ఫెలిస్యూకార్డోస్
కొంకణీ కథ
అనువాదం:అచ్యుతుని రాజ్యశ్రీ
''ఇదిగో, ఇవ్వాళ కూడా అమ్ముడు పోలేదు'' లోపలికి అడుగు పెడ్తూ నుదుటి చెమటను తుడుచుకుంటూ అన్నాడు భార్యతో నారాయణ. ఎనిమిది రోజులు గడిచాయి. బీదరికంతో మగ్గుతున్న అతను హతాశుడైనాడు. అప్పు కోసం బైలుదేరాడు. బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు అతనికొక్క పైసా కూడా విదల్చలేదు. పొలం శత్రువుల చేతిలో పడరాదని అతను శతవిధాలా ప్రయత్నాలు చేస్తూ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. నెత్తిమీద కత్తి ఫ్యాన్‌లా తిరుగుతున్నంత బాధగా ఉందతనికి!
గత ఏడాది వంద రూపాయలకే పొలం అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాపం తన పొరుగువాడే అంత నమ్మక ద్రోహం చేస్తాడని కలలో కూడా అనుకోలేదతను. తన చర్మాన్ని చీలుస్తున్నంత బాధగా ఉంది నారాయణకి. పిల్లా పాపల కోసం పొలాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఆ పొలం అతనిది కాదు. కానీ తాత తండ్రుల కాలంనించీ తన చెమట, రక్తం ధారపోసి ఆ పొలం దున్నుతున్నాడు. శ్రమ, కష్టాలకి భయపడడు కానీ, అదే తన సర్వస్వం అని పగలూ రాత్రీ మనసు, శరీరం లగ్నం చేసి పని చేస్తాడు. కానీ ఈ ఏడు అతనికి దుర్దశ ప్రాప్తించింది. మే నెలాఖరులో చెత్త, పేడ, గడ్డీగాదం వేసి నేలని తయారుచేశాడు. మట్టిని తవ్వుతుంటే చేతులు బొబ్బలెక్కాయి గూడా! పొలం దున్నాడు. హఠాత్తుగా కాలంగాని కాలంలో కుంభవృష్టి కురవటంతో మొత్తం కష్టం అంతా నీటి పాలైంది. అంతా శూన్యం, కటిక చీకటి.
పైసాపైసా కూడబెట్టి వంద రూపాయలకి జమ అయితే ఎద్దుని కొంటానికి మూట గట్టాడు. కానీ, ఆ డబ్బుతో విత్తులు కొని తిరిగి నాటాడు. కొన్నాళ్లకే ఆ పైరు పచ్చగా తివాచీలా కళకళలాడసాగింది. రాబోయే పంటకి గాలి మేడలు కట్టసాగాడు. ఈ పంట చేతికొస్తుందనే నమ్మకంతో భార్యతో అన్నాడు, ''శేవంతీ! దేవుడు మన మొర ఆలకించాడు. ఈసారి తాకట్టు పెట్టిన నీ కంకణం, కంటె విడిపిస్తా''.
''పంట కోత కాగానే మా పుట్టింటి కెళ్దాం. ఓ నాల్గు రోజులుండి వద్దాం'' సత్యనారాయణస్వామి ప్రసాదం నోట్లో వేస్తూ అన్నదామె.
ఎప్పటిలానే దసరా రోజుల్లో టిఫిన్ తిని పొలానికి బైలుదేరాడు నారాయణ. అంతే కాళ్ళు నేలకి అంటుకుపోయాయి. ఒక్క రాత్రిలో మిడతల దండు పైరు మొత్తాన్ని సర్వనాశనం చేయటంతో కన్నీరు కారుస్తుండిపోయాడు. ఇంటికి తిరిగొచ్చి వరండాలో ఏడుస్తూ కుప్పకూలాడు.
శేవంతీ గుండె గుభిల్లుమనడంతో భర్తని అడిగింది. ''ఎందుకా కన్నీరు?''
''ఏం చెప్పేది? మన అదృష్టం కుప్ప కూలింది. మిడతల దండు మన పచ్చని చేలని సర్వనాశనం చేసింది''.
ఆమె గుండె అవిసిపోయింది. పాలిపోయిన మొహంతో, మిగిలిన ఒకే ఒక బం గారు నగని తెచ్చి భర్త చేతిలో పెట్టింది.
అతను దీర్ఘంగా నిట్టూరుస్తూ లేచి సరాసరి కంసాలి శాణూ దగ్గరకెళ్లి సగం రేటుకే అమ్మేశాడు. విత్తులు కొని రెండోసారి నాటాడు. ఈసారి కూడా వరదలకి అతని ఆశలు కుప్ప కూలాయి. ఎలా బాకీ తీర్చాలా అనే చింత పట్టుకుంది. ఇక ఎవరి ముందు ఏడ్వాలతను? దైవమే తనకి వ్యతిరేకం అయితే, ఇక భూమిపై నుండే మనుషులేం చేయగలరు? కానీ భూమికి యజమానిపై దయ మాత్రం రాదు, కలగదు. అప్పు తీర్చకపోతే పొలం చేతిలోంచి జారిపోటం ఖాయం. తాకట్టు పెట్టి అప్పు తీసుకునే ఆశ కూడా లేదు, ఇంక ఇంట్లో ఏం మిగిలింది కనక?
ఎంతో ఆలోచించగా తనకిష్టమైన ఎద్దు ములా అతని దృష్టిలోకి వచ్చింది. ఇక దాన్ని అమ్మటమే తరుణోపాయం. కష్టాల్లో కొట్టుకుపోయే తనలాంటి వాడికి దొరికిన గడ్డి పోచ అది! తన ప్రాణం కంటే మిన్న అయిన ములాని అమ్మటం అంటే తన కాళ్ళని తాను నరుక్కోటమే! అయినా, అది కూడా శుష్కించి, తిండి లేకపోటంతో బక్కచిక్కి ఎముకల పోగులా అయింది.
దాన్ని మాడ్చి చంపటం కన్నా అమ్మటం మేలు. అందుకే రెండుసార్లు మడగావ్ బజారుకి తీసికెళ్లాడు. దాన్ని చూస్తూనే జనం పెదవి విరిచారు. ఓ ఐదు రూపాయలు ఎక్కువ ఇచ్చి కొనే ఏకైక వ్యక్తి కసాయివాడు మాత్రమే. అందుకే ఎంతో బాధగా తిరిగివచ్చాడు.
ములాతో వచ్చిన తండ్రిని, ఎద్దుని చూసి నారాయణ ఏడేళ్ల కొడుకు సురేష్ పరుగెత్తుకొచ్చి దాని మెడని నిమరసాగాడు. కొద్దిగా గడ్డి వేశాడు. అది అలసిపోయి చతికిలబడింది.
భార్యతో అన్నాడు, ''ఇప్పుడేం చేద్దాం.బాకీ తీర్చడానికి ఒకే ఒక్కరోజు గడు వుంది. కసాయికి అమ్మాలంటేనే నా గుండె బద్దలవుతోంది. అసలు లేనిదానికంటే ఉన్నకాడికి అమ్మటం ఉత్తమం. రేపు అమ్మితీరుతా!''.
తన ఎదలో చురకత్తి దిగబడినట్లు విలవిలలాడిందామె. మౌనమే అంగీకారంగా భావించాడతను.
సురేష్ కూడా విలవిల్లాడాడు. ''నాన్నా! ములాని అమ్మొద్దు, ఇక్కడే ఉంచు'' అని ఏడ్వసాగాడు. ఎలా దాని ప్రాణం కాపాడాలా అని ఆలోచించాడు.
బాగా రాత్రయింది. అంతా నిద్ర పోతున్నారు. సురేష్ కంటికి కునుకే రావటం లేదు. నెమ్మదిగా లేచి చప్పడు కాకుండా తలుపు తెరిచి ఎద్దు దగ్గరికెళ్లి దాని వీపు నిమరసాగాడు. దాని పలుపుతాడు విప్పి చాలా దూరం పారిపోయేలా తోలి, ఇంటి కొచ్చి పడుకున్నాడు. ''అమ్మయ్య! ములా ప్రాణం కాపాడాను'' అన్న సంతోషం ఆ పసిమనసులో గంతులేసింది.
ఆ మర్నాడు నిద్రలేచిన నారాయణ మొహం, కాళ్లు చేతులు కడుక్కొని చిరిగిన కంబళి తీసుకొని ఎద్దుని లేపాడు. దాని మెడలో పలుపు తాడు లేకపోవటంతో ఆశ్చర్యపోయాడు. దాని శరీరం ఒక్క అంగుళం కూడా కదలనని మొరాయిస్తోంది. నారాయణకి దాన్ని చూస్తూనే కొత్త దిగులు పట్టుకుంది. ఎద్దు కొద్దిగా లేచి, నించోలేక కూప్పకూలి పోతోంది. అతను పరుగెత్తి కసాయిని ఇంటికే తెచ్చాడు. ఆ కఠిన కసాయి దాని వీపుపై నాలుగైదుసార్లు కొరడా ఛెళ్లు మన్పించాడు. అయినా అది కదలలేకపోతోంది. నారాయణని మెడ పట్టుకోమని, తను తోక పట్టుకున్నాడు కసాయి. పళ్లతో క్రూరంగా దాని తోకని కొరకసాగాడు. అది హృదయవిదారకంగా అరుస్తూ కుంటుతూ పడుతూ లేస్తూ నడవసాగింది.
డబ్బు తీసుకునేప్పుడు నారాయణ కళ్లు నీటిచెలమలైనాయి. చేతులు వణకసాగాయి. కానీ ఇంకో మార్గం లేదే!
సురేష్ పొద్దున్నే పొయ్యి దగ్గర చేరాడు. తను రాత్రి ఎంచక్కా ములాని పలుపుతాడు వదిలి తోలేశానని ఆనందంగా ఉంది వాడికి! కానీ... పాపం వాడికేం తెల్సు, తన యజమాని దుర్దశకి వగచి, అది ఇంకో ఎద్దుతో కల్సి బండి ఈడుస్తోందని. ఆ బండిలో ఎద్దు మాంసం ఉంది. ఆ మాంసంతో నిండిన బండిని ఈడుస్తూ, భయంతో వణికిపోతూ సగం చచ్చినట్లు అయింది ములా పరిస్థితి. పాపం, ఆ బొయికల పోగు ఎద్దుకి తనే బలిపీఠానికి ఎక్కుబోతున్నట్లు అప్పటికి తెలీదు.
Thursday, December 13, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment