ఆనాటి అంకంలో తన పాత్ర ముగించుకుంటున్న సూర్యుడు మెల్లగా పడమటి తెర చాటుకు జారుకుంటున్నాడు. సూర్యుడితో వీడ్కోలు పూర్వకంగా కరచాలనం చేసినట్టు గోదావరి అలలు కొన్ని నిమిషాలపాటు ఎర్రబారాయి. ఒడ్డున గౌతమీ నందనవనం పార్కులో బిలబిలమంటూ జనం. పార్కు రెయిలింగ్‌కు చేరువలో ఓ బెంచీ మీద కూర్చున్నాడు సుజయ్‌కుమార్! చత్వారం వచ్చిన ఒంటి కంటినే చికిలించి ఓ పక్క ఎరుపెక్కిన గోదావరి కెరటాలనూ, మరోపక్క నీలాకాశాన్నీ, ఇంకోవైపు గోదావరి లంకల్లోని రెల్లు పొదలనూ, పచ్చటి చెట్లనూ, మరోవైపు పార్కులోని రకరకాల పూలనూ చూస్తుంటే అతడికి ఫోకస్ లైట్లతో క్షణకాలంలోనే అనేక రంగులను పులుముకునే రికార్డింగ్ డ్యాన్స్ స్టేజి గుర్తుకు వచ్చింది. ఆ రంగుల్లో ధగధగమని మెరిసిపోయిన తన గతం గుర్తుకు వచ్చింది. పార్కులో మారుమోగుతున్న పిల్లల కేరింతలు- ఒకప్పుడు తన నాట్యవిలాసానికి మురిసి జనం కొట్టిన చప్పట్లలా వినిపించాయి.
పైన ఆకాశంలో అప్పుడే నెలవంక పొడిచింది. ఈ నెలవంకలాగే జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ సుజయ్‌కుమార్, అలియాస్ అప్పారావు ముఖంమీద చిరునవ్వు వెలిగింది. వరద గోదావరి అలల్లా ఛాతీ ఉప్పొంగింది. కీళ్ళనొప్పి కలుక్కుమనిపిస్తున్నా- పాదాలను అప్రయత్నంగా లయబద్ధంగా అటూ ఇటూ కదిలించాడు. ఎన్టీఆర్ అభిమానుల అభివందనాలు అందుకున్న ఆ పాదాలను ఓసారి గర్వంగా చూసుకున్నాడు. లక్షలాదిమందిని మురిపించిన తన ముఖాన్ని అరచేతులతో నిమురుకున్నాడు. నలభై ఏళ్ళు దాటిన ఆ ముఖం ఇప్పుడు గాలి పోయిన బెలూన్లా ముడతలు పడితేనేం- ఒకనాడు జనం జేజేలు అందుకుంది. ఆ కాళ్ళలో ఇప్పుడు పటుత్వం తగ్గి తడబడుతుంటేనేం- ఒకనాడవి మెరుపుల్లా చిందేస్తే ఈలలూ, వన్స్‌మోర్‌లూ కుంభవృష్టిలా కురిసేవి. 'మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమాన్ని జయప్రదం చేయా'లంటూ పార్కుకు కొంచెం దూరంలో గోదావరి గట్టునే ఏర్పాటు చేసిన నవరాత్రి షామియానా నుంచి మైకులో అనౌన్స్‌మెంట్ వినిపిస్తోంది. తననెవరో క్రూరంగా వెక్కిరించినట్టనిపించింది సుజయ్‌కుమార్‌కి. విరక్తిగా నవ్వుకున్నాడు. పక్కబెంచీమీద కూర్చున్న ఓ తండ్రి బిడ్డను అపురూపంగా పొదివి పట్టుకుని ఏదో చూపెడుతున్నాడు. సుజయ్‌కుమార్ అలియాస్ అప్పారావుకు తన తండ్రి సింహాద్రి గుర్తొచ్చాడు. పుష్కరాల రేవు పక్కనున్న రైలు వంతెనపై గూడ్స్ రైలు వెళుతోంది. ఒకదాని వెనుక ఒకటిగా తరలిపోతున్న దాని బోగీల్లానే సుజయ్‌కుమార్‌లో గత జ్ఞాపకాలు కదిలాయి.
* * *
హైస్కూలులో చదివే నాటినుంచే అప్పారావు సినిమాలంటే పడి చచ్చేవాడు. అతడి తండ్రి సింహాద్రి రిక్షా తొక్కేవాడు. తన ఎముకలు నుగ్గయినా తన ఒక్కగానొక్క కొడుకు బతుకును పేదరికపు డేగ నీడనుంచి తప్పించాలని తపించేవాడు. బాగా చదివిస్తే మంచి ఉద్యోగం వస్తుందనీ, తాను నరాలు తెగేలా రిక్షా లాగిన ఎగుడు దిగుడు రాజమండ్రి వీధుల్లోనే కొడుకు మోటార్ సైకిల్‌పై దూసుకుపోతున్నట్టు కలలు కనేవాడు. బీడీ కాల్చడమంటే సింహాద్రికి ఎంతో ఇష్టం. అయినా ఎన్నడూ కట్టబీడీలు ఒకేసారి కొనుక్కునేవాడు కాదు. రోజుకు అయిదు బీడీలే కొనేవాడు. ఒక్కో బీడీని నాలుగు దమ్ములు లాగి ఆర్పేసి చెవిలో పెట్టుకునేవాడు. అలా దాన్నే రెండుసార్లు కాల్చేవాడు. తోటి వారిలో కొడుకు వెలితి పడకూడదని రోజుకి రూపాయో, రెండో చేతిలో పెట్టేవాడు. ప్రతి పండక్కీ కొత్త బట్టలు కుట్టించేవాడు. తానూ, రోగిష్టి భార్యా తిన్నా, తినకపోయినా అప్పారావుకు వీలైనంతలో ఏ లోటూ రానిచ్చేవాడు కాడు. తండ్రి తన గురించి కలలు కంటుంటే, అప్పారావును సినిమాలు కలల ప్రపంచంలోకి నెట్టేవి. తెరపై హీరోల సాహసకృత్యాలు మంత్రముగ్ధుడిని చేసేవి. తండ్రి ఇచ్చే డబ్బుల్లో ఎక్కువ భాగం బడి ఎగ్గొట్టి మ్యాట్నీ సినిమాలు చూసేందుకే ఖర్చు పెట్టేవాడు. లేత వయసులోనే అప్పారావు మనసును సినీహీరోలు ఆవహించారు. ఎన్నటికైనా తానూ వెండితెరపై వెలిగిపోగలనని నమ్మేవాడు. క్లాసులోని బ్లాక్‌బోర్డు కూడా అతడికి థియేటర్‌లోని తెరలాగే తోచి తాను చూసిన సినిమా దృశ్యాలే కనిపించేవి. పాఠ్యపుస్తకాలు తెరిచినా ప్రతి పేజీలో పాఠాలకు బదులు తన అభిమాన హీరోల బొమ్మలే దర్శనమిచ్చేవి. అద్దంలో చూసుకున్నప్పుడల్లా తన ముఖంలో ఎన్టీఆర్‌నే చిన్నబుచ్చే కళ కనిపించేది. ఎవరూ పట్టించుకోని నల్లరాయే దేవుడి విగ్రహంలా చెక్కబడ్డాక గుళ్లో పూజలు అందుకున్నట్టు- ఈ ముఖం ఎప్పటికైనా వెండితెరపై వెలిగి కోట్లమందితో జేజేలు అందుకోవడం తథ్యమనుకునే వాడు.
ఓరోజు మ్యాట్నీ విడిచే సమయంలో మినర్వా టాకీస్ దగ్గర రోడ్డుపక్క రిక్షా కిరాయి కోసం ఎదురు చూస్తున్నాడు సింహాద్రి. ఆనందంతో వెలిగే ముఖంతో థియేటర్ గేటునుంచి బయటికి వస్తున్న కొడుకును చూసి రిక్షా పూటీ గోతిలో పడ్డప్పటిలా దిమ్మెరపోయాడు. కిరాయి మాట విడిచి నడుచుకుంటూ కొడుకు దగ్గరకెళ్ళాడు.
''ఏరా బాబా! బడికెళ్ళలేదా?''
హీరో చేసిన ఫైటింగ్‌లను, పాటల్లో వేసిన స్టెప్‌లను నెమరేసుకుంటూ తన్మయత్వంలో ఉన్న అప్పారావు తండ్రిని చూసి గతుక్కుమన్నాడు. హీరోతో డ్యూయట్ పాడుతున్న హీరోయిన్‌ను మధ్యలోనే ఎత్తుకుపోయిన మాంత్రికుడిలా కనిపించాడు తండ్రి. అయినా చటుక్కున అబద్ధమాడేశాడు.
''మధ్యాహ్నం నుంచి స్కూలుకు సెలవిచ్చారయ్యా''
'పోనీలే, బడి లేనప్పుడు కుర్రాడు ఆ మాత్రం సరదా పడితే కొంపలేమీ అంటుకుపోవు' అనుకున్న సింహాద్రి కొడుకు తలను నిమిరాడు. 'బిడ్డ అంతదూరం నడిచేమి వెళతాడు' అనుకుని రిక్షాలో ఎక్కించుకుని ఇంటికి బయల్దేరాడు.
* * *
పార్కు నడవాపై తప్పటడుగులతో పరుగులు తీస్తున్న పిల్లవాడు దబ్బున తూలిపడ్డాడు. మోకాళ్ళు కొట్టుకుపోవడంతో ఏడుపు లంకించుకున్నాడు. వాళ్ళమ్మ కూర్చున్న చోటినుంచి ఒక్కుదుటన లేచి వచ్చి కొడుకును చంకకెత్తుకుని అనునయించసాగింది. అంతవరకు ఆడుతూ పాడుతూ గడిచిన తన బాల్యం తండ్రి చనిపోయినప్పుడు ఒక్కసారే ఊబిలో కూరుకుపోయినట్టనిపించిన స్మృతి సుజయ్‌కుమార్‌లో మెదిలింది.
కొడుకు పదో తరగతి తప్పినప్పుడు సింహాద్రికి తన కష్టమూ, కలలూ గోదావరి వరదలో కొట్టుకుపోయినట్టనిపించింది. కొన్నాళ్ళకే లారీ రూపంలో అతడిని చావు కబళించింది. అతడి రిక్షా కూడా నుగ్గునుగ్గయిపోయింది. తల్లి రెక్కల కింద వెచ్చగా ఉన్న కోడిపిల్ల అకస్మాత్తుగా గద్ద గోళ్ళలో చిక్కుకున్నట్టు- అప్పారావుకు బతుకు ఎంత కర్కశమైందో తెలిసివచ్చింది. తననూ, రోగిష్టి తల్లినీ పోషించుకోవలసిన భారం భూతంలా కనిపించింది. తండ్రి ఆలనాపాలనలో పదిహేనేళ్ళు ఏపుగా, బొద్దుగా పెరిగిన శరీరాన్ని కష్టపెట్టక తప్పలేదు. కొన్నాళ్ళు హోటల్‌లో క్లీనర్‌గా చేశాడు. తర్వాత భవన నిర్మాణల్లో కూలీగా బరువులు మోశాడు. స్కూటర్ మెకానిక్ దగ్గర హెల్పర్‌గా చేరాడు. చీకటిలోనూ వెన్నాడే నీడలా- ఏం చేస్తున్నా అప్పారావును సినిమా కలలు విడిచి పెట్టలేదు. సినీ సింహాసనంపై రారాజులా వెలిగిపోవలసిన తాను 'చిత్తం ప్రభూ' అంటూ ఎవరి ఆజ్ఞలకో తలొగ్గాల్సిన బంటులా బతకాల్సి రావడం అతడి మనసును క్షోభ పెట్టేది. ఎంగిలి ప్లేట్లు కడిగీ కడిగీ చేతులు పాసిపోయినా, ఆయిల్ మరకలతో ఒళ్ళు జిడ్డుగా మారినా అప్పారావు తన ముఖాన్ని చూసుకుని ఊరడిల్లేవాడు. చాలామంది ప్రముఖ హీరోలు తొలినాళ్ళలో పడ్డ కష్టాలను గుర్తు తెచ్చుకుని ధైర్యం తెచ్చుకునేవాడు. 'ఈ ముఖం ఎన్నటికైనా నవరసాలకు వేదికవుతుంది. జనం నీరాజనాలందుకుంటుంది' అనుకుంటూ కలలను బతికించుకునేవాడు.
* * *
అప్పారావు 20వ ఏట తల్లి చనిపోయింది. అనాథనయ్యానన్న భావన ముల్లులా బాధించినా తనను బంధించి ఉంచిన సంకెల ఏదో తెగిపోయినట్టనిపించింది. తన కలను నిజం చేసుకునే దిశగా బతుకు మలుపు తిరగనుందనిపించింది. గుడిసెను అమ్మి ఆ సొమ్ముతో మద్రాసు వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆ సమయంలోనే తారసపడ్డాడు రికార్డింగ్ డ్యాన్స్ ట్రూపు ఆర్గనైజర్ రామస్వామి.
పుష్టిగా, నదురుగా ఉన్న అప్పారావును చూసి ''రేయ్! అబ్బాయ్! ఇప్పుడు మా ట్రూపులో జూనియర్ ఎన్టీఆర్‌గా వేస్తున్నవాడు రమణారెడ్డికి ఎక్కువా, అల్లురామలింగయ్యకు తక్కువా అన్నట్టున్నాడు. ఎన్టీఆర్ పాటలకు సరిగ్గా సరిపోతావు, మా ట్రూపులో చేరతావా?'' అనడిగాడు.
గోదావరి ఈ ఒడ్డునుంచి ఆ ఒడ్డుకు ఈదగల గజ ఈతగాడిని పిల్లకాలవలో ఈత పోటీలకు పిలిచినట్టు అవమానపడ్డాడు అప్పారావు.
''నేను రికార్డింగ్ డ్యాన్స్‌లు చేయను. సినిమాల్లో హీరోనే అవుతాను'' అన్నాడు ఉక్రోషంగా.
తన జీవితంలోకెల్లా గొప్ప జోక్ విన్నట్టు పగలబడి నవ్వాడు రామస్వామి. నవ్వీ నవ్వీ అడిగాడు.
''రేయ్! అబ్బీ! నన్ను చూస్తే నీకెవరు గుర్తుకు వస్తున్నారు- ఎన్టీవోడా, రేలంగోడా?''
అప్పారావు రామస్వామిని గుచ్చి చూసి ''రేలంగోడే'' అన్నాడు కచ్చిగా.
''అవునా! కొన్నేళ్ళ క్రితం నేనూ నీకన్న సొగసుగాడినే. ఎన్టీవోడినే సినిమాల్లోంచి సాగనంపేయగల మొనగాడిననుకుని మద్రాసు మెయిలెక్కాను. ఇదిగో ఇప్పుడిలా రేలంగోడి వాలకంతో రికార్డింగ్ డ్యాన్స్ ట్రూపు నడుపుకుంటున్నాను''
''అయితే ఇప్పుడేమంటావ్?''
''హీరో అయిపోవాలని నాలా మద్రాసెళ్ళిన వాళ్ళు మెరీనా బీచ్‌లో ఇసుక రేణువులంతమంది. వాళ్ళంతా ఇప్పుడేమయ్యారో నీకు తెలీదు. నాకు తెలుసు. నా బతుకే అందుకు సాక్ష్యం'' అంటూ రామస్వామి అప్పారావుకు రోడ్ కం రైలు బ్రిడ్జి అంత పొడవున హితోపదేశం చేశాడు. హీరోలవుతామని కలలు కన్న వారి జీవితాలు ఎలా కేరాఫ్ ప్లాట్‌ఫారాలుగా మారాయో కళ్ళకు కట్టించాడు. హీరో కావడం కన్న రికార్డింగ్ డ్యాన్స్ హీరో కావడం సులువని బోధించాడు. డూప్ హీరో అయినా జనం జేజేలు అందుకోవచ్చన్నాడు. జూనియర్ వాణిశ్రీలు, జూనియర్ జయప్రదలతో ఒకే ప్రదర్శనలో బోలెడు డ్యూయట్‌లు పాడుకోవచ్చన్నాడు. రామస్వామి తన కలలకు పట్టిన చెద పురుగులా కనిపించినా- స్వానుభవంతో అతడు చెపుతున్న మాటలు అప్పారావును హడలెత్తించాయి. దాంతో వెండి తెర కలలకు అయిష్టంగానే తెర దించుకున్నాడు. రామస్వామి ట్రూపులో చేరి, ముఖానికి రంగేసుకుని స్టేజి ఎక్కాడు. సుజయ్‌కుమార్ జూనియర్ ఎన్టీఆర్‌గా అవతరించాడు.
* * *
పార్కులో జనం రద్దీ పెరిగింది. రోడ్ కం రైలు బ్రిడ్జిపై దీపాలు అక్కడొకటీ అక్కడొకటీ బిక్కుబిక్కుమంటున్నట్టు వెలుగుతున్నాయి. దరిద్రుల హృదయాల్లోనూ మిణుకుమిణుకుమనే ఆశల్లా- చీకటి కమ్మిన గోదావరిలోనూ అలలు ఏదో కాంతిని పులుముకుని మందకొడిగా మెరుస్తున్నాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచీ అదే బెంచీ మీద కూర్చుని ఉన్నా సుజయ్‌కుమార్‌ను గుర్తుపట్టి పలకరించినవారే లేరు. నవమి, చవితి, దసరా పందిళ్లలో, అమ్మవారి జాతరల్లో, ఎమ్యూజ్‌మెంట్ పార్కుల్లో ఎందరు తన నాట్య విన్యాసాన్ని కళ్ళప్పగించి చూసేవారు! వారిలో కొందరు తనను తమ సమక్షానికి దిగి వచ్చిన ఎన్టీఆర్‌లాగే భావించి కౌగలించుకునేవారు. కరచాలనాల కోసం ఎగబడేవారు. అవధులు మీరిన అభిమానంతో పూలదండలతో ముంచెత్తేవారు. వేసిన పాటనే మళ్ళీ మళ్ళీ వేయించుకునేవారు. స్టేజిమీద రూపాయల వర్షం కురిపించేవారు. ఏడాదంతా తీరిక లేకుండా ఎక్కడో ఓ చోట ప్రదర్శనలుండేవి. ఆనాడు తనకు రెండు చేతులా సంపాదనే. కార్లలో తిరిగేవాడు. రోజుకు కొన్ని వందలు, వేలు ఖర్చు చేసేవాడు. 'చిలక కొట్టుడు కొడితే చిన్నదానా', 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' అంటూ చిందులు వేసినా, 'జన్మమెత్తితిరా అనుభవించితిరా', 'విధి ఒక విషవలయం' అంటూ విషాదాన్ని అభినయించినా చప్పట్లు మార్మోగేవి. మద్రాసెళ్ళి హీరో కాలేకపోయానన్న బాధకు ఆస్కారం లేకుండా సుజయ్‌కుమార్ రికార్డింగ్ డ్యాన్సర్‌గానే జనం జేజేలు పుష్కలంగా అందుకున్నాడు. తన సరసన జూనియర్ వాణిశ్రీగా నటించే మంగను పెళ్ళి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లల్ని కన్నాడు. రెండు చేతులా సంపాదిస్తూ నాలుగు చేతులతో ఖర్చు పెడుతున్న తనను మంగ హెచ్చరిస్తూనే ఉండేది. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోకపోతే తరువాత చీకట్లో తడుములాడుకోవలసి వస్తుందని మొత్తుకునేది. ఎదిగేకొద్దీ పెరిగే పిల్లల అవసరాల కోసమైనా డబ్బు పొదుపును అలవాటు చేసుకోవాలని నిత్యం సతాయించేది. అయినా జనం చప్పట్ల నిషాలో తనకా మాటలు మనసుకు పట్టలేదు. జాంపేటలో తన తండ్రి నుంచి వచ్చిన పాకను డాబాగా మార్చడం మినహా ఏమీ కూడ బెట్టలేదు. ఇసుక తిన్నెపై కురిసిన వానజల్లుగా- ప్రదర్శనల ద్వారా వచ్చే ఆదాయమంతా విందు విలాసాలకు, మిత్రులకు ఖర్చయిపోయేది. సుజయ్‌కుమార్‌కు జ్ఞానోదయం కాకముందే రికార్డింగ్ డ్యాన్స్‌లపై ప్రభుత్వం నిషేధం విధించింది. జాతర ముగిశాక అమ్మవారి ఆలయంలా అప్పారావును సుజయ్‌కుమార్‌గా మార్చిన కళ వెలవెలబోయింది. చప్పట్లూ, వన్స్‌మోర్‌లూ గత వైభవంగా మారాయి. మండు వేసవిలో ధవళేశ్వరం బ్యారేజి దిగువన గోదావరిలా బతుకు ఎండిపోయింది.
* * *
పచ్చిక మైదానంలో నిశ్చింతగా మేస్తుండగా పులి దాడి చేయడంతో చెల్లాచెదురైన లేళ్ళలా- అంతవరకూ రికార్డింగ్ డ్యాన్స్‌ను నమ్ముకున్న వారంతా ప్రభుత్వ నిషేధంతో పొట్ట చేత పట్టుకుని తలో బతుకుతెరువూ వెతుక్కోవలసి వచ్చింది. జూనియర్ ఏయన్నార్ బజ్జీల బండి పెట్టుకున్నాడు. జూనియర్ చిరంజీవి ఆటో నడుపుకుంటున్నాడు. జూనియర్ కృష్ణ హోటల్‌లో క్లీనర్‌గా చేరాడు. ఓ జూనియర్ హీరోయిన్ కేటరింగ్ కంపెనీలో వంటకత్తెగా చేరింది. మరో జూనియర్ హీరోయిన్ ఓ చోటా రాజకీయ నాయకుడి ప్రాపకాన్ని నమ్ముకుంది. స్జేజిపై మయూరిలా నర్తించిన సుజయ్‌కుమార్ భార్య మంగ కుట్టుమెషీన్ తొక్కాల్సి వచ్చింది. వాస్తవాన్ని జీర్ణించుకోలేని సుజయ్‌కుమార్ ఏ పనికీ మళ్ళలేకపోయాడు. జూనియర్ ఎన్టీఆర్‌గా వెలిగిన వైభవానికి తెరపడ్డా అలవాటు పడ్డ తాగుడును విడిచి పెట్టలేకపోయాడు. భర్త మీదున్న ప్రేమతో కొన్నాళ్ళు సహించిన మంగ ఇల్లు గడవడమే గండం కావడంతో చివరికి తెగేసి చెప్పింది.
''రూపాయి సంపాదించకపోగా ఆ తాగుడు మానవు. చెవినిల్లు కట్టుకుని పోరినా నాడు వినకపోతివి. ఇప్పుడేమో ఇలా మిగలాల్సి వచ్చింది. నువ్వు తేకపోతే మానె, నీ తాగుడికి నన్ను డబ్బులడగొద్దు. చిల్లిగవ్వ ఇవ్వను''
కుటుంబ పోషణకు భార్య చేస్తున్న ఒంటరి పోరాటం సుజయ్‌కుమార్‌కి తెలుసు. కానీ రాజ్యం కోల్పోయినా రాజసం పోని వాడిలా గతాన్నే తలుచు కుని ఆ జ్ఞాపకాలనే నెమరేసుకుంటూ మత్తులో మునిగిపోవడానికి అలవాటు పడిపోయాడు. భార్య అన్నమాటకు కట్టుబడి డబ్బులు ఇవ్వకపోవడంతో రోడ్డున పడ్డాడు. పరిచయమున్న ప్రతివాడి ముందూ చేతులు సాచి అడగసాగాడు. ఎవరు ఎంతిచ్చినా చీప్ లిక్కర్‌కే జమయ్యేది.
రికార్డింగ్ డ్యాన్స్‌లను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో సుజయ్‌కుమార్‌కి అర్థం కాలేదు. కొత్తగా వస్తున్న సినిమాల్లో హీరో హీరోయిన్లు డ్యూయట్ల పేరుతో బట్టల్ని అడ్డంగా పెట్టుకున్న బ్లూ ఫిలిమ్‌లనే చూపిస్తున్నారు. అలాంటి సినిమాలకు ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తోంది. ప్రజలను పాలించేవారే అలాంటి సినిమాల షూటింగ్‌లను ప్రారంభిస్తూ, పాటల క్యాసెట్లను విడుదల చేస్తూ విజయవంతం కావాలని ఆశీర్వదిస్తున్నారు. అందాల పోటీల విజేతలకు కిరీటాలు తొడుగుతున్నారు. క్లబ్‌లలో, పబ్‌లలో అర్ధనగ్న, నగ్న నృత్య విన్యాసాలు జరిగిపోతూనే ఉన్నాయి. రీమిక్స్‌ల పేరిట అంగాంగ విన్యాసాల సీడీలు వస్తూనే ఉన్నాయి. డ్యాన్స్ హంగామాల పేరిట కామ వికారాన్ని ప్రేరేపించే కార్యక్రమాలు జరిగిపోతూనే ఉన్నాయి. టీవీలో 24 గంటలూ దేవతా వస్త్రాలతో సాగే విన్యాసాలను చూపే ఫ్యాషన్ ఛానళ్ళూ, బూతుతో మిడ్‌నైట్ మషాళాలూ, కామ వికారాన్ని ప్రేరేపించే సవాలక్ష ప్రకటనలూ, ముక్కుపచ్చలారని చిన్నారులకు వెకిలి దుస్తులు వేసి అశ్లీలపు సినిమా కుప్పిగంతులు వేయించే డ్యాన్స్ బేబి డ్యాన్స్‌లూ ప్రసారమవుతూనే ఉన్నాయి. ఇంటర్నెట్ కేఫ్‌లలో పోర్నో సైట్లకు కుర్రకారు ఎగబడుతూనే ఉన్నారు. మరి రికార్డింగ్ డ్యాన్స్‌లతో లోకానికి ముంచుకొచ్చిన ముప్పేమిటి? తెరపై చూపేదానికి స్టేజిపై అనుకరణను నిషేధించినంత మాత్రాన జనంలో వికారాలు రద్దయిపోతాయా? సినిమాల కన్న సినీ రికార్డింగ్ డ్యాన్స్‌లు చెడిపోయాయా? సుజయ్‌కుమార్‌ను వేధించిన ఈ ప్రశ్నలకు జవాబు లభించలేదు.
రికార్డింగ్ డ్యాన్స్‌లు రద్దయినా రాజకీయాల పుణ్యమాని సుజయ్‌కుమార్‌కు అప్పుడప్పుడూ పని తగిలేది. ఎన్నికల ప్రచార సమయాల్లో తెలుగుదేశం వారు ఎన్టీఆర్ వేషం కట్టమని పిలిచేవారు. రోజుకింతని ఇచ్చేవారు. ఎన్టీఆర్ తెర వేషాలనే కాక ఆయన నిజజీవితంలోని పాత్రనూ అనుకరించే అవకాశం వచ్చినందుకు సంతోషించాలో, తెలుగు వారికి ఆరాధ్య కళాకారుడైన ఆయన స్థాపించిన పార్టీ పాలనలోనే తమ 'కళ'పై నిషేధం తప్పనందుకు ఏడవాలో అర్థమయ్యేది కాదు సుజయ్‌కుమార్‌కి. ఏమైనా- మోడైన ముఖానికి మళ్ళీ రంగు వేసుకునే అవకాశం వచ్చినందుకు తాయిలం దొరికిన పసిపిల్లాడిలా సంబరపడేవాడు. తనలోని కళాకారుడు బతికే ఉన్నాడని చాటుకోవాలని తపించేవాడు. ఎన్టీఆర్‌లా ధోవతి, లాల్చీ, ఉత్తరీయం ధరించి, ఆయన రాజకీయ ప్రసంగాలకు అభినయంచేస్తూ మైమరచి పోయేవాడు. అలా ఓ ఎన్నికల ప్రచారంలో ట్రాక్టర్‌పై ఎన్టీఆర్ వేషంలో లీనమైపోయి అభినయిస్తుండగా కిందకు జారిపడడంతో కుడి కంటికి గాయమై చూపు పోయింది. ఎన్నికలప్పుడు పిలుపులూ ఆగిపోయాయి. ఇప్పుడు వయసు మీద పడడంతో రెండో కంటికి చత్వారం వచ్చింది. తాగి తాగి నరాలు పట్టు తప్పాయి. స్టేజిపై చిరుతపులిలా గెంతినవాడు చేతి కర్ర ఊతంతో అడుగులో అడుగేసుకుంటూ అతి కష్టమ్మీద నడవాల్సి వస్తోంది.
* * *
ఉదయం వంట పూర్తిచేసి కుట్టు మెషీన్ ఎక్కింది మంగ. నాలుక పీకేస్తుండగా జంకుతూనే పది రూపాయలడిగాడు సుజయ్‌కుమార్. నడివేసవిలో అకస్మాత్తుగా గోదావరికి వరద వచ్చినట్టు కోపంతో విరుచుకు పడింది మంగ.
''తాగుడికేగా''ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధిరాదా? నీలాంటి వాడి కడుపున పుట్టబట్టే పిల్లలు చదువుకోవలసిన వయసులో షెడ్డుల్లో గొడ్డు చాకిరీ చేస్తున్నారు. ఇంట్లో కూర్చుని పెట్టేది తినలేవా? ఈ పాడు బతుకు బతికేకన్న గోదాట్లో దూకి చావొచ్చుగా. ఒకేసారి ఏడ్చి ఊరుకుంటాం'' అంటూ తిట్టి తిట్టి బావురుమంది. సుజయ్‌కుమార్‌కి 'జన్మమెత్తితిరా...' పాట గుర్తుకు వచ్చింది. మంగ మీద జాలేసింది. తనపై తనకు రోత పుట్టింది. మంగ ఒళ్ళో తల పెట్టుకుని ఏడవాలనిపించింది. అయినా ధైర్యం చేయలేకపోయాడు. మారుమాటాడకుండా రోడ్డెక్కాడు. ఏడుస్తూనే ఉన్న మంగ 'తిండి తిని వెళ్ల'మని అనలేకపోయింది.
కర్రతో రోడ్డును కొలుచుకుంటూ వీధుల్లో తిరిగాడు.
'ఈ వీధుల్లోనే తాను కార్లలో తిరిగాడు. ఈ వీధుల్లోనే తాను ఎదురైతే 'ఎన్టీఆర్‌గారూ! బాగున్నారా?' అన్న పలకరింపులు తెరిపి లేకుండా వినిపించేవి. తనను చూసి ఎన్టీఆర్ అభిమానులు ఆయనను చూసినట్టే సంబరపడేవారు. తానెన్నడూ డూప్ హీరోనని చిన్నబుచ్చుకోలేదు. తనకు చేతనైన కళతో జనాన్ని సంతోషపెట్టాడు. అవే వీధులు! ఆ వీధుల్లో ఆనాటికన్న పెరిగిన రద్దీ. అయితేనేం... ఇప్పుడు తన వంక ఓరకంట చూసేవారే లేరు. తిండి లేక కడుపూ, మందు లేక మనసూ రగులుతుండగా ఊరంతా తిరిగి తిరిగి సాయంత్రానికి గోదావరి గట్టుకు చేరాడు. గౌతమీ నందనవనం పార్కులోకొచ్చి కూర్చున్నాడు. చీకటి పడకముందు నుంచీ అలాగే బెంచీమీద కూర్చుని గతాన్ని నెమరేసుకున్నాడు.
రికార్డింగ్ డ్యాన్స్ 64 కళల్లోనూ గొప్ప కళ అనీ, తాను గొప్ప కళాకారుడిననీ ఎప్పుడూ అనుకోలేదు. హీరో హీరోయిన్లు లెక్కలేనన్ని టేక్‌ల తరువాత రక్తి కట్టించిన పాటలని తాము ఏకబిగిన స్టేజిపై అభినయించి ప్రేక్షకుల్ని రంజింప చేస్తున్నామనుకున్నప్పుడు మాత్రం ఒకింత గొప్పగా అనిపించేది. తమ అభినయంలో తాము పనిగట్టుకుని సృష్టించే అసభ్యత ఏముందో, తెరపై చూపే దానివల్ల కలగని ముప్పు తమవల్ల ఎలా కలుగుతుందో సుజయ్‌కుమార్‌కు అంతుబట్టలేదు.
'తెరపై హీరో హీరోయిన్లు చూపగల అన్ని శృంగార భంగిమలనూ స్టేజిపై అభినయించడం తమకు సాధ్యమూ కాదు. కెమేరాలను ఎక్కడెక్కడో ఫోకస్ చేసి క్లోజప్‌లో హీరోయిన్ అందాలను చూపి సొమ్ము చేసుకోవడంలో తాము సినిమా వాళ్లతో పోటీపడనూ లేరు. రికార్డింగ్ డ్యాన్స్‌లపై నిషేధం అంటే తమ నోటి దగ్గర కూటిని ఎత్తుకుపోయిన రాకాసి గద్ద తప్ప మరేమీ కాదు. లోకానికి నీతి లేదు. తనకు ఒక కన్నే పోయింది. లోకానికి రెండు కళ్ళూ ఎన్నడో పోయాయి. రికార్డింగ్ డ్యాన్స్ కళాకారులు కలలో కూడా పోటీ పడలేని బూతు సంస్కృతి విశ్వరూపంలో పేట్రేగిపోతున్నా దానికి కనిపించలేదు. పైగా అలాంటి బూతు సంస్కృతిని సృష్టించే వారికి శాలువాలు కప్పి సన్మానాలు చేస్తుంది. అవార్డులూ, బిరుదులూ కట్టబెడుతుంది. గోదావరిలో ఊరి మురుగంతా కలిస్తే లేని ముప్పు, ఓ పిలగాడు ఉచ్చ పోస్తే విరుచుకు పడుతుందా? రికార్డింగ్ డ్యాన్స్‌లను నిషేధించినవారు ఆ తరువాత ఎంత గొప్ప సంస్కృతిని పెంచి పోషించారు?'
తమ బతుకుల్లో చిచ్చు పెట్టిన లోకంపై కక్షతో పళ్ళు నూరుకున్నాడు సుజయ్‌కుమార్. మంగా, పిల్లలూ గుర్తొచ్చారు. కళ్లలో నీళ్ళు తిరిగాయి.
'చిల్లుల నావపై కుండపోత వానలా వాళ్ళ బతుకులకు తాను బరువే. మంగ అన్నది నిజమే. తాను చచ్చిపోతే వాళ్ళ బతుకులు తేలిక పడతాయి'
ఎనిమిదిన్నర దాటడంతో పార్కులో జనం పల్చబడ్డారు. గోదావరిలో వేలాడుతున్న జాలరులు వలలో చిక్కిన చేపలను నావల్లోని గంపల్లో వేస్తున్నారు. కాసేపు గిలగిలలాడాక వాటిలో చలనం నిలిచిపోతోంది. పార్కు వాచ్‌మెన్ వచ్చాడు.
''ఏమయ్యా! ఇల్లు గుర్తుకు రావడం లేదా? లేలే, గేటు వేసేస్తా'' అన్నాడు.
పక్కనున్న కర్ర పట్టుకుని లేచాడు సుజయ్‌కుమార్. గంటసేపు నడిచి కోటిపల్లి బస్టాండ్ సెంటర్‌లోని ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని చేరాడు. పట్టు తప్పిన కాళ్లతో తడబడుతూనే ఇనుప నిచ్చెన మీదుగా విగ్రహం ఉన్న దిమ్మనెక్కాడు. మసక చూపుతోనే ఆ మహా నటుడిని తనివి తీరా చూసుకున్నాడు. విగ్రహం ముఖం చుట్టూ రెండు చేతులూ వేసి నిమిరాడు. తరువాత తన ముఖాన్ని ఆప్యాయంగా నిమురుకున్నాడు. కాళ్లను మురిపెంగా తడుముకున్నాడు. వెర్రి గర్వంతో ఛాతీ విరుచుకున్నాడు. దూరంగా నవరాత్రి పందిరి నుంచి 'డ్యాన్స్ బేబీ డ్యాన్స్' చూస్తున్న ప్రేక్షకుల ఈలలూ, చప్పట్లూ గాలిలో తేలి వస్తున్నాయి. సుజయ్‌కుమార్ బిగ్గరగా నవ్వాడు. భర్త మరణాన్ని రద్దు చేయమని చేతులు జోడించి ప్రార్థిస్తున్న సతీ సావిత్రిని చూసి యముని వేషంలోని ఎన్టీఆర్ లా పగలబడి నవ్వాడు. నవ్వీ నవ్వీ కళ్లలో నీళ్ళు తిరుగుతుండగా దిమ్మ మీంచి ఎగిరి కింద విగ్రహం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ మీదికి దూకాడు. శూలంలాంటి ఊచలు గుండెల్లో దిగబడగా జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ సుజయ్‌కుమార్ అలియాస్ అప్పారావు ఊపిరికి తెరపడింది.
Thursday, December 13, 2007
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
kalidas mi abbi gurinchi na bidda telanganalo ilane antam ani cheppadam baga nachindi
Post a Comment