Thursday, September 27, 2007

నేర పరిశోధకుడు అమెరికన్‌ కథ

హోస్టన్‌ నగర ప్రముఖుల వివరాలను తెలిపే పుస్తకంలో థామస్‌ కీలింగ్‌ పేరు లేదు. ఒక నెల కిందట కీలింగ్‌ తన నేరపరిశోధన వృత్తిని వదులుకొని మరో ప్రదేశానికి వెళ్ళకుండా ఉంటే, ఈపాటికి ఆయన పేరు కూడా ఆ పుస్తకంలో ఉండేదే.
కీలింగ్‌ కొంత కాలం కిందట హోస్టన్‌ నగరానికి వచ్చి, ఒక నేరపరిశోధన కార్యాలయాన్ని ప్రారంభించాడు. ఒక డిటెక్టివ్‌గా స్థానిక ప్రజలకు తన సేవలను ఒక పద్ధతిలో అందించడం ప్రారంభించాడు. ఆయన పెద్ద ప్రమాదకరమైన కేసుల్ని కాకుండా సాధారణ కేసుల్ని మాత్రమే చేపట్టేవాడు.

యజమాని తన దగ్గర పనిచేసేవారి వివరాలను రహస్యంగా తెలుసుకోవాలన్నా, అనుమానపు భార్యలు తమ భర్తల గురించి ఆరా తీయాలన్నా కీలింగ్‌ చక్కని సేవలను అందించేవాడు.

ఆయన చూడడానికి నెమ్మదస్తుడిగా, కష్టించి పనిచేసే వ్యక్తిలా కనిపించేవాడు. ఆయనెప్పుడూ ప్రముఖ రచయిత కానన్‌ డయల్‌ సృష్టించిన డిటెక్టివ్‌ షెర్లాక్‌ హోమ్స్‌ కథలు చదువుతుండేవాడు. హోస్టన్‌కు రాకముందు తూర్పున ఉన్న ఒక నగరంలో ఒక పెద్ద నేరపరిశోధన సంస్థలో కీలింగ్‌ గుమస్తాగా పనిచేసేవాడు. అక్కడ పదోన్నతి పొందడం కష్టమవడంతో ఆయన ఆ పని వదులుకొని తను కూడబెట్టుకున్న తొమ్మిది వందల డాలర్లతో హోస్టన్‌కు వచ్చాడు. ఇక్కడ ఒక చిన్న వీధిలోని ఒక ఇంట్లో పైభాగాన్ని అద్దెకు తీసుకొని, తన సొంత నేరపరిశోధన కార్యాలయాన్ని ప్రారంభించాడు. షెర్లాక్‌ హోమ్స్‌ కథలు చదువుకుంటూ కస్టమర్స్‌ కోసం ఎదురుచూసేవాడు.

ఒకరోజు కీలింగ్‌ కార్యాలయానికి ఇరవై ఆరేళ్ళ యువతి వచ్చింది. సన్నగా, పొడుగ్గా, చక్కటి వస్త్రధారణతో ఉంది. ఆమె తన మొఖం మీద కళ్ళు, ముక్కు సగంవరకు కప్పేలా సన్నని మేలిముసుగు వేసుకొంది. తలపై టోపీ ఉంది. ఆమె కీలింగ్‌ ఎదుట కూర్చుంటూ తన మేలిముసుగును టోపీ పైకి నెట్టింది. ఆమె ముఖం నాజుగ్గా, కాంతివంతంగా ఉంది. కళ్ళు చురుగ్గా ఉన్నాయి. కానీ ఆమె కొంచెం ఆందోళనగా ఉన్నట్టు కనిపించింది.

''మీరు నాకు అంతగా పరిచితులు కారు. కాబట్టి నేను మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను. నేను మీకు చెప్పే నా వ్యక్తిగత విషయాన్ని నా సన్నిహితులతో, స్నేహితులతో పంచుకోలేను. నేను మిమ్మ ల్ని నా భర్త కదలికల్ని గమనించడానికి నియమించాలనుకుంటున్నాను. ఈ విష యం మాట్లాడడానికి నాకు ఎంతో బాధగా ఉంది. కానీ తప్పదు. నా భర్త నన్ను ప్రేమించడం లేదనిపిస్తోంది. ఆయన ఇంకొక స్త్రీ పట్ల ఆకర్షితులవుతున్నారని పిస్తోంది. మా వివాహం కాకముందు ఆయన తను అద్దెకుంటున్న ఇంటి యజమానురాలి కూతుర్ని ప్రేమించారట. కానీ మా వివాహం అయిన తర్వాత ఈ అయిదేళ్ళూ మేమిద్దరం హాయిగానే ఉన్నాం. ఈ మధ్య ఆ స్త్రీ హోస్టన్‌కు వచ్చింది. అప్పటినుంచి నా భర్త మారిపోయారు. ఎక్కువ సమయం ఆమెతోనే గడుపుతున్నారు. మీరు వారిద్దరి కదలికలనీ గమనించి నాకు తెలియచేయాలి. రేపు ఇదే సమయానికి మీ కార్యాలయానికి వస్తాను. అన్నట్టు నా పేరు మిసెస్‌ ఆర్‌. నా భర్త మిస్టర్‌ ఆర్‌. ఈ పట్టణంలో నగల దుకాణాన్ని నడుపుతున్నారు. నేను మీ సేవలకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాను. ముందుగా ఈ ఇరవై డాలర్లు ఉంచండి'' అంటూ ఆమె ఇరవై డాలర్ల నోటు కీలింగ్‌ కిచ్చింది.

ఇలా రోజూ డాలరు నోట్లు తీసుకోవడం తనకు చాలా సహజం అన్నట్టు కీలింగ్‌ ఆ నోటును చాలా నిర్లక్ష్యంగా అందుకున్నాడు.

తర్వాత కీలింగ్‌ తనకు అప్పగించిన పనిని నిర్వహిస్తానని ఆమెకు భరోసా ఇచ్చాడు. తను సేకరించిన సమాచారం తెలుసుకోవడానికి రెండవరోజు సాయంకాలం నాలుగు గంటలకు ఆమెను రమ్మని చెప్పాడు.

రెండోరోజు ఉదయం కీలింగ్‌ తన దర్యాప్తు ప్రారంభించాడు. ఆర్‌ నగల దుకాణం కనుక్కొన్నాడు. ఆయనకి దాదా పు ముఫ్పై అయిదేళ్ళు ఉండొచ్చు. చూడ్డానికి మనిషి మర్యాదస్తుడిలా, శ్రమించి పనిచేసేవాడిలా కనిపించాడు. ఆయన దుకాణంలో మేలైన వజ్రాలు, నగలు పొందికగా అమర్చి ఉన్నాయి. కీలింగ్‌ తన దర్యాప్తులో మిస్టర్‌ ఆర్‌ మంచి వ్యక్తి అనీ, తాగుడు, ఇతర వ్యసనాలు అతడికి లేవని తెలుసుకొన్నాడు.

కీలింగ్‌ మధ్యాహ్నం వరకు ఆ నగల దుకాణం చుట్టుపక్కలే తచ్చాడాడు. చివరకు అతడి శ్రమ ఫలించింది. నల్లని జుట్టుతో, అందమైన దుస్తులు ధరించిన ఒక యువతి ఆ దుకాణంలోకి ప్రవేశించింది. ఆమెను చూడగానే ఆర్‌ ఆమె దగ్గరకు వచ్చాడు. ఇద్దరూ కొంచెంసేపు ఏదో మాట్లాడుకున్న తర్వాత ఆర్‌ ఆమెకు కొంత డబ్బిచ్చాడు. తర్వాత ఆమె దుకాణం బయటకు వచ్చి వీధిలో గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.

ఆరోజు సాయంకాలం మిసెస్‌ ఆర్‌ కీలింగ్‌ కార్యాలయానికి వచ్చింది. కీలింగ్‌ తను చూసిన సంగతులన్నీ ఆమెకు వివరించాడు.

''ఆమెనే, ఆ నల్లజుట్టు వగలాడి. నా భర్త బాహాటంగా ఆమెకు డబ్బులిచ్చేవరకు వచ్చిందన్నమాట వ్యవహారం'' అని కళ్ళొత్తుకుంది ఆమె బాధగా.

''ఈ విషయంలో మీరేం చేయదలచుకున్నారు? నన్నింకా ఏం దర్యాప్తు చేయమంటారు?'' కీలింగ్‌ ఆమెను అడిగాడు.

''నేనింతకాలం అనుమానిస్తున్న సంగతిని, నా కళ్ళతో చూసి నిర్ధారించుకోవాలి. అంటే నేను వాళ్ళిద్దరూ కలిసి ఉండగా పట్టుకోవాలి. అప్పుడు ఒకరిద్దరు సాక్షులుండడం కూడా అవసరమే. నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను. ఇటువంటి భర్తతో ఈ దౌర్భాగ్యపు జీవితాన్ని నేనింక జీవించలేను'' మిసెస్‌ ఆర్‌ ఆవేశంగా అంది.

ఆమె కీలింగ్‌ చేతిలో పది డాలర్ల నోటు పెట్టింది. రెండోరోజు మిసెస్‌ ఆర్‌ కీలింగ్‌ కార్యాలయానికి వచ్చింది.

ఆ రోజు దర్యాప్తు వివరాలను ఆయన ఆమెకు చెప్పాడు. ''నేనీరోజు మళ్ళీ మీ వారి దుకాణానికి వెళ్ళాను. ఇవ్వాళ కూడా ఆ యువతి వచ్చింది. ఆమె మీవారితో, 'చార్లీ, ఈ రోజు రాత్రికి మనం ఏదైనా హోటల్లో భోజనం చేద్దాం. మళ్ళీ దుకాణానికి వచ్చి కొంచెంసేపు కబుర్లు చెప్పుకుందాం. కబుర్లు చెప్పుకుంటూనే నువ్వు నగలలో వజ్రాలు పొదిగే పని కూడా చేసుకోవచ్చు' అంది.

''మేడమ్‌, మీరు వాళ్ళిద్దర్నీ ఒకేసారి పట్టుకోవాలంటే ఈ రాత్రే మంచిది'' అన్నాడు కీలింగ్‌.

''పిశాచి'' మిసెస్‌ ఆర్‌ పళ్ళు కొరికింది.

''ఈ రోజు రాత్రి కలసి భోజనం చేద్దామంటే కుదరదు, తనకు చాలా పని ఉందని చెప్పాడు. ఇదన్న మాట మా ఆయన వెలగబెడుతున్న పని'' కోపంగా అంది.

''వాళ్ళిద్దరూ హోటల్‌కు వెళ్ళినపుడు మీరు వెనుక ద్వారంగుండా దుకాణంలోకి ప్రవేశించి దాక్కోండి. వాళ్లు మళ్ళీ దుకాణంలోనికి వచ్చి మాట్లాడుకుంటున్నపుడు సమయం చూసి మీరు హఠాత్తుగా వాళ్ల ముందు ప్రత్యక్షమవ్వండి. దాంతో వారి ఆటకట్టు'' కీలింగ్‌ చెప్పిన పథకం ఆమెకు నచ్చింది.

''మీరు చెప్పింది చాలా బాగుంది. మా దుకాణం ఉన్నచోట విధులు నిర్వహించే ఒక పోలీస్‌ మా కుటుంబానికి సన్నిహితుడు. అతడు రాత్రిపూట ఆ పరిసరాల్లోనే గస్తీ తిరుగుతూ ఉంటాడు. అతడి పేరు చెప్తాను. మీరు ఒకసారి అతణ్ణి కలుసుకొని సంగతంతా వివరించి, నేను మా ఆయన్ని, ఆయనగారి ప్రియురాలిని వలవేసి పట్టుకొన్నప్పుడు మీతోపాటు సాక్షిగా ఉండమని చెప్పండి'' మిసెస్‌ ఆర్‌ కీలింగ్‌ను ప్రాధేయపడుతున్నట్టుగా అడిగింది.

''నేనా పోలీసుతో మాట్లాడతాను. మీరు మాత్రం చీకటి పడకముందే నా కార్యాలయానికి వచ్చేయండి. అప్పుడు మన పథకానికి తుదిరూపం ఇవ్వొచ్చు'' అన్నాడు కీలింగ్‌.

డిటెక్టివ్‌ కీలింగ్‌ మిసెస్‌ ఆర్‌ చెప్పిన సదరు పోలీసును వెదికి పట్టుకొన్నాడు. పరిస్థితినంతా అతడికి వివరించాడు.

''గమ్మత్తుగా ఉందే, నాకు తెలిసినంతవరకు మిస్టర్‌ ఆర్‌ అంత విలాసపురుషుడు కాడే. అయినా ఈ రోజుల్లో ఎవరి గురించీ ఏమీ చెప్పలేం. అయితే మిసెస్‌ ఆర్‌ అతణ్ణి ఈ రోజు రాత్రి వలవేసి పట్టుకోబోతోందన్నమాట. సరే, దుకాణానికి వెనకవైపు ఒక చిన్నగది ఉంది. ఆర్‌ అందులో నగల్లో వజ్రాలు పొదగడానికి బొగ్గులు, పాతపెట్టెలు పెడతాడు. మీరు ఆ గది గుండా ఆమెను దుకాణంలోకి పంపితే ఆమె ఎక్కడైనా దాక్కొని వారి మాటలు వినొచ్చు. ఇలాంటి విషయాల్లో తల దూర్చడం నాకు అంతగా ఇష్టం ఉండదు. కానీ మిసెస్‌ ఆర్‌ అంటే నాకు సానుభూతి ఉంది. ఆమె నాకు బాల్యం నుండి పరిచయం. ఆమె కోరుకున్న సాయం చేయడానికి నేను సిద్ధమే'' అంటూ అంగీకరించాడు ఆ పోలీసు

సాయంత్రమవుతూనే కీలింగ్‌ కార్యాలయానికి మిసెస్‌ ఆర్‌ వచ్చింది. ఆమె నల్లటి దుస్తులు ధరించింది. తలపై నల్ల టోపీ పెట్టుకొని ముఖం మీద మేలిముసుగు కూడా వేసుకొంది.

''ఇప్పుడు నా భర్త నన్ను చూసినా గుర్తు పట్టలేడు'' అంది ఆమె. కీలింగ్‌, మిసెస్‌ ఆర్‌ నగల దుకాణం ముందు పచార్లు చేస్తున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు వాళ్లు ఎదురు చూస్తున్న ఆ స్త్రీ దుకాణంలోకి వెళ్ళింది. కొద్దిసేపట్లో ఆర్‌, ఆమె కలసి బయటకు వచ్చి, దుకాణానికి తాళంవేసి ముందు అనుకున్నట్లుగానే భోజనం చేయడానికి హోటల్‌కు బయలుదేరారు.

తన చేయి పట్టుకున్న మిసెస్‌ ఆర్‌ చేయి వణకడం కీలింగ్‌ గమనించాడు.

''దెయ్యం! నేనీయనగారి కోసం ఇంటి దగ్గర అమాయకంగా పడిగాపులు పడుతుంటాను. ఆయనేమో ఈ వగలాడితో ఇలా షికార్లు కొడుతున్నాడు'' మిసెస్‌ ఆర్‌ కసిగా అంది.

ఆమె, కీలింగ్‌ దుకాణం వెనకవైపుకి వెళ్ళారు. వెనక ఉన్న చిన్నగది తెరిచే ఉంది. ఆ గదిలో నుండి దుకాణంలోకి వెళ్ళే తలుపులకు తాళం వేసి ఉంది. కీలింగ్‌ తన దగ్గర ఉన్న తాళాల గుత్తిలో నుండి ఒక తాళంతో ఆ తాళం కప్పను తెరిచాడు. ఇద్దరూ నగల దుకాణంలోకి వెనుక వైపునుండి ప్రవేశించారు.

''అదిగో అక్కడ... ఆ టేబుల్‌ కింద వరకూ పెద్ద బట్టతో కప్పి ఉంది. నేను లోపలినుంచి గడియ వేసుకొని ఆ బల్లకింద దాక్కొంటాను. మీరు మా ఆయన్ని, ఆ స్త్రీని వెంబడించండి. వాళ్లిద్దరూ భోజనం ముగించుకొని మళ్లీ దుకాణంలోనికి ప్రవేశించాక మీరు వెనక వైపు వచ్చి ఈ తలుపు మీద మూడుసార్లు తట్టండి. ఆ సంకేతంతో వాళ్ళు దుకాణంలోకి ప్రవేశించారని నాకు తెలుస్తుంది. కొంతసేపు వాళ్ల సంభాషణ విన్నాక నేను గడియ తెరుస్తాను. అప్పుడు మీరు, నేను, పోలీస్‌ హఠాత్తుగా వాళ్ళ ముందు ప్రత్యక్షమవుదాం. మీరు మాత్రం నా పక్కనే ఉండాలి. వాళ్లిద్దరూ కలిసి నన్నేమైనా చెయ్యవచ్చు'' మిసెస్‌ ఆర్‌ కీలింగ్‌కు వివరించింది.

కీలింగ్‌ నగల వ్యాపారిని, అతడితో ఉన్న స్త్రీని వెంబడించాడు. వాళ్ళిద్దరూ హోటల్లోకి వెళ్లి భోజనం చేసి బయటకు వచ్చే వరకు కీలింగ్‌ హోటల్‌ బయటే తచ్చాడాడు. వాళ్లు బయటకు రాగానే కీలింగ్‌ వాళ్ళకంటే ముందు దుకాణం వెనుక వైపు వెళ్లి తలుపు మీద మూడుసార్లు తట్టాడు.

కొంతసేపటికి వాళ్లిద్దరూ దుకాణంలోకి ప్రవేశించినట్టుగా లోపల దీపాలు వెలిగాయి. కీలింగ్‌ మళ్లీ వీధి వైపు వచ్చి కిటికీ గుండా వాళ్లిద్దర్నీ గమనించడం ప్రారంభించాడు. ఆర్‌ తన నగల పని చేసుకుంటూ ఆమెతో మాట్లాడుతున్నాడు.

''వాళ్ళకు ఇంకొంచెం సమయం ఇద్దాం'' అనుకుంటూ కీలింగ్‌ వీధిలోకి వచ్చాడు.

వీధి మలుపులో పోలీస్‌ నిలబడి ఉన్నాడు. మిసెస్‌ ఆర్‌ నగల దుకాణంలో బల్ల కింద దాక్కొని ఉందని, పథకం అంతా అనుకున్నట్టే జరుగుతోందని కీలింగ్‌ పోలీసుకు చెప్పాడు.

''పదండి, మనిద్దరం దుకాణం వెనక్కి వెళ్దాం. మిసెస్‌ ఆర్‌ తలుపు తీసే సమయానికి మనమూ అక్కడ ఉండాలిగా. కీలింగ్‌, పోలీసుతో అన్నాడు.

ఇద్దరూ దుకాణం వెనుక వైపుకు బయలుదేరారు. వెళ్తూ వెళ్తూ పోలీసు ఒకసారి కిటికీలో నుంచి లోపలికి చూశాడు.

''వాళ్లిద్దరికీ సయోధ్య కుదిరినట్టుంది. మరి ఆ స్త్రీ ఎక్కడుంది?'' కీలింగ్‌ను అడిగాడు పోలీసు.

''ఆ స్త్రీయే కదా ఆర్‌తో మాట్లాడుతోంది'' కీలింగ్‌ అన్నాడు.

''నేను ఆర్‌తో భోజనానికి వెళ్ళిన మహిళ గురించి అడుగుతున్నాను'' పోలీసు మళ్లీ అడిగాడు.

''నేను ఆమె గురించే చెపుతున్నాను'' కీలింగ్‌ సమాధానమిచ్చాడు.

''మీరు ఏదో గందరగోళ పడుతున్నట్టున్నారు. ప్రస్తుతం ఆర్‌ గారితో మాట్లాడుతున్న మహిళ ఎవరో మీకు తెలుసా?'' పోలీసు రెట్టించాడు.

''ఆమెనే ఆర్‌తో కలిసి భోజనానికి వెళ్లిన మరో స్త్రీ''

''కాదు, ఆర్‌ భార్య. నేను ఆమెను పదిహేనేళ్ళ నుండి ఎరుగుదును'' పోలీసు నొక్కి వక్కాణించాడు.

''అయితే, అయితే ఓరి భగవంతుడా! నగల దుకాణంలో బల్లకింద దాక్కున్నది ఎవరు?'' కీలింగ్‌ హతాశుడయ్యాడు.

కీలింగ్‌ కంగారుగా నగల దుకాణం తలుపు తట్టాడు.

ఆర్‌ తలుపు తీశాడు. పోలీస్‌, డిటెక్టివ్‌ లిద్దరూదుకాణంలోకి చొచ్చుకుపోయారు.

''బల్లకింద చూడండి'' కీలింగ్‌ అరుస్తున్నాడు.

బల్ల కిందివరకూ కప్పి ఉన్న బట్టను తీసి చూశాడు పోలీస్‌. నల్ల దుస్తులు, నల్ల మేలి ముసుగు, ఒక నల్ల విగ్‌ కనిపించాయి. వాటిని బయటకు తీశాడు.

''ఈమె, ఈమె మీ భార్యేనా'' కీలింగ్‌ అనుమానం తీరనట్టు ఆర్‌ని అడిగాడు.

''అవును, కానీ మీరు చేస్తున్నదేమిటి? తలుపులు నెట్టుకొని దుకాణంలోకి వచ్చి వెదుకులాట ఏమిటి?'' ఆర్‌ కోపాన్ని అణుచుకుంటూ మర్యాదగానే అడిగాడు.

''మీ దుకాణం షోకేస్‌లో చూసుకోండి. ఏమీ పోలేదుగా?'' పోలీసు అన్నాడు.

చూస్తే, పోయిన వజ్రాలు, నగల విలువ ఎనిమిది వందల డాలర్లు. రెండవ రోజు డిటెక్టివ్‌ కీలింగ్‌ ఆ సొమ్మును నగల వ్యాపారికి చెల్లించాడు. అతడికి ఏదో సర్ది చెప్పాడు.

ఆ రోజు రాత్రి కీలింగ్‌ తన కార్యాలయంలో కూర్చొని నేరస్థుల ఫొటోలతో, వివరాలతో ఉన్న ఆల్బమ్‌ను వెదికాడు.

చివరకు ఆయనకు కావాల్సింది దొరికింది. ఎంతో మృదువైన ముఖంతో ఉన్న ఒక దొంగ ఫొటో కింద ఈ వివరాలు ఉన్నాయి.

జేమ్స్‌. హెచ్‌.మిగిల్స్‌ ఉరఫ్‌ స్లిక్‌ సైమన్‌ ఉరఫ్‌ వితంతువు.ఉరఫ్‌ బంకో కేట్‌ ఉరఫ్‌ జిమ్మీ స్నేక్‌.

నేరాలు చేసే పద్ధతి: ముందు కొంత కాలం నమ్మకంగా వ్యవహరించి తర్వాత దొంగతనాలు చేయడం. స్త్రీలాగ మారు వేషాలు వేసుకొని నేరాలు చేస్తాడు. చాలా ప్రమాదకరం. కాన్సాస్‌ న్యూ ఆర్లెవెన్స్‌ ఇంకా ఇతర పట్టణాల పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న వారి జాబితాలో ఉన్నాడు.

అందుకే థామస్‌ కీలింగ్‌ హోస్టన్‌లో తన డిటెక్టివ్‌ వృత్తిని కొనసాగించలేకపోయాడు. అందుకే ఆయన పేరు హోస్టన్‌ నగర ప్రముఖుల వివరాలున్న పుస్తకంలో లేదు.

No comments: