Thursday, March 13, 2008

6వ అధ్యాయం

6వ అధ్యాయం

ఇస్లాం నియంతృత్వ స్వభావం
ఫ్రెంచి విప్లవం ఇస్లాం ఆవిర్భావం కలిసిన లక్షణాలు బోల్షివిజంలో ఉన్నాయి.
కమ్యూనిజం రాక తప్పదని మార్క్స్ బోధించాడు. మహమ్మద్ వారసుల మనస్తత్వమే ఇది.
మతాలలో బోల్షివిజాన్ని క్రైస్తవ బౌద్ధులకంటే మహ్మదీయ మతానికే చేర్చి చూడాలి. క్రైస్తవ, బౌద్ధాలలో మార్మిక సిద్ధాంతాలూ, ధ్యానంపట్ల ఇష్టత ఉండగా వ్యక్తిగతమతాలుగా కొనసాగాయి. మహమ్మదీయ మతం, బోల్షివిజం ఆచరణాత్మకాలూ, సామాజికాలూ, ఆధ్యాత్మికేతరాలూ, ప్రపంచాన్ని జయించాలనేవి కూడా.
(రసెల్, థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ బోల్షివిజం, లండన్, 1921, పుటః5, 29, 114)
1937లో ఛార్లెస్ వాట్సన్ తొలుత ఇస్లాంను నియంతృత్వంగా చిత్రించి, అది ఎలాగో చూపాడు. (ముస్లిం వరల్డ్, సంపుటి 28, పుటః6)
జీవితంలో అన్ని రంగాలలోనూ ప్రవేశించి మత ప్రాధాన్యతతో ముస్లింలపై పట్టి చూపుతున్న రీతిగా పేర్కొన్నరు. ఇస్లాంలో రెండు నియంతృత్వ ధోరణులను బాస్క్వే చూపాడు. ఒకటి ఇస్లాం చట్టం, రెండు ఒకే పెత్తనం కిందకు ప్రపంచం అంతా తీసుకువచ్చే ఆలోచనతో పవిత్ర యుద్ధాన్ని నడపాలనటం.
ఇస్లాం చట్టం మత, సామాజిక, రాజకీయ రంగాలను అదుపులో పెట్టాలని అంటుంది. మత సహనంతో అనుసరించే వారి కార్యకలాపాలు ఇస్లాంకు అడ్డు రాకూడదని కూడా అంటుంది. (సి.స్నాక్, హర్ గోంజ్రే, సెలక్టెడ్ వర్క్స్ ఎడిటెడ్, జి.హెచ్. బాస్క్వే, జె. షాట్, లైడన్, 1957, పుటః 264) ఇస్లాం చట్టం నీతినీ, సత్ప్రవర్తననూ, కర్మకాండలనూ వేరు చేసి చూడదు. ఈ చట్టం ఇస్లాం సమాజాన్నీ, నమ్మకస్తుల యావత్తు జీవితాన్ని అదుపులో పెడుతుంది. మారుమూల రంగాలలోనూ ప్రవేశిస్తుంది. యాత్రపన్ను, వ్యవసాయ కంట్రాక్టులూ, బానిసల నివాసం, పెళ్ళి ఆహ్వానం, పళ్ళు శుభ్రం చేసుకొనే వస్తువులూ, కర్మకాండల విలాసాలు, బంగారం, వెండి ఆభరణాల నిషిద్ధం, జంతువుల సంరక్షణ వంటి అన్ని విషయాలూ చట్టంలో ప్రస్తావించారు. ఇస్లాం చట్టమంతా విధులతో కూడినదే. దేవునిచే నియమించబడిన వ్యక్తులు ఈ చట్టాలను అమలుపరుస్తారు. ఈ విధులు దైవాన్ని దృష్టిలో పెట్టుకున్నవి. కనుక వాటి మంచి చెడులు విమర్శించరాదు. పాటించటంలో మినహాయింపులు లేవు.
(హార్ గ్రోంజే, పైన ఉదహరించిన పుస్తకం, పుటః 264)
మతం ... రాజ్యం వేరు కాదు
(లూయీస్ కెపెల్, ప్రవక్త, ఫేరో, లండన్, 1985, పుటః 10, 11, పీఠిక)
నీజరుకు ఇవ్వవలసింది నీజరుకూ, దేవునికి ఇవ్వవలసింది దేవునికీ ఇవ్వమని జీసస్ క్రైస్ట్ సూత్రం చెప్పాడు. (మాథ్యూ 22.17) దేవుడూ, నీజరూ భిన్న రంగాలలో, విభిన్న విషయాలు వారివారి నియమాలతో సంస్థలతో నిర్వహిస్తూ ఉంటారు. మతం, రాజ్యం వేరుచేసి చూడటం ఇస్లాంలో లేదు. ఇలాంటి తేడాలను చూపే పదాలు కూడా అరబిక్ లో లేవు. అలా ఎందుకు జరిగిందో ఇస్లాం స్థాపకుడి ద్వారా తెలుసుకోవాలి. మహమ్మద్ ప్రవక్త గాక, రాజనీతిజ్ఞూడు కూడా. అతడు రాజ్యాన్నీ, సమాజాన్నీ స్థాపించాడు. అతడు సైన్యాధిపతి. చట్ట నిర్ణేత. న్యాయమూర్తి, యుద్ధం, శాంతీ రెండూ తలపెట్టాడు. ఆదినుండీ ముస్లిం సమాజం ప్రవక్త ఆధిపత్యంలో రాజకీయాన్నీ, మతాన్నీ కొనసాగించింది. ముస్లింల తొలి విజయం వలన దేవుడు వారి పక్షానే ఉన్నాడని భావించారు. ఇస్లాం ప్రారంభదశ నుండీ, పవిత్ర చరిత్రకూ, సెక్యులర్ చరిత్రకూ, రాజకీయాధికారానికీ, విశ్వాసానికీ తేడా లేకుండా పోయింది. క్రైస్తవంలో సీజరుకు ఇవ్వవలసిన విధిని నిర్ణయించేముందు మూడు శతాబ్దాల చిత్రహింసలు అనుభవించారు.
ఇస్లాం చట్టం
ఇస్లాం చట్టం 4 సూత్రాలపై ఆధారపడింది. ఖురాన్, గుర్తించిన సంప్రదాయాలలో చేర్చిన ప్రవక్త ప్రవచనాలూ, సనాతనుల అంగీకారం గల ఇజ్మా విషయాలూ సామ్యంతో చెప్పిన న్యాయాధికారుల తీర్పు పద్ధతులు.
ఖురాన్
ఖురాన్ ముస్లింలకు దైవ వాక్యం. ఖురాన్ లో సాధారణ సూత్రాలుండవు. ఐతే వివాహం, విడాకులు, ఆస్తి సంక్రమణకు సంబంధించిన నియమ నిబంధనలు తొలి సమాజానికి వర్తించేవి చేర్చారు. చాలా విషయాలు గందరగోళంగా ప్రస్తావించారు. అనేక ప్రధాన విషయాలు అసలు ప్రస్తావనకి రాలేదు.
సున్నా
సున్నాఅంటే జీవిత విధానం, ప్రవక్త మాటలూ, చేతలూ ఆధారంగా ముస్లింల ఆచార వ్యవహారాలు వ్యక్తం చేశారు. ప్రవక్త నిషేధించనిదీ, అతనే ఎదుట చెప్పినవీ, చేసినవీ కూడా ఇందులో చేర్చారు. సంప్రదాయాలలో చేర్చిన సున్న చాలా వరకూ ప్రక్షిప్తాలే. అయినప్పటికీ ముస్లింల దృష్టిలో కొరాన్కు అనుబంధంగానే సున్నా ఉన్నట్లు ఖురాన్ అవగాహనకూ, స్పష్టతకూ ఖురాన్ మౌనం వహించిన వాటికోసం ఇది అవసరమంటారు. సున్నా లేకుంటే నిత్య జీవితంలో ముస్లింలకు అనేక విషయాలలో కష్టాలెదురయ్యేవి.
ఖురాన్, సున్నా దైవజ్ఞాలు గనుక విడమరచి చెప్పటానికి వీలులేని అల్లా ఆజ్ఞలు గనుక, సందేహాలూ, అరమరికలూ లేకుండా ఆమోదించాలి.
ఎన్నిఅస్పష్టతలున్నా ఖురాన్, సున్నాలకు భాష్యం తప్పలేదు. షరియా ఆ పని నిర్వహించింది. చట్ట నిపుణులను ఫిఖీ అంటారు. వీరు అనేక భాష్య (ఫిఖా) పీఠాలు స్థాపించారు. అందులో నాలుగు నేటికీ ఇస్లాం, సున్నీ సనాతనులకు శిరోధార్యాలుగా ఉన్నాయి. ఈ నాలుగూ అర్హమైనవేనని అంటారు.
మాలిక్ ఇబ్న అబ్బాస్ (795లో మరణం) మదీనాలో తన భావాలను పొందుపరచాడు. అతడికి ప్రవక్త సహవాసుల్లో చివరి వ్యక్తితో పరిచయమున్నట్లు చెపుతారు. అతడి సిద్ధాంతాన్ని మూవత్త అనే పేరిట రాయగా, ఆఫ్రికాలో చాలామంది ముస్లింలు దానిననుసరించారు. దక్షిణాఫ్రికా, జాంజిబార్, దిగువ ఈజిప్టు మాత్రం దానిని స్వీకరించాయి.
హనీఫా పీఠాన్ని స్థాపించిన అబూహనీఫా ఇరాక్ లో జన్మించాడు. (767లో మరణం) ఇతడి పీఠం వివేచనకూ, తర్కానికీ ఎక్కువ అవకాశం ఇచ్చిందంటారు. భారత, టర్కీ ముస్లింలు ఇతనిని అనుసరించారు.
అల్ షఫీ (820లో చనిపోయాడు) మితవాదిగా ఇరాక్, ఈజిప్టులలో బోధించాడు. ఇతని అనుచరులు ఇండోనేషియా, దిగువ ఈజిప్టు, మలేషియా, ఎమెన్ లో ఉన్నాడు. షరియాకు ఆధారం ప్రవక్త సున్నా అని అతడు గట్టిగా చెప్పాడు.
మహమ్మద్ ఇబ్న హన్ బాల్ (855 లో చనిపోయాడు) బాగ్దాద్ లో పుట్టి అల్ షఫీ బోధనలు విని సంప్రదాయాలు నేర్చుకున్నాడు. అతన్ని హింస పెడుతున్నా ఖురాన్ సృష్టించింది కాదని హన్ బాల్ చెప్పాడు. సౌదీ అరేబియాలోని నేటి వహాబీలు ఇతన్ని అనుసరిస్తారు. వివిధ పీఠాలు తమ సొంతాలు కొన్ని చేర్చి సమర్థనీయం కాకున్నా ప్రపంచ ఆసక్తుల నిమిత్తం మత చట్టాన్ని మార్చారు. అందుకు వారు విమర్శకు గురయ్యారు. షరియాకు పునాదిగా ఉన్న అంగీకారాభిప్రాయం తిరుగులేదని కూడా సిద్దాంతీకరించారు.

ఇజ్మ
మా సమాజం దోషాన్ని అంగీకరించదు అనే ప్రవక్త చెప్పాడన్నారు. మతం తిరుగులేనిదనటానికి ఈ సిద్ధాంతాన్ని వాడారు. కేథలిక్కుల సిద్ధాంతాన్ని పోలి ఉన్నట్లు హర్ గ్రోంజే ముస్లింల పీఠంపై వ్యాఖ్యానించారు. అంగీకార అభిప్రాయంలో ప్రజాస్వామ్యంలో ఏమీ లేదు. అక్కడ జనం లేరు. కొందరు పండితులు తమకనుకూలంగా అంగీకార అభిప్రాయాన్ని ఆమోదించారు.
ఐనప్పటికీ ఎవరి ఇజ్మ (అంగీకారం) అంగీరించాలనేదానిలో తగాదా ఉన్నది. కొందరు ప్రవక్త అనుచరులను, మరి కొందరు ప్రవక్త వారసులను అంగీకరిస్తున్నారు.
దోషరహిత అంగీకారం అనే సిద్దాంతంలో స్వేచ్ఛ లేదు. సిద్ధాంతాన్ని ఇంకా సంకుచిత పరచి ఉచ్చులు బిగించారు. స్వతంత్ర వివేచనలు లేకుండా చేశారు. (షాట్, యాక్ ఇంట్రడక్షన్ టు ఇస్లామిక్ లా, ఆక్స్ ఫర్డ్ 1964, పుటః 69)
క్రీస్తు తరువాత 900 నాటికి ఇస్లాం చట్టం మార్చడానికి వీలులేని, గడుసుబారిన సిద్ధాంతంగా మారింది.
వివిధ పీఠాల పండితులు ప్రధాన విషయాన్ని చర్చించి తుది నిర్థయానికి వచ్చినట్లు అప్పటి నుండి ఎవరికీ చట్టాన్ని గరించి స్వతంత్ర ఆలోచన చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కార్యకలాపాలన్నీ ఈ సిద్ధాంతాన్ని అన్వయిస్తూ, ఆచరిస్తూ పోవలసిందేనన్నారు. (షాట్, పై పుస్తకం, పుటః 70, 71)
స్వతంత్ర అలోచనకు అవకాశం లేకుండా చేయటంతో వివిధ పీఠాల సిద్ధాంతాలను ఆమోదించమన్నారు. అప్పటి వరకూ ఇస్లాం చట్టం పెంపొందుతూ, మార్పులలో ఇముడుతూ వచ్చింది.
ఆ తరువాత జటిలమైన గడుసుబారి స్థిరపడింది. శతాబ్దాలుగా ఇస్లాం రాజకీయ సంస్థలు దిగజారిపోయాయి. మార్పులన్నీ చట్టపరమైన సిద్ధాంతాలలోనూ, ఉపరితల నిర్మాణంలోనూ జరిగాయి. తొలి అబ్బాసిద్ కాలం నాటికి సాంఘిక, అర్థిక స్థితిగతులను ఇస్లాం చట్టం ప్రతిబింబించింది. ఆ తరువాత వచ్చిన సామాజిక రాజ్య మార్పులన్నీ వీరికి అందుబాటులో లేవు (షాట్. పై పుస్తకం, పుట 75)


ఖియాస్
ఉపమానంతో వాదనచేసే పద్ధతిని మిగిలిన ఇస్లాంచట్టం పీఠాలు తక్కువ ప్రాధాన్యతనిచ్చాయి. ఈ పద్ధతిలో చేసిన నిర్ణయాలు పరిమిత స్వేచ్ఛాభిప్రాయానికీ, మానవ వివేచన తృణీకరించటానికీ మధ్య రాజీగా ఉన్నది.
ఇస్లాం చట్ట స్వభావం
మానవ చర్యలూ, సంబంధాలూ అన్నీ నిషిద్ధపూరిత జూగుప్సాకర భావాల పరిధిలో అంచనా వేశారు. ఇస్లాం చట్టం మత విధులలో భాగం. ఇందులో చట్టానికి దూరంగా ఉన్న లక్షణాలు కలిపి చూశారు. (షాట్ పై పుస్తకం, పుటః 201)
ఇస్లాం చట్టంలో హేతుబద్ధం కానిదంతా ఖురాన్ సున్నలనుండి వచ్చింది. అది దైవనిర్దేశం అన్నారు. వాటి నియమాలు వివేచనతో నిమిత్తం లేకుండా కేవలం అవి ఉన్నందుకే పాటించాలన్నారు. చట్టపూరిత కట్టుకథలు పెంపొందటానికీ, ఆమోదించటానికీ ఈ ధోరణి తోడ్పడింది. ఉదాహరణకు వడ్డీకి తీసుకోవటాన్ని ఖురాన్ నిషేధిస్తున్నది.
మతపరంగా ఉన్న ఈ నిషేధం బలీయమైనది కనుక బాహాటంగా, ప్రత్యక్షంగా దీనిని ఉల్లంఘించటానికి జనం ఒప్పుకోలేదు. కాని వాణిజ్యరంగంలో వడ్డీలిచ్చిపుచ్చుకోవటం నిత్యావసరమైంది. కనుక కొన్ని మార్గాన్వేషణలు చేశారు. ఆస్తిని తాకట్టుపెట్టి అప్పిచ్చినవాడు వాడుకునేటట్లు అనుమతించారు. అలా వాడుకోవటంలోనే వడ్డీ ఇమిడి ఉన్నది. అప్పు తీసుకున్నవాడు తన వస్తువును అప్పు ఇచ్చినవాడికి తక్కువ ధరకు అమ్మి, అదే వస్తువును వెంటనే ఎక్కువ ధర ఇచ్చి కొంటాడు. ఈ లావాదేవీలలో ఉన్న తేడా సొమ్ము తరువాత ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకుంటాడు. అంటే వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ కేవలం ఆ మాటను వాడకుండా వ్యవహారం సాగిస్తున్నాడన్నమాట (షాట్. పుటః79)
పై ఆచారాన్ని ఏమనాలి ? చట్టాలు ఈ విషయంలో చాలా దయతలుస్తున్నాయి. నైతికంగా చిత్తశుద్ధిలేదా... మొహం తప్పించుకోటమా ? రెండు నీతులు పాటించటమా ?
ఇస్లాం చట్టం పవిత్రమైనా నిర్హతుకమైనదేమీ కాదు. నిరంతరం దివ్యదత్తంగా దీనిని సృష్టించలేదు.
హేతుబద్ధమైన వ్యాఖ్యానాలతో మేథస్సుతో ఇస్లాం చట్టాన్ని రూపొందిస్తూ వచ్చారు. తదనుగుణంగా న్యాయ విధానం పెంపొందించలేదు. జీవన ప్రమాణాలను ఏర్పరచాలని ఉద్దేశించారు. భిన్న అసక్తులుగలవారి మధ్య నియమనిబంధనలు ఏర్పరచటం వారి ఉద్దేశం కాదు. ఇందుమూలంగా విశ్వాసం, న్యాయం, ధర్మం, సత్యం ఇత్యాదులకు ప్రాధాన్యత రాలేదు. (షాట్, ఇస్లామిక్ రెలిజియస్ లా ఇన్ ది లెగసీ ఆఫ్ ఇస్లాం, ఆక్స్ ఫర్డ్, 1974 పుటః 397)
రోమన్ చట్టంవలె గాక ఉపమానాల పద్ధతిలో ఇస్లాం చట్టం న్యాయవిధానాలను రూపొందించింది. ప్రతి కేసునూ ఇస్లాం చట్టం సాధారణ నియమాలతో ఇమడ్చడానికి ప్రయత్నించింది. (షాట్, పుట.205 యాన్ ఇంట్రడక్షన్ టు ఇస్లామిక్ లా) ఉదాహరణకు ఆస్తి సంక్రమణలో సూత్రీకరణ బదులు ఒక వ్యక్తి పూర్వీకుల నుండి ఎలా ఈ విషయాలను సంక్రమింపజేసుకున్నాడో చూప ప్రయత్నించారు. పశు ప్రవృత్తి నలవరచుకున్న వ్యక్తికి ఆస్తి సంక్రమణ గురించి చర్చించారు. గోల్డ్ జిహర్ ఈ విషయాలపై ఇలా వ్యాఖ్యానించాడు. (ఇన్ ట్రడక్షన్ టు ఇస్లామిక్ థియాలజీ అండ్ లా, ప్రిన్ స్టన్, 1981, పుటః 63-64)
దైవ వాక్యాన్ని వ్యాఖ్యానించటంలో తదనుగుణంగా మానవ జీవితాలు రూపొందించడంలో అర్థం, పర్థం లేని విషయాలను ప్రవేశపెట్టారు. కోడిగుడ్డుకు వెంట్రుకలు తీసే వాదాలు చేశారు. వాస్తవాలకు సంబంధం లేని కేసులు చర్చించారు. అందులో ప్రజల మూఢనమ్మకాలను న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకున్నారు. దయ్యాలు మానవులుగా మారతాయని నమ్మటంతో మతచట్టంలో వాడి ప్రభావాన్ని న్యాయమూర్తులు స్వీకరించారు. శుక్రవారం పూజలలో అలాంటి వారిని కూడా స్వీకరించవచ్చా అని చర్చించారు. మానవుడికీ, దెయ్యానికీ పుట్టే వారి సంతానాన్నిఎలా పరిగణించాలని చర్చించారు. అలాంటి పరిణామాన్ని గురించి అలోచించారు. ఇదంతా ఎంతో తీవ్రమైన విషయంగా స్వీకరించారు.
ఇస్లాం చట్టాలు విమర్శలు
శిక్షకు సంబంధించి ఇస్లాం చట్టం దైవహక్కులకూ, మానవ హక్కులకూ తేడా చూపింది.
దైవ హక్కులకు మాత్రమే శిక్షించే హక్కు ఉన్నది. దీనిని ఖురాన్ సంప్రదాయాల ఆధారంగా ప్రవక్త, అతని అనుచరుల మాటల ప్రాతిపదికగా రూపొందించారు. ఇస్లాంకు ముందున్న అరేబియా చట్టం నుండి పౌరులకు సంబంధించిన కొన్ని విషయాలు అట్టిపెట్టారు. మానవ హక్కులలో జోక్యం చేసుకున్నా, నష్టపరచినా ఖచ్చితమైన శిక్ష అంటూ లేదు. గాయపరచటం, చంపటం మొదలైన వాటిలో కూడా శిక్షలు విధించే పద్ధతి లేదు. (షాట్, పై పుస్తకం, పుటః 399)
షరియా అనేది దేవునికి పూర్తిగా లొంగిపోయిన ఆదర్శ ముస్లిం సమాజానికి అన్వయిస్తుంది. విమర్శ లేకుండా దాన్ని ఆమోదించాలి. సామాజిక పరిణామాలూ, తరచూ వచ్చే మార్పులతో ఇస్లాం చట్టానికి నిమిత్తం లేదు. పవిత్ర గ్రంథాల ఆధారంగా వచ్చిన చట్టం మారనిది. ఖురాన్ నుండి, సంప్రదాయాల నుండి తిరుగులేని చట్టాలను కొందరు రాబట్టారు. మూడు శతాబ్దాల అనంతరం అన్ని సమస్యలకూ పరిష్కారాన్నిచ్చారు. అల్లా మాటపై ఆధారపడిన ఈ చట్టం తిరుగులేనిదీ, దివ్యమైనది. సందేహాలు, ప్రశ్నలు లేకుండా దీన్ని ఆమోదించాలి. అల్లా, అతని ప్రవక్త మాటలను షరియా రూపంలో అన్వయిస్తున్నారు. ఖియాస్ అనే ఉపమాన వాదన పరిమితంగానే ప్రయోగించవచ్చు. దేవుడు మహమ్మద్ ద్వారా ఈ చట్టాన్ని ఇచ్చాడు. (బాస్క్వే, హర్ గ్రోంజె, షాట్)
ఇస్లామిక్ చట్టంపై విమర్శలు
ఖురాన్, సున్నాలు ఇస్లాంకు మూలంకాక వాడిని హదిత్ లో వెల్లడించారు. కొరాన్ దైవదత్తం కాదనీ, 7, 9 శతాబ్దాల మధ్య రాసిందనీ, యూదు, క్రైస్తవ, సమరిటన్, జొరాస్ట్రియన్, ఇస్లాం పూర్వ అరేబియా నుండి స్వీకరించారని పేర్కొన్నాము. వాటిలో చారిత్రక దోషాలు, శాస్త్రీయ తప్పులూ, విరుద్ధాలూ, వ్యాకరణ దోషాలూ ఉన్నాయి. దయామయుడైన దేవుడికి తగినట్లు పొందికలేని వైవిధ్యాల పుట్టగా ఆ సిద్ధాంతాలున్నాయి. ఖురాన్ లో మరొకవైపు ఉదారత్వం, తల్లిదండ్రుపట్ల గౌరవం మొదలైన నైతిక సూత్రాలూ ఉన్నాయి. మొత్తం మీద అనర్హమైన సూత్రాలే ఎక్కువ మోతాదులో ఉన్నాయి. పరమతస్థులపట్ల అసహనం, హింస, హత్యల పిలుపు, స్త్రీలకూ, ముస్లిమేతరులకూ సమానహక్కులు లేకపోవటం, బానిసత్వాన్ని ఆమోదించటం, పాశవిక శిక్షలూ, మానవ వివేచనపట్ల జుగుప్స ఉన్నాయి.
గోల్డ్ జిహర్, షాట్ తదితరులు అనేదేమంటే ఆనాటి పాత సంప్రదాయాలు కాపీ కొట్టినవేనని, ముస్లిం శకంలో తొలుత వీటిని ప్రచారంలోకి తెచ్చారనీ పేర్కొన్నారు. ఈ వాస్తవాన్ని ఆమోదిస్తే ఇస్లాం చట్టం పునాదులు కదిలిపోతాయి. ఇస్లాంచట్టం యావత్తూ పుక్కిటి గాథల చౌర్యాల పునాదులపై నిర్మించినదే. ఇస్లాం చట్టం, ఇస్లాం జీవితానికి ఆలోచనలకూ, ఇస్లాంలో మూల స్వరూపానికీ ప్రాతిపదికగా చూసేవారికి గోల్డ్ జిహర్, షాట్ నిర్ణయాలు దద్దరిల్లజేస్తాయి.
పురోహితుల శక్తి మానవుడు ఏమి చేయాలి, చేయకూడదు అనేది దేవుడు ఒకేసారి నిర్ణయించేసాడు. ఏ మేరకు దైవ నిర్ణయాన్ని శిరసావహించాడన్నదాన్ని బట్టి వ్యక్తి, జనం విలువను నిర్ణయించాలి. దైవేచ్ఛ తీర్పునాడు శిక్షలూ, బహుమతుల రూపంలో వెల్లడవుతుంది. దైవేచ్ఛ తెలుసుకోవాలి. (అంటే, పురోహితుల శక్తిని అట్టిపెట్టుకోవటమే నన్నమాట) దీనికోసమే దేవుడు వెల్లడించాడనే పద్ధతి కావలసివచ్చింది. పవిత్ర గ్రంథాన్ని కనుగొన్నారు. పటాటోపంగా దాన్ని వెల్లడించారు. పురోహితులు తాము కోరుకున్నది దైవేచ్ఛగా పేరుపెట్టారు. పురోహితులు జీవితంలో తప్పనిసరి అయ్యారు. (నీషే, ది పోర్టబుల్ నీషే, ఎడిటెడ్, డబ్ల్యు.కాఫ్ మన్, న్యూయార్క్, 1974, పుటః 596, 597)
ఇస్లాంలో పురోహిత వర్గం లేదని ముస్లింలూ, వారి పక్షాన వాదించేవారు అంటారు. ఆచరణలో మాత్రం క్రైస్తవులలోవలే వీరిలోనూ పురోహిత వర్గం ఏర్పడింది. వారే ఉలేమాలు. కొరాన్, సున్నాల ప్రాధాన్యత దృష్ట్యా పవిత్రగ్రంథాల భాష్యానికీ వీరి అవసరమయ్యారు. సమాజంలో వారి పెత్తనం పెరుగుతూ ఉంటే, చట్టం, విశ్వాసాలకు సంబంధించి సర్వాధిరాకాలను పురోహితవర్గం ఆపాదించుకున్నది. ఇజ్మ సిద్ధాంతపరంగా వారి అధికారం బలపడింది. గిల్ ఇలా అన్నాడు. చట్టానికి మూలాధారంగా ఇజ్మను గుర్తించిన తరువాత నిర్దుష్టమైన న్యాయ విధానాన్ని అమలుపరిచారు. అంగీకారానికి వచ్చిన వాటిని వ్యతిరేకంగా వ్యవహరిస్తే, బిదా అనే పేరిట ద్రోహంగా పరిగణించారు. (హెచ్.ఎ.ఆర్.గిబ్, ఇస్లాం ఆక్స్ ఫర్డ్, 1953, పుటః 67)
ఉలేమాల ప్రభావం వలన ముస్లిం సమాజాలలో మేథస్సు ప్రగతిగానీ, నిశిత పరిశీలనగానీ పెంపొందలేదు. ఇస్లాం చరిత్రలో ఇటీవల మానవహక్కుల ప్రవేశానికీ, స్వేచ్ఛకూ, వ్యక్తివాదానికీ ఉదార ప్రజాస్వామ్యానికీ వీరు అడ్డుకట్ట వేశారు. ఇరాన్ లో 1906-07 రాజ్యాంగాన్ని ఇస్లాం విరుద్ధంగా ఖండించారు. అందులో పేర్కొన్న స్వేచ్ఛను వ్యతిరేకించారు. ఆధునిక కాలాలలో ఇరాన్, సూడాన్, పాకిస్తాన్ లో ఉలేమాలు ఇస్లామీకరణకు పూనుకున్నారు. అంటే మానవహక్కులను తొలగించటమే.
షరియా చెల్లుతుందా.... వేయి సంవత్సరాల క్రితం రూపొందించిన చట్టం కాలానుగుణంగా, 20వ శతాబ్దానికి తగినట్లు పెంపొందని చట్టం ఎలా పనికి వస్తుంది. తొలి అబ్బాసిద్దుల సాంఘిక, ఆర్థిక స్థితిని ప్రతిబింబించే షరియా ఉత్తరోత్తరా వచ్చిన సాంఘిక, ఆర్థిక, నైతికాభివృద్ధికి సంబంధం లేకుండా ఉన్నది. మనం స్త్రీలను వంటింటి దాసులుగా చూచే పరిస్థితి దాటిపోయాము. మన మత నమ్మకాలను పాటించని వారిని సమానంగా చూడరాదనే ధోరణి మారిపోయింది. పిల్లలకూ, స్త్రీలకూ నేడు హక్కులున్నాయి. ఆధునిక సమస్యలన్నింటికి ఖురాన్ లోనే పరిష్కారం ఉన్నదనుకొంటే ప్రగతి లేదు. నైతికాభివృద్ధికి కొరాన్ సూత్రాలు వ్యతిరేకం.
---

No comments: