స్వామి బువ్వ
రూ.3000 ప్రోత్సాహక బహుమతి పొందిన తెలుగు కథ
-మంచికంటి వెంకటేశ్వర రెడ్డి
రాత్రి పదిగంటలు దాటింది బయట కీచురాళ్ళు రొద చేస్తున్నాయి. డిమ్‌లైట్ వెలుతురులో లోపలంతా చేదు తిన్నట్టుగా అనిపించసాగింది.
''అనూ ప్లీజ్... చిన్న చిన్న విషయాలకే అలా అయిపోతే ఎలా చెప్పు'' అంటూ అటువైపు తిరిగి పడుకున్న తనను పట్టి వెనక్కు లాగాను.
''ఊ...'' అంటూ గట్టిగా తనవైపు లాక్కుని నా పట్టు నుండి విదిలించుకుంది.
''ఇలాగైతే ఎలా! వాడికి ఇంజనీరింగ్‌లో ర్యాంక్ రాలేదని అంతగా దిగాలు పడిపోతే ఎలా చెప్పు. వాడి టాలెంట్ వాడిది. పైగా వాణ్ణి మనం మంచి కాలేజీలో కూడా చదివియ్యలేదు కదా! దానికి డిసస్పాయింట్ అయిపోయి ఆ కోపం చిన్నోడి మీద చూపించడం ఏమన్నా బాగుందా చెప్పు.
పిల్లలన్న తరువాత ఆడుకోకుండా ఎలా ఉంటారు? పొద్దస్తమానం చదువూ అంటుంటే వాళ్ళేం జేస్తున్నారు? పిచ్చిబట్టి పోతున్నారు. చదివేది ఏమిటో, ఎందుకో అర్థంకాక అయోమయంలో పడిపోతున్నారు. దాంతో టీవీకి అతుక్కుపోతు న్నారు. ఆ దరిద్రం చూసి బలైపోయేకంటే ఆటలాడుకోవడం మేలుకదా! స్కూల్లో ఆటలూ పాటలూ ఉండనే ఉండవు కదా!'' మాట్లాడుతూనే మళ్ళీ ఒకసారి చెయ్యి పట్టి లాగాను.
ఊహూ... చలనం లేదు. శ్వాస బలంగా తీస్తోంది. అంటే నిద్రలోకి జారుకుందన్న మాట.
ఇవాళ కూడా మామూలేనన్న మాట. ఎన్ని దీర్ఘ రాత్రులు ఇద్దరి మధ్యా ఒంటరిగా గడిచిపోయుంటాయో! అలవాటు పడేదాకా ఎంత బాధగా ఉండేది. పెళ్ళయిన చాలా కాలానికి కానీ అలవాటు పడలేకపోయాను. నాకే కాదేమో, ప్రతి మధ్య తరగతి కుటుంబంలోనూ ఉండే సంఘర్షణే ఇదనుకుంటాను.
ఫోమ్ బెడ్‌మీద నిద్ర పట్టక అటూ ఇటూ పొర్లాను. ఇంక ఈ రాత్రిని తగలెయ్యడం చాలా కష్టం అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నాను. ఊహూ లాభంలేదు. పైన తిరిగే సీలింగ్ ఫ్యాన్‌ను చూస్తుంటే సుళ్ళు తిరిగే ఆలోచనలోన్నుండి పిల్లలిద్దరూ కళ్ళ ముందు కదిలారు.
ఎటు పోతున్నాయసలు చదువులు. జ్ఞానం శూన్యం. ప్రయోగశీలత, ప్రయోజన తత్వం శూన్యం. జీవితానికి అన్వయం, సమన్వయం లేని చదువులై పోయాయి. ఇప్పుడు పిల్లల చదువులొక పెద్ద సమస్య. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి గొడవలే పిల్లల గురించీ, వాళ్ళ చదువుల గురించీ.
ఇంత వయస్సులో అప్పటి చదువులు ఎంతానందంగా సాగేవి. కరక్కాయ సంచీనిండా పుస్తకాలు, సత్తు గిన్నెల కారియర్‌లో అన్నం తీసుకుని, జారిపోయే చెడ్డీని ఎగలాక్కుంటూ రేగల గుంట చెరువుకి అడ్డంపడి పోవడం, చెరువు నిండితే మాగాణి గనేలమీద నడుస్తూ నడుస్తూ మధ్యలో పందేలు వేసుకోవడం, జారి బురదలో పడి వొళ్ళంతా బురదైతే ఆ నీళ్ళతోనే కడుక్కుని అదే డ్రస్సుతో బడికి పోవడం ఎంత హాయిగా చదువుకున్న రోజులు. ప్రతి దాంట్లోనూ పోటీయే కదా! ఎంత ఆరోగ్యకరమైన పోటీ అది. ఆటల్లో, పాటల్లో, డ్రాయింగ్‌లో, వ్యాసరచన, వక్తృత్వం అన్నీటితో పాటు చదువు ఎంత మొద్దోడైనా క్రియాశీలంగా సృజనాత్మకతతో చదివిన చదువులు.
హోంవర్క్ చెయ్యకపోతే లెక్కల మాష్టారు కర్ర విరిగేదాకా కొడతాడని నక్కపాలెం మర్రిచెట్టు దగ్గర మధ్యాహ్నందాకా ఆటలాడుకుని తెచ్చుకున్న అన్నం తిని సాయంత్రం బడి పిల్లలతో కలిసి ఇంటికి పోవడం. అమ్మో... ఆ రోజైతే నిజంగా ఇంక ఈ భూమ్మీద నూకలు చెల్లిపోయినియ్యనుకున్నా. చెరువు వర్షానికి నిండిపోయింది. దారెక్కడో సరిగ్గా కానరావడం లేదు. వర్షంలోనే అందరమూ పాలిథీన్ గొంగళ్ళు తగిలించుకొని పుస్తకాలు తడవకుండా ఒకర్ని పట్టుకొని ఒకరం మెల్లగా నడుస్తుంటే కళ్ళకు అడ్డం పడిన గొంగళితో కొంచెం పక్కకు పోయేసరికి ఎంత పెద్ద గొయ్యో! ఇంకేముంది పీకల్దాకా నీళ్ళు. అయిపోయాననుకున్నా. ముని వేళ్ళమీద పైకి లేవకపోతే నోరు దాటి వొచ్చే నీళ్ళు.
అప్పుడు శీనుగాడు చూసి చెయ్యందియ్యక పోతే ఇవాళ ఈ ఫోమ్ బెడ్‌మీద మెత్తగా పడుకుని ఉండేవాణ్ణి కాదేమో!
ఏటి కాలువలో కొత్త నీళ్ళు వొచ్చినప్పుడు ఏ కాస్త సందు దొరికినా ఆ కాలవలో పడి ఈతలు కొట్టడమే. ఇళ్ళ దగ్గర్నుండి కర్ర తీసుకొని ఎవరో ఒకరు వొచ్చేదాకా అలా మునకల్లోనే మునిగిపోయేవాళ్లం. చిన్న పంతులు చెప్పిన పద్యాలు ఇప్పటికీ నాలుకమీద నాట్యం చేస్తూనే ఉన్నాయి. 'ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండులీనమై ఎవ్వడియందు డిందు పరమేశ్వరు డెవ్వడు, మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు' అర్ధరాత్రి నిద్రలో లేపి అడిగినా 'అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు...' ఎన్నెన్ని పద్యాలు దాశరథి శతకం, సుమతీ శతకం, వేమన శతకం ఎన్నెన్ని పద్యాలు, ఎన్నెన్ని పాటలు నేర్చుకునే వాళ్లం.
సంవత్సరం చివర్లో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జరిగే యానివర్సిరీకి పోటీల్లో పాల్గోని పిల్లలుండేవాళ్లా? ఎవరికి తగ్గ పోటీలో వాళ్ళు కల్చరల్లో లేనివాళ్ళు ఆటల్లో అది కూడా లేని వాళ్ళు ఎన్‌సీసీలోనో, క్రాఫ్ట్‌లోనో, ఎన్‌ఎసెస్‌లోనో ఏదోక దానిలో ఉండాల్సిందే! అదేకదా. ఇవాళ జీవితపు సమస్యల్ని నిర్భయంగా ఎదుర్కొనేలా చేస్తుంది. ఆ సృజనాత్మకత ఇవాళ చదువుల్లో లోపించడం వల్లనేకదా ఈ విద్యార్థుల దశనుంచే ఆత్మహత్యల వైపుగా ఆలోచించడం. ఎక్కడ చూసినా రికార్డింగ్ డ్యాన్సులు మినహా మరో కార్యక్రమం కనపడుతుందా! స్కూళ్ళ నుండి కాలేజీల దాకా ఇళ్ళనుండి బజార్ల దాకా ఒకటే గంతులు... మెల్లమెల్లగా కళ్లు మూతలుపడి నిదుర మబ్బులోకి జారిపోసాగేను. నిద్రలో కూడా ఎన్నెన్నో తీయతీయని జ్ఞాపకాలు.. ఎన్నెన్నో పీడ కలలు... కలగలిసి కలత నిద్రలోనే ఈరోజు తెల్లవారి పోయిందే!
'ఎక్కడికి రా మళ్ళీ స్టడీ అవర్ కి టైమ్ అవుతుంటే బుద్ధుందా లేదా నీకు?' తల్లి అరుపులు నిద్రలోకి దూరి వస్తున్నాయి.
''అమ్మా ఇప్పుడే వస్తానమ్మా రవి దగ్గరకు పోయి నోట్స్ తెచ్చుకోవాలి.'' కొడుకు బతిమాలుతున్నాడు.
''ఇప్పుడు స్టడీకి పోతా ఇంకేం నోట్సు. నీ వేషాలు నాకు తెలుసులే మర్యాదగా వొచ్చి రెడీకా'' కేక వేసింది.
సన్నగా ప్రారంభమైన ఏడుపు వెక్కిళ్ల మధ్య... వాడు. ప్చ్ వీళ్ళిద్దరి మధ్య సమన్వయం ఎట్లా చెయ్యాలో అర్థం కావడమే లేదే! నిద్ర కళ్ళతో మెలకువలోనే ఆలోచనల సుడి గుండాల్లో... తనకై తను తెలుసు కోలేదు. చెబితే వినదు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు. మనిషి ఎంత మంచిదో కానీ ఏం చేస్తాం... పరిస్థితులు కూడా ఆమెని నిస్సహాయురాలుగా చేస్తున్నాయి. చుట్టూ పోటీ ప్రపంచాన్ని చూసి ప్రతి తల్లీ ఇలాగే ఘర్షణ పడుతూ ఉంటుందేమో!
దడదడమని ప్లేట్లు శబ్దం... యుద్ధం మొదలైనట్టుంది. సూచన ప్రాయంగా శబ్దాలే వొచ్చాయి ఇంకా లేవకపోతే... అమ్మో అనుకుని దుప్పటి ముసుగు తీసి పెరట్లోకి వొచ్చాను.
పాత్రల్లో మిగిలిపోయిన కూరలు, నీళ్ళల్లో అన్నం చూసి కడుపు మండిపోయింది. ''ఏయ్ ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు కేకేశాను''.
''ఏందంట'' అంటూ పెరట్లోకి వొచ్చింది.
''ఏందిది... ఈ కూరలేంది, ఈ అన్నమేంది! ఎందుకు ఇంతింత వొండుకుని పార బొయ్యడం. చాలినంతే వొండుకోవొచ్చు కదా! అ...బ్బ... ఎన్నిసార్లు చెప్పాలే నీకు, అన్నం విలువ తెలుసా నీకు...''
''అయితే నేను దుబారా చేస్తున్నాననే కదా మీ ఉద్దేశం. పొద్దున్నే నిదర మంచం దిగి వొచ్చారు ఒడ్డించడానికి. నాకు తెలియదు. మీరే ఒండుకోండి. వొడ్డించుకోండి. నేను పనికిమాలినదాన్నే. కాదన్లేదుగా. మీరే చేసుకోండి పొండి'' ఉదయాన్నే అలకపాన్పు ఎక్కేసింది.
''అదికాదే.. మిగిలిందనుకో కనీసం ఎవరికైన పెట్టనన్నా పెట్టొచ్చు కదా...?''
''ఇదుగో మీ ఇష్టం వొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. ప్రతిదాంట్లో తల దూరుస్తారు. ప్రతిదీ నాదేనని అందుకుంటారు'' తుంపరలా మొదలైన ఏడుపు...
''అబ్బ... ఆపవే తల్లీ మొదలు పెట్టావు. మాటకు ముందు ఎందుకు వొస్తది ఏడుపు. ఏమాట మాట్లాడినా తప్పేనా!
'ఛీ వెధవ జన్మ'. ప్చ్ పొద్దున్నే అనవసరంగా కదిలించుకున్నాను. ఎప్పటికప్పుడు సర్దుకు పోవాలనే అనుకుంటాను. తను చేసే పనులు చూసి తట్టుకోలేక మాట్లాడాల్సి వొస్తంది.
డబ్బులో గారాబంగా పెరిగి వొచ్చిన వాళ్ళతో వొచ్చిన తంటానే ఇది. ఆకలి తెలిసిన వాళ్ళకి అన్నం విలువ తెలుస్తుంది. అసలు ఆకలంటే తెలుసా నీకు హూ... అది తెలియని వాళ్ళకి ఎంత చెప్పినా తలకెక్కదేమో...
కళ్ళముందు నట్టింట్లో కూర్చుని అన్నం తినే నాన్న మెదిలాడు. కుడికాలు మడుచుకుని ఎడం కాలు నిలబెట్టి పై పాదంపై నంజుడు కోసం పచ్చడి పెట్టుకొని, తినే ప్రతి ముద్దనీ ఆప్యాయంగా నోట్లో పెట్టుకుంటూ కిందపడ్డ ప్రతి మెతుకునీ ఏరి పళ్ళెంలో వేసుకుంటుంటే 'ఎందుకు నాన్నా మట్టిలో పడింది కూడా మళ్ళీ అన్నంలో వేస్తావూ' అన్నాను.
''మెతుకు పోతే దొరుకుద్దంటయ్య. వందెకరాల ఆసామి రామానాయుడే కింద మెతుకు పడితే ఊరుకోడంట'' అనేవాడు. కష్టం విలువా, ఆకలి విలువా ఆనాడు ఎంతగా తెలిసిందో.
ఎప్పుడో పెద్ద పండక్కో ఏరువాక పౌర్ణానికో దొరికేది వొరి అన్నం. అప్పుడది స్వామి బువ్వ. ఎంత ఆనందంగా మల్లెపూలలా తెల్లగా కళ్ళ ముందు కదులుతుంటే దాన్లోకి ముద్దపప్పు, పేరి నెయ్యి, చింతకాయ పచ్చడి ఆ... హా హా ఆ రుచే వేరు కదా! ఎప్పుడూ ములుకుల్లా గుచ్చుకునే వొరిగ అన్నం, జొన్న సంకటీ తిని బతికిన వాళ్ళం కదా!
నోరు పూసి ఎర్రగా రక్తకొల్లులాగా ఉండప్పుడు వొరిగ అన్నం తింటుంటే అమ్మో పుండుమీద కారం చల్లినట్టే భగభగా మండిపోయేది. ఆ వరిగ అన్నం తింటూ లబలబలాడిపోయేను. కళ్ళల్లో కారుతున్న నీళ్ళు చూసిన అమ్మ ''ఎందుకురా అట్ట లబలబ లాడతావు. ఈతాకు నోట్లో యేసుకోని నముల కూడదా'' అనింది.
''ఒరే ఇయ్యాల మా ఇంట్లో అన్నం అయిపోయిందిరా! మాయిటిపూట పెందలాడే వొండుతానందరా మమ్మ! ఒరే ఒరే గరువు చేలల్లో వొరవ దగ్గిర చాలా ఉండయ్యిరా... అందే చెట్లు. పోయి బురగంజి కొట్టుకోని తిందాంరా'' అంటూ సీతారాముడొచ్చాడు.
చాలీచాలకుండా రుద్దుడు కారపు పచ్చడితో కుండ అడుగున మిగిలిన మాడు చెక్కలతో కలిపి అర్ధాకలితో తిన్న తిండి కడుపులో సొద పెడుతుంది. అప్పుడు దేవుళ్లాగా వొచ్చిన వాడితోటి కలిసి కొడవళ్ళు గొడ్డలీ తీసుకొని బయలుదేరాం.
మిట్ట మధ్యాహ్నం ఎండ నెత్తిమీద చుర్రుమంటోంది. ఇసకలో కాలు పెడితే చుర్రమంటోంది. కాలు పెట్టి తీసే లోపలే బొబ్బలెక్కిపోయినయ్.
''ఒరే ఇట్టకాదు గానీ కొడవలి ఇటియ్యి అని తాటాకులు కొట్టి, వాటిని బూట్లులాగా కట్టుకుని బురగంజి (మోము) కొట్టుకోని ఆత్రంగా తింటుంటే కాళ్లకెక్కిన బొబ్బలు ఎటుపోయాయో'' తిన్నంత తిని మిగిలింది ఇంటికి తెచ్చాం.
రూపాయి రూపాయి చేర్చి ఇటుకిటుకా పేర్చి కట్టిన ఇంటికి చేసిన అప్పు తీర్చడానికి అమ్మానాన్న ఎంత సచ్చి దగ్గరయిపోయేవాళ్ళు. వొంటిమీద రవిక విప్పి ఉతుక్కుని పిండి మళ్ళీ తొడుక్కుంటుంటే అమ్మను చూసి శీనుగాడు 'మీ అమ్మకి ఇంకో రైక లేదా! మా అమ్మకైతే ఎన్నిరైకలుండయ్యో' అని ఎగతాళి చేశాడు.
''ఇంకో రైక కొనుక్కోకూడదా వెంకటరత్నం'' అనింది రత్తమత్త.
''చేసిన అప్పులు తీరితే రైకా కొనుక్కోవొచ్చు. కోకా కొనుక్కోవొచ్చు. ఇంటి ముందుకు వొకరొచ్చి అడిగితే ఏం మర్యాదా'' అని నవ్వుతూ చెప్పింది.
''ఇంక లాభంలేదు, ఎన్నిసార్లు తిరగ కప్పిచ్చినా వానొస్తే నీళ్ళన్నీ ఇంట్లోనే ఉంటుండయ్యి. ఇంక ఆ రోజంతా జాగార మే! ఎట్టోకట్ట ఇయ్యేడన్నా ఇల్లేసుకోవాల'' అంటూ చెప్పినప్పుడు నాన్న కళ్ళల్లో చూడాల వెలుతురు. ఇప్పటికీ కళ్ళల్లో మెదులుతూనే ఉంది. ఆ మాటనుకున్న తరువాత ఎన్నో సంవత్సరాలకు ఈడేరిన కలకోసం ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు జాగారం చేశారో!
పగలంతా ఎండలో వొళ్ళు అలసిపోయేలా పనిచేసి వొచ్చిన వాళ్లంతా హాయిగా తిండితిని మంచాలెక్కుతుంటే, ఆ వెన్నెల రాత్రుల్లో మళ్ళీ పొలానికి వెళ్ళేవాళ్ళు అమ్మా నాన్న. రాత్రంతా పొగకట్టెలను పీకిన అమ్మా నాన్నలు తెల్లారేసరికి తోటకూర కాడల్లా వేలాడుతూ వొచ్చేవాళ్ళు. అప్పుడైనా ఇంటి దగ్గర ఉంటారా అంటే ప్చ్... బొబ్బలెక్కిన అరి చేతులకు కొబ్బరినూనె పూసుకుని వొరిచేనుకి గెమాక్సిన్ కొట్టడానికి నాన్న, గరువుకుపోయి మొయ్యలేక మొయ్యలేక అంతపెద్ద మోపు చొప్పదంట్లు తెచ్చే అమ్మ.
జీవితాంతం అస్తులరిగిపోయేటట్లు మనం పనిచేస్తా ఉండాల్సిందే అనే అమ్మ, మనం బతికినంత కాలం వొళ్ళరగ దీసుకొని పని చెయ్యడానికి కాకపోతే దేనికి పుట్టినట్టు... అందుకే ఎప్పటికీ కష్టం జెయ్యడమే మన పని అనే నాన్న...
సెలయేటి గలగలలు... పక్కమీదా...! ఊహూ... కలలోనా... ఎక్కడో నీళ్ళ శబ్దం...
బాత్‌రూమ్‌లో నుండే... బెడ్‌రూమ్ వెనకవైపు నుండే కదా! ''ఎవ్వర్రా నీళ్ళొదిలేసింది. కట్టెయ్యండి పంపు'' పెద్దగా ఒక్క అరుపు.
''ఎందుకు అంత గొంతేసుకుని అరుస్తారు. వీధిలో వాళ్ళందరికీ తెలియాలా మన భాగోతం'' అనూ గొంతు చించుకు అరుస్తుంది.
''నీ నోట్లో నోరు పెట్టడం నా వల్ల కాదమ్మా అన్నపూర్ణమ్మ! నీళ్లు ఇవాళ కుళాయిలో ఇట్ట తిప్పితే అట్ట వొస్తున్నాయ్యి''
బొడ్డు బాయి మీద చేంతాడుకి ఇంతింత తపేళాలు కట్టుకొని వెనక భూమిలో పాతిన రాళ్ళకి కాళ్ళు మోటించి, బొడ్డుకేసి నీళ్ళు లాగుతుంటే, వొరేయ్ ఈడు ఎద్దుకాల్లో ముల్లంత లేడురా! యెనక కాళ్ళు జూడు ఎంతెత్తున లేస్తుండయ్యో జారి బాయిలో పడతాడేమో అని వెంకటేశ్వర్లు మామంటే, వాడా! నీ తల్లోగుండా దూరిపోతాడు. నరంలాగా సాగీసాగీ తోడతాడు బాయిలో నీళ్ళన్ని. వాడి సంగతి నీకు తెలవదులాగుందే'' నాగమ్మవ్వ భరోసా ఇచ్చేది.
బడినుంచి వొచ్చి కుడితి తొట్టికి, నీళ్ళ తొట్టికి నీళ్ళు లాగి పోసేసరికి కడుపులో పేగులు నోట్లో కొచ్చేవి. అప్పుడు నీళ్ళంటే పాతాళలోకంలో నుంచి బతిమిలాడితే పైకి వొచ్చే జల. ఇయ్యాల ఉండయ్యిలే అని లబలబ పారబొయ్యడంతో అయిపోలేదు. మనలాంటి వాళ్ళు చాలామంది ఉంటారింకా ఒక్క బిందె నీళ్ళకోసం అరసకలాడేవాళ్ళు.
ఏదైనా అంతే చేస్తుంటది. అవసరం ఉన్నంత వొరికే వాడుకోవాల. మునక్కాయలు తెస్తానా! వాటిని చూస్తా చూస్తానే ఎండ బెడతావుకదా! కాకరకాయలు తెస్తే పండ బెడతావు. టమోటాలైతే కుళ్ళబెడతావు. ఊరకపారబోస్తే ఏమి వొచ్చుద్ది. బూజు పట్టిచ్చి, కుళ్ళబెట్టి బయట పారబోస్తుంటే ఎంత బాధగా ఉంటది. ఎన్నిసార్లు చిలక్కి చెప్పినట్టు చెప్పాను.
ఉహూ తన మాట తనదే! ఏదైనా తనకి అనిపిస్తేనే చేసిద్దంట అంతేగానీ ఎంత మంచి మాటైనా, ఎవురు జెప్పినా ఎక్కదు కాక ఎక్కదు. ఎన్నిసార్లని తగాదా పెట్టుకోవాల? ఎంత నచ్చజెప్పటానికి ప్రయత్నిస్తే ఆ రోజంత పెద్ద రభస.
అయినా నా నోరు ఊరుకుంటుందా! అంటే, ఎలా ఊరుకుంటుంది. తగాదా అయితే అయిందని చెప్పడం. తగాదా పెట్టుకోవడం... మామూలే! ఎప్పటికైనా తెలుసుకుంటుందనే మినుకు మినుకు మనే ఆశ. అబ్బే కుక్కతోక వంకరే. ఎప్పట్నుండి చూస్తున్నాను. పుట్టుకతో వొచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవు.
సెలవు రోజుల్లో ఎర్రటి ఎండలో రూపాయి సంపాయించడానికి ఎంతగా అల్లలాడిపోయేవాణ్ణో తెలుసంటే!
కింద కాళ్ళు కాలీ, పైన మాడుకాలీ పండు మిరపకాయలు కోస్తుంటే చేతుల్లో మంట, కాళ్ళల్లో మంట, వొళ్ళంతా మంట, కళ్ళంతా మంట
ఒరేయ్ వీడి టిపినీలో ఎప్పుడూ గోంగూర పచ్చడీ, మిరప్పచ్చడీ, చింతకాయ పచ్చడీ. ఎప్పుడూ పచ్చళ్ళేనంట్రా ఈడు తినేది. మధ్యాహ్నం హైస్కూల్ దగ్గర అన్నం తినేటప్పుడు వాళ్ళు ఎగతాళి చేస్తుంటే, పచ్చళ్ళు కాకుండా ఈళ్ళంతా ఏం తింటారబ్బా అని వాళ్ళ టిపినీల్లోకి ఆశ్చర్యంగా చేసేవాణ్ణి. అమ్మ ఎప్పుడన్నా పప్పుశారు కాసేది. లేదా ఎవురింటి దగ్గరన్నా ఉలవలు వొండిన తరువాత వొంచిన నీళ్ళు తెచ్చి ఉలవశారు చేసేది.
''నిదరమంచం దిగేది లేదా ఏంది! అన్నీ చెయ్యడానికి నేనొక దాన్ని దొరికేగా! మీకేం బాధా లేసిందాకా'' ఇంట్లో నుండి రుసరుసలు మొదలయ్యాయి.
''లేస్తానమ్మ లేస్తాను'' ఊరక కూర్చోని తినే బతుకులా మావి. వొళ్ళు విరుచుకుంటూ వంటింట్లోకి పోయాను.
''ఏందా సూటిపోటి మాటలు! నీకు ఎన్నిసార్లు చెప్పి ఉంటాను. ఏదైనా విషయముంటే నేరుగా నా ముఖాన్నే కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పు. అంతేగానీ సూటిపోటిగా మాట్లాడొద్దు'' అంటే నావైపు చురచురా చూసింది.
''నాకు అంతకంటే మాట్లాడ్డం రాదు. నేనేం మీలాగా బియ్యేలూ, ఎమ్మేలూ పాస్ కాలేదు. ఇంతకీ హాస్పిటల్‌కి కేరేజ్ సంగతేందో చెప్పలేదు'' మళ్ళీ మాట తీరు మామూలే...
తీసికెళ్ళాలి. ఎవరున్నారక్కడ వాళ్ళకి పెట్టడానికి అమ్మెనక వాళ్ళు, అబ్బెనక వాళ్ళు అనుకుంటూ బాత్‌రూమ్‌లో దూరి తలుపేసుకున్నాను.
నాన్నకి తగ్గుతుందో లేదో! ఇక్కడికొచ్చి ఉండండి అంటే నాన్న వినరు. ఎన్నిసార్లు బతిమాలినా బామాలినా మాట వింటేకదా! కన్న తల్లిదండ్రులు దగ్గర లేకపోవడం ఎంత బాధాకరం. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం. ఊళ్ళో పోయి ఉండడం సాధ్యమయ్యే పనేనా!
ఇద్దరిదీ ఒకేమాట ''ఆ టౌన్లోకొచ్చి మేముండలేమయ్యా! అయినా ఇప్పుడేం పోయిందీ... మా రెక్కలాడినంత కాలం నువ్వేం మా గురించి దిగులు పెట్టుకోవొద్దులే'' నాన్న మాటలు ఎంత ఆత్మాభిమానం నిండి ఉంటాయో!
నాన్న ఆరోజు నేను రమ్మన్నప్పుడే వొస్తే ఇలా జరిగుండేదా! ఈ వయిసులో ఏం జరిగినా తట్టుకోవడం ఎంత బాధ. 'నాన్నా... ఎందుకు నాన్నా మమ్మల్ని పరాయి వాళ్ళుగా చూస్తారు' ఆ రోజు ఎదురుగా కూర్చుని బాధపడుతూ అన్నాను.
''ఇందులో పరాయి వాళ్ళని చెయ్యడం ఏముందరా! పుట్టి బుద్దెరిగిన్నప్పట్నుండీ రెండు కాళ్ళు ఒకచోట పెట్టినోళ్ళం కాదు. ఇయ్యాల నువ్వేదో ఉద్యోగం చేస్తున్నావని మేమొచ్చి నీ దగ్గర కూకోని తింటం మా వల్ల కాదయ్యా! తిరగ్గలిగినంత కాలం చెయ్యాల్సిందే! తిరగలేనప్పుడు అప్పుడు చూసుకుందాం'' ఖచ్చితంగా మీ దగ్గరకు రాము అని చెప్పకుండా ఎలా తప్పుకుంటున్నారో!
బహుశా అప్పుడు జరిగిన దానివల్లేమన్నా రావడానికి జంకుతున్నారేమో!
పెళ్ళయిన తరువాత ఊళ్ళో ఉన్నది కొద్దిరోజులే. అయినా అనూకీ అమ్మకీ అస్సలు పొత్తు కుదిరేది కాదు. తను చేసిన ప్రతి పనీ మళ్ళీ అమ్మ చేసుకునేది. కసుపు చిమ్మడం దగ్గర్నుండి, అంట్లు తోమడం దగ్గర్నుండీ ప్రతి పని అమ్మకి స్వయంగా తన చేతులతో చేసుకుంటేనే గానీ తృప్తిగా ఉండేది కాదు.
ఇంటికొచ్చిన నాతోఅనూ మాట పలుకూ లేకుండా కోపంగా ఉంది. ''ఏందిరా ఏమైంది? ఎందుకలా కోపంగా ఉన్నావు'' అనునయంగా అడిగాను. కళ్ళ వెంట బొటబొటా కన్నీళ్ళు కారినయ్యి ''ఏంది యాడవకుండా చెప్పు. విషయం చెబితే కదా తెలిసేది''
''లంకంత కొంపలో ఉండొచ్చి, ఈ ఒక్క గదిలో ఉండటం ఎంత బాధగా ఉంటుంది. అయినా ఉంటన్నానా! నాకసలు ఏ పనీ చేతగాదనా... ఏంది మీ అమ్మ ఉద్దేశం. ప్రతి పనీ నేను చెయ్యడం మళ్ళీ వెంటపడి ఆమె చెయ్యడం. ఏమనుకోవాలి? ఏం చెప్పకుండా నన్ను అవమానించటం కాదా! చూసేవాళ్ళు ఏమనుకుంటారు. నేనింక ఒక్కక్షణం కూడా ఉండలేను. సింగరాయకొండలో ఇల్లు తీసుకోండి అక్కడికి పోయి ఉందాము'' చాలా బాధగా చెప్పింది.
''ఇంత తొందరపడితే ఎట్లా చెప్పు. ఏదో పెద్ద వాళ్ళు వాళ్ళ చాదస్తం వాళ్ళకుంటంది. మనమే సర్దుకుపోవాలి. ఏం జరిగినా మనము సర్దుకుపోవాలి'' బతిమలాడి చెప్పేసరికి అప్పటికి అసహనంగానే ఆ వ్యవహారం అంతటితో సద్దు మణిగింది.
పాపం ఎవ్వర్నీ ఒక్క మాట పరుషంగా మాట్లాడలేని నాన్న ఆ రోజు ఎంతగా బిక్క చచ్చిపోయి ఉంటాడో!
''ఏందసలు మీ ఉద్దేశం. నేనసలు ఏమీ తెలియని మొద్దుదాన్నను కుంటున్నారా! అదట్ట చెయ్యి, ఇదిట్ట చెయ్యి. యెంట పడతారేంది! ఒక్కరోజు చెబితే సరిపోదా! రోజూ... రోజూ చెప్పాల్సిందేనా!''
ఎంత గాయపడి ఉంటాడో! పిల్లల్నీ, పశువుల్నీ కూడా దయతో దగ్గరికి తీసే నాన్న అక్కడి పనులు కొత్తకదా. చదువుకున్నోళ్ళు తెలుసో తెలియదోనని దగ్గిరుండి చూయించడం తప్పయిపోయింది.
కొన్ని రోజులకే కదా, వేరే కాపురం పెట్టాల్సి వొచ్చింది. ఆ సంఘటనతో అప్పుడు చాలా నలిగిపోయారు వాళ్ళు.
''అప్పటికి మేము కాపరం చెయ్యనియ్యకపోతేనేగా యేరే కాపురం పెట్టారు వాళ్ళు'' అమ్మ ఎంతమంది దగ్గరో వాపోయిందంట.
''ఊళ్ళో రకరకాలుగా అనుకుంటన్నార్రా'' నాన్న అన్నప్పుడు వాళ్ళు ఎంతగా గాయపడి ఉంటారోనని బాధేసింది.
ఇక్కడికి వొచ్చి ఉండాలంటే ఆ గాయాలన్నీ కెలుతుతుంటాయేమో ''తొందరగా తెమిలి చావరా! ఎంత సేపటికీ సగచేస్తానే ఉంటావ్. స్టడీ అవర్‌కి ఎప్పుడూ ఆలస్యమే. చెప్పలేక చస్తున్నా. రోజూ చేసే పనికి కూడా వెంటపడి ఎవరు చెబుతారు''
అమ్మో మళ్ళీ మొదలైంది. ''ఒరేయ్ తొందరగా కానిచ్చి వెళ్ళరా'' బాత్‌రూమ్ నుండే అరిచాను.
ఎందుకో ఈ రోజు చాలా అసహనంగా ఉంది. ఈ రోజే కదూ డాక్టర్ ఏ విషయం చెబుతానంది. ఎక్స్‌రే తీసి ఉంటారు. సెట్ కాకపోతే ఆపరేషన్ తప్పదన్నారు. క్యారేజీ తీసుకొని హాస్పిటల్లో అడుగుపెట్టాను.
అమ్మో ఆపరేషనంటే ఎలా చెయ్యాలి. అసలే అప్పుల్లో ఉన్నాను. పైగా వాడికి ఇంజనీరింగ్ సీటుకి కట్టాలంటుంది. గుండె లబలబ లాడుతుండగా హాస్పిటల్‌లో అడుగుపెట్టాను.
క్యారేజీ అక్కడ పెట్టి స్టూలుమీద కూర్చుంటుంటే నాన్న కళ్ళల్లో నీళ్ళు. కాలుమీద చేత్తో నిమురుతుంటే బేలగా నా వైపు చూశాడు.
''ఊరుకో నాన్నా ఊరుకో! ఎన్నెన్ని రాత్రుళ్ళు పగళ్ళు మా కోసం నీ రక్త మాంసాల్ని చెమటగా మార్చావు. ఈ నాటికీ సుఖమంటే ఏమిటో తెలియకుండా, ఇప్పటికీ మానుండి ఒక్క రూపాయి ఆశించకుండా బతుకులు వెళ్ళదీస్తున్నారు. నెత్తిమీద పెట్టుకోని చూసుకోవాల్సిన మహానుభావులు మీరు. ఇంత అసహాయస్థితిలో ఎప్పుడూ చూడలేదు నాన్నా మిమ్మల్ని.
మీరు చేసిన దాంట్లో ఎన్నో వొంతు చేస్తే మా రుణం తీరిపోతుంది నాన్నా. మీ పట్టుదలా పంతాలతో అక్కడే ఉంటారు. ఎన్ని బాధలైనా పడతారు. అదే మా దగ్గరకొచ్చి ఉంటే ఇలా జరిగేదా! మీరెందుకొస్తారు? మీరు అభిమానం కలిగిన వాళ్ళు. ఎన్నటికీ ఎవ్వరి మీదా ఆధారపడకూడదనే మీ పట్టుదల. ఎవ్వరితో చీ...చా.. అనిపించుకోవడం మీవల్ల కాదు. మీ ఆత్మాభిమానం ముందు పోల్చుకుంటే మావెంత నికృష్టమైన జన్మలో కదా నాన్నా''.
అమ్మ మనసులో ఏముందో! బయటికి చెప్పుకోలేదు ఏ విషయం. బేల తనంతో కనిపిస్తుంది. మనుషులు ఎంత మొరటుగా కనిపిస్తారు. మీ మనసులు ఎందుకమ్మ అంత సున్నితంగా, సుకుమారంగా, వెన్నపూసకన్నా మృదువుగా లాలనగా... ఎలా తయారు చేసుకున్నారమ్మా.
మీ గురించి లోతుగా ఆలోచించినప్పుడల్లా ఎన్నిసార్లు సిగ్గుతో చితికిపోయామో! పిండి బొమ్మలం... తాకితే రాలిపడే మట్టి బొమ్మలం. పైకి కనిపించే డాబుసరేనమ్మ మాది. లోపలంతా వొఠ్ఠి డొల్లే. మీ చుట్టూ మమ్మల్ని ఎన్నిసార్లు దిగుతుడిస్తే మాకు అంటుకున్న మకిల పోతుందమ్మా. మీ పాదాలు కడిగి ఆ నీళ్ళు చల్లుకున్నా మాకు బుద్దొస్తుందా! నా కళ్ళల్లో కూడా నీళ్ళు తిరుగుతున్నాయి''.
ఎంతసేపలా ఒకరికొకరం మాట్లాడు కోకుండా స్థాణువుల్లా కూర్చున్నామో!
డాక్టర్ రావడంతో స్టూలు మీదనుండి పైకి లేచాను. అమ్మ కూడా పైకి లేచి చేతులు కట్టుకుని నిలబడింది.
నాన్న చేతులు మంచానికి ఆనించి పైకి లేవబోతుంటే ''వొద్దు వొద్దు పడుకో'' అంటూ డాక్టర్ వారించాడు.
''ఊ ...ఎలా ఉంది చెప్పండి'' అంటూ కేస్ షీట్ తీసి పరిశీలిస్తూ నిన్న తీసిన ఎక్సరే ఏదమ్మా అనడంతో నర్స్ ఎక్సరే తీసి చేతికి ఇచ్చింది.
ఎక్సరేని అటు ఇటు తిప్పి చూస్తూ పెదవి విరవ సాగాడు.
నా గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఏం చెబుతాడో, ఎలా చెయ్యాలో అన్న ఉత్కంఠతో నరాలు చిట్లిపోయేటట్లు ఉన్నాయి.
''ప్చ్... లాభంలేదయ్యా'' తేల్చి చెప్పాడు డాక్టర్.
''డాక్టర్ అయితే ...''
''ఊ...చెయ్యాల్సిందే ! వయసు బాగా పెద్దది కదా! అందుకే సెట్ కాలేదు. ఆపరేషన్ చేసేసి లోపల రాడ్స్ సెట్ చేయ్యాలి. నొప్పి బాగా ఉంది కదా'' నాన్న వైపు తిరిగి ప్రశ్నించాడు.
''ఊ... ఉందయ్యా ఇదిగో ఇక్కడయ్యా... జిమ జిమ లాగుద్ది'' కాలు దగ్గర నొక్కి చూయించాడు.
''ఉంటుంది... టాబ్లెట్స్ రాస్తున్నాను. అవి మింగు తగ్గి పోతుంది'' అంటూ ముందుకు కదిలాడు.
''డాక్టర్...''అంటూ ఆయన వెనుకే వెళుతూ సందేహించసాగేను.
''ఆ ఏందయ్యా నీ డౌటేంది? ఖర్చు బాగా అవుతుంది. రాడ్సదీ వెయ్యాలి కదా! నిదానంగా సెట్ అవుతుంది''
హూ...పెద్ద నిట్టూర్పు. లోలోపల రెండు విరుద్ద బలాలు కలబడి ఒక దానితో ఒకటి ఢీ కొంటున్న భావన. అంతా సజావుగా జరిగిపోతుందని అనుకుంటే వ్యవహారం తలకిందులయిందే.
నాన్న మొహం చూడటానికే చెల్లటంలేదు. ఇపుడు నిజంగా అగ్ని పరీక్షే కదా!
మౌనంగా ఉన్న నన్ను చూసి ''ఎందుకులేయ్యా! ఈ ఖర్చుకి నువ్వు నిగ్గలేవు గానీ పుత్తూరుకి తీసుకుపోరా. నాలుగు కట్లతో అదే కట్టుకుంటది'' దిగాలుగా అన్నాడు.
''సర్లే ఏదోకటి చేద్దాం'' అంటూ బయటికి నడిచాను. ఏమనుకున్నాడో నాన్న ఆపరేషన్ అనడంతో మొహం మాడిపోయిందనుకున్నాడో! లోపల ఏమి అనుకున్నా బైటకి కనబడరుకదా! మహాత్ము లంటే వీళ్లేకదా!
మొహం వేలాడేసుకుని ఇంటికి పోయేసరికి అనూ ఎదురొచ్చి నా వంక పరీక్షగా చూసింది.
''ఏమయ్యిందంట తోటకూరకాడలా అయిపోయారు'' ఏక్కాణంగా అడిగింది. లోపల అనుకునే మాటలు తొందర తొందరగా బైటపడితే బాగుణ్ణు. గొంతు దాటి బయటకు రావడానికి ఎందుకంత మొరాయిస్తాయో! మనసు బాధగా మూలుగుతున్నపుడు అంతేనేమో!
ఎంతకీ తెగించి మాటల్ని కూడా బలుక్కుంటూ ''ఆప...రే..ష..న్... చెయ్యా... లన్నా....రు''అన్నాను.
''ఆపరేషనా...''మాట ఒక్కసారిగా వెలువడి తన ఆశ్చర్యాన్నంతా తెలియజేసింది.
''ఆ...'' అన్నాను ముక్తసరిగా.
''అందుకు మీరేమన్నారు?'' ఒక్క రవ్వ...ఒక్క రవ్వ... నిప్పు రాజుకుంటోందని అర్థమౌతోంది.
''ఆ... ఏమంటాను? ఎదురుగా నిలబడలేక పక్కకు తప్పుకున్నాను''.
''మీరేమంటారో నాకు తెలియదా! అదేమంటే మీ వాళ్లు నీకు ఎక్కువైతే నా వాళ్లు నాకు ఎక్కువ కాదా అంటావు. సంపాయించడం చేతగాకపోయినా ఉన్నదాన్ని నిలుపుకుంటే... బాగుండేది. అదీ చేతగాకపోయా! ఎన్నిసార్లు కొట్టుకున్నా విన్నావా! వొద్దు వొద్దు అనేకొద్దీ వెధవ పనులన్నీ చేస్తివి. చిలక్కి చెప్పినట్లు చెబుతానే ఉండాను. ఏదన్నా వొచ్చిందంటే అప్పటికప్పుడు యాణ్ణుండి పరిగెత్తుతావు అంటూనే ఉండాను. ఇంటేగా నువ్వు. ఇప్పుడు కూర్చొని భజన జెయ్యి''.
''వాడికి ఇంజనీరింగ్ సీటుకి కడతావో! మీ నాన్న ఆపరేషన్‌కే తెస్తావో! అవతల అప్పులు అప్పుల్లాగే మిగిలిపోయి ఉండయ్యి''
హూ... అయింది. నిప్పు రాజేసుకోని మంటగా మండటం ఆరంభమయ్యింది. ఇంక మంట మండుతూనే ఉంటుంది. ఇది ఇప్పట్లో ఆరే మంట కాదు. భగభగ మండుతూ... తను దహించుకుపోతూ నన్ను కూడా దహించి వేస్తుంది. మా ఇద్దరితో ఆగితే సరే... అది పిల్లల్ని కూడా దహించి వేస్తుందే. వాళ్లూ సమిధలే. ఏం జేస్తాం మనం చేసిన తప్పులకి వాళ్లు కూడా బలే. మౌనంగానే ఉండటం తన అహాన్ని ఇంకా రెచ్చ గొట్టినట్టయ్యింది.
''నాకు తెలుసు. వాడు ఎట్టపోయినా నీకు సంతోషమే. ఎటొచ్చీ కాటికి కాళ్లు చాపినవాడే నీకు ముఖ్యం. పో... పోయి ఆ పనే చెయ్యి. వాళ్ళూ నేనూ కట్ట గట్టుకోని ఏ బాయిలోనో దూకితే సరిపోతుంది.''
మెల్లగా మాట్లాడకుండా, తన మాటలు వింటూ ఇంట్లోకి నడిచాను. ఎటూ పాలుపోని పరిస్థితి అయింది. పోనీ ఇద్దరికీ అప్పు తెద్దామంటే తరవాత వొడ్డీ గంపెడై కూర్చుంటది. పైగా వాడేమో చేరితే మంచి కాలేజీలోనే చేరతాను అంటాడు. అయినా ఎనభైవేలు ర్యాంకు తెచ్చుకున్నాడు. ఇంజనీరింగ్‌లో చేరడం అవసరమా? వేలకు వేలు పోసి చేర్పిస్తాం. అయిపోయిన తరవాత రేపటి పోటీలో రాణించగలుగుతాడా? వెయ్యికీ రెండు వేలకీ పనిజేసే ఇంజనీర్లని ఎంతమందిని చూడడం లేదు. అప్పుడు కూడా మళ్లీ మా కోసం ఎదురు చూడాల్సిందే కదా! ఏ హైదరాబాదులోనో ఉంటే రెండు మూడు వేలు సరిపోతయ్యా.
ఏ డిగ్రీనో చేసి తరవాత ఏదోక కోర్సు చేసుకుంటే చాలదా వీడి టాలెంట్‌కి. అందరితో పాటు పొలోమని పోవడమే. నలుగురూ నడిచేదే రాజబాట అయి కూర్చుంది.
నా వెనకే ఇంట్లోకి తనూ వొచ్చింది.
''ఏందంట మౌనమే అర్ధాంగీకారమా!''
''ఏందే నీ గోల'' విసుక్కున్నాను.
''విసుక్కోవడం కాదండీ. ఆపరేషన్ చేయించటానికే నిర్ణయించుకున్నారా అని'' కాస్త శాంతంగానే అడిగింది.
''అది కాదే వాణ్ణి... డిగ్రీ...'' నోట్లో నుండి మాట పూర్తిగా కూడా రాలేదు.
భగ్గున మంట మండి సెగ మొఖానికి తాకింది.
''ఆగండంతటితోటి. ఇయ్యాలో రేపో సావబోయే వాళ్లకి వేలకు వేలు తగలెయ్యకపోతే పుత్తూరు తీసుకపోయి సావకూడదా! ఆపరేషన్లు చేయించుకున్నోళ్లు ఎంతమంది సెట్టుకాక అల్లాడిపోతన్నారు. వొళ్ళంతా నుజ్జు నుజ్జయి సస్తారనుకున్న మనుషులు కూడా ఆ కట్లకి లేసిరాలేదా! డిగ్రీ అంట డిగ్రీ. అందర్లాగా పుట్టలా నా బిడ్డ. వాణ్ణి డిగ్రీలో చేర్చు. నేను ఏ గుండంలోనో దూకి సావకపోతే అప్పుడు జూడు'' ముక్కు చీదుకుంటూ వెక్కిళ్లు పెడుతూ తిట్లూ, శాపనార్థాలతో మంచమెక్కేసింది.
మంటలు వొళ్లంతా మంటలు, ఇంటి నిండా మంటలే. బయటిగ్గూడా వ్యాపించకముందే ఏదోకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఉన్న విషయం చెబితే అర్థం చేసుకోదు.
ఇంక ఊరుకోబెట్టడం బ్రహ్మ రుద్రాదుల వల్ల కూడా అయ్యే పనికాదు. నాన్న కూడా అదే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి పుత్తూరుకి తీసుకెళ్ళటమే బెటరేమో...!
లోపలా బయటా అంతా చీకటి చీకటిగా ఉంది. చిత్తడి చిత్తడిగా ఉంది. తల బద్దలై పోతోంది. ఇంత వాడినై ఉండి కూడా దిక్కులేని వాళ్ల లాగా పుత్తూరుకు తీసుకుపోవడం నిజంగా ఎంత బాధాకరం. వాళ్లన్నప్పటికీ నా మనసులోకి కూడా ఆ భావన రావడం... ప్చ్... ఇప్ప టికీ నా మీద ఆధారపడకుండా వాళ్లే కష్టపడుతున్నారు. ఇప్పుడు ఆపరేషన్ చేయించాల్సి వొచ్చేసరికి ఎంత స్వార్థంతో ఆలోచిస్తున్నాను.
ఇటు చూస్తే వీడి చదువు. డిగ్రీలో చేరిస్తే పోయిద్దనుకున్నాను. కానీ, ఇప్పుడు డిగ్రీని ఎవడు లెక్క చేస్తున్నాడు. వాడికి రేపెవురన్నా పిల్ల నియ్యాలన్నా ఎట్ట చూస్తారు. అవసరమున్నా, లేకున్నా, ఇష్టమైనా కాకపోయినా ఇంజనీరింగ్ చదవాల్సిందే. ఊరంతా వొక దారైతే ఉలిపి కట్టెది ఒక దారైతే ఎట్టా. ఊహూ కుదరదు. వాస్తవంగా ఆలోచించి ఏటికి ఎదురీద్దామంటే బయట సమాజం ఊరుకుంటుందా! నలుగురూ వింత జంతువుని చూసినట్టే చూస్తారేమో! ఇంట్లో ఆఫీసులో తెలిసిన వాళ్లు... తెలియని వాళ్ళు... అమ్మో తల్చుకుంటేనే భయమేస్తుంది.
కడుపులో ఆకలి రగిలిపోతోంది. పోయి తిందామంటే ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తోంది. అనూ పిలుస్తుందేమోనని ఎదురు చూసినా, లాభం లేదు. ఎక్కడో మినుకు మినుకు మంటున్న ఆశ... ఊహూ... లాభం లేదు. తనెంత మొండిదో తెలిసీ ఎదురు చూడడం అనవసరం.
కళ్ళు మూతలు పడుతున్నాయి. కడుపులో ఎలుకలు పరుగెత్తుతుంటే నిద్రెలా పడుతుంది. నిద్ర... మెలకువ... మెలకువలోనే కలత నిద్ర.
ఎప్పుడో అర్ధరాత్రి మెలకువొచ్చి చూస్తే పక్కన అనూ లేదు. ఓహో కోపం తగ్గలేదు. తన మొండితనం తనదే. అయినా తన ఒక్కదానికే కొడుకా! నాక్కాదా... పక్కకు తిరిగి పడుకున్నా. పొట్ట వీపుని తగులుతున్నట్టుగా ఉంది. ఆకలితో పడుకుంటే సుఖంగా నిద్ర పడుతుందా! నిద్రలో ఒకటే కలవరింతలు. కలత నిద్రతోనే తెల్లవారింది.
అనూ గదిలోకొచ్చి తొంగి చూసి పోయింది. పలకరించనైనా లేదు. వొళ్ళంతా పచ్చి పుండులా ఉంది. కళ్ళు మంటలు పుడుతున్నాయి. తెల్లవారినా లేవాలనిపించలేదు. లేస్తే ఏం చెయ్యాలి. మళ్లీ ఊగిసలాట మొదలయ్యింది. ధైర్యం చాలటం లేదు.మళ్ళీ కళ్ళు మూసుకున్నా.
''నాన్నా అమ్మ పిలుస్తోంది'' చిన్నా పిలుస్తున్నాడు.
ఓహో ఇప్పటికి గుర్తొచ్చినట్టుంది. సరే కానియ్ లేవకపోతే మళ్ళీ ఏం ముంచుకొస్తుందో! ఎందుకొచ్చిన గొడవ అనుకుని లేచి కార్యక్రమాలన్నీ ముగించుకొని టేబుల్ దగ్గర కూర్చున్నా.
మౌనంగా టిఫిన్ తెచ్చి పెట్టింది. ఎప్పుడూ కేకలూ అరుపులతో ఉండే ఇల్లు శ్మశాన నిశ్శబ్దాన్ని సంతరించుకుని ఉంది.
టిఫిన్ తింటూ అనూ వైపు చూశాను. కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి. పాపం తనుకూడా నిద్ర పోయినట్టు లేదు.
తల్లి ప్రేమకదా! ఎంత బాధ పడుతోందో! నిలబడి అలాగే నా వైపు మాట్లాడకుండా చూస్తూనే ఉంది. నేనూ మౌనంగానే టిఫిన్ ముగించి బయటకు వొస్తుంటే,
''ఇంతకూ ఏం నిర్ణయించారు'' కొంచెం గొంతు పెద్దదిగా చేసి అడిగింది.
వెనక్కు తిరిగాను. ''ఏముంది పుత్తూరే తీసుకు పోదామనుకుంటున్నాను''. ఇంకోమాట మాట్లాడలేదు. కానీ అప్పటికప్పుడే ఆమె కళ్ళల్లో కనిపించిన విశ్రాంతి చూస్తే ఆమె ఇప్పటికి స్థిమిత పడిందని చెప్పకనే చెబుతోంది.
ఆమెకేనా స్థిమితం. ఆమెకేనా సంతృప్తి. ఈ నిర్ణయం తీసుకున్న తరువాత నాకు మాత్రం లేదా స్థిమితం. నా కొడుకు ఇంజనీరింగ్ చదవాలని నాకు మాత్రం లేదూ. నలుగురిలో పరువు నిలబెట్టుకోవాలనే ఆరాటం ఎవురికి మాత్రం ఉండదు. ఆ సంతోషంతోనే ముందుకి సాగిపోయాను.
about the writer
కల్లోల జీవనగాథ
మంచికంటి వెంకటేశ్వరరెడ్డి
కొత్తపట్నం, ప్రకాశం- 523 286.
పుట్టింది సింగరాయ కొండ దగ్గర పల్లెటూరు కలికివాయలో. ఇంట్లో అమ్మా, నాన్నా, అమ్మమ్మా; బయట బంధువులూ, స్నేహితులూ... వాళ్ల మాటలూ, కల్లోలమవుతున్న వారి జీవితాలు కథలుగా మలుస్తున్నారు. కొత్తపట్నంలో ఉపాధ్యాయ వృత్తి, సాహిత్యాధ్యయనం నిత్య ప్రవృత్తి. మూడు కవితా సంకలనాలు, ఒక కథా సంపుటి ప్రచురించారు.
Thursday, December 13, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment