సినిమా ముగిసింది.
న్యూయార్క్ రీగల్ థియేటర్లో సినిమా చూసిన ముగ్గురిలో, దిగువ వరుసన కూర్చున్న రాజు హాల్ లోంచి బైటకి రాగానే చల్లని గాలి అతనిని తాకింది. త్వరత్వరగా రెండడుగులు వేసి దగ్గరగా ఉన్న బౌడీన్ కాఫీ హౌస్‌లోకి జొరబడ్డాడు. ఒక క్రోసాంట్, ఓట్మీల్కుకీ, కాఫీతో ఒక మూల సోఫాలో చతికిలపడ్డాడు రాజు.
బైట మంచు కురవడానికి సిద్ధంగా ఉంది. సాయంకాలం దాదాపు ఐదు గంటలయింది. న్యూయార్క్ పట్టణంలో మంచు కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలియపరచగానే, భయపడి కాబోలు దాక్కోవడానికి సూర్యుడు తొందరగా పారిపోయాడు.
సినిమాహాల్లో ముగ్గురే ప్రేక్షకులు ఉన్నా సినిమా ప్రదర్శించారు. 'థియేటర్ యజమానికి ఎంత నష్టమో!' అనుకుంటుంటే తనతో సినిమా చూసిన మిగతా ఇద్దరు ప్రేక్షకులూ చలికి వణుకుతూ రాజు కూర్చున్న బౌడీన్ రెస్టారెంట్లోకి ప్రవేశించారు. లోపలికి వచ్చిన ఇద్దరూ దాదాపు అరవైఏళ్ల వయస్కులే. ఒకవ్యక్తి బలంగా, గుబురు మీసాలతో ఉంటే, రెండోవ్యక్తి పొడవుగా, రివటలా ఉన్నాడు. ఇద్దరూ కౌంటర్ దగ్గర ఆగి తినుబండారాలు కొనుక్కుని, రాజు కూర్చున్న వరుసకి ముందర ఉన్న వరుసలో సర్దుకున్నారు.
''అబ్బ! ఈ వాతావరణం వలనో ఏమో కాని భలే ఆకలిగా ఉంది'' అన్నాడు గుబురు మీసాల వ్యక్తి. ''కమాన్ స్మిత్. ఈ డైలాగ్ పాతదే. నీకు కాస్త ఆకలి ఎక్కువ'' అన్నాడు రివటలా ఉన్న వ్యక్తి.
''ఐ ఎగ్రీ. నువ్వు చెప్పిన దాంట్లో నిజం ఉన్నా, ఈవేళ మరీ ఎక్కువ ఆకలిగా ఉంది జాన్'' అంటూ తెచ్చుకున్న టిఫిన్‌ని కొరికాడు స్మిత్.
''ఇంతకీ ఫెలీనీ ఇటలీ చేరాడా, లేదా? డైరెక్టర్ మనల్ని సస్పెన్స్‌లో ఉంచి సినిమా ముగించాడు'' అనడిగాడు స్మిత్.
''ఏదేమైనా, చెప్పవలసిన దానిని డైరెక్టర్ చెప్పాడు. విచిత్రమైన సినిమా కదూ?'' అన్నాడు జాన్. వెనుక వరుస సోఫాలో కూర్చున్న రాజుకి స్మిత్, జాన్‌ల సంభాషణ స్పష్టంగా వినిపిస్తోంది. రాజు కళ్ల ముందర చూసిన సినిమా కదలాడింది.
ఇటలీలో అనాధ అయిన ఫెలీనీ చదువుకోసం స్కాలర్షిప్ మీద అమెరికా వస్తాడు. చదువు తొందరగా ముగించి, డిగ్రీ చేతికి వచ్చాక నేపిల్స్ దగ్గర తను పెరిగినచోటుకి వెళ్లిపోదామన్న బలమైన కోర్కె ఉన్నవాడు. ఇటలీలో అతనిని చేరదీసినవారు కాని, కరుణ చూపించినవారు కానిలేరు. గది అద్దెకి ఇచ్చిన యజమాని, నడిచి వెళ్లేటప్పుడు ఆ వీధిలో నివసించే మనుషులు ముక్తసరిగా పలకరించి చిరునవ్వు ప్రదర్శించేవారు తప్ప ఇంకెవరూ తెలియదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఫెలీనీ నిజంగా ఒంటరివాడు. కానీ కాలం అతనికి కొండంత నిబ్బరాన్ని ప్రసాదించింది. చదువులో అందరికన్నా ముందర ఉంటూ తమతో కలవని ఫెలీనీ అంటే అతని తోటి విద్యార్థులకి రవ్వంత కోపం, ఈర్ష్య. ఇటలీలో పెరిగినప్పుడు తిండి సరిగ్గాలేక అలమటించిన ఫెలీనీ శరీరానికి, కారు చవుకగా లభించే అమెరికన్ తిండి, మొక్కకి ఎరువులా పనిచేయడంతో అమెరికా చేరిన ఒక్క నెలలోనే దృఢత్వం నిగారింపువచ్చాయి. పెద్దకళ్ళు, బలమైన నాసిక, చెక్కినట్లున్న చెక్కిళ్లతో విప్పారి ఉన్న ఫెలీనీ ఏ విధంగా చూసినా అందగాడు. ఎవ్వరితోనూ కలవకుండా తనపని తాను చేసుకుపోయే ఫెలీనీ తోటి విద్యార్ధినులకి ఒకవింత, ఒక ఆకర్షణ, అందమూ చందమూలేదని ముకుళించుకుని ఉన్న కుర్రాళ్ళ సంగతి సరే, కాని ఈ అందగాడు తెలివైనవాడు, ఎలాంటి వ్యసనాలు లేనివాడు అందరికీ దూరంగా మసలడంతో ఎవరకీ అర్ధమవడు. అతని మీద చర్చ వచ్చినప్పుడు, బహుశా అతను ''స్వలింగ సంపర్కుడేమో'' అన్న అనుమానం కొందరికి వచ్చినా, 'ఛ' అలా కాకూడదు అనుకుంటారు.
రెండు సెమిస్టర్లు గడిచాయి.
మూడవ సెమిస్టర్లో ఒక ప్రొఫెసర్ ఇరవై నలుగురు ఉన్న క్లాసుని నలుగురు చొప్పున ఆరు గ్రూపులుగా విభజించి గ్రూప్ ప్రాజెక్ట్‌లు చేయమని నిర్దేశించినపుడు జార్జియా ఫెలీనీకి పరిచయం అవుతుంది. గ్రీస్‌లో ఉన్న ఒక ప్రముఖ ధనవంతుల పిల్ల జార్జియా. చెంపకి చేరడేసి కళ్ళతో, పండిన చెర్రీ రంగు పెదిమలతో, అవసరమున్నా లేకపోయినా మొహం మీద తారట్లాడే జుత్తుని వెనక్కివిదిలిస్తూ, ఫెలీనీ ఉచ్చరించిన ప్రతీవాక్యానికి స్పందించినట్లు ప్రవర్తించి అతని దృష్టిని ఆకర్షిస్తుంది. జీవితంలో ఎవ్వరూ పట్టించుకోని ఫెలీనీ, జార్జియా తన పట్ల ప్రదర్శిస్తున్న ఆసక్తికి ముగ్ధుడవుతాడు. చిన్న గుడి కట్టుకుని దానిలో గుట్టుగా నివసిస్తున్న ఫెలీనీని ఉక్కిరిబిక్కిరి చేసి అతని గుడిని తుత్తునియలు చేస్తుంది జార్జియా. తన ప్రభావ ప్రవాహంతో వరద నీటిలో కొట్టుకుపోయే చిన్న రాయిలా, తన మోహంలో శ్లేష్మంలో పడిన ఈగలా ప్రవర్తించేలా చేస్తుంది. అతని బలహీనత అర్ధం చేసుకున్న జార్జియా, ''కొన్ని హద్దులు పెళ్ళయ్యాకే దాటాలని నా సిద్ధాంతం'' అంటుంది.
మనం ''పెళ్ళి చేసుకుందాం'' అంటాడు ఫెలీనీ.
''నిజం?'' అంటూ కళ్ళు చికిలించి, ఒంకరలు తిరిగి విలాసంగా నవ్వుతూ తిరిగి ప్రశ్నిస్తుంది జార్జియా. అమె తన గుండెల్లో రగిల్చిన జ్వాల ఫెలీనీ నరనరాల్లో ప్రవహించి ఒంటిని కాల్చి తీయని అనుభవం కోసం శరీరంలో ప్రతీ అణువునూ అవధుల మేరకు కుదపడంతో ఇంకేమీ పాలుపోక, ''నిజం'' అంటాడు ఫెలీనీ.
కావలసింది సాధించడానికి దేనికైనా వెనుదీయని వ్యక్తి జార్జియా. అందగాడైన ఫెలీనీ తన ఉనికిని ఒక సంవత్సరం పాటు పట్టించుకోకపోవడంతో అవమానంగా తలిచిన ఆమె, అతనిని లొంగతీసుకోవాలన్న అభిమతాన్ని నెరవేర్చుకుంది. అందరి బంధువుల సమక్షంలో పెళ్ళి జరగాలన్న జార్జియా ప్రతిపాదనకి ఫెలీనీ అంగీకరిస్తాడు. గ్రీసులో ఏథెన్స్ పట్టణంలో అత్యంత వైభవంగా ఫెలీనీని జార్జియా పెళ్ళాడుతుంది.
వివాహమయ్యాక ''ఇక్కడే నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. ప్రయత్నిద్దాం. మంచి ఉద్యోగం లభించకపోతే మరో మార్గం వెతుకుదాం'' అని అతి చాతుర్యంగా గ్రీసులోనే ఫెలీనీ ఉండేలా చేస్తుంది జార్జియా. దొరికిన ఉద్యోగంలో చేరి జార్జియాతో గ్రీసులో జీవితం మొదలుపెడతాడు ఫెలీనీ.
''ఒకసారి ఇటలీ వెళ్ళి నే నివసించిన ప్రదేశం చూసి వద్దాం'' అన్న ఫెలీనీ ప్రతిపాదనకి జార్జియా ''అలాగే వెళ్దాం'' అంటుంది కాని దాని గురించి ఆలోచించకుండా రోజులు దాటవేస్తుంది.
నాలుగుసార్లు ''ఇటలీవెళ్దాం'' అని ఫెలీనీ అన్నా ఏవో కారణాలు చెప్పి అతడి ఆలోచనని మరుగు పరుస్తుంది.
ఫెలీనీకి జార్జియా అంటే ప్రేమ ఏమాత్రం సడలినట్లు అనిపించకపోయినా, అందగాడైన అతడు ఏదైనా అడ్డదార్లు తొక్కుతాడేమోననే అనుమానంతో అతడి మీద రహస్యంగా నిఘా ఉంచుతుంది జార్జియా.
ఒకరోజు సాయంకాలం ఆఫీసు నుంచి తిరిగి వస్తుంటే ఒక పెద్ద భవనంలో పేలుడు జరగడం, ఆ వెనువెంటనే నలుగురు వ్యక్తులు పారిపోవడం ఫెలీనీ కంట పడుతుంది. విస్తరిస్తున్న జ్వాలలని ఆశ్చర్యంతో గమనిస్తున్న ఫెలీనీ దగ్గరకి పోలీసులు వస్తారు. అతడు తను చూసినదంతా వివరించగా ఫెలీనీని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళతారు.
మర్నాడు ఉదయం జార్జియా వచ్చి ఫెలీనీ గురించి పోలీసాఫీసర్లకి చెప్పి ఇంటికి తీసుకెళ్తుంటే ''ఇటలీ నుంచి వచ్చి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడిన వ్యక్తుల్ని ఆనవాలుపట్టగల వ్యక్తి మీరొక్కరే. వాళ్ళు దొరికేంత వరకు మీరు ఈ దేశం వదిలి వెళ్ళకండి'' అని ఆదేశిస్తారు. నాలుగు రోజుల తరువాత ఫెలీనీ లేనపుడు ఇంటికి వచ్చి ఫెలీనీ పాస్ పోర్ట్ తీసుకెళ్తారు. అడపాదడపా పోలీసుల నుంచి ఫెలీనీకి పిలుపు వచ్చి పోలీస్ స్టేషన్‌కి నిందితులని గుర్తించడానికి వెళ్ళినా, విద్రోహకారుల ఆచూకీ తెలియదు.
రోజులు గడుస్తుంటాయి. ''ఎన్నాళ్ళిలా, ఒకసారి ఇటలీ వెళ్ళివద్దాం'' అని ఫెలీనీ రవ్వంత అసహనంగా ప్రశ్నించినపుడు, ''కాస్త వోపిక పట్టు'' అంటూ ఫెలీనీని ముద్దులతో ముంచెత్తి మురిపించి మరపిస్తుంది. నాలుగైదుసార్లు అలా జరిగాక ''నేను వాకబు చేయించాను, అసలు నిందితులని పట్టుకునేంత వరకు నీ పాస్‌పోర్ట్ నీకు అందచేయడం చట్ట విరుద్ధమట. ఆ సంఘటన జరిగినపుడు నువ్వు అక్కడ ఉండడం దురదృష్టకరం, దుండగులు త్వరలో దొరుకుతారు, ఇటలీ వెళ్దాం. అక్కడ ఏముంది? అయినా నీకు ఇక్కడ ఏం తక్కువయింది'' అనడిగింది జార్జియా.
ఫెలీనీ గ్రీస్ వచ్చి మూడేళ్ళు దాటిపోయింది. గ్రీస్ అందమైన దేశం. అక్కడ అన్ని సదుపాయాలూ సౌకర్యాలూ ఉన్నాయి. ప్రేమించే భార్య, మంచి ఉద్యోగం ఉన్నాయి. దేనికీ కొరత లేదు, అయినప్పటికీ ఫెలీనీలో క్రమంగా అసంతృప్తి, అసహనం వివరించలేనంత తీవ్రతకి చేరాయి.
'తను ఈ దేశంలో బందీ! తను ఎక్కడకీ వెళ్ళలేడు. తన జీవితం ఇలా మగ్గిపోవాల్సిందే!' అనుకుంటాడు. చిన్నప్పుడు ఇటలీలో గడిపిన రోజులు జ్ఞాపకానికి వస్తే, అవి విశిష్టమైనవి కాకపోయినా ఎందుకో అవి చాలా తీపిగా అనిపిస్తాయి ఫెలీనీకి. 'అన్నీ ఉన్నాయి తనకి ఒక్క స్వతంత్రం తప్ప! సముద్రంలో తిరిగే చేపని పట్టుకు వచ్చి చిన్న మంచినీటి చెరువులో పడవేసినట్లుంది తన బతుకు' అని ఫెలీనీ గింజుకుంటాడు.
మనకి ఏదైతేలేదో దాని వెలితి వెయ్యి రెట్లు పెరిగినట్లనిపిస్తుందని ఎవరో అన్నట్లుగా కావలసిన చోటుకి వెళ్ళలేకపోతున్నానన్న బాధ ముందు ఇతర సుఖాలన్నీ చిత్తుగా వోడిపోవడంతో గ్రీస్ నుంచి పారిపోవడం ఎలా? అన్న తీవ్రమైన ఆలోచన ఫెలీనీని వేధిస్తుంది.
దేశం నుంచి పారిపోయే మార్గాల గురించి అన్వేషణ మొదలు పెడతాడు. నెల్లాళ్ళ పరిశోధన తరువాత గ్రీస్ నుంచి ఏడ్రియాటిక్ సముద్రాన్ని చిన్న పడవలో దాటించడానికి ఒక వెయ్యి డాలర్లు ఇస్తే కుదురుతుందని తెలుసుకుని, హుటాహుటిన బ్యాంక్ నుంచి డబ్బు తెచ్చి మధ్యవర్తికి అందజేస్తాడు ఫెలీనీ.
రెండు రోజుల తరువాత రాత్రి పది గంటలకి సముద్ర తీరాన ఉన్న మిలాన్ కేఫ్‌కి రమ్మన్న కబురందడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. జార్జియాతో చెబితే ప్రయాణానికి అడ్డుతగులుతుందని ఈ విషయాన్ని గుట్టుగా ఉంచి ఇటలీ చేరాక ఆమెకి తెలియపరచాలానే నిర్ణయానికి వస్తాడు.
''అప్పుడే కాఫీ తాగేసావా?'' అన్న జాన్ మాటలు రాజుని వాస్తవంలోకి తెచ్చాయి.
'ఇంతకీ ఫెలీనీ సంగతేమిటి? నువ్వు తిండిధ్యాసలో పడి సమాధానం ఇవ్వలేదు' అనడిగాడు స్మిత్.
''ఫెలీనీ లాంటి వ్యక్తులని రెండు పడవలలో సముద్రం దాటిస్తున్నారని, అందులో ఒక పడవ మునిగిపోయిందని సినిమాలో చూపించారు. ఫెలీనీ ఇటలీ చేరాడా? లేదా? అన్నది ముఖ్యం కాదు కాబట్టి అది మనకి చూపించలేదు. కొందరు వ్యక్తులు స్వేచ్ఛ కోసం ఎంతకైనా తెగిస్తారన్నది చెప్పడమే ముఖ్యం. ఫెలీనీ మునిగినా తేలినా ఒక్కటే కదా!'' అన్నాడు జాన్.
''నేను ఏ మాత్రం ఏకీభవించను. అన్నీ ఉన్న గ్రీస్ వదిలి స్వేచ్ఛ అంటూ ఏమీలేని ఇటలీకి ఫెలీనీ పరుగుపెట్టడం చాలా హాస్యాస్పదం. ఇటలీలో అతడిని సరిగ్గా గుర్తించే వారైనాలేరు. మరి దేనికోసం అతడి తపన, పరుగు. చాలా సిల్లీగా ఉంది'' అన్నాడు స్మిత్.
''బలహీనతలకి, సెంటిమెంట్లకి బానిసలయ్యే మనుష్యుల్ని మనం చూస్తాం. ఒక రకమైన బలహీనత ఉన్న వ్యక్తి ఇంకో రకమైన బలహీనత ఉన్న మనిషిని ఎద్దేవా చేయకూడదు. అలాంటిదే సెంటిమెంట్ కూడ. ఫెలీనీ విషయంలో బలహీనతకాని, సెంటిమెంట్కాని ముఖ్యం కాదు. తిండి, సుఖాలు మనిషికి ముఖ్యమే కాదనను. అవి కేవలం శారీరక సంబధమైనవి. స్వేచ్ఛ అలాంటిదికాదు, అది మెదడుకి సంబంధించినది. కొందరు స్వేచ్ఛకి ఫెలీనీలా ప్రాముఖ్యత ఇవ్వకపోవచ్చు. వాళ్ళని ప్రశ్నిస్తే, 'ఆ! అదంత ముఖ్యంకాదు' అంటారు. స్యేచ్ఛకి ఆనకట్ట పడనంత వరకు అలాగే అనుకుంటారు. నాకు తెలిసిన ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. నా స్నేహితునికి ప్రతీరోజూ పడుకునే ముందు డైరీ రాసే అలవాటుంది. అతడికి వివాహమయ్యాక డైరీలు చదువుతానంటుంది అతడి భార్య. డైరీలో రాసుకున్న వాటిలో ఏమీ రహస్యాలు లేకపోయినా అవి నా స్వంతం అంటాడు అతడు. నేను నీ భార్యని, నాకు నీ డైరీ చదివే హక్కు ఉంది అంటుంది ఆమె. ఆమెతో ఘర్షణ పడలేక అతడు డైరీ రాయడం మానుకున్నాడు. కానీ తన ఊహల్ని, కోరికల్ని వ్యక్తపరిచే ఆ మార్గం మూత పడడంతో అంతర్లీనంగా అతడి గుండెలో ఆమె మీద కోపం రాజుకుంది, అతడి స్వేచ్ఛ గాయపడింది.
స్వేచ్ఛ! అది శరీరంలో నిబిడీకృతమై నిద్రపోతున్న ఒక వికృతమైన మృగం. ఒక వ్యక్తినేరం చేస్తే, సమాజం అతడిని నాలుగు గోడల మధ్య బంధించి, మనిషికి అన్నిటికంటే ముఖ్యమైన స్వేచ్ఛని లాగేసుకుంటుంది.
ఫెలీనీకి ఇటలీమీద ప్రత్యేకమైన ఆసక్తి ఏమీలేదని మనకి తెలుసు. అతను ఇటలీ వెళ్దామనుకుంటాడు. ఆ కోరికకి పరిస్థితులు అడ్డంపడి వెళ్ళ లేకపోతాడు. అతడిలో నిద్రపోతున్న స్వేచ్ఛా మృగం మేల్కొని కట్టలు తెంచుకుని అదుపు తప్పింది. దాని పరిణామమేమిటి? అని క్రమబద్ధ ఆలోచన అతనికి రాదు. శృంఖ లాలని తెంచుకోవడమే ముఖ్యం'' అని ఆగాడు జాన్. స్మిత్ విచిత్రంగా చూస్తుంటే జాన్ తిరిగి అందుకున్నాడు.
''నీకు చెప్పలేదు ఇంతవరకూ, నేను ఇంగ్లండ్‌కి శాశ్వతంగా వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాను,'' అన్నాడు.
''వాట్?'' అని స్మిత్ అరిచినంత పని చేశాడు.
''దాదాపు నలబైఏళ్ళ క్రితం ఇక్కడకి వచ్చాను. అన్నివిధాలా జీవితంలో పురోగమించాను. ఒకసారి విడాకులు తీసుకున్నాను. నా రెండో భార్య నాకంటే చాలా చిన్నది, ఉద్యోగం చేస్తోంది, నా మొదటి భార్య తిరిగి పెళ్ళి చేసుకోవడం వల్ల ఆమెకి నే భరణం ఇవ్వనక్కరలేదు. ఆ భార్య ద్వారా జన్మించిన నా కొడుక్కి ఇరవై ఒక్కేళ్లు వచ్చేంతవరకు అయిన ఖర్చు భరించాను. ఇప్పుడు అతను ఉద్యోగం చేసుకుంటున్నాడు ఇతర బాదర బందీలులేవు. లండన్ వెళ్ళిపోతాను'' అన్నాడు జాన్.
''డోంట్ బి ఎ జాక్ ఏస్, నీ జీవితం అంతా ఇక్కడే గడిచింది. అక్కడ ఉన్న వాళ్లకి నువ్వు ఎప్పుడో మరుగునపడి ఉంటావు. నువ్వు లండన్ వెళ్లడానికి నీ రెండోభార్య ఒప్పుకోకపోతే ఆర్థికంగా నష్టపోతావు'' అన్నాడు స్మిత్.
''ఐ డోంట్ కేర్''
''నీ భార్యతో సఖ్యంగా రోజులు సాగడంలేదా? అదే కారణమైతే విడాకులు తీసుకోవచ్చు. నాకైతే నువ్వు లండన్ వెళ్ళిపోతాననడం సబబుగా లేదు. ఆ ఆలోచన రావడానికి అసలు కారణాలు ఏమిటి?'' అనడిగాడు స్మిత్.
''అమెరికాలో ఇప్పుడు స్వేచ్ఛ లోపించింది. అది భరించలేకపోతున్నాను'' అన్నాడు జాన్.
''ఏమిటీ అసందర్భ ప్రేలాపన. ఇతర దేశాల నుంచి అక్కడ అణిచివేతకు గురయిన ప్రజలు ఇక్కడికి స్వేచ్ఛ కోసం వలస వస్తున్నారు. ఏ దేశంలోనూ లేని స్వేచ్ఛ ఈ దేశంలో ఉందన్న సంగతి అందరికీ తెలసిందే కదా?'' అన్నాడు స్మిత్. ''అమెరికాను ల్యాండ్ ఆఫ్ ఆపర్చ్యూనిటీ అంటారు, ఒప్పుకుంటాను. ఈ దేశంలో మనకి నచ్చిన కెరియర్ని మనం ఎంచుకోవచ్చు. ఇద్దరూ ఇష్టపడితే, కావాలనుకున్న స్త్రీని వివాహం చేసుకోవచ్చు. భార్యాభర్తల మధ్య తీవ్రమైన విభేదాలు ఉద్భవించి, అవి సర్దుకోలేనంతగా ఉంటే విడాకులు తీసుకోవచ్చు. ఏ బట్టలు కావాలంటే అవి ధరించవచ్చు. అలాంటివి కోకొల్లలు ఉన్నాయి, కాదనను. కానీ కొన్ని పనులు చేయలేం, ఆంక్షలు వచ్చాయి. పత్రికలలో ఎవరి ఊహలు, ఉద్దేశాలు వారు నిర్భయంగా ఇదివరకు రాసేవారు. వాక్స్వాతంత్రం ఉండేది. ఇప్పుడు అలాకాదు. ఉదాహరణకి పత్రికలలో యూదులని విమర్శిస్తూరాయి చూద్దాం. తుక్కురేగిపోతుంది. గతంలో ప్రభుత్వ నడవడిక మీద పౌరులు బాహాటంగా తమ ఆలోచనల్ని వ్యక్తపరిచేవారు. ఇప్పుడు ధోరణిమారింది. ప్రభుత్వాన్ని సమర్థించకపోతే ఆ వ్యక్తిని 'దేశద్రోహి' అనేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించాలి? యూదుల మీద ఎందుకు రాయాలి? అని నువ్వు అనవచ్చు. ఏదైనా కట్టడిపెడితే మెదడులో నిద్రపోతున్న మృగం మనల్ని అల్లరి పెడుతుంది. అమెరికాలో ఉన్న విశృంఖలమైన స్వేచ్ఛ దేశానికి మంచిది కాదు అంటున్నారు కొందరు. ఎవరు నిశ్చయిస్తారు దీనిని? నాకు నా భావస్వాతంత్రం ముఖ్యం, నా ఉద్దేశంలో దానికి పెద్ద గండిపడింది. అందుకే వెళ్ళిపోతున్నాను. అక్కడకి వెళ్లాక పరిస్థితులు ఇక్కడ కన్నా ఘోరంగా ఉండవచ్చు. నాకు తెలిసిన ఇక్కడి పరిస్థితులు నాకు రుచించడంలేదు. అక్కడ బాగుంటాయిని వెళ్తున్నాను. అక్కడా బాగుండకపోతే ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాను'' అంటూ ముగించాడు జాన్. స్మిత్, జాన్ సంభాషణ ఇంకోదారి పట్టడంతో రాజు ఆలోచనల్లో పడ్డాడు.
అమెరికాలో వ్యక్తి స్వాతంత్రం ముఖ్యం. కొన్ని సందర్భాలలో దానికంటే దేశం ముఖ్యం అంటోంది ప్రభుత్వం. సిద్ధాంతరీత్యా అది సరి అయిందే అనిపించినా పదవిలో ఉన్న కొందరి వ్యక్తుల వ్యక్తిగత ఉద్దేశాల ఆధారంగానో, ఇంకే ఇతర కారణాల వల్లనో దేశానికి నష్టం అని భావిస్తే ఎందుకు నష్టమో నిజాయితీతో వివరిస్తే, ఏ పౌరుడూ కాదనడు. అలా కానపుడు, 'ఏలాంటి నష్టం?' అని ప్రశ్నించే హక్కు సామాన్య పౌరునికి లేకపోతే ఎలా? ఆ హక్కుని లాగేసుకున్నపుడు అతడు తన స్వేచ్ఛని కోల్పోలేదా? ఆ కోణంలోంచి చూస్తే జాన్ ఆవేదన అర్థమవుతుంది.
మన సంగతి ప్రభుత్వమే చూసుకుంటుంది, అనుకుని ఏమీ పట్టించుకోకుండా బతికే వ్యక్తులకి ఏ ఇబ్బందీ ఉండదు. కానీ అందరూ అలా వదిలేస్తే, దేశం కొందరి చేతులలో కీలుబొమ్మ అయిపోతుంది. ఆ కొందరు తమ ఉద్దేశాలకి, ఆనవాయితీలకి మిగతా జానాభాని బానిసలుగా చేయడమే కాకుండా, ఎవరైనా ఎదురు చెబితే అణగతొక్కేయరూ?
అణగతొక్కడమంటే రెండురోజుల క్రితం ఇంటర్నెట్లో చదివిన వార్త జ్ఞాపకానికి వచ్చింది రాజుకి. ఒకనటి వివాహానికి ముందు స్త్రీ లైంగిక సంబంధం గురించి చేసిన వ్యాఖ్య మీద దుమారం రేగి, అలజడులు సృష్టించి, విషయం కోర్టుల వరకు వెళ్లింది. ఆ నటికి దేవాలయం కట్టించి, ఆకాశానికి ఎత్తేసిన అభిమానులు ఒక అంశం మీద తమకి తమకి నచ్చని రీతిలో వ్యాఖ్యానించగానే ఆమెమీద చెప్పులు, రాళ్లు విసిరి నిరసన ప్రదర్శించారు. తమకి ఆమోదయోగ్యమైనట్లే ఆమె ప్రవర్తించాలంటే ఆమె వ్యక్తిగత స్వాతంత్రం ఏమైంది?
బెత్తెడు గుడ్డపీలికలు వేసుకున్న సినిమాలు ఉత్సాహంతో చూసి రోడ్లమీద గెంతు లేస్తున్న ప్రజ, ఒక క్రీడాకారిణి వేసుకున్న దుస్తుల మీద ఆంక్షలు పెట్టడానికి ప్రయత్నించడం విడ్డూరం కాక ఇంకేమిటి? రేపు కళ్లకి కాటుక ధరించకు అంటే? 'స్వేచ్ఛ! వింత మృగం' అన్నాడు జాన్. తనికి నచ్చింది ఆ వ్యాఖ్య.
కోతి చేతిలో గ్రెనేడ్‌లా కొందరు ఛాందసులు, వ్యక్తిలో ఉన్న స్వేచ్ఛా మృగాన్ని చంపేయడానికి చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఆ మృగం ఎంతకాలం తట్టుకుంటుంది'' అనుకుంటూ వేడెక్కిన తలని చల్లపరచడానికి కురుస్తున్న మంచులోనికి నడిచేడు రాజు.
Thursday, December 13, 2007
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
rama
బాగుంది. అచ్చు తప్పులు లేకుండా మంచి కధలు అందజేస్తున్నందుకు మీకు అభినందనలు. మీ కుమార్తె ముచ్చటగా ఉంది. పేరు ఏమిటో?
Post a Comment