ మార్చడం కూడా తనకు సాధ్యమే. మరొక గ్రహం మీద భూమికన్నా ఎన్నోరెట్లు విశాలమైన సముద్ర వుపరితలం కన్పించింది. ఇక జీవులకోసం వెదకటమే తరువాయి. అసోవ్‌కున్న సెన్సరీ నెర్వ్స్‌, సుదూరంగా వున్న కృత్రిమ నిర్మాణాలనూ, అణుధార్మిక తరంగాలనూ రికార్డు చేశాయి. ఇది సహజం కాదు. మరికొంత విశ్లేషణ తర్వాత, తనకు వస్తున్న సంకేతాలకు సోర్స్‌, ఒక జీవి లేదా 'ఇంటెలిజెన్స్‌' కావచ్చునని నిర్థారించింది అసోవ్‌లోని 'బ్రెయిన్‌'.

విశ్వరహస్యాలను అన్వేషిస్తున్నది తను. తనకోసం అన్వేషిస్తున్నారు మరొకరు!

అదే వేవ్‌లెంత్‌లో అసోవ్‌ కూడా తిరిగి సిగ్నల్‌ పంపింది. భూగ్రహం చరిత్ర, శాస్త్ర ప్రగతి, సంస్కృతీ, తన ఆవిర్భావం, లక్ష్యం వగైరా అన్నీ రికార్డు చేసిన సందేశమది. ఆ తర్వాత, అసోవ్‌, తనకు వచ్చిన సందేశాన్ని కూడా డీకోడ్‌ చేసింది. మొత్తంమీద సూర్య కుటుంబంలోని రెండు గ్రహాల మధ్య జరిగిన తొలి సంభాషణ.

అంతరిక్షమంటేనే శూన్యం, నశ్వరం. సూర్యుడు ఒక పదార్థం కాదు. కొంత విస్తీర్ణంలో ఆక్రమించుకున్న వాయువులకు మనం పెట్టుకున్న పేరది. అసోవ్‌ యాత్ర కొనసాగింది. ట్రాఫిక్‌ నిబంధనలు లేని ఆ స్పేస్‌ వ్యాక్యూంలో గ్రహశకలాలు అనూహ్యంగా దూసుకువస్తాయి. అసోవ్‌లోని సెన్సరీ సిస్టమ్‌ వాటిని దూరం నుండే పసిగట్టగలదు. అయితే సౌర కుటుంబంలో ప్రయాణానికి మాత్రమే ఆ సిస్టం పరిమితం- గురుత్వాకర్షణ శక్తి అధ్యయనం వల్ల యిక్కడి వస్తువుల వేగం అంచనా వేయటం సాధ్యమే. కాని ఇవి దాటి మరో కొత్త గురుత్వాకర్షణ కక్ష్యలో ప్రవేశిస్తే-అగమ్యమే! ఒకటీ, రెండూ కాదు. అసంఖ్యాకమైన మీటియార్లు ఒక కాస్మిక్‌ వరదలా ఎదురొచ్చాయి.

ప్రమాదకరమైన ఈ కక్ష్య నుండి తప్పించుకుని గురుత్వాకర్షణ శక్తి ప్రభావం లేని 'శూన్యం'లోకి వెళ్లటానికి ప్రయత్నించింది అసోవ్‌. ఎర్రనక్షత్రాన్ని పరిశోధించటం అసాధ్యమే. కనీసం, దానికున్న మూడు గ్రహాలనైనా వెలుపలినుండి అధ్యయనం చెయ్యాలి. భూగ్రహం నుండి పరిశీలిస్తే ఈ విపరీత పరిస్థితులు అర్థం కావు. గ్రహశకలాలు మనుషులకు తెలిసిన చాలా గ్రహాలకన్నా పెద్దవి. ఆ పరిమాణాల్ని వూహించుకోవటం కూడా కష్టమే. తోటలో పిచ్చిమొక్కలు మొలిచినట్టుగా, ఈ అనంత విశ్వంలో ఎన్ని నక్షత్రాలో. ఒక్కొక్క నక్షత్రానికీ డజన్ల కొద్దీ గ్రహాలు. ఒకవేళ, యివన్నీ తెలుసుకోవటం సాధ్యమే అనుకున్నా, ఆ ప్రయత్నానికి పట్టే 'సమయం' సంగతేమిటి? అసోవ్‌ది కూడా పరిమిత జీవితమే!

చివరికి ప్రమాదం జరిగింది. ఒక పెద్ద ఆస్టరాయిడ్‌ వల్లకాదు. అలాంటి వాటిని ముందే పసిగట్టి తన దారి మార్చుకోవటం సులభమే. గోళీకాయలంత సైజున్న చిన్న చిన్న మిస్సెల్స్‌ను అతిసున్నితమైన, అతి సమర్థవంతమైన అసోవ్‌ సెన్సర్లు కూడా గుర్తించలేవు. అయితే, నష్టం జరగటానికి సైజుకన్నా, వేగం ముఖ్య కారణం. అది తగలినట్టుగా కూడా తెలియలేదు. మొదట ట్రాన్స్‌మిటర్‌ ఏరియల్‌ విరిగింది. ఫరవాలేదు. మరొక రెండు సెట్లు రెడీగా వున్నాయి. కానీ కంట్రోల్‌ మెకానిజం పనిచెయ్యదిక. అంటే మనిషికి కోమా వచ్చినట్టన్నమాట. అసోవ్‌ ప్రయాణమాగలేదు. అయితే అది నియంత్రణ కానీ, గైడెన్స్‌ కానీ, లక్ష్యంలేని కదలిక. ఆ అనంత అంధకారంలో తనూ ఒక డెడ్‌ రోబో! ఇంతటితో కథ ముగియాల్సిందే కానీ, మన వూహకందని గ్రహాంతర సీమల్లో ఎన్ని రకాల జీవులు, మరెన్ని సంస్కృతులు, ఎంత శాస్త్ర, సాంకేతిక పరిజ్జానం దాగివుందో! అసోవ్‌కు వెంటనే ప్రాణం వచ్చిందనీ కాదు. ఎన్ని కాంతి సంవత్సరాలు అది అలా పరిభ్రమించిందో కూడా అంచనా వెయ్యలేం. శూన్యంలో అణు విచ్ఛిత్తి జరగటం సర్వసామాన్యం. దీని పరిణామంగా కొన్ని గ్రహాలు నశిస్తాయి. మరికొన్ని ఆవిర్భవిస్తాయి. కొత్త శక్తి వనరులు ఏర్పడతాయి. అలాంటి సృష్టి విచిత్రం జరిగిందొకసారి.

అదే సూపర్‌నోవా!
ఒక గెలాక్సీలో సుమారు లక్ష మిలియన్‌ నక్షత్రాలుంటాయి. అప్పుడప్పుడూ యిందులోని ఒక సూర్యుడిలో హీలియం (వాయువు) వ్యాకోచం చెంది పేలిపోతుంది. దానివల్ల వుత్పన్నమైన కాంతి యించుమించు సగం గెలాక్సీకి వ్యాపిస్తుంది. ఇలాంటి ఒక సూపర్‌ నోవా విచ్ఛిత్తి సమయంలో, ఆ వేడికో, కాంతికో, కొత్త జీవులు ఆవిర్భవించినట్టే అసోవ్‌కు కూడా ప్రాణం వచ్చింది. అయితే, యిప్పుడది తన వునికిని గ్రహించ గల స్థితిలో లేదు. చుట్టూ పరిమితమైన సౌరకుటుంబం లేదు.

ఇది మరో లోకం తనకు తెలిసిన సూర్యుడితో పోలిస్తే యిక్కడి నక్షత్రాల వ్యాసార్ధం నాలుగు వందల రెట్లు పెద్దది. మరో నెబ్యులాకు (నక్ష్రత సముదాయాల పేర్లు- పాలపుంత, గెలాక్సీ, సూపరోనోవా, నెబ్యులా... ఒకదానికన్నా పెద్దది మరొకటి) సమీపంగా కదులు తోంది తను. కానీ విశ్వరహస్యాలలో ఓనమాలు కూడా బోధపడలేదు. కాస్మిక్‌ తుఫాన్లలో తన కక్ష్య మారిపోతున్నది. పేలిపోయే ముందర నక్షత్రాలలో కదలిక వస్తుంది. అది మృత్యు నర్తనం. నక్షత్రాల చరమ విన్యాసాలకు ఏకైక సాక్షి అసోవ్‌. సేకరించిన సమాచారంతో తన మెమొరీ సర్క్యూట్స్‌ జామ్‌ అవుతున్నాయి. సూపర్‌ నోవా నుండి కొత్త శక్తిని సమకూర్చుకున్నది అసోవ్‌. ఇదే చివరి ప్రయత్నం నక్షత్రాల మృత్యుహేలను రికార్డు చెయ్యటమే తన లక్ష్యం. మంచు ముద్దల్లాంటి గ్రహాలు క్షణాల్లో అగ్నిగోళాల్లా మారిపోతున్నాయి. కానీ నక్షత్రాలే పేలిపోయినప్పుడు గ్రహాలు మిగుల్తాయా!

అంతలో ఒక విచిత్రం జరిగింది.
తన రేడియో సిగ్నిల్స్‌ను గ్రహించిన మరొక ఉపగ్రహం చేరువగా వచ్చింది. సంభాషణంతా అంకెల్లోనే జరిగింది. సమాచార విస్తీర్ణత ఎక్కువైపోవడంతో పేలిపోతానేమోనని భయంగా వుంది అసోవ్‌కు. తన డేటానంతా మొదట ఆ ఉపగ్రహానికి చేర్చేసింది. ఈసారి సెన్సర్లు పని చెయ్యటం మానేశాయి.

''నా మిషన్‌ కంట్రోల్‌కు ఈ వార్త చేరవెయ్యాలి'' అంటూ తన మిత్రుణ్ణి అభ్యర్థించింది అసోవ్‌. అదే దాని చివరి సిగ్నల్‌. అనేకానేక కాంతి సంవత్సరాల తర్వాత, ఈ విషయం బహుశా, భూ గ్రహవాసులకు తెలియవచ్చు.

No comments: