Thursday, December 13, 2007

మనవడు ఒరియా కథ

డా|| ప్రశాంతకుమార్‌ ప్రదాన్‌
అనువాదం: మహీధర రామశాస్త్రి
''ఒరేయ్‌! గంట నుంచి చూస్తున్నాను, అక్కడ మీరంతా ఏం చేస్తున్నట్టు? దొంగ పీనుగులంతా ఒక్కటయ్యారు. తల తిప్పితే చాలు గోతులు తవ్వేస్తారు! మిమ్మల్ని బొత్తిగా నమ్మడానికి లేకుండా పోయింది. అక్కడలాగే తగలడండి! బడుద్దాయిల్లారా... ఒక్కొక్కడొక్కొక్క సైతాను నాకు...!''
సదానంద త్రిపాఠి అరుగుమీద నిలబడి అరుస్తున్నాడు. అయిదడుగుల ఎత్తరుగులు, కిరీటంలా రెండు చూరులున్న పాతకాలం నాటి ఇల్లు అది. ఒకనాడు ఆ ఇంటి ముందు ఏనుగులాంటి మదించిన ఎడ్లు గడ్డి మేస్తుండేవి. ట్రాక్టర్లొచ్చాక ఇప్పుడు ఎడ్లని మేపాల్సిన పని లేకుండా పోయింది. ఇంటి ఎదురుగా ఉన్న కొబ్బరి తోట త్రిపాఠిదే. మధువాభాయి తోటలో పని చేస్తున్నాడు. మధువాభాయి ఆయన పాలేరు. త్రిపాఠి కేకలేస్తున్నది అతణ్ణే.

సదానంద త్రిపాఠి పక్క ఊళ్ళోని ఓ హైస్కూల్లో పనిచేసి, ఎనిమిది సంవత్సరాల క్రితం రిటైరయి, ప్రస్తుతం పింఛను పుచ్చుకుంటున్నారు. ఆ రోజుల్లో ఆయన బి.ఎ, బి.ఇడి, పాట్నా యూనివర్సిటీ నుంచి డిస్టింక్షన్‌లో పాసయ్యారు. అదీ ఇంగ్లిషులో ఆనర్సు చేశారు. పాఠాలు చెప్పడంలో ఆయన దిట్ట. ఇంగ్లిషు, సంస్కృతం, ఒరియా భాషల్లో ఆయనను మించినవాడు లేడు. ఆయన అనువాదాలు, వ్యాకరణ గ్రంథం హైస్కూలు పిల్లలకు పాఠ్య పుస్తకాలయ్యాయి. ఆయన పుస్తకాలు చదవని విద్యార్థులుండరు. అయితే ఆయన చదువులు ఆయన తలమీది పిలక ముడినీ, నుదుటి నామాలనూ ఏమాత్రం మార్చలేకపోయాయి. మనిషి మంచి స్ఫురద్రూపి. వయసు మీదపడి ఇప్పుడు కొంచెం తగ్గినా, యవ్వనంలో మంచి వస్తాదు. త్రికాల సంధ్య వారుస్తాడు. చిన్న మేస్టార్లు త్రిపాఠి¸ గారంటే భయపడతారు. అందర్నీ పరుగులు పెట్టిస్తూ పనులు చేయించడంలో నిష్ణాతుడాయన. వెనకాల ఎన్ని సణుక్కున్నా ఆయన ఎదురుగా మాత్రం ఎవరూ నోరు విప్పరు.
ఇన్ని సుగుణాలున్న త్రిపాఠిలో కొన్ని అవలక్షణాలు కూడా ఉన్నాయి. ఆయనను రోగంలా పట్టి పీడిస్తున్న లక్షణాలు- కుల పట్టింపులు, అంటరానితనం.

'ఈ శూద్రులు ఎప్పటికీ ఏమీ నేర్చుకోలేరు. ఏబీసీడీలు నేర్చుకుందుకు సంవత్సరాలు పడుతుంది. స్కూలుకి ఇవాళ వస్తే రేపు రారు. వీళ్ల నైజం బురదలో పడి దొర్లడం... అంగారః శతధౌ తీన...' అన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం.
ఆయనకు పదిహేనెకరాల పంట భూమి ఉంది. దాన్ని కౌలుకి ఇచ్చేశారు. ఒక ఎకరం కొబ్బరితోటను మాత్రం సొంతంగా చేసుకుంటున్నారు. అందులో రెండు వందల కొబ్బరి చెట్లున్నాయి. తోటలో పని చెయ్యడానికి పక్క పాలెంలోని మధువాభాయి ఉన్నాడు. తోటలో కంద, అల్లం, పెండలం అంతరపంటలు వేస్తుంటారు.

రిటైరైపోయాక త్రిపాఠి తోటపనీ గట్రా రెండు సంవత్సరాలపాటు చూసుకున్నాడు. అయితే అందులోని కష్టం త్వరలోనే తెలిసి వచ్చి, పాఠాలు చెప్పినంత సులువు కాదు, వ్యవసాయం చెయ్యడం అన్న సత్యాన్ని తెలసుకున్నారాయన. భూములన్నింటినీ మళ్లీ కౌలుకి ఇచ్చేశారు. ముఖ్యంగా ఆయన సుపుత్రుడు అమెరికా వదలి రానని కరాఖండిగా చెప్పేశాక త్రిపాఠికి అన్నింటి మీదా విరక్తి వచ్చేసింది. ఆయన భార్య ఏకంగా మంచం పట్టేసింది. త్రిపాఠి¸కి ముందునుంచీ సందేహంగానే ఉండేది. కొడుకు ఐ.ఐ.టిలో సీటు రాగానే ఢిల్లీ వెళ్లాడు. ఆ తర్వాత రూర్కీ వెళ్లాడు. అటునుంచి అటు స్టేట్స్‌కి వెళ్లిపోయాడు. కొడుకును చూసుకుని త్రిపాఠి ఎంతో మురిసిపోయేవాడు.

ఆయన కింద పనిచేసే అసిస్టెంటు రవుతు కొడుక్కి ఆర్‌.ఇ.సిలో సీటు వచ్చింది. రవుతు ఆనందాన్ని చూసి ఓర్వలేకపోయేవాడు త్రిపాఠి. చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికైనా డాక్టరు, లెక్చరరు, చివరకు ప్యూను ఉద్యోగం వచ్చినా ఆయన సహించలేకపోయేవాడు.

ఛీఫ్‌ సెక్రటరీ తమ అమ్మాయిని యిస్తామంటూ సంబంధం కుదుర్చుకోవడానికి వచ్చారు.
'మా అబ్బాయి వస్తాడు. చూసుకుంటాడు. కొంచెం ఆగండి' అంటూ అభ్యర్థించాడు త్రిపాఠి¸. కానీ ఆయన ఆశలన్నీ అడియాశలైపోయాయి. ఆయన అహంకారమంతా బుగ్గిపాలయిపోయింది. బోలెడు డబ్బు ఖర్చు పెట్టుకుని ఆయన స్వయంగా శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాడు. కానీ కొడుకు మారిపోయి కనిపించాడక్కడ. 'ఇండియాలో ఏముంది? ఒట్టి కరప్షను తప్ప, ఎవడేనా కాస్తంత ఎదుగుతున్నట్టు కనిపిస్తే వాణ్ణి ఎలా పడగొట్టాలా అన్న చింతన! రాంగ్‌ పాలసీలు! నేనిక్కడ రీసెర్చి చేస్తున్నాను. పెంటగన్‌ గూఢచార సంస్థలో నేనొక విశిష్ట సభ్యుడిగా ఉన్నాను. అమెరికా పౌరసత్వం తీసేసుకున్నాను. నో మోర్‌ ఏనిండియన్‌!' అంటూ తండ్రికి ఎదురు తిరిగాడు తనయుడు. కొడుకు రానని అలా తెగేసి చెప్పాక త్రిపాఠి¸ మొహం మాడ్చుకుని వెనక్కి వచ్చేశాడు. భర్తను చూసి పరిస్థితిని అర్థం చేసుకున్న ఆయన సతీమణి స్పృహ తప్పి పడిపోయింది. చుట్టాలు పక్కాలు వచ్చి పరామర్శించి వెళ్లారు. దాంతో మేస్టారికి నడుము విరిగినంత పనయింది. ఆ రోజు నుంచి ఆయన బయట తిరగడం మానుకున్నాడు.

పైగా కొడుకు, ''మీ ఇద్దరూ ఇక్కడకు వచ్చేయండి,నాకూ బాగుంటుంది''అన్నాడు.
కానీ మేస్టారుకి గ్రామంలోని చేపల చెరువునీ, కొబ్బరి తోటనీ, పంట పొలాలనూ వదలడం ఇష్టం లేదు. అనాదిగా ఇతరుల మీద వెలిగిస్తోన్న పెత్తందారీతనాన్నీ ఆయన వదులుకోలేకపోయాడు. అమెరికాలో ఉన్న నాలుగు రోజులూ ఆయనకు ఊపిరాడింది కాదు. అక్కడి ఆధునికతను చూసి ఆయన బెదిరిపోయాడో, గ్రామంలో తమకున్న పెద్దరికం కట్టిపడేసిందో, లేక ఆయన తెల్లరంగు అమెరికా తెల్లదనం ముందు తెల్ల మొహం వేసిందో మరి, ఆయన కొడుకుతో తర్కంలోకి దిగలేదు. ఒక క్షణంలో గాంధీజీలా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ కొడుకు ముందు కూర్చుందామనిపించినా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. కొడుకు రైటో, తాను రైటో తేల్చుకోలేని సందిగ్ధంలో పడ్డాడాయన.
''ఒరేయ్‌! నువ్వు కొడుకుతో ఆటలాడుతున్నావా లేక గడ్డి పోగేస్తున్నావా? చాల్లే చూపించిన ప్రేమ... వీళ్లని మనం ఎంత ముద్దు చేస్తామో అంతగా పెద్దయ్యాక మననెత్తికెక్కుతారు''

మధువా భార్య సాబి అక్కడే కొడుక్కి ఏదో తినిపిస్తుంది. కుర్రాడు తల్లిలా నల్లగా ఉన్నాడు. త్రిపాఠి ఎందుకనో పట్టిపట్టి చూశాడు. గతంలో వాణ్ణి ఆయన ఎన్నిసార్లు చూసి ఉన్నాడు. కానీ ఈ రోజెందుకో చాలా ఆదరంగా చూశాడు. కుర్రాడి మొహంలో లావణ్యం కనబడింది. ఆ చిన్నవాడికి మూడు నాలుగేళ్లుంటాయి. ఖిన్న వదనంతో త్రిపాఠి ఇంట్లోకి వెళ్లాడు. కుర్రవాడి కేకలు ఇంట్లోకి వినబడుతున్నాయి. తన గుమ్మం ముందు ఆడుతూ పాడుతూ గెంతుతున్నాడు వాడు. పరాగ్గా ఉంటే యింట్లోకి వచ్చేసినా వచ్చేస్తాడు. వచ్చేస్తే ఇల్లంతా మైలపడిపోతుంది! లోపల్నుంచి అరిచాడు మేస్టారు.

''ఓ సాబీ! నీ కొడుకుని కాస్తంత అదమాయించు. మా లోపలకు జొరబడకుండా చూడు!'' అని వీధి తలుపులు బిగించాడాయన. గ్రామంలో అన్ని జాతులవారూ ఉన్నారు. కరణాలు, మస్తాన్లు, పండాలు, అవధాన్లు, ఖండాయతులు, మహంతీలు, గొల్లలు వగైరాలు. రెండు రజకుల ఇళ్ళు, తాళ్లు పేనుకుని బతికే వాళ్లు, సాలెలు, కొండరా (మాదిగలు) వగైరాలు కూడా ఉన్నారు. కరణాల ఇళ్ళన్నీ అద్దెకివ్వబడ్డాయి. వాళ్లంతా శాశ్వతంగా కటక్‌, భువనేశ్వర్‌లకు మకాం మార్చేయడమే దానికి కారణం. కరెంటు డిపార్టుమెంటువాళ్లూ, గ్రామీణ బ్యాంకు మేనేజర్లూ, పోస్టుమేస్టర్ల లాంటివాళ్లు కరణాల ఇళ్లలో అద్దెకుంటున్నారు. కుప్ప నూర్పిళ్ల రోజుల్లో పిల్లల్ని వెంట బెట్టుకుని మహంతీలు గ్రామంలోకి వస్తారు. వారి రాకతో గ్రామానికి ఒక కొత్త కళ వస్తుంది. అయితే ఈ రోజుల్లో గ్రామాల్లో కూడా ఫ్యాషన్‌కి లోటేంలేదు. గ్రామంలోని దిబ్బ రొట్టె అమ్మాయిలందరూ దోసకాయలు తింటూ డైటింగు చేస్తున్నారు. అలంకరణ సామాగ్రి గ్రామీణ దుకాణాల్లో కూడా దొరుకుతోంది. మెహందీలు, ముల్తానీ మట్టి వగైరాలు. పట్టణవాసం అమ్మాయిలకు ఈ పల్లెటూరి అమ్మాయిలు ఏ రకంగానూ తీసిపోవడం లేదు.

మహంతీ పేటలో చాలామంది త్రిపాఠి గారి శిష్యులున్నారు. వాళ్లంతా పెద్దవాళ్త్లెనా స్కూటర్లు, కార్లమీద వెడుతూ కూడా మేస్టారు ఎదురయితే బండిదిగి నమస్కరించి వెడుతుంటారు. వారిని చూపించి, సరైన చదువులు లేని స్వజాతి యువకుల్ని మందలిస్తుంటారు మేస్టారు.
''బుద్ధి తెచ్చుకోండి, రాజ మహారాజాల కాలంలో ఈ పదవులన్నింటినీ మనం నిర్వహించే వాళ్లం. మీరంతా ఇప్పుడు బడుద్ధాయిల్లా తయారయ్యారు కాబట్టి ఈ మహంతీలు ఇంతగా ఎదిగిపోయేరు.''

మేస్టారు ఎదురయితే పిల్లలు మొహాలు చాటేసుకుని తిరగడం మొదలు పెట్టారు. అయినా ఉద్యోగాలు ఏమయినా చెట్లకు కాస్తున్నాయా?బీఏ, ఎంఏలు పాసయినా చివరకు ప్రయివేటు కంపెనీల్లో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం కూడా దొరకడం లేదు.
త్రిపాఠి¸ గ్రామ పౌరోహిత్యం పని మానుకున్నాడు. ఒకవేళ వెళ్లినా, పిల్చిన యజమానిని కాల్చుకుని తినేశాడన్నమాటే! ఇలాగనీ అలాగనీ నానారకాల విధివిధానాలతో విసిగించడమే కాక, 'అసింటా... యిసింటా' అంటూ అవమానపరుస్తాడు. నాలుగయిదు గంటల పాటు పెద్ద కంఠంతో సంస్కృత శ్లోకాలు చదువుతూ ప్రాతఃకాల సుఖశాంతుల్ని హరాయించేస్తాడు. వచ్చేముందే దక్షిణ డబ్బులు గురించి కరారు చేసుకుని మరీ వస్తాడు. అనార్యులను వేదమంత్రాలతో పవిత్రులను చేసినందుకు గాను కనీసం వందరూపాయలైనా ఇవ్వకుంటే ఆయన చిర్రెత్తిపోతాడు.
త్రిపాఠి¸కి మరొక రోగం కూడా ఉంది. గౌరవర్ణం, నలుపు రంగు శరీరం వాళ్లను ఆయన ఏవగించుకుంటారు. దానికాయన చెప్పే కారణాలు వింటే ఎవరికైనా ఒళ్లు మండుకొస్తుంది.

త్రిపాఠి¸ మంచంమీద పడుకుని భార్యకేసి చూశాడు. ఆమె కళ్లు మూసుకుని పడుకొని ఉంది. కొంతసేపు తర్వాత కళ్లు తెరిచి పైకి చూస్తూ, ''కానీండి... మనకెవరూ లేరనుకుందాం. ఈ లోకంలో పిల్లలు లేని వాళ్లెంతమంది లేరు! వాళ్లంతా చచ్చిపోతున్నారా? మీరేం బాధపడకండి... బతికినన్నాళ్లు బతుకుతాం. చచ్చిపోయేముందు ఆస్తిని ఏ పాఠశాలకో రాసి చద్దాం. శాశ్వతంగా పేరయినా నిలబడుతుంది'' అంది. అనేసి మళ్లీ ఆమె కళ్లు మూసుకుంది. ఆమె పెదవులు, కనురెప్పలు వణికాయి. కన్నీరు కిందకు జారింది.

సదానందబాబు ఇప్పుడు బొత్తిగా బయటకు రావడంలేదు. గ్రామ సంతర్పణలకు గానీ, బ్రాహ్మణార్థాలకు గానీ, బజారుకేసి గానీ, ఎక్కడకూ రావడం లేదు. నెలకోసారి పెన్షనుకోసం ట్రెజరీకి వెళ్లివస్తాడు. అంతే. ఆయన భార్య చుట్టుపక్కల ఇళ్లకు కూడా వెళ్లడం లేదు. ఆమెకు జీవితంలో ఇదే మొదటి దెబ్బ చివరిదెబ్బ అయింది. ఒక్కసారిగా పది సంవత్సరాల వయసు మీద పడినట్టయింది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆమె ఒంటి చేతిమీద మొత్తం ఇంటిని నడిపించిన మనిషి! త్రిపాఠి¸ చేత పచ్చిమిరపకాయ తొడిమను కూడా తెంపనివ్వని మనిషి! ఇప్పుడేమో లేచి కూర్చోలేకుండా అయిపోయింది. భర్త ఎంతగా నచ్చజెప్పినా ఆమె మాతృ హృదయం సమాధాన పడలేకపోతోంది.

త్రిపాఠి¸ దగ్గరి బంధువు ఆ పక్కనే ఉంటున్నాడు కానీ, భూమి తగాదాల విషయంలో పేచీలు పడి ఒకరి గుమ్మాలొకరు తొక్కడం మానుకున్నారు. త్రిపాఠి¸ అత్తగారి వైపు బంధువర్గం అంతా దూరంగా రూర్కెలాలో ఉంటున్నారు. బావమరదుల పిల్లలు అప్పుడప్పుడు వస్తుంటారు. కానీ వాళ్లూ ఎన్నాళ్లని రాగలరు? ఎవరి సమస్యలు వాళ్లకుంటాయి. చుట్టుపక్కల ఇళ్లవాళ్లు... ఆడవాళ్లు అప్పుడప్పుడు వచ్చి చూసిపోతున్నా ఇంటిపనిని వాళ్లమీద వదిలేయలేరు కదా? రెండువందల రూపాయలు నెల జీతం మీద ఓ వంట మనిషిని పెట్టుకున్నారు. మూడో నాటినుంచి ఇంట్లోని వస్తువులు ఒక్కొక్కటే మాయం కావడం మొదలెట్టాయి. సంతనుంచి ఎవరిచేతనైనా కూరలు గట్రా తెప్పించుకుంటే పదీ ఇరవై కొట్టేస్తున్నారు. పని చెప్పేటప్పుడు ఖుసామత్తు జమాఖర్చుల దగ్గర కసరత్తు తప్పడం లేదు. ఇలా కాదని ఓ రోజు మధువాని సంతకు పంపించారు. చక్కగా సంత చేసుకుని రావడమే కాదు, జమా ఖర్చులు కూడా సరిగా అప్పగించాడు. ఆనాటినుంచి ఇవాళ్టి వరకూ సంతపని మధువాయే చూస్తున్నాడు.

శీతాకాలంలో వేకువనే లేచి త్రిపాఠీ స్నానం చేసి తిరిగి వస్తున్నాడు. చిన్న చెరువు దగ్గర ఓ స్త్రీ వంగొని యేదో చేస్తూ కనబడింది. దొంగ అనుకొని అటువైపు పరుగు పెట్టాడు. తీరా చూస్తే సాబి అక్కడ పని చేస్తూ కనబడింది. ఆమె ఆయన్ను చూసి నిలబడి నమస్కరించింది. సాబీని ఇంత దగ్గరగా ఆయన ఎన్నడూ చూడలేదు. గతంలో తను అజ్ఞానాహంకారాలతో వాళ్లని లెక్క చేసేవాడు కాదు. అపరిశుభ్రంగా ఉంటారని చిన్నచూపు చూస్తూ వచ్చాడు. కానీ సాబీని చూశాక ఆయనకు కనువిప్పు కలిగింది. ఈసారి పట్టి పట్టి చూశాడాయన. అందమైన మొహం... తీర్చి కట్టిన చీర పొందిగ్గా ఉంది. ఆమె కొడుకు ఆ పక్కనే నీరెండలో కూర్చుని ఉన్నాడు. వాడి చేతిలో పలక... పలకమీద 'అ' నుంచి 'హ' వరకూ అక్షరాలు గుండ్రంగా ఉన్నాయి. ఆయనకు ఏమయిందో మరి, వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు.

ఆ సాయంకాలం త్రిపాఠి పెరట్లోకి ఓ ఆవు దూరింది. ఆ పెరట్లోకి ఎవరికీ ప్రవేశం లేదు. మధువా, సాబీల సంగతి చెప్పనవసరం లేదు. వాళ్ల నీడ కూడా పడనంత దూరాన ఉండాల్సిందేను. బొప్పాయి చెట్లను తినేస్తోంది ఆవు... అదీ ఆయన బాధ. దాన్ని బయటకు తోలగల బలం లేదాయనకు. మధువాని పిల్చారు. మధువా లేకపోవడంతో సాబి వచ్చింది కానీ... పెరట్లోకి ప్రవేశించడానికి ఆమె జంకుతోంది. త్రిపాఠి అరిచాడు-

''ఏయ్‌... ఆవు చెట్లు తినేస్తుంటే అలా చూస్తూ నిలబడతావేంటి? దాన్ని కొట్టు... కొట్టు...''
సాబి మొదటిసారిగా ఆయన అభ్యంతర ప్రాంగణంలోకి అడుగు పెట్టింది. కర్రతో ఆవును అవతలకు తోలేసి, ఆవుతోపాటు తనూ తొందరగా బయటకు పోయింది, వెనక్కి తిరిగి చూడకుండా.

నాలుగయిదు రోజుల తర్వాత- మధువా కొబ్బరి కాయలు దింపుతున్నాడు. కొబ్బరి చెట్లు- ఒకటా రెండా- అన్నింటినీ ఎక్కుతూ దిగుతూ శ్రమిస్తున్నాడు. అతణ్ణి చూసి కొబ్బరి చెట్టు కింద నిలబడ్డ కొడుకు పకపకా నవ్వుతున్నాడు. సాబి కాయలన్నింటినీ ఒక చోటకు చేరుస్తోంది. అప్పడాల కుర్రాడు ఆ దారినపోతూ కనబడగానే సాబి కొడుకు ''అప్పలం... అప్పలం'' అంటూ మారాం చేశాడు. సాబి ఎంత ప్రయత్నించినా వాడు ఊరుకోవడం లేదు. హఠాత్తుగా త్రిపాఠీ అప్పడాల అబ్బాయిని పిలిచి రెండప్పడాలు కుర్రవాడికి ఇప్పించాడు. ఆ సమయానికి ముసలావిడ నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడకు వచ్చింది. కుర్రాడు అప్పడాలు తినేసి ఆనందంగా గెంతుతూ కనిపించాడు. ముసలావిడ రెప్పార్పకుండా సాబి కొడుకుని చూస్తుండి పోయింది. ఆమె కళ్లు ఆనందంతో మెరిశాయి. చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుంటుండగా త్రిపాఠిగారామెను ఇంట్లోకి నడిపించుకుంటూ తీసుకుపోయారు.

ఇప్పుడు వంటపని కూడా త్రిపాఠి¸యే చూసుకుంటున్నాడు. ఇంట్లో గ్యాసు పొయ్యి ఉంది. అన్నం, కూర, బంగాళాదుంప వేపుడు, వంకాయ పచ్చడితో ఇద్దరూ భోజనాలు కానిస్తున్నారు.

ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఒక పార్సిలు, రిజిష్టరు ఉత్తరం వచ్చాయి త్రిపాఠి పేరుమీద.
అయిదువేల డాలర్లకు ఒక డి.డి., కంప్యూటరులో కంపోజ్‌ చేసిన ఒక చిన్న ఉత్తరం, ఓ పెద్ద సైజు ఫొటో వచ్చాయి. కొడుక్కి కొడుకు పుట్టేడుట- వాడి పేరు క్లయివు. ఫొటోలో పిల్లాడు ఎంత బాగున్నాడో! మొదటిసారిగా త్రిపాఠి కళ్ల నీళ్ళు పెట్టుకున్నాడు. ముసలావిడ చూస్తే బాధ పెరుగుతుందని మొహాన్ని పక్కకు తిప్పుకుని ఎడంచేత్తో ఫొటోను ఆమెకు అందించాడు.

''తీసుకో! నీ మనవణ్ణి చూసుకో...''
ఫొటోని గమ్మున లాక్కుని చూసింది ముసలావిడ. ఫొటోను చూస్తూ యేడుపూ నవ్వూ కలగలుపు స్వరంతో యేమిటేమిటో అంది. ఆవిడ మాటలు ఎవరికీ అర్థం కాలేదు. త్రిపాఠి లేఖను చదివాడు.
''మీరిక్కడకు రండి. నేను ఎన్నటికీ రాలేను. వీడు... క్లయివ్‌...''
ఈడియట్‌, రాస్కెల్‌- అన్న పదాలు ఆయన నోటెంట వెలువడ్డాయి. 'వదిలేయ్‌' అని తనకు తాను నచ్చజెప్పుకున్నాడు.
''వాడిని నిందించి లాభం లేదు. ఎందరో అమెరికాకి పోతున్నారు. తిరిగి రావడం లేదు. అయినా వాళ్ళ వాళ్ళందరూ బతకడం లేదూ?! కానీ... ఆ భగవంతుడు వాణ్ణీ, వాడి పిల్లల్నీ చల్లగా చూస్తే అంతే చాలు'' చేతులు పైకెత్తి గొణుక్కున్నాడాయన.

తర్వాత భార్యతో అన్నాడు,
''ఇదిగో... నీ కొడుకు నీకు కావలసినంత డబ్బు పంపించాడు. నౌకర్లను పెట్టుకో... వంట మనిషిని పెట్టుకో... పెద్ద పెద్ద డాక్టర్లచేత వైద్యం చేయించుకో... డబ్బు గురించి ఆలోచించకు... నీకింకా బాధేవిటి?''
''మీరేం వెక్కిరించ నక్కరలేదు...'' ముసలావిడ ఏడుస్తూ అంది.
త్రిపాఠీ ఆ ఫొటోని తన డైరీలో దాచుకున్నాడు. తర్వాత ఆ వృద్ధ దంపతులు ఆ ఫొటోని ఒకరికి తెలియకుండా ఒకరు ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నారో లెక్కలేదు.

ఆరోజు తోటలో మధువా కానీ సాబి కానీ కనిపించలేదు త్రీపాఠీకి. ఏదో పని ఉందని ప్రధాన్‌ ఇంట్లో చెప్పి వెళ్లిపోయారు. కొబ్బరికాయ లెక్కింపు పని ప్రధాన్‌ని చేసి పెట్టమని మధువా కోరాడు. కాయ లెక్కించనవసరం లేదని అలాగే పంపేయమనీ ప్రధాన్‌కి చెప్పాడు త్రిపాఠీ. మధువాని కలవడం కోసం అతడి ఇంటికేసి బయల్దేరాడు.

మేఘం కమ్ముకొస్తోంది. తొందరగా కాయను ట్రాక్టరుకి ఎక్కించాలి. ప్రధాన్‌కి ముగ్గురు కొడుకులు. అంతా శ్రమపడి పని చేస్తారు. పెద్ద మనవడు డాక్టర్‌ చేసి గత సంవత్సరం కెనడా వెళ్లాడు. అతడు కెనడా వెళ్లిన రోజునుంచీ, త్రిపాఠి గారబ్బాయి అమెరికా వెళ్లిన సంగతి మాములు విషయంగా మారిపోయింది. త్రిపాఠి గొప్ప బోడిగొప్పగా మారింది. విషయం విన్న త్రిపాఠి ప్రధాన్‌కి ఓ సలహా ఇచ్చారు.

''కుర్రవాడికి పెళ్లిచేసి పంపు. ఒకవేళ నా కొడుకులా కనక చేస్తే...''
''ఫరవాలేదులెండి బాబాయిగారు! నాకా బాధలేదు. వాడక్కడే ఉండదలిస్తే ఉండనీయండి. మన బాధ్యత మనం తీర్చేం. మిగతా విషయాలు వాళ్లు చూసుకోవాలి. నాకింకా ఇద్దరు కొడుకులున్నారు. వాళ్లని చూసుకుంటూ బతికేస్తాను.''

త్రిపాఠి మౌనం దాల్చాడు.
''ఔను! ఇతగాడికి ముగ్గురు మగపిల్లలు. నాకు వాడొక్కడే. చచ్చేలోగానైనా వాణ్ణి కళ్లతో చూసుకొగలుగుతానో లేదో'' అనుకున్నాడు.
చాలా రోజుల తర్వాత ఇవాళ బయట ఊళ్లో తిరుగుతున్నాడు త్రిపాఠి¸. ఎవరేనా కనిపిస్తే మధువాకి కబురు పెట్టాలనుకున్నాడాయన. కానీ ఎవరూ కంటబడలేదు. ఓ మూలనుంచి మేఘం కమ్ముకొస్తోంది. మధువా తండ్రి సరబడు వస్తూ కనిపించాడు. సరబడు భుజంమీద మనవణ్ణి కూర్చోబెట్టుకుని వస్తున్నాడు. తాతా మనవడు మహా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు. మనవడు తాత జుత్తు పీకుతూ ఆడుతున్నాడు. దగ్గరవగానే సరబడు కాస్త జంకుతూ సమస్కరించాడు.

''నేను తవరి దగ్గరకే బయల్దేరానండి. మధువా పెద్ద బేమ్మాలు కబురెడితే ఎల్లాడండి.'' మనవడు త్రిపాఠీని గుర్తుపట్టి- ''అప్పలం తాతా! అప్పలం....ఇయ్యి!'' అంటూ మీదకంటా వచ్చేశాడు. త్రిపాఠి కొయ్య బారిపోయాడు.
సరబడు తాటి పరక తీసుకుని మనవడి వీపుమీద అంటించాడు. కుర్రాడు లబోదిబోమంటూ నేలమీద పడ్డాడు. త్రిపాఠి తల దించుకుని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటి దారిపట్టాడు. వెనక నుంచి కుర్రాడి ఏడుపు వినబడుతూనే ఉంది.

ఆ రోజుంతా త్రిపాఠి అదోమాదిరిగా ఉన్నాడు. ఆయన మనసు పాడయిపోయింది. భార్యతో కబుర్లు చెప్పాలనుకున్నాడు. అంతలో మనసు మార్చుకుని బయట అరుగు మీదకొచ్చి కూర్చున్నాడు. అన్నం ఉడికి ఉడికి గంజి వచ్చి పొయ్యిలో పడింది. ఒళ్లంతా జ్వరం తగిలి నట్టయింది. ఎంత ప్రయత్నించినా మనసు కుదుట పడ్డంలేదు. లోలోపల కుంగిపోతున్నారాయన.

సాయంత్రానికి జ్వరం వచ్చేసింది. గ్లాసెడు హార్లిక్స్‌ కలిపి భార్యకు ఇచ్చి తనూ తాగాడు. కళ్లు మూసుకుని మంచం మీద పడుకున్నాడు. ఓ రాత్రివేళకు జ్వరం పెరిగింది. రాత్రంతా నిద్దట్లో పలవరించాడు. భార్య కంగారుపడి పక్కింటి వాళ్ల ను లేపి సాయం తెచ్చుకుందామనుకుంది. పలవరింతల్లో త్రిపాఠి ఆకాశం నుంచి పాతాళానికీ, భూమి నుంచి అంతరిక్షంలోకి- ఏవేవో- ఎన్నెన్నో- కలలు కన్నాడు.

ఒక కల- ఆయన వాయుగుండంలో గిరగిరా తిరుగుతూ ఆకాశంలోకి ఎగురుతున్నాడు. భూగోళం తలకిందుగా కనిపించసాగింది. చల్లని గాలి ఆయన శరీరమంతా వ్యాపించింది. తెల్లవాళ్లు-నల్లవాళ్లు- జంధ్యాలు వేసుకున్నవాళ్లు- వేసుకోని వాళ్లు- శైవులు- కిరస్తానీలు- అంతా కలగా పులగం అయిపోయారు. అంతలో ఆయనకు మనవడు క్లయివు చిన్ని మొహం కనిపించింది. ఆ మొహం లాంటి అనేక బాలల మొహాలు గిరగిరా తిరుగుతూ కిలకిలా నవ్వుతున్నాయి. వాటి మధ్య ఒక బిందువు కనబడింది. ఆ బిందువు క్రమంగా పెద్దదయింది. తర్వాత అది ఏకముఖంగా కనిపించసాగింది. మధువా కొడుకు నల్లని మొహం పెద్దదవుతుంటే తన మనవడు క్లయివు మొహం గాలిలో విలీనమై మాయమయిపోయింది.
త్రిపాఠి లేచి కూర్చున్నాడు. చెమటతో శరీరం తడిసిపోయింది. జ్వరం తగ్గుముఖం పట్టింది. ఆయన లేచి తిరగకుండానే భార్య జ్వరం వచ్చి మంచం ఎక్కింది.

ఆరోజు సాబి వచ్చి పనిలో పడింది. త్రిపాఠి జ్వరం తగ్గినా శరీరం దుర్బలంగా ఉంది. భార్యను మరుగుదొడ్డికి తీసుకొని వెళ్లాల్సి ఉంది. ఆయనకు బొత్తిగా ఓపిక లేదు. దగ్గరగా ఎవరూ లేరాయె. సాబీని చూశారు. కానీ ముందూ వెనకా ఆలోచిస్తుండిిపోయారు, ఆమెను సాయానికి పిలవాలా వద్దా అని. భార్య తొందర చేయడంతో విధిలేక సాబి సాయం కోరారు. ఆయనకీ తల తిరుగుతోంది. సాబి త్రిపాఠి భార్య రెక్క పట్టుకుని తీసికెళ్లింది. ఆమె రాకకై ఎదురు చూస్తూ నిలబడ్డ త్రిపాఠి¸కి కళ్లు తిరగసాగాయి. ఒక్కసారిగా నీరసం కమ్మి స్పృహ తప్పి పడిపోయారాయన.

ఆయన కళ్లు తెరచి చూసేసరికి వీధి వసారాలో మంచంమీద పడుకుని ఉన్నాడు. పక్కనే భార్య కూర్చొని ఉంది. సాబి అరికాళ్లు మర్దిస్తోంది. ఆయన తుళ్లిపడి కాళ్లను దగ్గరగా లాక్కున్నాడు. సాబి తొట్రు పాటుతో లేచి నిలబడి అంది.
''తవర్రు పడిపోనారండి. నానేం చెయ్యనండి... అరిచి కేకలెట్టినానుండి... ఒవురూ రానేదండి... నాకేం చెయ్యాలో తోచలేదండి... అమ్మగారు సెప్మట్టి ఇద్దరూ సాయం వట్టి తెచ్చి పండబెట్టినాముండి. అమ్మగోరు డాట్రుగారినట్టుకు రావాడానికై ఎల్లినారుండి.''

అన్నదమ్ముడి వరస చుట్టం, భార్యతో సహా వచ్చి చూసి అన్నాడు-
''ఏంటన్నయ్యా ఇది? మమ్మల్ని పిలవచ్చుగదా? ఎందుకిలా చేశావు?'' అని సాబిని చూసి తిరిగి, ''నువ్వెందుకిలా దిగజారిపోయావు? నేనింకా పాత కక్షలు కడుపులో పెట్టుకుని కూర్చున్నాననుకున్నావా? ఈసారన్నా యేదేనా కావస్తే నాకు కబురు పెట్టు. తెలిసిందా?'' అన్నాడు.

అతని భార్య క్యారియరుతో భోజనం తెచ్చి టేబిలు మీద పెట్టింది.
''మేం వస్తాం. మా రవిని పంపుతాను... సాయంగా ఉంచుకోండి. మీ దగ్గరుంటే కాస్తంత మనిషిగా తయారవుతాడు'' అందావిడ.
కళ్లు మూసుకుని త్రిపాఠీ అంతా వింటూ ఆలోచనలో పడ్డాడు- 'వీడు తన జ్ఞాతి సోదరుడు. పదిహేను సంవత్సరాల క్రితం తనమీద ఒక తప్పుడు కేసు బనాయించినవాడు. చుట్టుపక్కల వారినెవరినీ తన ఇంటికి రాకుండా కట్టడి చేసినవాడు. వీధికి పెద్దయి కూర్చున్నాడు. వీడి రెండో కొడుకు రవి తుంటరి... తండ్రినే లెక్క చెయ్యడు. నాకు సేవ చేస్తాడా? ఏ రాత్రో నా పీక పిసికి పారిపోకుండా ఉంటే చాలు!'

మధువా డాక్టరుగారిని వెంట బెట్టుకుని వచ్చి త్రిపాఠి ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు ఆదుర్దాగా.
'ఎనిమిది సంవత్సరాలుగా వీడు తన దగ్గర పనిచేస్తున్నాడు. దొంగతనం అన్నది ఎరగడు. తనెప్పుడూ ఒక రూపాయి అధికంగా ఇచ్చి ఎరగడు. సరికదా, కనీసం నవ్వుతూ వాడితో ఆప్యాయంగా రెండు మాటలు మాట్లాడి ఎరుగడు. ఈ అమాయకుణ్ణి ఆమడ దూరాన నిలబెట్టి తన కామందుగిరీ చూపిస్తూ అవమానపరచాడు- అయినా వాడు ఒక్కనాడు కూడా నోరెత్త లేదు. తన హద్దుల్లో తానుంటూ గౌరవంగా మసలుకున్నాడు.'

అలా ఆలోచించుకుంటున్న త్రిపాఠి¸కి కడుపులో తిప్పినట్టయింది. రెండు వాంతులయ్యాయి. డాక్టరు ఇంజక్షను ఇస్తూ సాబిని ఎగాదిగా చూశాడు. త్రిపాఠి¸కి ఒళ్లు మండింది డాక్టరు వాలకానికి!
నాలుగు రోజుల తర్వాత ఉదయాన్నే ముందు వసారాలో గోడకు జేరబడి కూర్చున్నాడు త్రిపాఠి. దీర్ఘాలోచనలో పడ్డాడాయన. ఏదో వెలితిగా అనిపిస్తోంది. ఉన్నట్టుండి గుమ్మం ముందు వినబడిన సవ్వడికి కళ్ళు తెరచి చూశాడు.

ఆహా... మధువా కొడుకు వచ్చేశాడన్నమాట... ఆయన మొహం సంతోషంతో విప్పారింది. నెమ్మదిగా గుమ్మందాకా వచ్చాడు. ఎదురుగా కొబ్బరి చెట్టు కింద బల్ల మంచం మీద పలకా బలపం పట్టుకుని కూర్చున్నాడు మధువా కొడుకు. త్రిపాఠీకి రోమాంచితమయి శరీరం పులకరించింది. ఆయన్ని చూసిన గుంటడు భయం భయంగా బిక్కమొహం వేశాడు.

త్రిపాఠి రొంటినున్న చాక్లెట్టు తీసి వాడికి చూపించాడు. గుంటడు చూసినా, యేమనుకున్నాడో యేమో... ఎదురు రాలేదు... పారిపోనూ లేదు. త్రిపాఠి¸ చెంగున వాడిని దొరకబుచ్చుకున్నాడు. పరిష్వంగ సుఖంతో త్రిపాఠి¸ ఛాతి పొంగింది. మానసికంగా సేదదీరారాయన. గుంటడు గింజుకున్నా, చాక్లెట్టు తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు.
త్రిపాఠి అటూ ఇటూ చూసి, మధువా కొడుకుని తనివితీరా ముద్దు పెట్టుకున్నాడు. మరుక్షణం కుర్రాణ్ణి వాడి మానాన వాణ్ణి వదిలేసి, కంగారుగా లోపలకు వెళ్ళిపోయాడు!

No comments: