Thursday, December 13, 2007

మంచు బొమ్మ - తెలుగు కథ

'సమర్థులు అవకాశాల కోసం ఎదురుచూడరు. అవకాశాలని తమంతట తామే సృష్టించుకుంటారు' అని మమ్మల్ని ఉత్తేజపరచడానికి మా మార్కెటింగ్‌ ట్రైనింగ్‌లో చెప్పేవారు.కానీ ఆ మాటల్లో నిజం లేదని నా అభిప్రాయం. ఎంతటివాళ్త్లెనా కానీ అవకాశాలనేవాటిని వాళ్లంతట వాళ్లు సృష్టించుకోలేరు. అసలా మాటకొస్తే అవకాశాలని ఎవరూ సృష్టించరు. వాటంతటవే సమాజంలో సహజసిద్ధంగా ఉంటాయి. వాటిని వెదికి పట్టుకోవడం, గుర్తించగలగడంలోనే వుంటుంది సమర్థత అంతా.

దానికెంతో చొరవ, ఓపిక, ఆసక్తి కావాలి. అవి లేనివాడు 'మార్కెటింగ్‌'లో రాణించలేడు.
ఆ పల్లెటూరి రైల్వే ప్లాట్‌ఫార్మ్‌ మీద డాక్టర్‌ శర్మగారిని చూడగానే నన్ను నేనే అభినందించుకున్నాను.
ముందు రోజు రైలెక్కేదాకా ఏవేవో పనులమీద ఎడతెరిపి లేకుండా తిరుగుతూనే ఉన్నాను. చాలా అలసటగా ఉంది. ఒళ్లంతా నొప్పులుగా ఉంది.
రాత్రంతా కురుస్తున్న వర్షం అప్పుడే తెరిపినిచ్చి గాలి చల్లగా, హాయిగా వీస్తోంది. రైల్లో నా రిజర్వుడు బెర్తుమీద పడుకుంటే చక్కగా నిద్ర పట్టేస్తుంది. అయినాసరే ముందు స్టేషన్‌ దగ్గర వర్షానికి పట్టాలు కొట్టుకుపోయి రైలు ఆగిపోయిందన్న విషయం తెలియగానే కిందకి దిగకుండా ఉండలేకపోయాను.

నాలో ఆ ఆసక్తే లేకపోతే ఈ అవకాశం వచ్చి ఉండేది కాదు కదా అనిపించింది, అక్కడ శర్మగారిని చూడగానే.
శర్మగారు నెల్లూరులో పెద్ద పేరున్న డాక్టర్‌. ఎంత పేరున్న డాక్టరంటే నెల్లూరులాంటి పెద్ద ఊళ్లో కూడా ఉన్న అన్ని మెడికల్‌ షాపుల్లోనూ అమ్మకాలు సగానికిపైగా ఆయన రాసిచ్చిన ప్రిస్కిప్షన్ల మీదే జరుగుతాయనడంలో అతిశయోక్తి లేదు.
అందుకే నాలాంటి ఎందరో మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లు ఆయన ప్రాపకం సంపాదించుకుని తద్వారా తమ కంపెనీ సేల్సు పెంచుకోవడానికి నిరంతరం అర్రులు సాచుతూ వుంటారు.

పేషంట్స్‌ని చూడటం ఆపేసి, మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లతో మాట్లాడే చాలామంది డాక్టర్లకన్నా భిన్నంగా శర్మగారు పేషంట్సుని చూడడం అయిపోయాక లేదా వాళ్లు లేని ఖాళీ సమయాల్లో మాత్రమే మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లను కలుస్తారు. అదీ రోజుకి నలుగుర్నో, ఐదుగుర్నో అంతే!
అన్ని రంగాల్లోనూ పోటీ ఉన్నట్లు మా మందుల తయారీ రంగంలోనూ చాలా గట్టి పోటీనే ఉంది. తయారుచేసేది ఒకే మందునైనా, డాక్టర్లు రాసే 'బ్రాండ్‌'లని బట్టే అమ్మకాలు.

రోగిని పరీక్షించి మందులు రాసేటపుడు డాక్టర్లకి మా 'బ్రాండ్‌'ని గుర్తు చెయ్యడానికి మేము పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు!
మా కంపెనీ పేరున్న గడియారాలు, లెటర్‌ ప్యాడ్స్‌, పేపర్‌ వెయిట్లు, పెన్నులు, పెన్ను స్టాండులు డాక్టర్ల గదిలో ఉంచడం దగ్గర నుంచీ, డాక్టర్లకి ప్రత్యేకమైన గిఫ్టులివ్వడం, వాళ్ళ కుటుంబ సభ్యులకి 'హాలీడే పేకేజీ'లని అరేంజ్‌ చేయడం వరకూ... ఎన్నో ప్రయత్నాలు చేస్తాం.

మా కంపెనీలు మాకిచ్చే 'ఇన్సెంటివ్‌'లు ఇవన్నీ చేయడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తాయి.
'ఒక్కసారి శర్మగార్ని పడగొట్టగలిగితే చాలు... మన టార్గెట్లలో డెబ్భై శాతం వరకూ చూసుకోనక్కర్లేదు' అనుకుంటాం మాలో మేము.
కానీ ఆయన్ని పడగొట్టడం అంత తేలికైన విషయం కాదని నాకు ఆయనతో మాట్లాడాకా తెలిసింది. అదీ ఆయన మాకు కేటాయించే అయిదారు నిమిషాల్లోనూ.

'ఎంతో ప్రయత్నిస్తే తప్ప, ఎన్నోసార్లు కలిస్తే తప్ప... ఆయన మనం చెప్పే మందులు రాయడు' అనేవారు ఆయన గురించి మా సీనియర్లు.
నాలో పంతం పెరిగేది.
గత ఐదారు నెలలుగా ప్రతి నెలలోనూ ఆయన్ని క్రమం తప్పకుండా కలుస్తున్నాను. వెళ్లిన ప్రతిసారీ ఆయన కలిసే ఐదారు మందిలో నేనూ ఖచ్చితంగా ఉండటం కోసం ముందే వెళ్లి ఎంతో సమయం వృథా చేసుకుంటున్నాను.
అసలు ఆయన దగ్గరకొచ్చే పేషంట్ల సంఖ్య చూస్తే నాకు మతిపోయేది. జనాన్ని ఆకట్టుకోవడంలో మాకు తెలియని గొప్ప రహస్యమేదో ఆయనకి తెలుసనిపించేది.

ఆయన్ని ఆకట్టుకోవడానికి నేను చేసే ప్రయత్నాలేమీ పెద్దగా ఫలితాలనివ్వడంలేదు. అయినా నా ప్రయత్నాలని ఆపలేదు. ప్రయత్నం చేయకపోవడం అంటే పోరాడకుండానే ఓటమిని ఒప్పేసుకోవడం నా దృష్టిలో.
''ఇవన్నీ ఎందుకు? మందుల శాంపిల్స్‌ ఇవ్వచ్చుకదా?'' నేను ఆయన టేబుల్‌ మీద పెడుతున్న ఫ్రీ గిఫ్టులని చూస్తూ అన్నాడాయన ఒకసారి.
నోరు తెరిచి ఆయన నన్ను కోరిన మొట్టమొదటి కోరిక...
ఎంతటి వాడికైనా ఒక బలహీనత వుంటుంది. ఆయన 'వీక్నెస్‌' ఏమిటో అర్థమయింది. అప్పట్నుంచీ వెళ్ళినపుడల్లా బహుమతుల బదులుగా మా కంపెనీ శాంపిల్స్‌నే తీసుకువెళ్ళడం మొదలుపెట్టాను. అయినప్పటికీ ఆయన మా కంపెనీ మందుల్ని రోగులకి రాయడం చాలా అరుదుగా జరుగుతోంది.

ఎంతమందో పెద్ద పెద్ద డాక్టర్లని సైతం ఆకట్టుకోగలిగిన నాకు శర్మగారు ఒక కొరకరాని కొయ్యలా కనిపించారు. నాలో పట్టుదల పెరిగిందే కానీ తగ్గలేదు.
ఆయన మా మందులు రాయాలంటే ఏదో ఒక రకంగా ఆయన్ని నేను ఆకట్టుకోవాలి. అది నా ఉద్యోగానికి సంబంధించిన సమస్యలా కాక నా 'అహానికి' సంబంధించిన సమస్యలా అనిపించసాగింది నాకు.
అక్కడ... ఆ రైల్వే ప్లాట్‌ఫార్మ్‌ మీద తోచకుండా తిరుగుతున్న శర్మగారిని చూడగానే నాలోని 'సేల్సుమాన్‌' నిద్ర లేచాడు.
'ఈ అవకాశాన్నెలాగైనా సద్వినియోగపరుచుకోవాలి' అనుకుంటూ వడివడిగా ఆయన వైపు నడిచాను.
రైలు అక్కడ ఆగి అప్పటికి నాలుగు గంటలయింది. తెల్లవారి, వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో అప్పుడప్పుడే కొంతమంది ప్రయాణికులు కిందకి దిగి ప్లాట్‌ఫార్మ్‌ మీద తిరుగుతున్నారు.
ప్యాసింజరు రైళ్ళు కూడా ఎక్కువగా ఆగని కుగ్రామం అది.

చుట్టూ పచ్చగా పరుచుకున్న చెట్లు, తడిసిన ఎర్రమట్టితో ప్లాట్‌ఫార్మ్‌... చల్లగా వీస్తోన్న గాలి... ఎంతో ఆహ్లాదకరంగా వున్నాయి.
''నమస్తే శర్మగారూ... నెల్లూరుకేనా ప్రయాణం'' అంటూ పలకరించాను ఆయన్ని.
ఆయన నన్ను గుర్తుపట్టి కరచాలనం చేశాడు.
''ఏ బోగీలో వెళ్తున్నారు?'' అంటూ ఆయన్ని సంభాషణలోకి దించాను.
ఏదో సెమినార్‌కి వెళ్ళి తిరిగివస్తున్నాట్ట ఆయన.
''ఇంకా ఎంత సేపుండాలి ఇక్కడ?'' అడిగాడాయన.

అప్పటిదాకా నేను సేకరించిన సమాచారాన్ని ఆయనకి చెప్పాను. పాడైపోయిన ట్రాక్‌ని బాగుచేసి, రైల్వే సిబ్బంది తనిఖీ చేసి రైలు బయలుదేరడానికి హీనపక్షం ఇంకో రెండు మూడు గంటలైనా పడుతుంది.
నేనన్న మాటలకి ఆయన ఏదో ఆలోచిస్తున్నట్లు కనబడ్డాడు.
''వాగు పొంగి రోడ్డు కూడా మనిగిపోయిందట. ఈ ఊరు దాటితే కానీ మనం బస్సు కూడా పట్టుకోలేం. ట్రాక్‌ బాగుపడి రైలు కదిలేదాకా మనం ఇక్కడే గడపాలి. మరో మార్గంలేదు'' అన్నాను, ఆయన ఆలోచనలని అంచనా వేస్తున్నట్లుగా.

ఆయన మౌనంగా వుండిపోయారు.
ప్లాట్‌ఫార్మ్‌ మీద తిరుగుతూ నెమ్మదిగా కబుర్లలో పడ్డాం.
ఆయన హాజరైన సెమినార్‌ విషయాలు అడిగాను. ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఎదుటివాళ్లని ఆకర్షించాలంటే మంచి వక్తలై వుండాలని చాలామంది అనుకుంటూ వుంటారు. కానీ ఎదుటి వ్యక్తులని ఆకర్షించాలంటే మంచి వక్తగా కన్నా మంచి శ్రోతగా వుండాలి.
తను చెప్పే విషయాలని కళ్ళు పెద్దవి చేసుకుని ఉత్సాహంగా వినే మనుషులంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు?!
ఆయన చెప్పే విషయాల్ని శ్రద్ధగా వినసాగాను.

మంచి శ్రోతలా మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రశ్నలు కూడా వేయసాగాను. సంభాషణని కాలక్షేపం కబుర్లలా కాకుండా ఒక 'లక్ష్యం'వైపు మళ్లేలా చేయడం నాకు బాగా అలవాటయిన విద్యే. కావాలని చెబుతున్నట్లు కాకుండా సహజంగా అతికేలా మా కంపెనీ ఉత్పాదనల గురించీ, వాటిని ప్రమోట్‌ చేస్తే ఆయనకి లభించే 'ప్రయోజనాల' గురించీ అన్యాపదేశంగా చెప్పసాగాను.

ఆ కాస్సేపటిలోనూ ఆయనతో మునపటికన్నా ఎక్కువ సాన్నిహిత్యాన్ని, చనువునీ సంపాదించగలిగాను. అందుకు సంతృప్తిగానే వున్నా, నాతో మాట్లాడుతున్న ఆయనలోని ఏదో 'అనీజీనెస్‌' నాలోని 'ప్రొఫెషనల్‌' దృష్టిని తప్పించుకోలేకపోయింది.
ఆయన కళ్ళు దేనికోసమో వెదుకుతున్నట్లున్నాయి. మనసు దేనికోసమో ఆరాటపడుతున్నట్లుగా వుంది.
ఆ ప్లాట్‌ఫార్మ్‌ మీద నాతో కబుర్లు చెబుతూ 'కాలక్షేపం' చేయడంకన్నా ఆయన 'అవసరం' వేరే వుంది. ఆయన చెప్పకపోయినా ఆ విషయాన్ని గ్రహించడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. కానీ అదేమిటన్న విషయమే అంతు పట్టడంలేదు.

కాస్సేపటి తర్వాత ఆయనే అన్నాడు అటూ ఇటూ చూస్తూ.
''కనీసం ఇక్కడ ఒక క్యాంటిన్‌ అయినా లేదే?'' అని.
అప్పుడు నాకు అర్థమయింది. ఆయన అవసరం ఏమిటో?!
విచ్చుకున్న పువ్వులా నా ముఖంలో నవ్వు మెరిసింది.
''క్యాంటినా! మామూలుగా అయితే ఇక్కడ ప్యాసింజరు రైళ్లు కూడా ఆగవు'' అన్నాను అదే నవ్వుతో.
''అయితే మాత్రం? నాలుగు గంటల నుంచీ రైలు అలా ఆగే వుంది. రైల్వే వాళ్లయినా ఏమీ ఏర్పాటు చేయలేదు'' అన్నాడాయన ఒకింత అసహనంగా.

ఆయనతో మాట్లాడుతున్న ఉత్సాహంలో నేను గుర్తించలేదు కానీ... నాలోనూ అదే బాధ. కడుపులో కరకరమంటున్నట్లు సన్నగా నొప్పి... ఆకలి.
నిన్న సాయంత్రమెపుడో హడావిడిగా తిన్న తిండే. మళ్ళీ ఏ ఆహారమూ తీసుకోలేదు.
మామూలుగా అయితే ఈపాటికి ఎప్పుడో నెల్లూరు చేరుకుని బ్రేక్‌ఫాస్ట్‌ చేసి ఎవరి పనుల్లో వాళ్లు పడాల్సిన వాళ్లం. ఈ వర్షం వల్ల ఇలా ఆగిపోవాల్సి వచ్చింది.
''మీరు వెళ్లి మీ బోగీలో కూర్చోండి సార్‌... నేను వెళ్లి బయట ఏమైనా దొరుకుతుందేమో చూసి వస్తాను'' అంటూ స్టేషన్‌ మాస్టర్‌ రూమ్‌వైపు వెళ్ళాను.

అప్పటికి రైలులోంచి చాలామంది దిగి ఏమీ తోచక ప్లాట్‌ఫార్మ్‌ మీద తిరుగుతున్నారు. అందరినీ మమ్మల్ని వేధిస్తున్న సమస్యే వేధిస్తున్నట్లు ఉంది. 'తినడానికేమైనా దొరుకుతుందా?' అని పక్కవాళ్లని చాలామంది అడగడం కనిపిస్తోంది.
'ఏమైనా దొరికితే బాగుండును' అని నేను కూడా అనుకున్నాను. నా కోసం కాదు... శర్మగారికోసం! ఆయన చాలా ఆకలిమీద వున్నట్లు కనబడుతున్నాడు. పరిస్థితి చూస్తే రైలింకా ఇక్కడ ఇంకో రెండు మూడు గంటలు ఆగిపోయేలా వుంది. ఈలోగా ఆయన ఆకలి మరింత పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో... ఈ మారుమూల రైల్వే స్టేషన్లో ఆయన ఆకలి తీరే మార్గం నేను చూపించగలిగితే ఆయన నన్ను జన్మలో మర్చిపోలేడు.

ఆయన దృష్టిలో నాకు పడిన మంచి మార్కులు వృథాగా పోవు!
'మనిషి తల్చుకుంటే సాధించలేనిదంటూ లేదు. అలాంటిది ఈ పల్లెటూళ్ళో ఇంత తిండి సంపాదించలేనా?' అనుకున్నాను. స్టేషన్‌ చిన్నదైనా పనికేమాత్రం తక్కువ లేదన్నట్లు గణగణా మోగుతున్న ఫోన్లతో బిజీగా వుంది స్టేషన్‌ మాస్టర్‌ రూము.

అక్కడ చాలామంది జనం గుమిగూడి వున్నారు.
అందర్నీ మెల్లగా తప్పించుకుని వెళ్ళి స్టేషన్‌ మాస్టరుని అడిగాను. ''దగ్గర్లో తినడానికేమైనా దొరుకుతాయా?''
''ఒక కిలోమీటరు దూరం నడిచి వెళితే ఊరు వస్తుంది. అక్కడ కొట్లలో ఏమైనా దొరకచ్చు'' అన్నాడాయన పాపం అంత బిజీలో కూడా.
ఒక్క క్షణం ఆలోచించి బయటికి నడిచాను.
మట్టిదారి... వానకి తడిసి బురద బురదగా వుంది. జాగ్రత్తగా చూసుకుంటూ నడుస్తున్నాను. నా వెనుకే మరికొంతమంది రావడం చూసి చిన్నగా నవ్వుకున్నాను.

ఆ స్టేషన్‌ మాస్టరు అన్న 'కొట్టు' పదానికి అర్థమేమిటో చూశాక నాకింకా నవ్వొచ్చింది. అక్కడ ఒక అరుగుమీద ప్లాస్టిక్‌ సంచుల్లో పోసి మరమరాలు, బఠాణీలు, సెనగపప్పు అమ్ముతున్నారు.
అవి తీసుకెళ్లి శర్మగారికివ్వాలంటే ఏమిటోలా అనిపించింది. నేను ఆలోచిస్తుండగానే నా వెనుక వచ్చినవాళ్లు అక్కడ దొరికే వాటిని ఎగబడి కొనుక్కోసాగారు.

కాస్సేపు చూస్తే అవి కూడా అయిపోతాయేమోనని భయపడుతూ ముందుకు కదలబోతుంటే నా దృష్టినాకర్షిస్తూ కనబడింది కొంతదూరంలో ఉన్న పూరిపాక. ఆ పాక వెనుకనుంచి సన్నగా పొగ లేస్తోంది, లోపల పొయ్యి వెలుగుతోందన్న దానికి గుర్తుగా.
కొంచెం పరికించి చూస్తే ఆ పాక ముందు కూర్చుని సత్తుపళ్ళాలలో ఏదో తింటున్న ఒకరిద్దరు మనుషులు కనబడ్డారు.
బురదలో నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆ పాకవైపు నడిచి అక్కడేముందా అని చూశాను.
మంచినీటికోసం వెదికే మనిషి నీటి చెలమల దగ్గరే ఆగిపోతే చెరువులనీ నదులనీ కనిపెట్టలేడు!
ఆనందంతో నాకు గంతులు వెయ్యాలనిపించింది. అది ఆ పల్లెటూళ్లో ఉన్న ఒక 'హోటల్‌'.
లోపలికి వెళ్లిన నాకు అప్పుడే వాయిదింపిన ఇడ్లీరేకుల మీద ఉన్న వేడివేడి ఇడ్లీలు ఆకర్షిస్తూ కనబడ్డాయి.
నెల్లూరు బ్రాహ్మలకి ఇడ్లీలు చూస్తే ప్రాణం లేచొస్తుంది. నాలుగు రూపాయలు ఎక్కివిచ్చి అరడజను ఇడ్లీలని సెనగపప్పు చెట్నీతో అరిటాకులో పొట్లం కట్టించాను.

అప్పటిదాకా కడుపులో గిరగిరా తిరుగుతున్న ఆకలి నేనున్నానంటూ గుర్తుచేసింది నాకు. అయినా నేను పెద్దగా పట్టించుకోలేదు. ఆలస్యం చేస్తే అక్కడ శర్మగారు ఏ మరమరాలతోనో బఠానీలతోనో కడుపు నింపేసుకోవచ్చు.
అక్కడింక తినడానికేమీ దొరకదని రూఢీగా తెలిసిపోయాక, మంచి ఆకలిమీదున్న ఆయనకి వేడివేడి ఇడ్లీలని అందించగల అవకాశాన్ని 'మిస్‌' చేసుకోవడం నాకెంతమాత్రం ఇష్టం లేదు.

ఆ రొచ్చులో కూడా వడివడిగా అడుగులు వేసుకుంటూ స్టేషన్‌వైపు నడుస్తున్నాను.
దార్లో నలుగురైదుగురు ప్రయాణీకులు ఎదురై ''ఏవండీ... ఏమైనా దొరుకుతున్నాయా ఊళ్లో తినడానికి?'' అనడిగారు ఆదుర్దాగా.
''ఏంలేవండీ... మరమరాలు, సెనగపప్పు తప్ప'' అన్నాను. నా చేతిలో ఉన్న పొట్లాన్ని సాధ్యమైనంతవరకూ దాచేస్తూ.
నాకింకెవరికీ ఆ హోటల్‌ గురించి చెప్పడం ఇష్టంలేదు. అక్కడ ఎవ్వరికీ దొరకని దాన్ని నేను శర్మగారికి అందచేయాలి... 'యునీక్‌'గా! ఆయనని ఆ విధంగా నా వలలో వేసుకోవాలి. అదీ నా పథకం.

స్టేషన్‌ చేరుకుని గబగబా శర్మగారి బోగీ దగ్గరకి చేరుకున్నాను. లోపలికెక్కి ఆయన సీటు దగ్గరకి నడిచాను.
''ఏమైనా దొరికాయా?'' నన్ను చూడగానే ఆత్రంగా అడిగాడాయన. నేను విజయగర్వంతో నవ్వేను.
''దొరికాయి'' అంటూ పొట్లం విప్పి ఆయన చేతిలో పెట్టాను. అరిటాకుమీద నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. ఆకుల మధ్యలో వెన్నముద్దల్లా తెల్లని ఇడ్లీలు!

చూడగానే ఆయన కళ్లు మెరిశాయి.
ఆత్రంగా ఆ పొట్లాన్ని అందుకున్నాడు. అందుకున్న వెంటనే ఎదుటి బెర్తుమీద కూర్చున్న యువతికి పొట్లాన్ని ఇస్తూ అన్నారు.
''ఇవి పెట్టమ్మా పిల్లలకి... కొంచెం శాంతిస్తారు'' అని. నేను షాక్‌ తిన్నట్లు చూశాను ఆయన వంక.
''తెల్లవారుజాము నుంచీ ఆ పిల్లలు ఒకటే గొడవ ఆకలంటూ. కూడా తెచ్చుకున్న పాలేమో విరిగిపోయాయట. స్టేషన్లో ఏమైనా దొరుకుతుందేమోనని కిందికి దిగితే నువ్వు కనబడ్డావు...''
ఒక్కసారిగా నన్ను కమ్మిన ఏదో మైకం వీడిపోయి స్పృహలో కొచ్చినట్లుగా అనిపించసాగింది నాకు.

కడుపులో కరకరమంటూ ఆకలి...
అక్కడ నాతోసహా సగంమంది అదే స్థితిలో ఉన్నారు. కానీ నేను వీళ్లందరి ఆకలినీ కాకుండా కేవలం 'శర్మగారి ఆకలి'నే ఎందుకు గుర్తించగలిగానో తల్చుకుంటే సిగ్గుగా ఉంది.
నా మీద నాకే అసహ్యంగా ఉంది.
''ఎక్కడ దొరికాయండీ ఇడ్లీలు?'' ఎవరో అడుగుతున్నారు.
''ఏమోనండీ... మా వాడు తెచ్చాడు. అసలు ఆ హోటల్‌ వాడినే ఇక్కడికొచ్చెయ్యమంటే సరిపోయేది. అందరి ఆకలీ తీరిపోయేది'' అంటున్నారు శర్మగారు నవ్వుతూ.

ఆ పిల్లల ఆకలి తీరిందన్న సంతృప్తివల్లో ఏమో... ఇప్పుడాయనలో ఇందాకటి 'అనీజీనెస్‌' లేదు.
వాళ్ల మాటలేమీ నాకు వినపడడంలేదు.
విభ్రమకి గురయిన వాడిలా అలాగే వుండిపోయాను.
ఎంతటి విభ్రమ అంటే... మాటల మధ్య శర్మగారు నన్ను 'మావాడు' అంటూ సంబోధించడం కూడా గుర్తించలేనంత.
* * *
ఇప్పుడు శర్మగారు మా కంపెనీ ముందులని రోగులకి విరివిగా రాస్తున్నారు. కంపెనీకి నా తరఫున అమ్మకాలు విశేషంగా పెరిగాయి. ఈ క్రమంలో నాకు శర్మగారి గురించి అంతకుముందు తెలియని విషయాలు కొత్తగా తెలుస్తున్నాయి.
ఆయన దగ్గరకి వచ్చే రోగులని చూడడానికి 'ఇంతా' అని ఫీజు వుండదు. డబ్బులివ్వని వాళ్లని ఊరికే చూస్తాడు. అవసరంలేకుండా ఒక్క మందు కూడా రాయడు. మేము ఇచ్చే 'శాంపిల్స్‌'ని అవసరమైన బీదవాళ్లకి ఉచితంగా ఇస్తాడు.
ఆయన దగ్గరకి వచ్చే జనం రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నారు. వినియోగదారుడ్ని ఆకట్టుకోవడానికి మా మార్కెటింగ్‌ పుస్తకాల్లో చెప్పని కొత్త కొత్త రహస్యాలేవో నాకు ఇంకా శర్మగారి నుంచి తెలుస్తూనే ఉన్నాయి!
తార్కిక దృష్టి
ఆకునూరి మురళీకృష్ణ,
అసిస్టెంట్‌ మేనేజర్‌, ఆంధ్రాబ్యాంక్‌
జోనల్‌ ఆఫీస్‌, ఆర్‌.ఆర్‌.పేట, ఏలూరు.
పుట్టింది తూర్పు గోదావరి రాజమండ్రిలో, ఉద్యోగం పశ్చిమ గోదావరిలోని ఏలూరులో. ఆంధ్రాబ్యాంక్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా వుంటూనే ఉభయగోదావరులను ఒరుసుకుని సాగుతున్న జీవితాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అరవై కథలు అచ్చయ్యాయి. కొన్ని టీవీ ఎపిసోడ్లకు కథ, సంభాషణలు సమకూర్చారు. మామూలు జీవితాన్ని కొత్త కోణంలో చూపించడం, తార్కిక దృష్టితో విశ్లేషించడం ఇష్టం.

No comments: