Thursday, September 27, 2007

శిశు వధ ఫ్రెంచి కథ

డిసెంబర్‌ నెల, ఇరవై ఆరవ రోజు, శుక్రవారం సాయంత్రం, గొర్రెల కాపరి కుర్రవాడొకడు బిగ్గరగా ఏడుస్తూ నజారెత్‌ నగరంలోకి ప్రవేశించాడు. దట్టమైన తోపులో నుండి, మంచు దారిగుండా వచ్చాడు వాడు. ''చీకటి పడగానే నిద్రపోయే కార్నెలిజ్‌ కొడుకు, ఎందుకిలా పరిగెత్తుతున్నాడు?'' కల్లుపాకలో తాగుతూ కూర్చున్న జనం ఆదుర్దాగా అడిగారు.

''ఏమైందిరా నాయనా? దేన్ని చూసి అంతగా భయపడ్డావు?''

వెక్కి వెక్కి ఏడుస్తూ, వచ్చీరాని మాటల్లో ఏదో చెప్పాడు ఆ పసివాడు- 'స్పేనియార్డులు (స్పానిష్‌ దేశీయులు) వచ్చి పొలాలు తగలబెట్టారు. తన తల్లినీ, తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లనూ ఒకే చెట్టుకు ఉరితీశారు. వాళ్లంతా గుర్రాలెక్కి వచ్చారు. చేతుల్లో ఆయుధాలున్నాయి. తమ పశువులమందను కూడా తరలించుకుపోయారు'.

వాడి మాటలు అర్థంకాగానే చేతికి దొరికిన కర్రా, పారా, గునపం తీసుకుని దివిటీలతో తోపువైపు పరిగెత్తారు గ్రామస్తులు.

ఆ రోజు పున్నమి. మంచు మీద మెరుస్తున్న వెన్నెలతో పట్టపగల్లా వుంది తోట. కార్నెలిజ్‌, అతని బావమరిది క్రేయర్‌ తలలు పట్టుకుని కూర్చున్నారు. దుండగుల ఆచూకీ మాత్రం లేదు.

చేసేదేమీలేక, పారిపోతున్నవాళ్లు కనిపిస్తారేమోనని చర్చి గోపురమెక్కి నలుదిశలా పరిశీలించి చూశారు. విశాలమైన మైదానాలలో ఎక్కడా జనసంచారం లేదు.

ఒకసారి కొల్లగొట్టిన వాళ్లు తప్పక తిరిగివస్తారు. అక్కడే పొదల్లో నక్కి స్పేనియార్డుల కోసం నిరీక్షించారు. ప్రీస్టు, స్త్రీలు చర్చిలో ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పదును పెట్టుకున్నారు.

ఎత్తయిన దిబ్బమీద నిల్చుని ఒక గొర్రెల కాపరి సెంట్రీ డ్యూటీ చేశాడు. దొంగల రాకను దూరం నుండే గమనించి తమవాళ్లను అప్రమత్తం చెయ్యాలి.

ఇంకా అర్ధరాత్రి దాటలేదు. మొదట ఎర్రటి మంటలు కనిపించాయి. ఆ తర్వాత మంచుమీద కదిలివస్తున్న గుర్రాలు. నలుగురు అశ్వికులు ఆ సైన్యానికి నాయకత్వం వహిస్తున్నారు. పశువుల, గొర్రెల మందలు వాళ్ల వెనకే కదులుతున్నాయి. గడ్డిమేస్తున్న జీవులు ఎంత అదిలించినా అడుగు ముందుకెయ్యవు.

కార్నెలిజ్‌ రక్తం సలసలా మరిగింది. తాను చెమటోడ్చి సంపాదించిన ఆస్తిని వీళ్లు తేరగా కాజేస్తారా! ఒక్కసారిగా స్పేనియార్డులపైకి లంఘించాడు. అతణ్ణి చూసి ఇతర్లు కూడా ముందుకురికారు. వెన్నెల రాత్రి ఆ ప్రదేశమంతా రణరంగమైంది. దుండగుల తలలు తెగిపడ్డాయి. కార్నెలిజ్‌ పగ ఇంకా చల్లారలేదు. వాళ్ల గుర్రాలను కూడా సంహరించాడు.

యుద్ధంలో శత్రువులను తుదముట్టించి ఇళ్లకు చేరుకున్నారు గ్రామస్తులు. స్త్రీలు తమ వీర పురుషులకు స్వాగతం పలికారు. పిల్లల కేరింతలతో, కుక్కల అరుపులతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.

ఇది గొప్ప విజయమే. కాని తదుపరి కర్తవ్యమేమి? ప్రీస్టును సలహా అడిగారు.

మొదట వాళ్లు వధించిన స్త్రీని, తొమ్మిది మంది పిల్లల్నీ ఒక బండిలో ఇంటికి తీసుకు రావాలి. హతురాలి బంధువులూ, అక్కాచెల్లెళ్లూ ప్రీస్టును వెంట తీసుకుని బయల్దేరారు.

అడవంతా నిర్మానుష్యంగా వుంది. ఛిద్రమైన స్పేనియార్డుల శవాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. తలలు తెగిన మేలుజాతి గుర్రాలు వెన్నెల వెలుగులో మెరుస్తున్నాయి. మరి కాసింత దూరంగా, పొలంలో ఆకాశం దాకా ఎగిసిన ఎర్రటి మంటలు భీతిగొల్పుతున్నాయి. ఒక పక్కన, శాఖోపశాఖలుగా విస్తరించిన మహావృక్షమొకటున్నది. దానికి వేళ్లాడుతున్న స్త్రీని చూసి గొల్లుమన్నారందరూ. కింద, గడ్డిమీద, మంచులో హృదయ విదారకంగా పడివున్నాయి ఆడ పిల్లల మృతదేహాలు. స్త్రీని కిందికి దించటానికి చెట్టెక్కాడు కార్నెలిజ్‌. ఆమె నేలమీద పడకుండా పట్టుకోవటానికి కింద ఆడవాళ్లు చేతులు జాపి నిల్చున్నారు- శిలువ నుండి జీసస్‌ క్రైస్ట్‌ను కిందికి దించినప్పటి దృశ్యమే అది.

తెల్లవారి ఆమెను సమాధి చేశారు. మరోవారం దాకా నజారెత్‌లో ఏమీ జరగలేదు.

అయితే మరుసటి ఆదివారం, చర్చి ప్రార్థనల తర్వాత, ఆకలిగొన్న తోడేళ్లు ఊళ్లో విహరించాయి. మధ్యాహ్నం దాకా మంచు కురిసింది. అనూహ్యంగా ఎండ తీవ్రత పెరిగింది. రైతులు యథాతథంగా భోజనం చేసి విశ్రమించారు.

గ్రామంలో జన సంచారం లేదు. కుక్కలూ, కోళ్లూ, గడ్డిమేస్తున్న గొర్రెలూ అక్కడక్కడా కనిపించాయి. కుర్చీలో వాలి ప్రీస్టు కునుకు తీశాడు. అతడి సేవకుడు చర్చి ఆవరణ శుభ్రం చేశాడు.

సరిగ్గా అప్పుడే ఆ ప్రశాంత సమయాన, రాతివంతెన దాటి సాయుధులు కొందరు గ్రామంలో ప్రవేశించారు. వాళ్లంతా స్పేనియార్డులు. మళ్లీ వచ్చిన హంతకులను చూసి భయపడి, తలుపులేసుకుని, ప్రాణాలరచేతిలో పెట్టుకొని నిరీక్షించారు గ్రామస్తులు.

చర్చివద్ద కవచాలు ధరించిన ముప్ఫయ్‌ మంది సైనికులు ఒక తెల్ల గడ్డం వృద్ధుణ్ణి ముట్టడించారు. గడ్డకట్టిన మంచుమీద గుర్రాల డెక్కల చప్పుడు మళ్లీ వినిపించింది. ఎరుపు, పచ్చరంగు దుస్తుల్లో మరికొందరు శూలాలు పట్టుకుని వచ్చారు.

ఆ వూళ్లో వున్న ఒక మద్యశాల గోల్డెన్‌సన్‌. కొందరందులో ప్రవేశించి చిత్తుగా తాగారు.

వాళ్ల నాయకుడు ఆ గ్రామాన్ని దిగ్బంధం చెయ్యటానికే ప్రణాళిక వేసినట్టుంది. కొందరు అనుచరుల్ని పొలిమేరల్లో కాపలా వుండమని పంపించాడు. ఆ తర్వాత, ఇళ్లలో వున్న పిల్లలందర్నీ చర్చి వద్దకు లాక్కురమ్మని ఆదేశించాడు. (సెయింట్‌ మాత్యూ సువార్తలో యిలాగే రాసున్నది) మూకుమ్మడి హత్య ఆనాటి కార్యక్రమం.

సైనికులు, యింటింటికీ వెళ్లి పిల్లల్ని తమ వెంట పంపమన్నారు. కాని వాళ్ల భాష గ్రామస్తులకు అర్థంకాలేదు.

ఒక క్షురకుడి యింట్లో, అందరూ భోజనం ముగించి కబుర్లు చెప్పుకుంటున్నారు. పసిపిల్లవాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. సైనికులు, ఆ శిశువునెత్తుకుని ఆపిల్‌ చెట్టుకింద దించారు. ఏం జరుగుతుందో తెలియక, తల్లీదండ్రీ లబోదిబోమంటూ పరిగెత్తుకొచ్చారు. ఆ తర్వాత కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చర్మకారుల యిళ్లకూ వెళ్లారు. అతిథులను మర్యాదగా ఆహ్వానించటం ఆ వూరివాళ్ల సాంప్రదాయం. వృద్ధులు వాళ్లకు సాదరంగా స్వాగతం పలికారు. భాష అడ్డంకిగా వుందని, ప్రీస్టుని పిలిచి వాళ్లు వచ్చినపనేమిటో తెలుసుకుని చెప్పమన్నారు.

పశువుల కొట్టాల గేట్లు తెరుచుకోవటంతో ఆవులు, గేదెలు, పందులు బైటికివచ్చి పచ్చగడ్డిలో తిరుగాడ సాగాయి. జనం పారిపోకుండా ఒక్కొక్క యింటిముందర ఒక్కొక్క సైనికుడు కాపలావున్నాడు.

ఆపిల్‌ చెట్టు వద్ద, కాళ్లు పట్టుకుని శిశువును తలకిందులుగా వేలాడదీశాడు సైనికుడు. ''ఆ పసికూన ఏం పాపం చేశాడని శిక్షిస్తారు?'' అంటూ కాళ్లమీద పడ్డారు తల్లిదండ్రులు.

హేళనగా నవ్వుతూ ఖడ్గంతో ఒక్కవేటు వేశాడు సైనికుడు.

తలతెగి కిందపడింది. ఆకుపచ్చని గడ్డిమీద ఎర్రటి నెత్తురు వ్యాపించింది. చుట్టూ మూగిన జనం హాహాకారాలు చేశారు. కొడుకు మొండెం తీసుకుని పరిగెత్తింది తల్లి. కోపం ఆపుకోలేని కొందరు సైనికుల మీదికి రాళ్లు రువ్వారు. సైనికులకు యిదో పరిహాసంగా తోచింది. వలలో చిక్కిన జంతువులు ఎంత గింజుకున్నా తప్పించుకోలేవని వాళ్లకు తెలుసు. పెద్దలమీద ప్రతీకారం తీర్చుకోవాలంటే పిల్లల్ని వధించడమొక్కటే మార్గం. ఇళ్లలో దూరి, గదులన్నీ వెతికి, ఎక్కడెక్కడో దాచిన శిశువుల్నీ ఎత్తుకువచ్చారు. తల్లిదండ్రులు, బంధువులు ఎంత అరచి మొత్తుకున్నా లాభం లేదు.

ఆదివారం చర్చిలో పండగ వాతావరణం వుంటుంది. మంచి దుస్తుల్లో ముస్తాబయినారు ఆడ, మగపిల్లలు. ఎల్మ్‌వృక్షం చుట్టూ వాళ్లను నిల్చోబెట్టారు సైనికులు. లేత శరీరాలు. ఇంకా నడక నేర్చుకుంటున్న బుడతలు. మరణమంటే ఏమిటో కూడా వూహించలేని అమాయక ప్రాణులు. తల తెగటానికి ఒక్క వేటు చాలు.

ఈ ఘోరం చూడలేని గ్రామస్తులు ఇళ్లల్లోకి పరిగెత్తి తలుపులేసుకున్నారు. ప్రీస్టు నాయకత్వంలో మరికొందరు స్పేనియార్డుల ముందర మోకరిల్లి రక్షించమని ప్రార్థించారు. కన్నబిడ్డల మొండేలను ఒళ్లో పెట్టుకుని రోదించారు తల్లులు. సైనికులకు ఒక పెద్ద వంటశాల కనిపించింది. ఆరోజు వూళ్లో విందు కాబోలు. రకరకాల తినుబండారాలు, మద్యం, మాంసాలు టేబుళ్లమీద గుట్టలు గుట్టలుగా పేర్చి వున్నాయి. కొందరు పిల్లలక్కడ మిఠాయిలు తింటున్నారు. వాళ్లందర్నీ బుజాలమీద వేసుకుని ఎల్మ్‌వృక్షం వద్దకు చేరుకున్నారు సైనికులు. ఆ తర్వాత గ్రామస్తుల సమక్షంలో ఒక్కొక్కర్నీ కత్తులతో, బల్లాలతో పొడిచి చంపారు.

ప్రీస్టు నిస్సహాయంగా, చేతులెత్తి పైకిచూస్తూ ఈ దారుణానికి అంతెప్పుడని ప్రార్థించాడు. ఒక్కొక్క వరుసలో ఇద్దరు, ముగ్గురు, చొప్పున కవాతు చేస్తూ ఇళ్లలో మగవాళ్లందర్నీ బైటికి లాగారు సైనికులు.

కొందరు, ఎవరూ తెలుసుకోలేరని నేలమాళిగల్లో నక్కారు. కానీ గోడల్ని పగలగొట్టి మరీ వెదికే నరహంతకుల నుండి ఎవరు తప్పించుకోగలరు!

సంతానం లేని గ్రామస్తులకు కూడా ఆ దృశ్యాలు చూసి కడుపులో దేవినట్త్లెంది. కత్తులతో, శూలాలతో ఎడాపెడా నరికేస్తున్నారు, పొడిచేస్తున్నారు నలుసుల్ని. అంతా భగవదేచ్ఛ అనుకోవటం తప్ప చెయ్యగలిగిందేముంది. ఎరుపు, గులాబీ, తెలుపు రంగుల్లో పిల్లల ఫ్రాకులు గడ్డిలో చెల్లాచెదరుగా పడివున్నాయి. భయంతో అందరూ కిక్కురుమనకుండా నిల్చున్నారు. కుక్కలు మాత్రం విసుగూ విరామం లేక మొరుగుతూనే వున్నాయి.

ఎరువుల కుప్పమీద కూర్చున్న బట్టతల ముసలాడొకడు నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చాడు. మరొక స్త్రీ స్పృహతప్పి పేర్‌ వృక్షం కింద పడిపోయింది. చేతులు తెగిన పిల్లల్ని ఎలా ఎత్తుకోవాలో తెలియక తల్లడిల్లిందొక తల్లి.

ఈ భీభత్స వాతావరణంలో ప్రాణాలకు తెగించిన కొందరు చేతికి దొరికిన కర్రా, పలుగూ పట్టుకుని సైనికులనెదుర్కొన్నారు. ఎదిరించి నిల్చిన వాళ్లంటే ఎవరికైనా భయమే. సైనికులు, గ్రామస్తులను తప్పించుకుని, చెట్లెక్కి, చర్చి ప్రహరీగోడ దూకి, లోపలివాళ్లను సంహరిద్దామనుకున్నారు. కానీ అక్కడ పోగైన స్త్రీలు, వృద్ధులు వీళ్ల మీదికి స్టూళ్లు, ప్లేట్లు, గరిటెలు, చెంబులు, గ్లాసులు- ఏది దొరికితే అది విసిరేశారు.

ఊరి చివర ఒక ముసలావిడ మనవడికి చిన్న టబ్బులో స్నానం చేయిస్తున్నది. అటుగా వచ్చిన సైనికులు ఆ టబ్బునెత్తుకుని వెళ్లారు. మాంసం కొట్లో కూర్చున్న కసాయి తన కూతురికేవో కబుర్లు చెబుతున్నాడు. అతని కళ్లముందే వాళ్లు గొర్రెను కోసినట్టుగా ఆ పిల్ల మెడ నరికేశారు.

మృత్యువు తన కళ్లముందే తాండవిస్తుంటే ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు? కేవలం పిల్లల్ని నిశ్శేషంగా నిర్మూలించే ఈ వింత పగ పెద్దల్ని కూడా దహించివేసింది. కత్తిని మెడమీద పెట్టినప్పుడు కూడా అదో ఆటవస్తువనుకుని ఆడుకునే అమాయకులు కదా పిల్లలు!

ఆ వూరికో రాజు లేకపోలేదు. సిల్కు గుడ్డల్లో, సకలాభరణాలు ధరించి, బురుజెక్కి ఈ హత్యాకాండను ఆసక్తిగా పరికిస్తున్నాడతను.

గ్రామస్తులంతా వెళ్లి కోటగోడకు మోకరిల్లారు. శత్రువులనుండి తన ప్రజలను రక్షించవలసిన వాడే నిల్చుని తమాషా చూస్తే ఎలా? కాని, అతడు వీళ్ల ప్రార్థనలు తిరస్కరించి, నిస్సహాయంగా చేతులు పైకెత్తాడు.

ఆవిధంగా శిశుసంహారం ముగించిన సాయుధులు, తమ ఖడ్గాలను గడ్డితో శుభ్రంచేసుకుని, పేర్‌ వృక్షాల కింద భోజనం ముగించుకుని, మళ్లీ గుర్రాలెక్కి, రాతివంతెన దాటి నజారెత్‌ నుండి నిష్క్రమించారు.

సూర్యాస్తమయమైంది. నేలా, ఆకాశం అని తేడాలేక, అంతటా ఎరుపురంగు అలుముకుంది. పిల్లల మొండాలతో కొందరు, యితర శరీర భాగాలతో కొందరు స్త్రీ పురుషులు, వృద్ధులు శోకంతో శిలలుగా మారారు. అదీ ఆనాటి నజారెత్‌ చిత్రం.

మృత్యువు కబళించిన మరుసటిరోజు కూడా తెల్లవారుతుంది. బకెట్లకొద్దీ నీళ్లుపోసి నేలంతాశుభ్రం చేశారు. బెంచీల మీద, కుర్చీలమీద నెత్తుటి మరకలు కడిగారు.

చంద్రబింబం కనుమరుగై, అరుణ కాంతులతో సూరీడు కొత్తజీవితానికి నాంది పలికాడు.

No comments: