Thursday, December 13, 2007

సేవ - తెలుగు కథ

''అబ్బా, ఇంక యీ బాధ భరించలేను దేవుడో త్వరగా తీసుకుపోరా నాయనా. ఇంకెన్నాళ్లు వీళ్లను అవస్థ పెట్టాలి. ఇంకెంతమంది నన్ను చీదరించుకోవాలి. ఎంతపాపం చేశానురా భగవంతుడా, నా కింతటి శిక్ష వేశావు...'' సీతమ్మ బాధతో మూలుగుతూ తనను తాను తిట్టుకుంటోంది.
''ఎందుకమ్మా, అలా బాధపడతావు. ఇప్పుడు నీ మీదెవరు విసుక్కున్నారనీ. నువ్వు మాకు భారమని అన్నానా? సాయంత్రం ఆయనొచ్చాక డాక్టరును తీసుకొస్తాడులే'' అంది నిర్మల తల్లిని ఓదార్చుతూ.

సీతమ్మ మంచం పట్టి సంవత్సరం దాటింది. పక్షవాతం- కుడికాలు, కుడి చెయ్యి పడిపోయాయి. మొహం కూడా కుడివైపుకు ఈడ్చుకుపోయి వికృతంగా వుంటుంది. ఆమె అవసరాలన్నీ ఓ మనిషి సాయంతో మంచం దగ్గిరే తీరాలి.
''దిండు యిలా వేస్తాను. వెనక్కువాలి కూర్చుని కాసిని పాలుతాగు. నిస్త్రాణగా వుంటే మరీ బెంబేలు పడిపోతావు'' అంటూ పాలగ్లాసు స్టూలుమీద పెట్టి మంచం పక్కకు వచ్చింది నిర్మల.

సీతమ్మ మొహంలో కోపం, దైన్యం, విసుగు. నిస్సహాయతతో మరింత దిగులు. అలవాటైన వాళ్లకు తప్ప ఆమె మాటలు పోల్చుకోవటం కష్టం.
''పెద్దాడికి కబురు పంపావా?''
''ఆఁ... ఆయన రెండుసార్లు ఫోన్‌ చేశాడు. అన్నయ్య వస్తానన్నాడట. ఇవాలో రేపో వస్తాడులే''.
''మళ్లీఫోన్‌...''
''అలాగే మళ్లీ ఫోన్‌ చెయ్యమని ఆయనకు చెబుతాను. నువ్వైతే పాలు తాగు''.
''జ... జై...''
''ఆఁ జయక్కూడా కబురు పెట్టారు. సెలవులు కదా, జయా, వాళ్లాయనా కలసి అత్తవారి ఊరెళ్లారట. రాగానే వస్తారు''.
సీతమ్మకు పెద్దకూతురి మాటల మీద నమ్మకం కుదరదు. ఇది తన దగ్గర బుకాయిస్తోంది. లేకపోతే కొడుకూ, చిన్న కూతురూ యింకా ఎందుకు రారు? తనకు ప్రతిరోజు యిదే ఆఖరి రోజన్నట్టుగా వుంటున్నది.

''మీ... ఆయన యింకా ఎందుకు రాలేదు?''
''ఆరే కదా అయింది. వస్తుంటారు''
''డాక్టరు వెళ్లిపోతాడేమో...''
''వెళ్లడమ్మా, ఎనిమిదింటిదాకా వుంటాడు. ఇదిగో, పాలు''
వద్దని తలతిప్పటానికి కూడా శక్తిలేదు. అతి ప్రయత్నం మీద ''పిల్లలు...'' అంది సీతమ్మ.
''వచ్చారమ్మా, హోంవర్కు చేసుకుంటున్నారు''.
సీతమ్మ నిష్ఠూరంగా చూసింది.
పిల్లలు యిటీవల ఆమె గదిలోకి రావటం తగ్గినమాట వాస్తవమే.
''పరీక్షలు దగ్గరకొస్తున్నాయి గదమ్మా... చదువుకోకపోతే ఎలా?'' అంది నిర్మల.
తల్లి వుంటున్న గదిలోకి పిల్లలు రావటం ఆరోగ్యకరం కాదని ఆమెకు తెలుసు. గదిలో వాసన. అనారోగ్యకరమైన వాతావరణం.
ఎంత ఫినైలు వేసి కడిగినా ఆ దుర్గంధం పోదు. డెట్టాలు పెట్టి తల్లిఒళ్లు తుడుస్తుంది. కాని ఆమె శుభ్రమైన మనిషిలా ఎలా వుండగలదు?

''పిల్లల్ని రమ్మను''
నిర్మల యిరకాటంలో పడింది.
''తర్వాత వస్తారు లేమ్మా''
సీతమ్మకు అనుమానంతో పాటు పట్టుదల పెరిగింది.
''రమ్మను.''
పిల్లలు వస్తే ఆమె వూరుకోదు. వాళ్లను దగ్గరకు లాక్కుని, కౌగిలించుకొని, ఒళ్లు తడిమి, ముద్దులు పెట్టుకుంటుంది. పిల్లలు చీదరించుకొంటారు. చొంగ కారే ఆమె నోరు చూసి వాళ్లు అసహ్యించుకొని, విదిలుంచుకొని వెళ్లిపోతారు. సీతమ్మ ఏడుస్తుంది.
'పిల్లలకు నామీద మమకారం లేకుండా చేశావు' అందోసారి.
నిర్మల మనసు చివుక్కుమంది.

కాని తల్లి మీద ఎలా కోపం చూపించగలదు? అందువల్ల రహస్యంగా ఏడ్చి యథా ప్రకారం తన విధుల్ని నిర్వర్తిస్తూనే వుంది. భర్తక్కోపం వస్తుందేమోనని ఈ మాట అతడిక్కూడా చెప్పలేదు.
సీతమ్మకు పెద్దల్లుడి మీద కోపంగా వుంది. అతడు తనను నిర్లక్ష్యం చేస్తున్నాడు. కూతురు కాస్త మెరుగేకాని, అది కూడా భర్తకు వంత పాడుతున్నట్లుగానే వుంటుంది. ఆస్పత్రిలో నర్సులాగా వుంటుందే తప్ప దానికి నిజంగా తన మీద ప్రేమవుందా?
ఎంతైనా, కొడుకు దగ్గర వున్న సుఖం తనకు కూతురింట్లో ఎలా వస్తుంది? కన్న కూతురైనా పరాయి ఆడపడుచే గదా?
''సరే. పాలిప్పుడు వద్దా ఇక్కడే పెడతాను తరువాత తాగు. ఆయనొచ్చేలోగా నేను వంట చేసి వస్తాను'' అంది నిర్మల.
సీతమ్మ నిప్పులు కక్కుతూ కూతుర్ని చూసింది.
తల్లి కోపం నిర్మలకు నవ్వుతెప్పించింది.

''ఇప్పుడే వస్తానమ్మా, బియ్యం, పప్పు కుక్కర్లో పెట్టివస్తాను''అంటూతల్లి చెంపలు నిమిరింది.
తల్లి కోపం ఆమెకు కొత్తేమీకాదు. ఆమె పరిస్థితికీ, ఆమె చిరాకుకూ సంబంధం వుందని గ్రహించి, ఎన్ని మాటలన్నా భరిస్తుంది. కాని ఆ క్షణాన ఎందుకోగాని తల్లికి తనమీద ద్వేషం, అసహ్యం పెరుగుతున్నాయేమోననిపించింది. ఎందుకు తల్లికి తనమీద విసుగు? తనెక్కడ పొరపాటుచేసింది? ఏం లోటు చేసింది? ఆమె ఎందుకిలాగైంది. తన అన్న, చెల్లెళ్ల మీది కోపం తన మీద చూపిస్తున్నదా? వంటింట్లో కెళ్లటానిక్కూడా కాళ్లు రాలేదు. కాంతి తగ్గిన తల్లి గాజు కళ్లలోకి చూస్తు వుండిపోయింది నిర్మల. ఆమెకు కొడుకంటే పంచప్రాణాలు. ఆ సంగతి తనకు తెలుసు. అతడు రాకపోతే ఆమె బాధపడటం సహజం.

తన పెళ్లినాటికి తల్లిదండ్రులు అంత మంచి స్థితిలోలేరు. అందువల్ల పదహరేళ్లకే వచ్చిన మొదటి సంబంధం చూసి పెళ్లి చేశారు. అక్కడితో వాళ్లకు తన బాధ్యత తీరింది. తరువాత తండ్రికి కొంత ఆస్తి కలిసి వచ్చింది. కాని అప్పటికే తనకూ వాళ్లకూ సంబంధం తీరిపోయింది. అంతే గాక, భర్త వుద్యోగరీత్యా వేరే రాష్ట్రాలకు వెళ్లటం వల్ల దూరం మరింత పెరిగింది. ఆ తర్వాత అన్నయ్య బాగా చదువుకున్నాడు. అంటే తల్లిదండ్రులు అతడికీ, చెల్లికీ మంచి చదువు చెప్పించగలిగారు. అన్నయ్య యింజనీరింగు పాసయ్యి, పెద్దింటి సంబంధం చేసుకున్నాడు.
ఆ అమ్మాయి కూడా విద్యావంతురాలు. కాలేజీలో లెక్చరరుగా పనిచేస్తున్నది. సెల్ఫ్‌పిటీ అనేది మనుషులకు కలిగే వుద్రేకాలన్నింటిలోకీ నీచాతినీచమైనదే అయినప్పటికీ, కొన్నిసార్లు ఎంత అణచుకున్నా అణగదు. నిర్మలకు తల్లిని చూస్తుంటే సెల్ఫ్‌పిటీ పొంగిపొర్లింది.

చెల్లెలు కూడా చదువుకొంది. పైగా తెలివైన పిల్ల. బ్యాంకులో వుద్యోగం వచ్చింది. మరో బ్యాంకు ఆఫీసర్ని చేసుకుంది. తన శని త్వరగా విరగడైనందుకు తల్లి ఎంతగా సంతోషించిందో!
అలా, ఆస్తి కలిసి వచ్చినప్పుడుగానీ, ఆ తర్వాత అన్నయ్యకు, చెల్లికీ దండిగా పంచినప్పుడు గానీ తను జ్ఞాపకం రాలేదు. పెళైంది గనక తను పరాయి యింటి పిల్ల.తండ్రి మరణం తర్వాత తలకొరివి పెట్టాల్సిన కొడుకు పంచనే జీవిత శేషం గడపటానికి నిర్ణయించుకున్న తల్లి యిల్లూ, ఆస్తీ అంతా అతడి పరం చేసింది.

అన్నయ్యదీ, చెల్లాయిదీ ఒకటే స్టేటస్‌. గత సంవత్సరం ఈ స్ట్రోక్‌ వచ్చిందాకా అన్నయ్య పిల్లల్నీ, చెల్లాయి పిల్లల్నీ తల్లి చూసుకుంటూ వుండేది. వాళ్ల యిళ్లు కూడా దగ్గర దగ్గరే. ఎప్పుడైనా తను వెళ్లినా చుట్టపు మనిషిగానే.
కాని, స్ట్రోక్‌ వచ్చి, మంచం దిగలేని స్థితి ఏర్పడ్డాక, కొన్నేళ్లు హాస్పటల్లో వుంచుకొని తర్వాత డాక్టర్లు, ''మేం చెయ్యగలిగిందేమీ లేదు. ఇంటికి తీసికెళ్లండి. కేర్‌ తీసుకుంటే మరో ఏడాది, రెండేళ్లు బతక్కపోదు'' అని చెప్పాక తల్లి యింటికి వచ్చింది.

అందరూ వుద్యోగస్తులే. ఎవరు చూడాలి? ఉద్యోగం లేకుండా యింట్లో వున్నది తనొక్కత్తే. అప్పుడు తను జ్ఞాపకం వచ్చింది. ఉద్యోగస్తుల దృష్టిలో, ఇంట్లో వుండే గృహిణికి యిరవై నాలుగ్గంటలూ తీరికే.
''అమ్మను నువ్వే చూసుకోక తప్పదే. మాకైతే వీలుపడదు. మేం ప్రతి ఆదివారం వచ్చి చూసిపోతుంటామనుకో. డబ్బులేమైనా కావాలంటే సర్దుతాంలే'' అన్నాడు అన్నయ్య.

''ఛఛ అమ్మ గురించి మాట్లాడుతూ డబ్బులంటావేం'' అందితాను. పరాయి యింటిపిల్ల(సెల్ఫ్‌పిటీ)
''మాటవరసకన్నానులే ఎంతచేస్తే మాత్రం మనకు వాళ్ల రుణం తీరుతుంది'' అన్నాడు అన్నయ్య.
చెల్లెలు డిట్టో అంది.
తల్లి తనింటి కొచ్చింది.

తన భర్తకు ఆడిట్‌ డిపార్ట్‌మెంటులో పని. ఎప్పుడూళ్లో వుంటాడో, ఎప్పుడు టూరుకుపోతాడో ఆయనకే తెలియదు. నిజానికి, తల్లి తనింటి కొచ్చినరోజున ఆయన యింట్లో లేడు. కాని వచ్చిన తర్వాత విషయం తెలుసుకుని ఒక్క మాటనలేదు.
నీకు వీలైనంత చెయ్యి. మన సుఖం కన్నా ఆమె అవసరం ముఖ్యం. అతడి స్వభావం తెలుసు గనక అది వ్యంగ్యం కాదని ఆమె అర్థం చేసుకోగలిగింది.

ఒకటి రెండు వారాలు అన్నయ్య, చెల్లెలూ వచ్చారు.
తరువాత నెలకోసారి. ఈలోగా వాళ్లు విలాస యాత్రలు చేశారు.
చివరిసారి, చెల్లెలు రెండునెలల క్రితమూ అన్నయ్య మూడునెలల క్రితమూ వచ్చారు.
అందువలన, ఆలనాపాలనా చూసుకునే పెద్ద కూతురి మీద తప్ప, మంచానపడ్డ ఆ తల్లి తనకోపం మరెవరిమీద చూపించగలదు?
ఖర్చులు మించిపోతున్నాయి. వాళ్లనడగాలంటే మొహమాటం. తన కన్నా ఎక్కువ మొహమాటం భర్తకు. రెండు, మూడుసార్లు విసుక్కున్నాడు. చిన్న పోట్లాటలు కూడా జరిగాయి.

కోపంగా తను ''చూడండి నా చాకిరీ తీసెస్తే మనమామెకు పెట్టింది అయిదారు వేలకు మించదు. ఇప్పటికీ ఆమె ఒంటిమీద బంగారం బాగానే వుంది. అన్నయ్యకూ, చెల్లెలికీ ఆమె పెట్టవలసిందంతా పెట్టేసింది. ఈ అవసానదశ కోసమే ఆమె బంగారం దాచుకున్నది. కాకపోతే యిప్పుడే అది అమ్మి మనమెందుకు బజారున పడటం. కొన్నాళ్లాగండి'' అంది.
తన బలహీనతను తెలుసుకున్న మనిషి ముందర బయటపడటం యిష్టం లేక 'నా వుద్దేశం అదికాదు' అన్నాడతడు.
* * *
''అమ్మా, అమ్మా''అంటూ పిల్చింది నిర్మల.
తల్లి మూల్గింది. ఆమె కుంగి పోతున్నదని తెలుసు. రోజురోజుకీ బలహీన పడుతూనే వున్నది. మందు మింగలేకపోతున్నది. ''ఇంకెక్కువ బతకదు'' అన్నాడు డాక్టరు.

కబురు చేయగా, అన్నయ్యా, చెల్లెలూ కుటుంబ సమేతంగా వచ్చారు. వాళ్లు వచ్చిన కొద్ది రోజులూ ఆ మూడు గదుల యిల్లు జనరల్‌ కంపార్టుమెంటులాగైంది.
పిల్లలందర్నీ చూడటంతో సీతమ్మకు ప్రాణం లేచివచ్చింది.
''వచ్చారర్రా, అమ్మయ్య. నాకిప్పుడు నిమ్మళంగా వుంది. అందరూ నా పక్కన వుండగానే ప్రాణాలు విడుస్తాను... రండి...''
మెదడు పనిచెయ్యటం తగ్గిపోయింది. మాటలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఏదో వాగింది.
''...మీరు ముగ్గురూ నాకు సమానమే. ఒకరు ఎక్కువా ఒకరు తక్కువా కాదు. ఎవరికివ్వగలిగినంత వాళ్లకిచ్చాను. ఈ బంగారం- ఇందులో నా కొడుకు నా బం గారు కొండకు సగం. మిగతాది, అమ్మాయిలూ మీరిద్దరూ పంచుకోండి. నేను నా పిల్లలకు న్యాయం చెయ్యలేదని ఎవరూ అనకూడదు'' అని తుది శ్వాస విడిచింది తల్లి.
* * *
కర్మ కాండంతా పూర్తయిన తర్వాత, తన వాటాకు వచ్చిన చిన్న గొలుసును భర్త ముందర పడేసి''ఇది తీసుకొని, మీరు పెట్టిన ఆరేడువేల ఖర్చు జమకట్టుకోండి. నా కన్న తల్లికి నేను సేవ చేశాననే తృప్తే చాలు. అందుకోసం నాకే ప్రతిఫలమూ అక్కర్లేదు'' అంది నిర్మల

1 comment:

మాలతి said...

మనతెలుగు కుటుంబాల్లో ఆత్మీయతలూ అంతఃకరణలూ ఎలా వుంటాయో చక్కగా ఆవిష్కరించారు.