Thursday, December 13, 2007

నాన్నగారి జ్ఞాపకం - తమిళ కథ

 
ఉదా పార్తిబన్‌
అనువాదం:చల్లా భాగ్యలక్ష్మి
కురిసి కురిసి అప్పుడే వెలిసిన ఆకాశం కిటికీలోంచి చూస్తుంటే స్వచ్ఛమైన స్ఫటికంలా అనిపించింది. లాన్‌లో గడ్డిమీద నిలిచిన నీటి బిందువులు... తేమ నిండిన గాలి... దాన్నిండా యూక్లిప్టస్‌ ఆకుల వాసన...నాన్నకు ఇవన్నీ చాలా ఇష్టం. ఆయన ఇంట్లో ఉన్నారంటే చాలు. 'గోల్ఫ్‌' మైదానం వరకు వాకింగ్‌కు వెళ్తారు. నేనూ ఆయన్ని అనుసరించిన సందర్భాలు ఎన్నో. అలా వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు పడే తుంపర్లు నాన్నలో ఏదో తెలియని ఉత్సాహాన్ని నింపుతాయి. ఆయన కళ్లు ఆనందంతో విప్పారుతుంటాయి. ఆ సమయంలో ఆయన్ని చూశానంటే వెంటనే చేయి పట్టేసుకునేవాడ్ని.

పాతికేళ్ల కుర్రాడు తన తండ్రి చేయి పట్టుకుని నడవడం అరుదైన సన్నివేశమే. అయితే నాకు మాత్రం అది చాలా సంతోషాన్నిస్తుంది.
నాన్నని నేనెప్పుడూ ఓ తండ్రిగా చూడలేదు. నా అంతరంగిక స్నేహితుడిగానే భావించాను. నాన్నకు కోప్పడ్డం చేతగాదు. ''ఇన్నేళ్లు కాపురం చేసినా ఆయన ముఖం చిట్లించడం నేనెప్పుడూ చూడలేదురా'' అని గర్వపడుతుంది అమ్మ. ఎప్పుడూ ఆయన పెదాలపై చిరునవ్వు పలుకరిస్తుంటుంది. 'నీకు కోపమే రాదా నాన్నా' అంటే దానిక్కూడా నవ్వుతూ 'ఎందుకు కోప్పడాలి? జీవితంలో ఓడిపోయినవారే చిర్రుబుర్రులాడుతారు. నా జీవితంలో పరాజయాలే లేవు. మనసుకు నచ్చిన ఉద్యోగం... సరిపోయినంత జీతం, భార్య గుణవతి, కొడుకు బుద్ధిమంతుడు... ఇంకేం కావాలి నాకు?' అని ఎదురు ప్రశ్నించేవారు.

ఇంట్లోనే కాదు... బయటా అంతే. నవ్వుతూ నలుగురితోనూ సన్నిహితంగా ఉండడమే ఆయన నైజం. ఎంతోమంది కష్టనష్టాల పట్టికను నాన్నతో వల్లె వేస్తుంటారు. ఆయన సర్ది చెప్పే వైనానికే సగం సమస్య తీరినట్టు వారి ముఖాలు వెలిగిపోతుంటాయి. మాట సాయం కాదు... ఏ సాయం కావాలన్నా నాన్న అందరికన్నా ముందే ఉంటారు. వ్యక్తుల మీదే కాదు. ఇతర ప్రాణులన్నా ఆయనకు దయ ఎక్కువ. ఇదిగో... మా ఇంటి చుట్టూ ఉన్న చెట్టూ చేమలన్నీ నాన్న పెంచినవే. నారింజ రంగులో కులుకుతున్న జెరేనియం, పసుపు రంగు లిల్లీ, శ్వేత గులాబీలు, ఎర్ర డెలియా... ఎన్నెన్ని రకాలనీ.

మేమేం పాపం చేశామనో నాన్న ఇంత త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లారు. ఆ రోజు కూడా వర్షం కురిసింది. నాన్నకు ఇష్టం కదా అని అమ్మ మిర్చిబజ్జీ వేస్తుంటే వచ్చిందా వ్యాన్‌... నాన్న ఫ్యాక్టరీ హాస్పిటల్‌లో ఉన్నారన్న వార్తను మోసుకుంటూ.
ఏమైందో ఏమిటోనని అందరం ఒకటే పరుగు... గుండెపోటు వచ్చిందట. ఆయన్ని ఓ రెండు నిమిషాలు చూడ్డానికి మాత్రమే మమ్మల్ని అనుమతించారు. పెద్ద మట్టిపురుగులాంటి ప్లాస్టిక్‌ పైపుతో నాన్న కనిపించారు. అలాంటి పరిస్థితిలోనూ చెక్కు చెదరని చిరునవ్వు. అమ్మ ఏడుపును ఆపుకోలేకపోతోంది. పెద్ద పెట్టున కేక పెట్టి మరీ గుండెలు బాదుకుంది. నాన్న కళ్లతోనే ధైర్యం చెప్పారు. ''నాకేం కాదు... బాధపడొద్దు'' అని.

కానీ మరో అరగంటలో భయపడినంతా అయింది. అందరి మంచీ కోరుకునే నాన్న గుండె చప్పుడు ఆగిపోయింది. అమ్మ స్పృహ కోల్పోయింది. నా కాళ్లు భూమిలోకి చొచ్చుకుపోయాయి. ఎవరో అమ్మ ముఖంపై నీళ్లు చల్లారు. నన్ను కూడా ఎవరో పొదివి పట్టుకున్నారు.
నాన్న మనుషుల్లో ఎప్పుడూ హెచ్చుతగ్గులు చూసినవాడు కాదు. బడ్డీకొట్టు నడిపే వారినుంచి గొప్ప అధికారుల వరకూ అందరితోనూ ఒకేలాగే ప్రవర్తించేవారు. ఇతరుల అభిమానాన్ని ఆయన ఎంతగా చూరగొన్నారో అక్కడ తెలిసింది. అక్కడున్న ప్రతి ఒక్కరూ గుండెలవిసేలా రోదించారు. ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ అంతా కదిలొచ్చింది. మరుసటిరోజు అంత్యక్రియలు చేసేదాకా నాన్నతోనే ఉంది. ఏడ్చి గగ్గోలు పెట్టిన మాకు ధైర్యం చెప్పింది. ఎవరు ఏం చెప్పి ఏం లాభం? మా ప్రపంచమే కూలిపోయింది. శూన్యమైపోయింది. ఏ వైపు తిరిగినా నాన్న జ్ఞాపకాలే.

వారం తిరిగిందో లేదో కంపెనీ ఛైర్మన్‌ నన్ను రమ్మని కబురు పెట్టారు. వెళ్లాను.
నాన్న అంత్యక్రియలకు ముందు ఆయన్ని ఒకటి రెండుసార్లు చూశాను.
''రా నాన్నా... కూర్చో'' అన్నారు.
కాస్త భయపడుతూ కుర్చీ అంచున కూర్చున్నాను. నాన్నకు రావల్సిన మొత్తాన్ని చెక్కు రాసి సంతకం పెడుతూ ఆడిగారు ''ఏం చదువుకున్నావ్‌?'' అని.

''ఎం.ఎ. సార్‌...''
''ఇది కేంద్రప్రభుత్వ సంస్థ. ఇక్కడి ఉద్యోగులు చనిపోతే సాధారణంగా వాళ్ల వారసులకు ఉద్యోగాలివ్వం. కానీ... మీ నాన్న గురించి, ఆయన పని తీరు గురించీ మాకు బాగా తెలుసు. ఆయన కావాలనుకుంటే దొడ్డిదారిలో ఎంతో సంపాయించేవాడు. కానీ అలా చేయలేదు. డబ్బు కోసం వృత్తికి ద్రోహం చేయలేదు. అందుకే ఆయన కుటుంబానికి, నాకు వీలైనంత సాయం చేయాలనుకుంటున్నాను. నీకు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నా... ఏమంటావ్‌?''

ఆ వాక్కు దారి కానరాక చీకటిలో చిక్కుబడిపోయి ఉన్న వ్యక్తికి సూర్యోదయం. నాన్న నిజాయితీ చూపించిన వెలుగు. ''ఇదే క్వార్టర్స్‌లో ఉండవచ్చు'' అన్న ఛైర్మన్‌ మాటలు ఇంకా వినబడుతున్నాయి. మరుసటి వారమే ఉద్యోగంలో చేరాను. అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగం. నాకో గది. ఎగ్జిక్యూటివ్‌ టేబిల్‌, కుర్చీ, ఫోను, కంప్యూటర్‌, పిలిచీ పిలవగానే వచ్చే ప్యూన్‌... నా వేషం చటుక్కున మారినట్టుంది.

ఆరోజు...
ప్యూన్‌ తెచ్చిచ్చిన ఫైల్‌మీద సంతకం చేశాను. దాన్ని తీసుకుని సగం దూరం వెళ్లిన అతడు తిరిగొచ్చాడు. ''సార్‌... ఈ లెక్కనోసారి కూడండి. తప్పుగా సంతకం చేశారు'' అన్నాడు. అతను చెప్పింది నిజమే. సరిచేసి సంతకం పెట్టాను. అతడు బయటికెళ్లి నా మీద చాడీలు చెప్పడం వినిపిస్తూనే ఉంది. వెంటనే అతణ్ణి పిలిచి చెడామడా తిట్టాను. అతడు తల వంచుకుని వెళ్లిపోయాడు.

మరుక్షణం ఫోన్‌ మోగింది. అకౌంట్‌ సెక్షన్‌ నుంచి... ''చూడు తమ్ముడూ... నువ్వరిచిన అరుపులు నేనూ విన్నాను. కీప్‌ ఇట్‌ అప్‌'' అన్నారు అటు వైపునుంచి.

నాలో ఏదో తెలియని అతిశయం పొంగింది. క్యాంటీన్‌ కెళ్తే అక్కడ కూడా అందరూ ''వెరీ గుడ్‌'' అన్నారు.
''ఆ ప్యూన్‌కి యూనిట్‌లో మంచి పేరుంది. అతణ్ణి తిట్టడానికి పెద్ద ఆఫీసర్లే భయపడతారు. మీరు చాలా ధైర్యస్థుల్లా ఉన్నారే'' అన్నారు మరికొందరు.

ఇంతలో ప్యూన్‌ కొంతమందిని వెంటేసుకుని వచ్చాడు. ''ఏంటీ? ఉద్యోగంలో చేరీ చేరకముందే పెత్తనం చెలాయిస్తున్నావు. కేవలం ప్యూన్‌ ఉద్యోగం అన్నావటగా... ప్యూన్లంటే నీకంత చులకనా?'' అన్నారు అతనితో వచ్చినవాళ్లు. అంతటితో ఆగలేదు... ''మెమో ఇస్తానని బెదిరించావటగా... మీ నాన్న బుద్ధులు నీకు రవ్వంత కూడా రాలేదే?'' అన్నారు.
అంతకుముందు ఎన్ని అన్నా చివరి మాటలు నా చెవిలో మారుమోగాయి. బైక్‌మీద ఎంత స్పీడ్‌గా వెళ్లానో నాకే అర్థం కాలేదు. ఇంటికెళ్లి మంచం మీద వాలిపోయాను.

మనసులో ఏవో జ్ఞాపకాల దొంతరలు. 'మీ నాన్న బుద్ధులు నీకు రవ్వంత కూడా రాలేదు' అన్న మాటలు ఇంకా వినిపిస్తున్నాయి.
'నాన్న లేరని బాధపడితే చాలా? ఆయన మహోన్నత గుణ గణాలను తలచుకుని మురిసిపోతే సరిపోతుందా? నాన్నని ఆదర్శంగా తీసుకుని ప్రవర్తిస్తే కదా. ఎలాంటి పరిస్థితుల్లోనూ కోపమన్నది ఎరుగని ఆయన గుణం, అందరినీ సమానంగా చూసే తత్వం అబ్బితే ఎంత బావుణ్ణు. ఇవన్నీ నాలో ఉంటే ఆయన ఇంకా బతికున్నట్టేగా. అప్పుడే కదా ఆయన ఆత్మకు శాంతి కలిగేది...' అని నన్ను నేను బుజ్జగించుకున్నాను.

చెదరిన మనసు కాస్త కుదుట పడింది. రేపు ఉదయాన్నే ప్యూన్‌ను పిలిచి మాట్లాడాలి అనుకున్నాను. అంతలో గుర్తొచ్చింది.... బైక్‌ వల్ల గాయపడ్డ కుక్కపిల్ల. వీధి పక్కన పడి ఉన్న ఆ బుజ్జికుక్కను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నా. ఇంటికి తెచ్చి పాలన్నం, బిస్కెట్‌ తినిపించా. అది కృతజ్ఞతాపూర్వకంగా తోకాడించింది.
నాలో ఏదో తెలియని ఆనందం. అంతలో అక్కడున్న మొక్కలన్నీ గాలికి తలలూపాయి. అరే... వీటికి నీళ్లు తోడి ఎన్ని రోజులయిందో కదా అనుకుని అన్నింటినీ తడిపాను. వంగిపోయి కనిపించిన ఓ గులాబి మొక్క నిటారుగా నిలబడి నవ్వినట్టనిపించింది. మనసు పరవశించింది.
వెంటనే నాన్న గుర్తుకొచ్చారు.

No comments: