Thursday, September 27, 2007

80 ఏళ్లనాటి కథ లండన్‌ విద్యార్థి

గురురావు గొప్ప జమిందారుడు. అతని మిరాసి గ్రామములు పల్లెలగుట బట్టి పల్లెలయందుండుట కిష్టము లేక పట్టణమున నివాసము చేయసాగెను. పల్లెల అధికార మంతయు దివానుగారు నడిపెదరు. అనగా దివానుగారే జమిందారుగారు. జమిందారుగారే దివానుగారి వలన భూతాది పూర్వకముగా జీవించు నౌకరు. ఎవని సొమ్ము వానికి నష్టము కాకుండా అభివృద్ధి గావలయునని మనస్సుండును. కాని యితరునికేమి? జమిందారుని జమీను చెడితే దివానుకేమి? బాగు పడితే దివానుకేమి? ''ఊరుపాయె హుసేన్‌ సాయిబు'' అంటే ''పోతె పాయె బడే సాయబు'' అన్న సామెత యెవరెరుగనిది. చెరువులు మరమ్మతు చేయించుట, బావులు తీయించుట, కాల్వలు గట్టించుట మొదలయిన సౌకర్యములు రైతులకు కలుగచేయుట యేమి లేదు. కాని యెండలో నిలువబెట్టి మీద బండలెత్తి మాఫి రకం అను పేరు లేక సేద్యం అయినా కాకున్నా సిస్తు వసూలు చేయుట ఆయన పని. దివానుకు దయవచ్చి సిద్ధం చేసినంత రకముతో పట్టణములో సౌఖ్యపడుట గురురావుగారి పని. గురురావుగారికి కుమా రరత్నం కలిగినాడు. రూపమే మయినా లోపమా? గుణమేమయినా లోపమా? తెలివి యేమయినా లోపమా? నగరములో చదివినాడు. బి.ఎ. ప్యాసు అయినాడు. సెకండరీ చదువుచున్నప్పుడే వివాహం అయింది. ఇక కావలసినదేమి? బ్రతుకు దెరువునకు మార్గము కలదు. వృత్తి విద్య అంత అవసరం లేదు. కాని అంత మాత్రమున తృప్తి యెక్కడిది? వృత్తి విద్య యుంటేనో? అది మాత్రము దేశమున లేదా? వైద్యము చదువ వలయునన్న ఎం.డి. మట్టున కిక్కడనే గలదు. న్యాయవాదము ఎల్‌.ఎల్‌.బి. మట్టున కిక్కడనే గలవు. ఇట్టులనే అన్నియు నిక్కడనే గలవు. ఎంత చదివి ఎంత జ్ఞానమార్జించినను సీమకు వెళ్ళి వచ్చిన దర్జాయే వేరు.

రామాచారి, విశ్వనాథశర్మ, లతీఫ్‌ సాహెబ్‌ మొదలయిన వారలు కొందరు గురురావు గారింటనొకనాడు కూడిరి. పయివారంతా నగరములో ఉద్యోగమో, న్యాయమో చేయుచు కాలము గడిపే గౌరవనీయులే. వారందరు గురురావుగారి కుమారుడగు తుకారాంగారి విద్యాభ్యాసమును గురించి చర్చ చేయుచుండిరి.

'ఈ దినములలో లండను, కేంబ్రిడ్జి మొదలగు విశ్వ విద్యాలయములలో చదివిన వారలకే కీర్తి ప్రతిష్టలు గాని మన దేశీయ విశ్వవిద్యాలయములలో చదివిన వారలకు గౌరవము లేదండి' అని రామాచారి గారనిరి.

'అయితే మా తుకారామును ఎక్కడికి తోలించవలయును' అని గురురావుగారనిరి. 'సీమ చదువే పాడండి. మన ఆచార వ్యవహారాలు బొత్తిగా పాడు కావడమే కాక పిల్లలు మళ్లీ మనకక్కరకు రాకుండా అయి వస్తారు. ప్రతి సంవత్సరము ఇండియా నుండియే రెండు వందల మంది విదేశములకు వెళ్ళి డబ్బంతా పాడుచేసి వస్తున్నారు కదా! వారిలో ఇండియాకు వచ్చి వెలుగబెట్టినదేమిటి? అని విశ్వనాథశర్మ నుడివెను. 'సీమ బారిష్టరులకు గౌరవమెక్కువండి' అని రామాచారి వక్కాణించెను.

'పళ్లూడగొట్టుకొనుటకు పర్వతానికి పోయినారట రాయి కొరకు, ఇన్ని వేలు కర్చు చేసి సీమకు పోయి మళ్లీ వకాలతయేనా? మొన్న నొక బారిష్టరు ముక్తారునామా తీసుకొని వచ్చిన సువ్వందర్జా వకీలుతో వాదించలేక గుటకలు మింగినాడు. మన దేశములో చదివిన వకీళ్లు పిడుగులాంటి వారు లేరనా? సీమకు పోయి వస్తే షోకులకు కర్చులెక్కువ చేయడము తప్ప తక్కిన వానిలో యెందుకు పనికి రారు' అని శర్మ తీక్షణముగా పలికెను.

'సీమకు పోయి వచ్చిన వాండ్లకు తెల్ల దొరసానులు తమ డాన్సులో నిరాటంకముగా చేర్చుకొంటారు. తక్కిన వారికెంత పాండిత్యమున్నా చేర్చుకొనరు. ఇదియొక సదుపాయము' అని లతీఫ్‌ సాయబనెను.

'సరె! ఎలుకను బట్టుటకు గుట్ట త్రవ్వినారుట. దొరసానుల ఆటలలో చేరుటకు వేల రూపాయలు పాడు చేసుకొని సీమకు పోయి రాకడయా! బాగు బాగు. ఈ పోవు విద్యార్థులు సీమకు బోయి తెచ్చెడి యోగ్యత ఏమి? వాయు విమానముల చేయు నేర్పా? మోటారు బండ్లు చేయు నేర్పా?తుదకు కుట్రపు మిషన్‌లో సూదిని చేయు తెలివి సైతము కొని వచ్చుట లేదు. ఇక యేమి తెచ్చెదరంటే ఇంట గల ద్రవ్యమంతయు వ్యయము చేసి దరిద్రపు పెద్దమ్మ వారిని తెచ్చెదరు. ఒక్కొక్కడయితే దానికి తోడు శేష భాగము గుల్ల చేయుటకు సీమ దొరసానిని తెచ్చును. ఇంతకంటే విశేషమేమియు నాకు కనపడలేదు' అని శర్మ పరిహసించెను.

'అందరంతేనా? కొందరు నీతిగా మెదలి వచ్చుట లేదా? మీ అబ్బాయిని తోలించి చూడండి. కుర్రవాడు మంచి తెలివి తేటలు గలవాడు. వినయ విధేయతలు మంచిగా గలవు. చెడిపోగూడదు' అని రామాచారి నుడివెను. 'మంచి మనస్సుంటే యెక్కడికి వెళ్ళినా యేమి ఫర్వాలేదు' అని లతీఫ్‌ సాహెబు చెప్పెను. 'గురువుగారూ! పిల్లవానిని పంపించుట నాకెంత మాత్రము నచ్చదు చూడండి. ఈ వినయ విధేయతలు మారి వ్యర్థుడయి రాకుంటే నా పేరు తీయించుకుందును. పోయినందుకేదో పరీక్షలలో నెగ్గినట్లు కమ్మల తెచ్చుకొనక పోడు. ఆ కమ్మలతో రాగానే కడుపు నిండదు. మళ్లీ యిక్కడ తంటాలు పడి జీవనోపాధికి మార్గం కల్పించుకోవలసి ఉంటుంది. చూడండి! వాలకం. పైసా కర్చు లేకుండానే ఆ తంటాలు ఇక్కడ పడితే బాగని నా యభిప్రాయం. పిల్లవాడంతగా చెడడు' అని శర్మ చెప్పి యూరకుండెను.

ఎవరెంత చెప్పినను గురురావుగారికి తుకారామును సీమకు పంపి తీరవలయునని నిశ్చయముండెను. కావున తదితరుల మాట నెగ్గలేదు.

తుకారాం లండన్‌ విశ్వ విద్యాలయములో చేరెను. ఇండియానుండి వచ్చెడివారంతయు యే రాజులో ఏ కోటీశ్వరులోయని అక్కడి వారి విశ్వాసము. ఎట్లయిన గౌరవము సంపాదించుకొనవలెనని వారలు వీరిని భాగ్యవంతులనుకొనియెదరు. అణా చీటి వేసి ఆత్మారాం సేటు వద్ద ప్రాంసరీ నోటు వ్రాసి చేయుచున్న వైభవమని పాపము వారలకేమెరుక? ఇదియు గాక ఇక్కడినుండి చదువబోవువారలొక బిడ్డో కొడుకునో కనియో లేక యీడేరిన పెండ్లాము నింట నుంచియో చనియెదరు. ఈ సమాచారమక్కడి సుదతులతో చెప్పరు. ఆ దేశమున యా కాలమునకు ప్రాయశః వచ్చిన వారలు అవివాహితులనియే వారు తలచెదరు. వివాహితులని వారికి తెలిసినచో వారెవరును దగ్గరికి చేరరు. ఎన్ని తమాషాలు! గాంధి మహాత్ముని వంటి ఒకరిద్దరు నిప్పచ్చరావతారాలు అక్కడి రహస్యాలు బట్టబయలు చేస్తే మాకెరుక అయింది. తాను లండన్‌ యూనివర్సిటీలో చేరినానని రెండు మూడు విషయములలో తంటాలు పడుచున్నానని తనకు సహాధ్యాయులుగా మిస్‌ కొంగా దొరసాని చేరినదని జాబు వ్రాసెను. అన్నియు సరికాని కొంగ మాట వినగానే గురురావు గుండె గుభాలుమనెను. ఏమి చేయగలడు? తుకారాం భార్యకు మాత్రమా సమాచారము తెలియకుండునా? ఆమె యిక మగడు రాడనియె నిరాశ చేసుకొన్నది.

కొంగా దొరసానికి తుకారాం అను పేరు పొడవుగాను ఉచ్ఛారణ సౌకర్యము లేనిదిగాను కనుపించెను. కావున తత్‌ ప్రత్యామ్నాయము 'మిస్టర్‌ తూ' అని పేరు వచ్చినది. కొంగ దొరసాని కూడా 'మిసెస్‌ తూ' అను పేరు మార్చుకొనెను. వారుభయుల మిత్రులు యెరిగిన వారలు 'తూ' అనసాగిరి. ఇండియాయైున యెడల తుకారాము 'తూ' అనుబడుచున్నప్పుడు అభిమానపడవలసి యుండెడిది. కాని అది ఇంగ్లండు. అక్కడ 'తూ' అన్నను మరేమన్నను అభిమాన పడవలసిన అవసరము లేదు. అదిగాక తానొక్కడే 'తూ' అనుబడుచున్నాడా? తనదంటకు 'మిసెస్‌తూ' ఒకతె లేదా? ఉభయులు ఏకరీతి 'తూ, తూ' అనబడుటయు నొక విధమయిన గౌరవముగానే ఉండెను.

పరీక్షలు ముగిసినవి. తుకారాంగారు పత్ర యోగ్యతకు పాత్రుడైనాడు. ఇండియాకు ప్రయాణమైనాడు. మిసెస్‌ తుకారాం (కొంగా దొరసాని) తోడ రాదలచినది. కాని ఇండియాకామెను తీసుకొని వచ్చి యేమి పెట్టగలడు? ఇక ముందు తండ్రి డబ్బీయునా? ఉన్నది పాడుజేయు తెలివికంటె ఇంకొక తెలివే అతని దగ్గర లేదు. అక్కడనున్న దినములన్నియు డిన్నరులలో, డ్యాన్సులలో, షికారులలో, డ్రామాలలో, సినిమెటోగ్రాపులలో గడచిపోయెను. ఇక యేమి యోగ్యత కొరకాతడు శ్రమ పడవలసి యుండెను. కాని కష్టమనిన చేతగానివాడుగా మారెను. ఇక ముందిండియా వచ్చి సంపాదన మార్గము నేర్చుకొనవలయును.

నాల్గు సంవత్సరములు సీమలో నుండి సంపాదించిన మాయ మర్మము కుట్ర కుహకములు వినియోగించి వెనుక నుండి పిలిపించుకొనియదనని కొంగనొడంబడిక జేసి యీవలబడుసరికి తుకారాం గారికి తల ప్రాణము తోకకు వచ్చినది. కాని ఇండియనులకు ధైర్యము లేదు. సాహసము లేదు. పిరికి పందలు. ఇక ఆడుదాని సాదలేరు. అని కొంగ పోట్లు తల వాయునట్లు తినక తప్పులేదు. చేజేత అనుభవించక యెవనికి తప్పదు.

''క్యాష్‌ బ్యూటి'' అను పడవ బొంబాయి రేవులో దిగినది. గురురావుగారు రెండు దినములకు ముందే బొంబాయికి దివాన్‌గారితో వచ్చి రేవునకు బోవు టికటు కొని యుండెను. పడవ వచ్చినదని తెలిసినది. నాలుగు సంవత్సరముల నుండి చూడక కండ్లు కాయలు కాచినట్లుండుటచే యెప్పుడు కొడుకును చూచెదనాయని మనస్సుననున్న గురురావు రేవునకు పరుగెత్తుకొని వెళ్లెను. ఇంకను తుకారాం పడవ నుండి దిగలేదు. రెండు మూడు దినములు పడవలోనే విశ్రాంతిగొననుండెను. మొదలే తానేగుట బాగుండదనియో లేక మరో కారణమునో దివానును పంపించెను గురురావు. దివానులోనికేగి మీ తండ్రి నిన్ను చూచుటకు రేవులోనున్నాడని జెప్పెను. అందుకాతడు Oh! This is not my leisure time, ask him to come at five అనగా ఇది విశ్రాంతి సమయముగాదు సాయంకాలము అయిదు గంటలకు రమ్మనమని చెప్పినాడు. ''సీమకుబోయి యెంత గౌరవ మర్యాదలు నేర్చుకొని వచ్చినాడు. ఎంత ప్రేమ విశ్వాసములు నేర్చుకొని వచ్చినాడు? తండ్రి గది గుమ్మము వద్ద నిలిచియుండ తను చూడమన్నప్పుడన వలసిన మాట యిదియేనా? నాలుగు సంవత్సరముల శిక్షకు ఫలమా యిది?'' అనుకొని గురురావు వద్దకు వచ్చెను. కాని మంత్రికి చెప్పుటకు నోరెక్కడ గలదు? కొమారుడన్నమాట లేనోటితో చెప్పగలడు? మంత్రి యింకనూ సీమకు వెళ్ళిరాలేదు గదా? ''సరిచూచెదను. యుక్తి చేయనిది కుదరదు'' అని గురురావును వెంటనిడుకొని పోయెను. తండ్రి వెళ్ళువరకు కొడుకు పడుకొనియుండెను. తండ్రిని చూచిన పిమ్మటనైన లేచి ప్రత్యుత్థానము చేయలేదు. తండ్రి పట్టరాని దుఃఖముచే కొడుకు పయిబడి దుఃఖించెను. ప్రేమా విశ్వాసముల నడుమ పెరిగినవాడు తండ్రి. నల్లతోలు సంచిలో తెల్ల విజ్ఞానమును నింపుకొని వచ్చినవాడు కొడుకు. ఉభయులకెంత తారతమ్యములు! ''అమ్మ బాగున్నదా? తమ్ముడు చదువుకొంటున్నాడా? కోడలక్కడనేయున్నదా?'' అను కుశలప్రశ్నలేవియూ లేవు. మీటనొక్కిన సిడి వలె తటాలున లేచి గదిలో నొకమూలన ''షూషు ఘాషు'' అని యీలబాడుచు నిలుచుండెను. ఈ చర్యను చూచి తండ్రికి మరింత దుఃఖము వచ్చినది. కాని కడుపు తీపి చెడ్డది. మాలిన్యము కలదయినను లేనట్టు దోచును. ఈ చర్యనంత సహించుకొని ''తుకారాం బసకు పోదామురా వంట సిద్ధముగా నున్న''దని పిలిచెను. కొడుకుతో కలిసి తినక తండ్రికెంత కాలమయినది? "This is not fit for me" అన సాహసించెను. అనగా ఆ భోజనము నాకు సరిపడదు అని అర్థము. తల్లిపాలు చేదయినప్పుడెవడేమి చేయగలడు.

పడక గది

సర్వాలంకార భూషితయగు భార్య అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్య పడక గదిలోనికి వచ్చి నిలిచెను. తుకారామామెను ఎగాదిగా చూచి "Who are you, Please?" అని ప్రశ్నించెను. అనగా నీవెవరివని అర్థము. ఆ రవంత ముక్క తెలుగున అనలేకపోయెనా? నాలుగు సంవత్సరములకే తెలుగు బొత్తిగా మరచెనా? తల్లిదండ్రులను, చేసుకొనిన భార్యను మరచెనా? మాతృభాషలో మాటలాడిన మానహానియా? విదేశమునకేగి వచ్చుట యన జన్మాంతర మంది వచ్చుట కాబోలు!

ఆ ఇంగ్లీషు ముక్కలు పాపమా బాలకేమెరుక! ఈ నాలుగు సంవత్సరములలో క్షేమముగానున్నారా? నన్నెప్పుడయినా తలచుకొనుచుంటిరా! అని కుశలప్రశ్నలు వేసెను. ఆ ప్రశ్న ప్రేమలో ముంచి పావిత్య్రమద్దినట్లున్నది కాని ప్రయోజనమేమి? ఇక తుకారాంనకు తెలుగు మాట్లాడక తప్పలేదు. 'నీవెవరు?' అని ప్రశ్నించెను. ''అయ్యో! నన్నెరుగననుచున్నారా? మీ భార్యనుగానా? మీ రాక కొరకెదురు చూచుచున్న దానను కానా? నన్నీతీరు...'' ఆ పయిన మాట అనలేక యేడువసాగెను. ఆ యేడుపునకు హిమాలయమంతటిది కరిగిపోవలసినదే. కాని ఇది హిమాలయముగాక ఆలెప్‌ ఆయెను. 'ఓ... ఓ.... నా వైఫ్‌! షేం షేం నాకు వద్దు పో' అనెను. ఆమెకక్కడనికయేమి కలదు? ఆ పై ఏడ్చుచు పోయి అత్తమామలతో నీ సోదె చెప్పెను. వారామెననుకరించుట కంటే యేమి చేయగలరు.

రెండు పూటలింట ఒక పూట డియాంజలిస్టు హోటలులో భోజనము చేయుచు ఈ ప్రకారము మూడు మాసములు గడిపినాడు. ఒకనాడు బొంబాయికి చెప్పకుండా వెడలినాడు. కారణము విచారించగా కొంగా దొరసాని వచ్చినట్లు కబురు రాకడయే. 'మిస్‌ తూ', 'మిస్టర్‌ తూ'లు కలిసినారు. ప్రస్తుతము పిన్న మొదలు పెద్దదాకా వారినందరు 'తూ, తూ' అనే అంటారు. లండను నగరములో రహస్యముగా పెట్టుకొనిన పేళ్లు హిందువులకెట్లు తెలిసినవి? వారికి దివ్యజ్ఞానము కలదుగా... ముందు అవకాశముంటె 'తూ, తూ' దాంపత్యమని వారి అనంతర జీవితము వ్రాయబడును.

ఆధునిక తెలంగాణా సాహిత్య మూర్తులలో ఒద్దిరాజు సీతారామచంద్రరావు, రాఘవరంగారావు గారలది విశిష్టస్థానం. మానుకోట అనే చిన్న పల్లెటూరి నుంచి వీరు 'తెనుగు' అనే మాసపత్రికను 80 ఏళ్ళకిందటే స్థాపించి, పదేళ్ళు అవిచ్ఛిన్నంగా నడిపారు. ఈ అన్నదమ్ములు సాహిత్యరంగంలో ఒద్దిరాజు సోదరులుగా ప్రసిద్ధులు. ఆధునిక సాహిత్యంలో అన్ని ప్రక్రియలూ వీరు ఇంచుమించుగా సుసంపన్నంచేశారు. ప్రౌఢకావ్య రచనతోపాటు ప్రహస రచనలూ చేశారు. నాటకాలు రచించారు. తీరాంధ్రంలోనూ కనపడని విశేషమే మంటే వీరు ఆ పల్లెటూళ్ళోనే ఒక ఫొటోస్టూడియో నెలకొల్పి, ఫొటోగ్రఫీని గూర్చి ఆ రోజులలోనే తెలుగులో ఒక ప్రామాణికమైన గ్రంథం రచించడం. సమాజానికత్యంతావశ్యకమైన చేతివృత్తులను, హస్తకళలను, సాంకేతిక విద్యలను గూర్చి ఎనభై ఏళ్ళనాడే వీరు తెలుగులో పుస్తక రచన చేశారు. విద్యుదుత్పాదనం చేశారు. ఆయిల్‌ ఇంజన్‌లు నడిపారు. స్వయంకృషితో ఇంగ్లీషు నేర్చుకొని అందులో కవిత్వం కూడా రాశారు. వీరి తల్లి గొప్ప పండితురాలు. ప్రాచీన కావ్యాలలో, సాహిత్య ప్రస్తావనలలో ఈ సోదరులకు ఏమైనా అర్థస్ఫురణ కలగనప్పుడు, సందేహాలు వచ్చినప్పుడు వీరి తల్లిగారు పరిష్కరించేవారుట. వడ్రంగ కళలో వీరెంతో నైపుణ్యం సాధించారు. ఇంజనీరింగ్‌ విద్యలో మహా ప్రతిభావంతులు. తమ భవనం ఆ పల్లెటూళ్ళో తామే నిర్మించుకున్నారు.

పల్లెటూరులో ముద్రణాలయం స్థాపించి పదుల పుస్తకాలను, వ్యాఖ్యానాలను, ఆధ్యాత్మిక మత గ్రంథ ప్రచురణలను తేవడం వీరి అసామాన్య ప్రతిభా నిరూపకం, నిదర్శనం. ఈ సోదరులలో చిన్నవారైన రాఘవరంగారావుగారు నిరంతర హాస్య సంభాషణ కుశలురు అని వారిని తెలిసినవారు చెపుతారు. ఆయన వెంట ఎప్పుడూ పదిమంది గుమిగూడి నవ్వుతూ ఉండేవారుట. అంత చమత్కారంగా, హాస్యరసపూరితంగా శ్రీరంగారావు మాట్లాడేవారుట.

ఎనభైఏళ్ళ కిందట రాసిన ఈ కథలో ఆనాటి సంపన్న కుటుంబాలలో విదేశివేషభాషా వ్యామోహం ఎట్లా ఉండేదో ఈనాటి తరం పాఠకులకు వినోదప్రాయంగా, హాస్యవిషాద భరితంగా వర్ణితమైంది. ఇది తెలంగాణా ప్రాంత సామాజికేతివృత్తంతో రచితమైంది. ఈ కథకు 'తూ... తూ' అని పేరు పెట్టినా ఇంకా హాస్యస్ఫోరకంగా ఉండేదేమో! తుకారామ్‌ అనే కథానాయకుడి పేరు కోస్తాలోనూ, రాయలసీమలోనూ వాడుకలో ఉన్నట్లు కనపడదు. కాని తెలంగాణంలో బాగా పరిచయంగానే కనపడుతుంది. మరాటీ భాషా సంస్కృతులు, పాండురంగడి ప్రభావమూ ఆంధ్రదేశంలోని ఇతర ప్రాంతాలకన్నా తెలంగాణంలో ఎక్కువ. అదీకాక ఈ కథలో వ్యంగ్యమంతా ఆ పేరును ఆశ్రయించుకొని ఉన్నదే కాబట్టి రాఘవరంగారావుగారి హాస్య ప్రవృత్తికది బాగా తోడ్పడింది. ఈనాటి అభిరుచులకు, సామాజిక సంబంధాలకు అనుగుణం కొంత సంక్షిప్తత ఈ కథలో అవసరమైంది.

No comments: