4వ అధ్యాయం
మహమ్మద్ - అతని సందేశం
అరబ్ మూలాధారాలతో సన్నిహిత సంబంధం ఉండి నాటి జీవనాన్ని గురించి బాగా అవగాహన ఉన్న పండితులు మహమ్మద్ ప్రవక్త అని చెప్పడానికి వ్యతిరేకత చూపుతున్నారు. మార్కోలియత్, హర్ గ్రోంజే, లామెన్స్, కాటాని ఇలాంటి పండితులే. ఆధారలలో తరచు చూసే కొద్దీ ఇలాంటి నిర్ణయాల నుండి తప్పించుకోవటం కష్టంగానే ఉన్నది. (జఫ్రీ, ముస్లిం వరల్డ్, 16వ సంపుటి, నం.4, అక్టోబర్, 1926 ది క్వెస్ట్ ఆఫ్ ది హిస్టారికల్ మహమ్మద్)
మానవ స్వభావాన్ని గురించి ఏమాత్రం అనుభవం ఉన్నా చిత్తశుద్ధితో కూడిన మతపరమైన వ్యక్తి చాలా దుష్టుడై ఉంటాడు అనేది వాస్తవం (విన్ వుడ్ రీడ్, ది మార్టర్ డమ్ ఆఫ్ మ్యాన్, లండన్, 1948, పుట. 428)
మహమ్మద్ అనే వ్యక్తిని గురించి కుక్, క్రోన్, వాన్స్ బ్రో తదితరులు నిర్ధారించినట్లు మనకంతగా తెలియదన్నా ఒప్పుకోవాలి. లేదా సంప్రదాయ మూలాధారాలతో సరిపెట్టుకోవాలి. ముస్లింలో తొలి ప్రత్యామ్నాయాన్ని ఒప్పుకుంటే సరిపోతుంది. ఎందుకంటే సంప్రదాయాలలో ప్రవక్తను గురించి అంత శ్లాఘనీయమైన విషయం రావడం లేదు. పైగా అదంతా శత్రువులు చిందించిందని అనటానికి ముస్లింలకు వీలు లేదు.
పాశ్చాత్య లోకంలో చారిత్రక నిశిత పరిశీలనతో మహమ్మద్ జీవితాన్ని తొలుత రాసి గ్రస్టావ్ వైల్, మహమ్మద్ మూర్ఛలతో బాధ పడ్డాడని ప్రస్తావించాడు. (Mohammad Der prophet Seinlebenund Seinlehre, 1843) తరువాత స్ట్రెంగర్ నోల్డెక్, మూర్ తదితరుల రచనలు వచ్చాయి. ముందు స్ట్రెంగర్ భావాలు చూద్దాం. ఖురాన్ అధ్యాయంలో నోల్డెక్ గొప్ప రచన పరిశీలిద్దాం.
1856-61 మధ్య మహమ్మద్ జీవితాన్ని 4 సంపుటాలుగా మూర్ ప్రచురించాడు, తొలి ముస్లిం ఆధారాలపై రచన సాగించి ఆ ఆధారాలు నమ్మదగినవి కావని, వాటిపట్ల దృష్టిసారించాలని మూర్ స్పష్టం చేశాడు. మహమ్మద్ శీలాన్ని గురించి మూర్ ఇచ్చిన నిర్ణయాన్ని తరువాత పండితులంతా ప్రస్తావిస్తూ వచ్చారు. మహమ్మద్ జీవితాన్ని మక్కా, మదీనా కాలాలకింద విభజించి మూర్ చూచాడు. (పేజి 503-506, లైఫ్ ఆఫ్ మహమ్మద్, ఎడింబరో, 1923) మక్కాకాలంలో మహమ్మద్ మతపరంగా చిత్తశుద్ధితో సత్యాన్వేషణ సాగించాడన్నారు. మదీనా కాలంలో మహమ్మద్ అధికారం, ప్రాపంచిక తృష్ణతో సాధారణ మానవుడి వలె ప్రవర్తించాడన్నారు.
మక్కా కాలంలో వ్యక్తిగత కోర్కెలు లేకుండా దురుద్దేశాలు లేకుండా గడిపాడు. అప్పట్లో మహమ్మద్ బోధకుడుగా ఉన్నాడు. లాభార్జనతో ఉన్న ప్రజలు అతడిని నిరసించ నిరాకరించారు. వారికి సంస్కరణ తప్ప ఉన్నత లక్ష్యాలేమీ లేవు. ఈ లక్ష్యాలను సాధించటానికి సరైన మార్గం అనుసరించినా సదుద్దేశంతో చిత్తశుద్ధితో చేశాడనటంలో మహమ్మద్ ను సందేహించ నక్కరలేదు.
మదీనాకు వచ్చేసరికి అంతా మారిపోయింది. ప్రవక్త జీవితంతో మిళితమై అధికారం, పటాటోపం, కోర్కెలు తీర్చుకోవటం ప్రధానమయ్యాయి. రాజకీయ ప్రవర్తనను సమర్థించుకోవటానికి దైవదత్తమైన ఆజ్ఞలు వచ్చాయంటూ యథేచ్ఛగా వాడారు. మతపరమైన సూత్రాలను ఆ విధంగానే తెచ్చి పెట్టారు. దేవునిపేరిట యుద్ధాలు చేశారు. హతమార్చారు. భూముల్ని ఆక్రమించుకున్నారు. ఇందులో వ్యక్తిగతమైన వాటిని కూడా దైవం పేరిట క్షమించి ప్రోత్సహించారు. ప్రవక్తకు అనేకమంది భార్యల్ని అనుమతిస్తూ ప్రత్యేక అనుమతిని చూపారు. ఒక సురలో కోప్టిక్ యువతి మేరీతో వ్యవహారాలను సమర్థించారు. అతడు దత్తత స్వీకరించిన కుమారుని భార్య పట్ల మోహాన్ని దైవదత్త సందేశంగా చూపారు. దేవుడు నిరశించిన విడాకులను అనుమతించారు. అలాంటి దైవాజ్ఞలన్నీ మహమ్మద్ చిత్తశుద్ధితో నమ్మాడంటే విశేషమే. అందుకు అతడు బాధ్యత వహించాలి. తన తీర్పును తానే ఉల్లంఘించటం అతడిలో కనిపిస్తుంది.
మదీనాకు చేరిన మహమ్మద్ చాలా మారాడు. స్వేచ్ఛ స్థానంలో అసహనం వచ్చింది. నచ్చచెప్పటానికి బదులు బలవంతం చోటుచేసుకున్నది. ఉన్నత లక్ష్యాలకు ఉద్దేశించిన ఆధ్యాత్మికతను ప్రాపంచిక విషయాలకు వాడారు. ప్రాపంచిక పెత్తనాలను అధ్యాత్మిక ఆయుధాలకు వినియోగించారు. రాజ్యశక్తికి దేవుడి పేరు చేర్చి బలాన్ని సమకూర్చారు. దేవుడి శత్రువులని పేరు పెట్టి కొత్త మతానికి కొందరిని బలి ఇచ్చారు. నమ్మకం లేని వారిని ఎక్కడ కనిపించినా నరికివేయటం ఇస్లాం మూల సూత్రమయింది. వ్యతిరేకత అంతా అణచివేసే వరకూ ఇస్లాం మతం ఒక్కటే నిలబడేవరకూ పోరాడామన్నారు. మక్కాలో సౌహార్దంగా, భక్తితో, ప్రవక్త అతని అనుచరులూ చెప్పిందంతా తీవ్ర ఛాందసవాదంగా, లాంఛన ప్రాయ క్రతువుగా దిగజారింది.
మూర్ కొనసాగిస్తూ విశ్వాసానికి ప్రమాణంగా ఉన్నంతవరకూ కొన్ని దోషాలు ఉంటాయన్నాడు. బహు భార్యాత్వం, విడాకులూ, బానిసత్వం ప్రజా జీవితాన్ని దెబ్బతీస్తాయన్నాడు. గృహజీవనం కలుషితమవుతుంది. సమాజం గందరగోళం అవుతుంది. ముసుగు అనేది స్త్రీల స్థానాన్ని, ప్రభావాన్నీ పక్కకు నెడుతుంది. స్వేచ్ఛాలోచన, వ్యక్తిగత నిర్ణయాలు అణచివేసి రూపుమాపుతున్నది. సహనం లేదు. స్వేచ్ఛాయుత సంస్థలు మూసేస్తున్నారు.
మహమ్మద్ శీలంలో అసంబద్ధతలను మూర్ చూపాడు. విగ్రహారాధన పోగొట్టి ప్రపంచంలో మతాన్నీ, ధర్మాన్నీ పెంపొందించి, అదంతా దైవదత్తంగా సమర్థించుకోవడానికి మహమ్మద్ చూపదలిచాడు. సామాజిక ఔన్నత్యానికి దూరంగా, స్వయం నిగ్రహానికి ఎడంగా తనను తాను సమర్ధించుకున్నాడు.
మహమ్మద్ కత్తి, ఖురాన్ నాగరికతకూ, స్వేచ్ఛకూ, సత్యానికీ బద్ధ శత్రువులు. (ముస్లిం వరల్డ్ 6వ సంపుటి, కటాని, అనాలి, డెల్ ఇస్లాం)
కటాని అలాంటి నిర్ణయాలకి వచ్చాడు. మదీనాలో మహమ్మద్ ఆధిక్యతతో, ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు.
మహమ్మద్ ప్రథమ శ్రేణిలో నిలిచాడు. ప్రవక్తగా అతడి శక్తికి ఎదురులేదనిపించాడు. ప్రవక్త తన రాజకీయ లక్ష్యంలో విజయాలను శ్లాఘిస్తూ, ఓటమిలో ఓదార్పు పొందుతూ ప్రాపంచిక సమస్యల చిక్కులను ఎదుర్కొంటూ సాగిపోయాడు. మహమ్మద్ నుండి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వచ్చాయి. అంతేగాని దైవం నుండి కాదు. అన్నిటా ప్రవక్తే కనిపించాడు. అతడు ప్రత్యక్షంగా అందరి ఎదుటా ఉన్నాడు. దేవుడు ఉన్నత సూత్రంగానూ, ఉపయోగకర సిద్ధాంతంగానూ నిలిచాడు.
మహమ్మద్ తన తొలి దశనుండి దారితప్పాడంటే ఆశ్చర్యం లేదు. అతడు సమకాలీనుల వలె మనిషి సగం ఆటవిక దశలో ఉన్న సమాజంలో సభ్యుడే. యూదు, క్రైస్తవ మత సిద్ధాంతాలను సగం అర్థం చేసుకొని అవినీతికరంగా మదీనాలో మహమ్మద్ కొత్త సామాజిక స్థితిలో కొనసాగాడు. దిగజారిపోయిన అతడి నైతిక స్థాయిని గురించి చరిత్ర ఎన్నో ఉదాహరణలు చూపుతున్నది. మహమ్మద్ అధికారరీత్యా జయప్రదమయ్యాడు. కాని రమణీయకత కోల్పోయాడు.
మూర్, కటానీల వాదనలు సమర్థనీయమా, ప్రవక్త శీలం విషయంలో వీరి అంచనా సరైనదేనా అని చూడవలసి ఉన్నది. మహమ్మద్ జీవితంపై స్ట్రెంగర్ రచన కూడా గమనించాలి. మహమ్మద్ కు వచ్చిన వింత మూర్ఛలను గురించి ముస్లిం ఆధారాలలో చాలా ప్రస్తావనలున్నాయి. ముఖ్యంగా దైవ సందేశాలకు సంబంధించినవి కొల్లలుగా ఉన్నాయి. మార్గోలియత్ వాటిని ఇలా వర్ణించాడు.
అతడికి మూర్ఛలు వచ్చాయనీ, దైవాజ్ఞలు స్వీకరించటప్పుడు ఇవి గమనించారనీ పేర్కొన్నారు. ఈ లక్షణాలు కృత్రిమంగా సృష్టించి కూడా ఉండవచ్చు. అచేతనంగా పడిపోవటం, చెవులలో గంటలు మోగినట్లుండటం, ఎవరో కనిపిస్తున్నట్లనిపించటం, చెమటలు పట్టటం, తల ఒక వైపుకు తిరిగి పోవటం, నోట్లో నురగలు రావటం, మొఖం ఎర్రగా, తెల్లగా మారిపోవటం, తలనొప్పి రావటం లక్షణాలుగా ఉండేవి. (జఫ్రీ పుట. 335, ముస్లిం వరల్డ్, 16 సంపుటి ది క్వెస్ట్ ఆఫ్ ది హిస్టారికల్ మహమ్మద్)
మహమ్మదు వ్యక్తిత్వానికి మూర్ఛలు చాలా తోడ్పడతాయని స్ట్రెంగర్ రాశాడు. ఇతడి ఊహలు అనేకమంది పండితులు కొట్టి పారేశారు. కాని డేనిష్ పండితుడు ఫ్రాంజ్ బూల్ కొంత సవరణ చేస్తూ మదీనా దశలో మహమ్మద్ క్రూరంగా, చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తించినందున ఆకర్షించలేదన్నాడు. ఏ మార్గం అనుసరించి అయినా సాధించాలనే ధోరణి పాటించాడన్నాడు. (ముస్లిం వరల్డ్, సంపుటి 1, 1911, పుట, 356-64 తనకు పూర్తి విధేయత చూపాలని కూడా నిరంకుశత్వం చూపాడని బూల్ పేర్కొన్నాడు. ఇంద్రియ లోలంత్వం కూడా ఎక్కువయిందన్నారు.
దేవుడు తనకు వెల్లడించాడన్న విషయాలలోనూ శృంగార ధోరణులు, అంతఃపుర స్త్రీల విషయాలు సమర్థించుకున్నాడు. కావాలని ఇదంతా చేసి ఉండవచ్చని తొలుత దైవం వెల్లడించాడన్న అంశాలన్నీ తన ఖ్యాతి కోసం చేసి ఉండొచ్చని అన్నారు.
అతడు చేసిన దాడులు, రుగ్మతలను సూచిస్తాయి. హిస్టీరియా స్వభావం కూడా అతని ప్రవర్తనలకు తోడ్డాయి. నిజానిజాలు విచక్షణ గమనించలేదు. తన భావాలు నిజమని నమ్మి, వాటికి విరుద్ధంగా ఎంత సబబు ఉన్నప్పటికీ పట్టించుకోలేదు.
మదీనా కాలంలోని ఆదర్శాలు తరువాత కూడా ఉన్నాయని మహమ్మద్ పూర్తిగా మారాడనటం సరి కాదని బూల్ రాశాడు.
మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రవక్తకు అన్వయించిన డాక్టర్ మెగ్డానాల్డ్ అతనిది దయనీయమైన విషయమనీ, చిత్తశుద్ధిగల మోహ నిద్రావస్థలో ఎలా భ్రమింప చేస్తాయో అతనిలో చూపాడు. (ఏన్ ఫెక్ట్స్ ఆఫ్ ఇస్లాం, జఫ్రీ ఉదహరించిన సందర్భం, ముస్లిం వరల్డ్, అక్టోబర్ 1926, సంపుటి 16, సంచిక 4, పుట. 336)
ఇస్లాంను ఒక రహస్య సమాజంగా మార్గోలియత్ చూపాడు. (మహమ్మద్ అండ్ రైజ్ ఆఫ్ ఇస్లాం, లండన్ 1905, పుట. 88-89, 104-106) మహమ్మదును నేటి మోర్ మోన్ స్థాపకుడు జోసెఫ్ స్మిత్ తో పోల్చాడు. మహమ్మదు తన అధికారాన్ని మక్కా వారిపై చూపటానికి ఆధునిక రహస్య మత సంఘాలు ప్రయోగించిన పద్ధతులను వాడాడన్నారు. మార్గోలియత్ ఇలా రాశాడు.
ఒక ఖాళీ గదిలో మహమ్మదు కూర్చోవటానికి స్థలం లేకపోయింది. అన్ని స్థానాలు దేవతలు ఆక్రమించుకున్నారు. మహమ్మదు మర్యాదగా ఒక శవాన్ని పట్టించుకోకుండా స్వర్గం నుంచి వచ్చిన ఇరువురకు గౌరవం కల్పించాడు. అప్పుడప్పుడు గేబ్రియల్ పాత్ర నిర్వహించేవాడు. అధ్యాత్మికత గురించి ఎఫ్.పోర్ట్ మోర్ రాసినట్లుగా మహమ్మదుకూడా దైవం చెబుతున్నట్లు పూనకం వచ్చినవాడుగా నటించేవాడు. మతపరంగా ఈ పూనకపు మాటలు ఉద్వేగ పూరితంగా వచ్చి ఉండవచ్చు. తన చిత్తశుద్ధితో తానే నమ్మడానికి అవి ఆధారాలై ఉండవచ్చు. మతపరంగా వీటిని వివరించటం కష్టం. మొత్తం మీద పోర్ట్ మోర్ చెప్పినట్లు మహమ్మద్ పూనకాలను ఆధారంగా అనుచరులను ఆకర్షించాడు. ఈ దైవదత్తమైన మాటలు అనుమానాస్పదంగా ఉండటంలో ఆ మాటల్ని రాసుకున్నవారు నమ్మలేక ఇస్లాంను వదిలేసారని కూడా రాశాడు. అతీంద్రియ ఆజ్ఞలు ఎంతవరకూ చిత్తశుద్దితో కూడినవనేది నమ్మకస్తులంతగా పట్టించుకోరు.
అబూబకర్ నాటికి ఖురాన్ లో చాలా భాగం ఉండి ఉండవచ్చు. మత మార్పిడి చేయటానికి ప్రవక్త దైవాజ్ఞను చూపించి ఉండవచ్చు. ఈ విషయంలో నమ్మకస్తులు పెరిగే కొద్దీ కొరాన్ అధికారికంగా మారి శక్తివంతమైన బోధనలలో చాలామంది పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న కొద్దిమంది తొలుత బాగా ప్రభావితమై ఉంటారు. కొత్తవారిని దూరంగా ఉంచాలని అన్నప్పుడు కొందరు కలవరపడి ఉంటారు. శ్రోతలు ప్రవక్త మాటలకు అత్యంత విలువ ఇవ్వటంలో అతడి అచేతనావస్థకూడా ఉపకరించి ఉండవచ్చు. నమ్మకస్తులు లేకుంటే అలాంటి చర్యలు పని చేయవు. మహమ్మదు ఎదుటకు తీసుకురాకముందే నమ్మకాలను ధృవపరచుకొని ఉంటారని జీవిత చరిత్రకారులు చెప్పారు. ప్రవక్త ముసుగు కప్పుకోవటం బహుశ అతడి అచేతనావస్థ ప్రారంభమైన తరువాత కావచ్చు. దాని వలన కూడా పవిత్రతకు ప్రాధాన్యత వచ్చి ఉండవచ్చు. ప్రతి రాత్రీ ప్రవక్త కాళ్ళకు రంగు వేసుకోవటం, శరీరం సుగంధాలు వెదజల్లటం జనాకర్షణలో భాగమే. జూట్టు భుజాలవరకూ పెంచుకున్నాడు. తెల్లబడిన వెంట్రుకలకు రంగు వేశాడు. శ్రోతలకు తగినట్లుగా తూచి మాట్లాడటం అభ్యసించాడు. మొత్తం మీద ఆధ్యాత్మిక విద్యలో ఆరితేరిన వ్యక్తిగత సమాచారం సేకరిస్తూ శక్తులున్నట్లు కనిపిస్తూ పోయాడు. ప్రవక్తను చూడటానికి తొలుత ఒకపట్టాన ఎవరినీ ఆమోదించేవారు కాదు. ఆరాధించటానికి సిద్ధపడేవారినే రానిచ్చేవారు.
మహమ్మద్ జీవితంలో సంఘటనల గురించి మూర్ కటాని తీవ్ర నిర్ణయాలకు వచ్చిన విషయాలను పరిశీలిద్దాం. ముస్లిం ఆధారాలతో ఇబ్న, ఇషాక్, అల్ తబానీ వంటి వారు వీటిని పేర్కొన్నారు.
రాజకీయ హత్యలు, యూదుల ఊచ కోత
620లో మదీనాలో కొన్ని యూదు జాతులుండేవి. బానుల్ నదీర, బాను కురాజ, బాను ఖయినూఖ అందులో పేర్కొనదగిన జాతులు. ఆవస్, ఖజరాజ్ అనే రెండు అరబ్బు తెగలు కూడా ఉండేవి. ఇందులో నాదిర్, ఖురామజ యూదులు అవస్ అరబ్బులనూ, కనూక యూదులు ఖజరాజ్ అరబ్బులను సమర్థించారు. సంవత్సరాల తరబడి కక్షలూ కార్పణ్యాలు సాధించారు. 622 సెప్టెంబరులో మహమ్మద్ రంగ ప్రవేశం చేశాడు. మదీనాలో వివిధ ముఠాలకూ మక్కా నుండి కొత్తగా వచ్చిన వారికి సమైక్యత ఏర్పాటు చేసి ఒడంబడిక కుదిర్చాడు. దీనిని మదీనా రాజ్యాంగం అంటారు. ఇబ్న ఇషాక్ దీన్ని గురించి ఇలా రాశాడు.
దైవదూత ఒక ధృవ పత్రాన్ని రాశాడు. మక్కా నుండి వచ్చిన ముస్లిం అనుచరులూ, మదీనాలో కొత్తగా మారిన అన్సారీల మధ్య మహమ్మద్ రాసిన పత్రం అది. అందులో యూదులకు హక్కులూ, విధులు కూడా కేటాయించారు.
అనేకమంది పండితులూ ఈ రాజ్యాంగాన్ని యూదులకు వ్యతిరేకంగా మహమ్మద్ తీసుకున్న చర్యగా భావించారు. (హంఫ్రీ, ఇస్లామిక్ హిస్టరీ, ప్రిన్ స్టన్, 1991, పుట 92-98) యూదుల పట్ల అపనమ్మకాన్ని సూచిస్తున్నదని ఈ పత్రాన్ని గురించి వెల్ హాసన్ అన్నాడు. యూదుల రాజకీయ ప్రభావాన్ని తటస్థ పరచడానికి అలాంటి రాజ్యాంగం రాశాడని వెన్ సింక్ అభిప్రాయపడ్డాడు. యూదులను అణచటానికి సమయం కోసం వేచి ఉన్నాడనీ అన్నారు. మోషేగిల్ ఇలా రాశాడు.
మదీనాలో అరబ్బు తెగలతో సంబంధాలు పెట్టుకున్నందున మహమ్మద్ ప్రవక్త యూదుల వ్యతిరేక విధానంలో బలం పుంజుకున్నాడు. ఈ విషయంలో మదీనావారు అంత సుముఖంగా లేరు. అది రాస్తున్నప్పుడే యూదులను బహిష్కరిచాలనే దృష్టి ఉండేది.
కనుక ఆ రాజ్యాంగం యూదులతో సంధి చేసుకోవటం కాదు. మదీనా అరబ్బు ముఠాల నుండి యూదులను వేరుచేసే ప్రకటన అది. (హంఫ్రీ. పుట. 97).
తొలుత మహమ్మద్ జాగ్రత్తగా అడుగులు వేశాడు. మదీనావారు అంతగా ఆహ్వానించకపోవటం, ఆర్థిక స్థితి బలహీనంగా ఉండకపోవటమే కారణం. తాను ప్రవక్తనని యూదులు ఒప్పుకోక పోవటం కూడా ఒక కారణం. మహమ్మద్ అప్పటికే దాడులు ప్రారంభించాడు. గౌరవంగా బ్రతకాలనే ధోరణి పోయి దోపిడీలు మొదలయ్యాయి. సిరియాకు పోతున్న మక్కా ప్రయాణీకులపై 3 దండయాత్రలలో మహమ్మద్ స్వయంగా ఆధ్వర్యం వహించి విఫలమయ్యాడు. మహమ్మద్ లేకుండా ముస్లింలు పవిత్ర మాసంలో రక్తం చిందించకూడదనే నిషేధాలు పక్కన పెట్టి నఖలా వద్ద దాడి చేసి మక్కావారిని జయించారు. అందులో ఒక మక్కావాసిని చంపారు. ఇద్దరిని బందీలుగా పట్టుకున్నారు. దోచుకున్నదంతా మదీనాకు తీసుకెళ్ళారు. పవిత్ర మాసంలో ఇలా జరగటం మదీనా వారికి విభ్రాంతి కలిగించింది. అది చూచి మహమ్మద్ ఆశ్చర్యపడ్డాడు. ఐనా దోపిడీ చేసిన దానిలో ఐదవ వంతు స్వీకరించాడు. తన చర్యను సమర్థించుకోవటానికి దైవం నుండి ఆజ్ఞలు వచ్చినట్లు పేర్కొన్నాడు. (సుర. 2.217) పవిత్ర మాసాలను గురించి వారడుగుతారు. యుద్ధం చేయొచ్చా అంటారు. ముఠా కలహాలు తప్పు అయినా దేవుడి మార్గాన్ని ఆటంకపరచటం మరింత ఘోరమైన తప్పు గనుక అలా వివరించు, బందీల నుండి ఒక్కొక్కరి దగ్గరా 40 ఔన్సుల వెండి చొప్పున మహమ్మద్ స్వీకరించాడు.
ఆప్స్, అరబ్బు ముఠా నాయకుడు సాఅద్ మూఆద్ మహమ్మద్ ను వెనకేసుకొచ్చి దాడుల్లో పాల్గొన్నాడు. క్రమంగా మదీనావారు కొందరు మహమ్మద్ నామోదించారు. యూదుల మతం అతను ప్రవక్త అని చెప్పుకోకుండా, విమర్శిస్తూ తమ పవిత్ర గ్రంథాలకు కొన్ని చోట్ల అతను చెప్పేవి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. యూదుల ఆచారాలు కొన్ని మహమ్మద్ ఆమోదించినా మదీనాలో తన నాయకత్వానికి యూదులే ప్రమాదమని అతడు గ్రహించాడు.
బదర్ యుద్ధంలో అల్లా పేరిట వేయి దేవతల పేరిట 49 మంది మక్కా వాసులను చంపారు. ఇంచుమించు అంతమందిని ఖైదీలుగా పట్టుకొన్నారు. చాలా సంపదను దోపిడీ చేశారు. అవి మహమ్మద్ జీవితంలో పెద్ద మలుపు. మహమ్మద్ శత్రువుల తలలను నరికి ప్రవక్త పాదాల ముందు పెట్టినప్పుడు మహమ్మద్ పెద్దగా అరుస్తూ అరేబియాలో అత్యుత్తమ ఒంటెకంటే అది చాలా ఆమోదయోగ్యమయిందన్నాడు.
మహమ్మద్ విశ్వాసంతో శత్రువులపైకి విజృంభించగా హత్యాపరంపరలు జరిగాయి. నిర్దాక్షిణ్యంగా తన అధికారాన్ని చలాయించాడు. ప్రవక్తకంటే మంచి కథలల్లిన అల్-నాదర్ ను చంపేయమని ఉత్తరువులిచ్చాడు. అక్బ అనే ఖైదీని చంపిన తీరు మూర్ ఇలా వివరించాడు.
అక్బను చంపేయమని ఉత్తరువులిచ్చారు. మహమ్మదునూ, దైవాన్నీ విరోధులుగా చూపిన కారణంగా మిగిలినవారికంటే అతడిని కఠినంగా శిక్షిస్తున్నట్లు ప్రవక్త చెప్పాడు. ఐతే, తన బిడ్డను ఎవరు సంరక్షిస్తారు అని అక్బ అడిగితే, నరకం అని ప్రవక్త చెపుతుండగా అతడి తల తెగిపడింది. దైవంలో ప్రవక్తలో పవిత్ర గ్రంథంలో నమ్మకం లేని నిన్ను చంపినందుకు దైవానికి కృతజ్ఞత చెపుతున్నానని అన్నాడు.
ఇలాంటి హత్యలన్నీ దైవాజ్ఞలుగా చూపారు. (సుర 8.68) అప్పటినుండీ తనకు ప్రమాదం అనుకున్న శత్రువులను నిర్మూలించటం మహమ్మద్ చర్య అయింది. రహస్య సంభాషణలు కూడా ప్రవక్తకు నివేదించారు. వాటి ఆధారంగా క్రూరమైన, విచక్షణా రహితమైన శిక్షలు వేశారు.
ఆప్స్ ముఠాకు చెందిన అస్మాబిన్ మార్వాన్ అనే కవయిత్రిని మహమ్మద్ శిక్షించాడు. ఇస్లాం పట్ల తన అసమ్మతిని ఆవిడ దాచుకోలేదు. సొంత ప్రజలతో పోరాడిన కొత్త వ్యక్తిని నమ్మటం ఎంత దోషమో ఆవిడ కవితల్లో రాసింది. (రాడిన్ సన్ ఉదహరించాడు. మహమ్మద్, న్యూయార్క్ 1980, పేజి. 157-58)
ఆవిడ కవితలు విన్న మహమ్మద్ మార్వాన్ కుమార్తెను అడ్డు తొలగించేవారు ఎవరూ లేరా అన్నాడు. ఉమాయర్ ఇబ్న అనే ముస్లిం ప్రవక్త కోర్కె తీర్చదలచుకున్నాడు. ఒకనాటి రాత్రి రచయిత్రి తన పిల్లలతో నిద్రిస్తుండగా, ఒక బిడ్డ పాలు తాగుతుండగా ఆ పసిపాపను లాగేసి కత్తితో పొడిచి కవయిత్రిని చంపాడు. మరునాడు ఉమాయద్ ను ఉద్దేశించి మసీదులో ప్రార్థనల వద్ద మహమ్మద్ అడిగాడు. మార్వాన్ కుమార్తెను చంపావా అని, అందుకతడు అవునన్నాడు. ఐతే భయపడాల్సిందేమైనా ఉందా అంటే అతడు లేదన్నాడు. అప్పుడు మసీదులో చేరిన ముస్లింల ఎదుట అతడిని పొగుడుతూ దేవునికీ, ప్రవక్తకూ సేవచేసినందుకు మహమ్మద్ మెచ్చుకున్నాడు. స్ట్రెగర్ ఈ విషయమై రాస్తూ మిగిలిన కుటుంబాన్ని బలవంతంగా ఒప్పించి ఇస్లాంలో చేర్చాడన్నాడు.
ప్రవక్తను విమర్శించే రాతలు రాసిన అబూ అఫక్ అనే అతను ఖజరైట్ ముఠాకు చెందిన శతవృద్ధుడు. నిద్రిస్తున్న అతనిని చంపేశారు.
యూదులపై దాడి చేయటానికి ఏదో ఒక వంక చూస్తున్న మహమ్మద్ కు మార్కెట్ వద్ద కలహం ఒకటి అక్కరకు వచ్చింది. యూదుల ముఠాకు సంబంధించిన బాను ఖానూక వారి ఇళ్ళను చుట్టుముట్టారు. ఒకవైపున స్నేహపూరిత ఒడంబడిక ఉన్నా కలహం తీర్చటానికి మహమ్మదేమీ చేయలేదు. యూదులు లొంగిరాగా వారిని చంపివేయటానికి రంగం సిద్ధమైంది. ఖజరైట్ నాయకుడు అద్అల్లా ఉభయ్ కోరికపై మహమ్మద్ ఊరుకున్నాడు. కాని వారి ఆస్తులను సైన్యం పంచుకొనగా 5వవంతు మహమ్మద్ స్వీకరించాడు. అప్పుడు మహమ్మద్ కు అందిన దైవాజ్ఞ సుర 3-12-13గా ప్రస్తావించారు. నమ్మకం లేని వారితో ఇలా చెప్పు. నీవు ఓడిపోతావు, నరకానికి పోతావు. అది పాపపంకిలమైన చోటు. తరువాత మక్కా వాణిజ్య ప్రయాణీకులపై దాడులు కొన్ని చేసినా అవేమంత ఫలించలేదు. కొన్నాళ్ళు ఊరుకున్నారు. కాని హత్యలు కొనసాగించారు. ప్రవక్త జీవితంలో చీకట్లు కమ్మే క్రూరత్వచర్యలవి. బాను నదిర్ కు చెందిన ఒక యూదు స్త్రీ కుమారుడు కాల్ ఇబ్న అల్ అష్రుఫ్. బదర్ యుద్ధానంతరం మక్కా వెళ్ళి అమర వీరుల స్మృతికై కవితలు రాసి మక్కావారు పగతీర్చుకోవాలని ఉద్భోధించారు. తెలివితక్కువగా అతడు మదీనాకు తిరిగి వచ్చాడు. అతడి ద్రోహచర్యలకు క్రూరత్వానికి ప్రతిచర్యగా అతణ్ణి తనకప్పచెప్పమని మహమ్మద్ ప్రార్థించాడు. అయితే బాను నదిర్ వారు కాబ్ ను కాపాడగలరు. ఎత్తుగడలతో మాత్రమే అతడిని చంపగలమని ముస్లింలు ప్రవక్తకు చెప్పారు. కాబ్ స్నేహితులవలె నటిస్తూ ఆ ముస్లింలు అతడినొక నీటి కొలను వద్దకు తెచ్చి హత్యచేసి ప్రవక్త పాదాలవద్ద తల అట్టిపెట్టారు. మహమ్మద్ వారి దైవ సేవను మెచ్చుకున్నాడు. అల్లా శత్రువుపై దాడిని చూచి యూదులు భయభ్రాంతులై ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నారు. కుట్రదారుల్లో ఒకరు ఈ విషయాలు చెప్పారు.
కాబ్ ను చంపిన తరువాత, చేతనైతే ఏ యూదునైనా చంపేయండని ప్రవక్త ప్రకటించాడు. యూదు వర్తకుడు ఇబ్న సునయనాను మహాయిమా మసూద్ చంపేశాడు. అంతకుముందు వారి కుటుంబాలకు సాంఘిక వాణిజ్య సంబంధాలుండేవి. మసూద్ సోదరుడు అలా ఎందుకు చేశావని అడిగితే మహమ్మద్ ఆజ్ఞయిస్తే నిన్నైనా చంపుతామన్నాడు. అప్పటివరకూ ముస్లింకాని అతడి సోదరుడు హువాయిన వెంటనే ఇస్లాంలోకి మారి అలాంటి స్థితికి తన అన్నను మార్చిన మతాన్ని మెచ్చుకున్నాడు. ప్రవక్త బోధనలు నిర్దాక్షిణ్యమైన మూర్ఖవాదం వైపుకు తీసుకెళ్ళాయనటానికి ఆ హత్యలే సోదాహరణాలు. (మూర్ ది లైఫ్ ఆఫ్ మహమ్మద్, పుట 240, ఎడింబరో, 1923).
యాహుద్ యుద్ధంలో ముస్లింలకు తీవ్ర ఓటమిని చూపగా ప్రవక్త పరువు బోయే స్థితి వచ్చింది. యుద్ధానంతరం మిగిలిన ఖైదీ అబూ ఉజాను, మరొక వ్యక్తి ఉత్మన్ ఇబ్న మోఘీరాంను మహమ్మద్ చంపేయించాడు.
ముస్లింల ఓటమి పట్ల హర్షాన్ని వ్యక్తం చేసిన నాదిర్ యూద్ ముఠాపై దాడిచేయాలని మహమ్మద్ తలపెట్టాడు. తాను హత్య చేస్తాననీ, దేవుడు హెచ్చరిక పంపినట్లు మహమ్మద్ పేర్కొని పది రోజుల్లో మదీనా వదలి వెళ్ళమని లేకుంటే చావుకు సిద్ధం కమ్మని చెప్పాడు. కొన్ని వారాల ముట్టడి అనంతరం యూదులు లొంగిపోగా వెళ్ళటానికి వారికి అనుమతి యిచ్చారు. వారు వెళ్ళి ఖఖర్ యూదులతో చేరారు. రెండేళ్ళ అనంతరం వారందరినీ మూకుమ్మడిగా చంపేశారు. యూదులపై విజయాన్ని సుర 59 సుదీర్ఘంగా ప్రస్తావిస్తుంది. నదిర్ వదలి వెళ్ళిన సందర్భంగా సంపన్నమైన భూముల్ని ముస్లింలు పంచుకోగా మహమ్మదుకు లభించిన వాటాతో ఆర్థికంగా అతడు స్వతంత్రడయ్యాడు.
627లో మక్కా వాసులూ, వారి మిత్రులూ మదీనాపై దండయాత్ర మొదలుపెట్టారు. రెండు వారాలకే ముగిసిన ఈ ముట్టడి ట్రెంచ్ యుద్ధంగా పేరొందింది. మదీనా చివరిలో మిగిలిన బానుక రాజ్య యూదు జాతి నగర రక్షణకు తోడ్పడి మొత్తం మీద తటస్థంగా ఉన్నారు. అయినా వారి విధేయతను సందేహించి ముట్టడి అనంతరం మహమ్మద్ వారిపై దాడి ప్రారంభించాడు. బానుక రాజ్య ముఠావారు వట్టి చేతులతో మదీనా వదలి వెళ్ళటానికి అంగీకరిస్తూ లొంగిపోయారు. ఎలాంటి నిబంధనలు లేకుండానే లొంగిపోవాలని మహమ్మద్ చెప్పాడు. యూదులు తమ లోగడ సావాసాన్ని బాను ఆవాస్ ముఠాకు గుర్తు చేస్తూ వారి నాయకుడు అబూలు బాబాను సందర్శించమని కోరారు. మహమ్మద్ ఉద్దేశాలు తెలుసుకోమన్నారు. అబూలూ బాబా గొంతు నులిమినట్లు చూపిస్తూ ప్రాణం ఉన్నంత వరకూ పోరాడి బయటపడడం ఒక్కటే మార్గమని చెప్పాడు. బాను అవాస్ ముఠావారు తమ భవిష్యత్తును నిర్ణయించాలంటూ యూదులు లొంగిపోయారు. బాను ఆవాస్ ముఠాలో ఒకరు నిర్ధారణ చేయాలని మహమ్మద్ నిర్ణయించి సాద్ ఇబ్న మాద్ ను నిర్ణేతగా ప్రకటించారు. ట్రెంచ్ యుద్ధంలోదెబ్బతిన్న సాద్ తీర్పు చెప్పాడు. పురుషులందరినీ చంపేసి, స్త్రీలు, పిల్లలనూ బానిసలుగా అమ్మేసి ఆస్తిపాస్తుల్ని సైన్యాన్ని పంచుకోమన్నాడు. ఆ తీర్పు తనదిగానే మహమ్మద్ భావించి దేవుడు అలాంటి తీర్పు సాద్ ద్వారా ఇచ్చినట్లు చెప్పాడు.
ఆ రాత్రి శవాలను పూడ్చటానికి నగర మార్కెట్టు వద్ద కందకాలు తవ్వారు. మర్నాడు ఉదయం 5, 6 గురిని ఒక్కొక్క జట్టుగా తీసుకురమ్మని మహమ్మద్ ఉత్తరువులిచ్చాడు. తలలు నరికి కందకాలలో పడేశారు. ఈ కసాయిపని పొద్దుపోయేవరకు సాగింది. సుమారు 800 మందిని అలా చంపిన తరువాత మార్కెట్ స్థలం అంతా రక్తసిక్తంకాగా మహమ్మద్ భయానక దృశ్యం నుండి ఊరటకై వెళ్ళిపోయారు. చనిపోయిన ఒకతని భార్య రెహనా సొగసులు అనుభవించటానికి అతడు ఉపక్రమించాడు. (మూర్. పుట 307, 308 లైఫ్ ఆఫ్ మహమ్మద్)
సంపద అంతా పంచుకున్నారు. బానిస యువతులను బహుమతులుగా ఇచ్చారు. స్త్రీలను అమ్మారు. ఆస్తులను వేలం వేశారు. యూదులను శిక్షించిన తీరు సమర్థిస్తూ దైవ పిలుపులందాయి. సుర. 33.25 యూదులకు సహాయపడిన వారి మధ్య నుండి వచ్చి వారిలో భయకల్పితాలను సృష్టించి కొందరిని చంపి, కొందరిని బందీలుగా చేశారు.
క్రూరత్వం, ఆటవికత్వం, అమానుషత్వం గురించి ఆధునిక చరిత్రకారులు భిన్నరీతులు అవలంబించారు.
మంచి చెడుల విచక్షణ గమనించేవారు. ఆటవిక చర్యను ఖండించారు. టార్ ఆండ్రీ, హెచ్.జి.హిర్ష్ బర్గ్, సాలో బేరన్, విలియం మూర్ ఈ కోవకు చెందినవారు. గత 60 సంవత్సరాలలో టార్ ఆండ్రీ రాసిన మహమ్మద్ జీవిత చరిత్ర ప్రధానమైనదిగా భావించారు. అతడు అరమరికలు లేకుండా అమానుష తీర్పుకు ప్రవక్తను ఖండించారు. నైతిక సత్తా, చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తించినట్లు చూపాడు. ఐతే, మహమ్మద్ క్రూరత్వం ఆండ్రీ వివరణలో మరొక కోణం నుండి పరిశీలించటం కూడా గమనించాలి. యూదుల ఆగ్రహం, మహమ్మదును నిరాకరించటం అతడికి జీవితంలో గొప్ప నిస్పృహ కలిగించాయని అన్నాడు. (టోర్ ఆండ్రీ పుట 218, మహమ్మద్, అనువాదం టి. మెంజెల్, న్యూయార్క్, 1955)
వాట్ వంటి పండితులు ప్రవక్తను పూర్తిగా వదిలివేయటం ఆశ్చర్యకరమే. లార్డ్ ఆక్టన్ ఇలాంటి సందర్భాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి దుష్టుడికి ఒక పండితుడు అన్నిటినీ ఆకళింపు చేసుకొనే ధోరణిలో లభిస్తాడు అన్నారు. ప్రవక్త అమాయకత్వాన్ని ఆమోదించటం కష్టం అని రాడిసన్ అన్నాడు. ప్రవక్త ప్రవర్తనలో యూదుల పట్ల ఎన్నడూ దయలేదు. ప్రారంభదశ నుండే యూదులను బహిష్కరించాలనే ధోరణిలో మహమ్మద్ ఉన్నాడని మోషేగిల్ చెప్పాడు. వివిధ యూదులను చంపటమేకాక ముస్లింలకు దొరికిన యూదులను హతమార్చమని కూడా అతడు చెప్పాడు. అబూలు బాబా సంజ్ఞ చేసినట్లు, బానుకు రాజా ముఠా గతి ముందే నిర్థారణ అయిపోయింది. సాద్ ను నిర్ణేతగా ఎంపిక చేయటం కూడా అనుకోకుండా జరిగింది కాదు. కురజాకు వ్యతిరేకంగా జరిగిన ముట్టడిలో అతడు గాయపడ్డాడు. (తరువాత కొద్ది రోజులకే చనిపోయాడు) అతడు ముస్లిం భక్తుడు. మహమ్మదుకు ఛాందస అనుచరుడు అనికూడా ఆండ్రీ రాశాడు. సాద్ తీర్పును మహమ్మదు పూర్తిగా ఆమోదించటంలోనే విషయం తేటతెల్లమయింది.
నైతిక, సాంస్కృతిక సాపేక్షవాదులు నాటి కురాజా వ్యవహారాలను నేటి నైతిక ప్రమాణాలతో కొలవరాదని అంటున్నారు. ఆనాటి యుద్ధ నియమాల కాఠిన్యతను బట్టి అవేమీ అనూహ్యమైనవి కాదన్నారు. (స్టెల్ మన్, ది జ్యూస్ ఆఫ్ అరబ్ లాండ్స్, ఫిలడెల్ ఫియా, 1979, పుట 16) నేటి కాలానికి సాపేక్షవాదం చికిత్సగా ఎలా చూపుతున్నారో ఇంతకు ముందే ప్రస్తావించాం. మళ్ళీ చివరి అధ్యాయంలో వీటిని పరిశీలిద్దాం. ప్రస్తుతం కొన్ని తార్కిక విషయాలు చూద్దాం.
సాపేక్షవాదం చెప్పటానికి వీలులేదు. సాపేక్షవాదంలోనే సాపేక్షత లేదు. అందులో బాహ్య సత్యమూ లేదు. కేవలం సత్యం అనేదే ఉన్నదని నిర్ధారణ చెపుతున్నారు. (జహన్, బెగ్లూ, కన్వర్ జేషన్ విత్ ఇసాయా బెర్లిన్, లండన్, 1991, పుట. 107) సాపేక్షవాదంలో అంతర్గతంగానే కుతర్కం ఉన్నది. మన కాలానికీ, ప్రాచీన కాలానికీ మధ్య కలియడానికి వీలులేనంత తేడా ఉంటే పాత వాటిపై నైతిక నిర్ణయాలు చేసి వ్యతిరేకంగా చెప్పటంతప్పు అంటే, అనుకూలంగా చెప్పటం కూడా అంతే తప్పు. 20వ శతాబ్దం దృష్ట్యా, గత సమాజాన్నీ లేదా వ్యక్తినీ పొగడలేము. ఐనప్పటికీ సాపేక్షవాదులు మహమ్మదుపట్ల విలువలతో కూడిన పదాలు ప్రయోగించారు. దయామయం అని రాడిన్ సన్, కురాజాగతి చాలా ఘోరమయిందనీ నార్మన్ స్టిల్ మన్ అనటంలో వారు ఏ దృష్టితో చూచినట్లు ? 20వ శతాబ్దమా ? 7వ శతాబ్దమా ? యుద్ధ నియమాలు కర్కశమైనవని స్టిల్ మన్ అన్నప్పుడు ఏ దృష్టితో కర్కశమైనది ?
చరిత్రను కేవలం తటస్థరీతులలో రాయగలిగితే మంచిదే గాని, అసంభవం స్టిల్ మన్ రాసిన ది జ్యూస్ ఆఫ్ ఆరబ్ లాండ్స్ లో సహనం వంటి నైతిక అంచనాలతో కూడిన పదాలున్నాయి. మహమ్మదును గురించి ఆదాం కుమారులలో అత్యున్నతుడు అంటూ వాడిన పదాలు సాపేక్షవాదికి తగ్గవి కావు. (వాట్)
సాపేక్షవాదం సరైనదైతే జీసస్ క్రైస్త్, సోక్రటీస్, సాలోన్ లను హిట్లరుతో పోల్చకూడదు. జీసస్ నైతికంగా హిట్లర్ కంటే ఉన్నతుడని చెప్పటం అసమంజసమే. నీతి కేవలం సాపేక్షమైతే అమెరికా పౌరులు, బ్రిటిష్ ప్రజలు బానిసత్వాన్ని నిరాకరించి యూదులను బాధించటం ఆమోదించకపోవచ్చు. కాని అవన్నీ కేవలం దోషాలని అనలేము. వాటిని ఆపటం కూడా వారొక్కరి సొత్తేం కాదు. (హాగ్ బిన్ పుట 256, మ్యాన్ అండ్ కల్చర్)
స్టిల్ మన్ ప్రతిపాదను బట్టి చూస్తే ఒక కాలం నాటి స్త్రీ పురుషులను ఆ కాలానికి వారు అంటి పెట్టుకుని ఉన్నందుకు విమర్శించలేము. అంటే, నైతిక ఆరోపణలను వ్యక్తికి బదులు కాలానికి అన్వయించటమేనన్నమాట. మహమ్మదును సమర్ధించటానికి ఇది పనికిరాదు. ఆటవిక కాలంలో మహమ్మదు ఉంటే ఆటవికుడౌతాడు. సమాజంలో ఇతరులవలె అతడూ ఉంటాడు. (సాపేక్ష వాది కాలాన్ని నిందించలేడు.)
కొన్ని ప్రాపంచిక అనుభవ పరిశీలనలను చూద్దాం.
1.7 శతాబ్దంలో అరేబియా మనకంటే నైతికంగా ఎంతో ఎడంగా ఉన్నదనటం సరికాదు. స్టిల్ మన్ వ్యాఖ్య అతిపోకడలతో ఉన్నది. మూర్ ఇలా అన్నాడు. (ది లైఫ్ ఆఫ్ మహమ్మద్ పుట 241, నోట్ 1, ఎడింబరో, 1923) ఇబ్న సునయన అనే యూదును చంపటం వంటి సంఘటనల దృష్ట్యా కొంతమంది ముస్లింలకు ఇలాంటి నేరారోపణలు రావచ్చు. వారు చెప్పింది సంప్రదాయ రికార్డులలో లేదు. మదీనా గవర్నర్ మర్వన్ ఒకనాడు కాబ్ తెగ నుండి మతం మారిన బెంజమన్ను నీవెలా చావును ఎదుర్కొంటావు అని అడిగాడు. విద్రోహంతో అని అతను సమాధానం చెప్పాడు. ఈ విషయాన్నే రాడిన్ సన్ కూడా పేర్కొన్నాడు. ప్రవక్త అమాయకత్వాన్ని ఆమోదించటం కష్టం అనీ, వివరాలు ఇలా ఉన్నాయనీ చెప్పాడు. (రాడిన్ సన్, మహమ్మద్, న్యూయార్క్, 1980, పుట. 213)
7వ శతాబ్దంలోని అరేబియా అరబ్బులకు దయ, దాతృత్వం బొత్తిగా తెలియవనటానికి వీలులేదు. ప్రజలకూ సమాజాలకూ మధ్య తేడాలను అతిశయోక్తిగా చెప్పవచ్చు. మనకు తెలిసిన ఏ సంస్కృతిలోనైనా మంచి చెడ్డలున్నాయి. సత్యాసత్యాలున్నాయి. ప్రతి సమాజం సాహసాన్ని అభినందించింది. విశ్వజనీన విలువలున్నాయి. మానవాళిని గురించి అనుభవం చెపుతున్న విషయాలే. (ఈ సయాబెర్లిన్, జహాన్, గ్లూ-లండన్, 1991, పుటః 37) ఏ శకంలోనైనా ఆటవికత్వం ఆటవికత్వమే.
విచిత్రమేమంటే క్షమాపణలోనే నిజమైన ఔన్నత్యం ఉన్నదని మహమ్మదే అన్నాడు. ఇస్లాంలో ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకొని క్షమించినవారు మంచిపని చేసినవారుగా స్వర్గానికి పోతారు. (సురః3.128, 24-22) ఐనప్పటికీ బానుకురాజ తెగపట్ల మహమ్మదలా ప్రవర్తించలేకపోయాడు.
2. చారిత్రక వ్యక్తులపై నైతిక నిర్ణయాలు ప్రకటించడానికి సుప్రసిద్ధ చరిత్రకారులు వెనుకాడలేదు. హిస్టరీ ఆఫ్ ది క్రూసేడ్స్ లో సర్ స్టీవెన్ రూంచిమన్ సుల్తాన్ బైబర్లను గురించి చెపుతూ, ఘోరమైన విధేయతలేని మోటు మనుషులని, దుష్టుడని పేర్కొన్నాడు. (ఎ హిస్టరీ ఆఫ క్రూసేడ్స్ కేంబ్రిడ్జ్, 1951-1954, పుట. 348)
బానుకు రాజ యూదులను సర్వనాశనం చేసిన తరువాత మహమ్మద్ తన దోపిడీలు, హత్యలు కొనసాగించాడు. వెలివేయబడిన బానూ, నాదిర్ ముఠావారు కాబార్ వద్ద నివాసం ఉంటుండగా ముస్లింలపై దాడి చేయమని వారు బెడోయిన్ తెగను ప్రోత్సహించినట్లు అనుమానం వేసింది. మహమ్మద్ యూదుల నాయకుడైన అబిహుకాయక్ ను చంపమని ఉత్తరువులిచ్చాడు. పడుకొని ఉండగా అతన్ని అనుచరులు చంపారు. అంతటితో సమస్యలు పరిష్కారం కాలేదని మహమ్మదు కొత్త పథకం వేశాడు. కాబార్ కు ఒక ప్రతినిధి వర్గాన్ని పంపి వాళ్ళ నాయకులు ఉసార్ జరీన్ ను మదీనాకు రమ్మని కాబా నాయకుని చేస్తామని కబురు చేశారు. అతన్ని రక్షిస్తామని హామీ ఇచ్చారు. ఉసార్ 30 మందితో ఆయుధాలు లేకుండా వెళ్ళాడు. త్రోవలో వారందరినీ ఏదో వంకతో చంపేశారు. ఒక్కరు మాత్రం తప్పించుకోగలిగారు. యూదుల గతి విన్న మహమ్మద్ తిరిగి వచ్చిన ముస్లింలను అభినందించాడు. అధర్మ ప్రజల నుండి ప్రభువు మిమ్మల్ని కాపాడాడని ప్రవక్త వారితో అన్నాడు. మరో సందర్భంలో యుద్ధం అంటే మోసమని మహమ్మద్ యుద్ధాన్ని గురించి తన తత్వం చెప్పాడు.
మహమ్మద్, అతని అనుచరులూ ఒక్కొక్కటిగా కాబార్ కోటలను ముట్టడించారు. కోటలు కూలిపోతుండగా చివరకు థామస్ కోట కూడా పట్టుబడింది. యూదుల నాయకుడు కినానా అల్ రబి, అతడి బంధువునూ మహమ్మద్ వద్ద ప్రవేశపెట్టగా బానూ నదిర్ సంపదను దాచిపెట్టారని మహమ్మద్ నిందించాడు. తను దగ్గరేమీ లేదని యూదులు అన్నారు. అప్పుడు నిజం చెప్పేవరకూ చిత్రహింసలు పెట్టమని మహమ్మద్ ఆజ్ఞాపించాడు. ఆ విధంగానే చేశారు. (స్టిల్ మన్ చూపిన ఉదాహరణలు, పుట. 147, ది జ్యూస్ ఆఫ్ అరబ్ లాండ్స్)
కాబా యూదుల ఇతర కోటల్ని అలాగే ముట్టడించి లొంగదీసుకున్నారు. ఒక నాదిర్ మాత్రం ఇందుకు మినహాయింపుగా ఉన్నది.
హత్యలూ, చిత్రహింసలు, క్రూరత్వం అనేవి మహమ్మదు నైతిక శీలాన్ని నిర్ణయించేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాలి. ఈ దుష్ట చర్యల పట్టిక సంపూర్తిగా లేదు. ముస్లిం ఆధారాల దృష్ట్యా కూడా అతని ప్రవర్తనను చాలా సందర్భాలలో పరిశీలించవలసి ఉంటుంది.
జైనబీ వ్యవహారం
ఒకనాడు ప్రవక్త తన దత్తపుత్రుడు జాయిద్ ఇంటికి వెళ్ళాడు. జాయిద్ ఇస్లాంలోకి మారిన తొలి ముగ్గురిలో ఒకడు. తన పెంపుడు తండ్రికి విశ్వాసపాత్రుడు. అతనంటే ప్రవక్తకూ గౌరవమే. జాయిద్ ప్రవక్త బంధువు. జైనబీ బింట్ జాష్ ను పెళ్ళి చేసుకున్నాడు. ఆమె అందగత్తె. మన కథకు అది ముఖ్యం.
ఆనాడు జాయిద్ ఇంట్లో లేడు. జైనబీ పలుచటి వస్త్రాలు ధరించింది. ఆమె సొగసులు కనిపిస్తున్నాయి. ప్రవక్త రాగానే తలుపులు తెరచి, లోనికి ఆహ్వానించింది. అతడికి ఆదరణ చేసే పనిలో ఉండగా ప్రవక్త ఆమె అందానికి పరవశుడయ్యాడు. ఓ దేవా, నీవు మనుషుల హృదయాల్ని ఎలా ఆకర్షిస్తున్నావు అని ఆమెను చూసి ప్రవక్త అనుకున్నాడు. లోనికి రాకుండా కలవరపడి ప్రవక్త వెళ్ళిపోయాడు. అతడు తనలో తాను అనుకున్న మాటలు విన్న జైనబీ తన భర్తకు జాయిద్ కు చెప్పింది. జాయిద్ తక్షణమే ప్రవక్త దగ్గరకు వెళ్ళి, తన భార్యకు విడాకులిస్తానని, స్వీకరించమని ప్రవక్తను కోరాడు. మహమ్మద్ నిరాకరించాడు. నీ భార్యను అట్టిపెట్టుకో, దేవునిపట్ల భయభక్తులతో మసలుకో అని చెప్పాడు. మహమ్మద్ ఆమెపట్ల ఆకర్షితుడు కావడం గ్రహించిన జాయిద్ తన భార్యకు విడాకులిచ్చాడు. జనాభిప్రాయానికి జంకిన మహమ్మద్ తటపటాయించాడు. దత్తపుత్రుడు అన్ని విధాలా సొంత కొడుకే కనుక అతని భార్యను స్వీకరిస్తే ఆనాటి అరబ్బుల దృష్ట్యా లైంగిక అపచారం చేసినట్లే. కాని, యథాప్రకారం, సమయానికి దైవాజ్ఞ రాగా, విచక్షణ గాలికి వదిలేశాడు. మహమ్మద్ తన భార్య ఆయేషా చెంత ఉండగా, మోహనిద్రావస్థలోకి వెళ్ళి మూర్ఛలు చూచాడు. కోలుకున్న తరువాత ఇలా అన్నాడు. జైనబీ దగ్గరకి అభినందనలు తెలపడానికి ఎవరు వెడతారు... ఆమెనూ, నన్నూ దేవుడు వివాహం ద్వారా కలిపాడు. (సుర 33.2-33-7)
దత్తపుత్రుడిని నీ సొంత కొడుకు వలే దైవం సృష్టించలేదు. దత్తపుత్రులు తండ్రిపేరు చెప్పుకుంటారు. దైవ న్యాయమది.
దేవుడు దేవతలు నిర్ణయించిన తరువాత, ఆ విషయంలో మానవుడి ఎంపిక ఉండదు. నీ భార్యను నీవు అట్టిపెట్టుకో అన్నప్పుడు దైవ నిర్ణయాన్ని నీవు దాచి పట్టావు. దేవుడికి బదులు జనాభిప్రాయానికి భయపడ్డావు. జాయిద్ విడాకులు ఇచ్చినప్పుడు ఆమెను నీకిచ్చి పెళ్ళి చేస్తాం. దత్తపుత్రుల భార్యల్ని పెళ్ళి చేసుకోవడం భక్తులకు తప్పుకాదు. దైవనిర్ణయం శిరసావహించాలి. మహమ్మద్ దైవదూత. తుది ప్రవక్త.
ప్రవక్త భార్య ఆయేషా ఈ వ్యవహారంలో స్పందించి నీ దేవుడు నీ ప్రార్థనలను వెంటనే విన్నట్లున్నదని వ్యాఖ్యానించింది.
ఈ ఉదంతాన్ని ఎలా సమర్థిస్తారు.... రాజకీయ కారణాలుగా ఈ పెళ్ళి జరిగిందని వాట్ వంటివారి వాదించారు. మహమ్మద్ ప్రవర్తనలో లైంగిక అపచారం లేదన్నారు. అప్పుడు జైనబీ వయస్సు 35 సంవత్సరాలు. కనుక అంత కోరదగిందేమీ కాదన్నారు. అలా అనడం అర్థరహితం. ముస్లిం ఆధారాలలో ఈ ఉదంతమంతా లైంగిక వ్యాఖ్యానాలతో ఉంది. జైనబీ అందం, ఆమె దుస్తులు స్వల్పంగా ధరించడం, గాలికి తొలగిన దుస్తులవలన ఆమె సొగసులు కనిపించడం, మహమ్మద్ కలవరపడడం ఇందులో గమనార్హం. మహమ్మద్ అనుచరులలో కొందరు ఆత్రుత చెంది ఉండవచ్చు. నీతి బాహ్యతకు వారు ఆత్రుత చెందలేదు. ఆనాడున్న సాంఘిక నిషిద్ధానికి విరుగుడుగా దైవాజ్ఞ చూపడం పట్ల వారు ఆత్రుత చెందలేదు.
రాడిసన్ ఇలా రాశాడు
మహమ్మద్ హమీదుల్లా ఈ విషయమై సాకు చెబుతూ, అలాంటి అందగత్తెతో జాయిద్ కాపురం చేయలేకపోవచ్చన్నాడు. అది అనౌచిత్యం, గ్రంథంలో ఇందుకు విరుద్ధంగా ఉంది. ఖురాన్ ప్రస్తావన సంక్షిప్తంగా ఉన్నా, దైవాజ్ఞ పాటించాలనే ప్రవక్త నిర్ణయించాడు. జనాభిప్రాయానికే జంకాడు. హమీదుల్లా సిద్ధాంతాన్నిబట్టి పిడివాదంగా ప్రబలిన సిద్ధాంతాలను ఇంకోరకంగా అన్వేషించబూనడం ఆశ్చర్యం. (రాడిసన్ పుట 207-208 మహమ్మద్ న్యూయార్క్ 1980)
మహమ్మద్ తన భార్యలతో ఒక్కొక్క రాత్రి ఒకరివద్ద గడుపుతూ వారిలో ఈర్ష్యలు ప్రబలకుండా చూడదలచాడు. హప్సా వద్దకు వెళ్ళవలసిన రోజున ఆమె తన తండ్రిని చూడడానికి పోయింది. అనుకోకుండా తిరిగి వచ్చింది. పక్కలో మహమ్మద్ తో బాటు కోప్టిక్ స్త్రీ మేరీ ఉన్నది. ఆమె చట్టబద్ధమైన ఉంపుడుకత్తె. హప్సా ఆగ్రహంతో మహమ్మద్ ను దూషించింది. అంతఃపురంలో అందరికీ నిజం చెప్పేస్తానన్నది. మేరీకి దూరంగా ఉంటానని, ఊరుకొమ్మని మహమ్మద్ ఆమెను బ్రతిమలాడాడు. హప్సా ఊరకుండలేక ఆయేషాతో చెప్పింది. ఆమెకూ మేరీ అంటే అసహ్యమే. ఆ వార్త అంతఃపురమంతటా పొక్కింది. భార్యల వద్ద మహమ్మద్ పరువు పోయింది. జైనబీ వ్యవహారంలో వలె దైవాజ్ఞ గృహసమస్యలో అతడిని ఆదుకున్నది. మేరీతో సంబంధం పెట్టుకోరాదన్న మాటను దైవాజ్ఞ కొట్టిపారవేయగా, భార్యల్ని వారి ప్రవర్తనకు గర్హించింది. అందరికీ విడాకులిచ్చి అణకువగా ఉండేవారిని చేసుకుంటానని బెదిరించాడు. మేరీని తీసుకుని భార్యలకు దూరంగా, ఒక మాసం గడిపాడు. ఉమర్, అబూబకర్ జోక్యంతో మళ్ళీ శాంతించి, భార్యల్ని మహమ్మద్ క్షమించాడు. అంతఃపురంలో శాంతి నెలకొంది. సుర 66.15 ఇలా అంటున్నది.
ఓ ప్రవక్తా, దైవం చట్టబద్ధంగా నీకిచ్చిన మేరీని నీవెందుకు వదలుకుంటావు. నీ భార్యల్ని సంతృప్తి పరచడానికా, దైవం క్షమిస్తాడని, దయామయుడనా ? నీ ప్రతినలు దైవం తిప్పి చూచింది. ప్రవక్త తన రహస్యాన్ని తన భార్యలలో ఒకరికి వెల్లడిస్తే ఆమె అందరికీ చెప్పింది. దైవం ఇలా చెప్పింది. నీ భర్త విడాకులిస్తే, అణకువతో దైవాన్ని కొలిచే భార్యల్ని అతనికి ఇస్తాడు. భక్తిగా ఉపవాసాలు చేస్తూ పశ్చాత్తాప పడేవారినిస్తాడు. లోగడ పెళ్ళాడిన స్త్రీలే వారు.
పవిత్ర పుస్తకంలో అతి ఘోరమైన విషయంగా మూర్ వ్యాఖ్యానించాడు. అయినా అది గౌరవంగా చదువుతున్నారు. ఇంటా బయటా ఖురాన్ లో ఇది పఠిస్తున్నారు. (మూర్ లైఫ్ ఆఫ్ మహమ్మద్ పుట 414, ఎడిన్ బర్ 1923)
సైతాను పాఠాలు
సైతాన్ పాఠాలు గురించి అల్ తబారి, వాఖిడి వంటి ముస్లిం పండితులు పేర్కొన్న ఆధారాలున్నవి. మూర్ 1850 ప్రాంతాల్లో ఈ పేరు వాడగా, నేడది సుప్రసిద్ధమైంది. మదీనాకు పారిపోకముందు, మక్కాలో మహమ్మద్ కొందరు సుప్రసిద్ధ వ్యక్తుల మధ్య కాబా వద్ద ఆసీనుడై ఉన్నాడు. సుర 53లో పాఠాన్ని చదవనారంభించాడు. మహమ్మద్ వద్దకు గాబ్రియేల్ వచ్చినప్పటి విషయం అదంతా తరువాత మరోసారి సందర్శిస్తాడు. ఒక దశలో రాజీ ధోరణి సూచించే మాటల్ని సైతాన్ అతని నోటి ద్వారా చెప్పిస్తాడు. తమ దేవతల్ని గుర్తించినందుకు మక్కావాసులు ఆనందించారు. కానీ గాబ్రియేల్ వచ్చి అలా చేసినందుకు మహమ్మద్ ను నిరసించి, పాఠాంతరం నిజంగా ఎలా ఉండాల్సిందీ చెప్పాడు.
ఈ కథ గురించి ముస్లింలు ఇబ్బంది పడుతూ వచ్చారు. ప్రవక్త అలాంటి దేవతారాధన పట్ల రాజీ పడ్డాడంటే నమ్మలేక పోయారు. ముస్లిం ఆధారాలను నమ్మితే, ఈ కథను నిరాకరించవలసిన అవసరం లేదు. అల్ తబారి వంటి ముస్లిం భక్తుడు అటువంటి కథను అల్లడుగదా మోసపూరిత ఆధారమైతే అతడు సైతం ఆమోదించేవాడే కాదు. (వాట్, ముస్లిం క్రిష్టియన్ ఎన్ కౌంటర్స్ పేజి. 114-15, లండన్, 1991) అబిసేనియా పారిపోయిన ముస్లింలు ఎందుకు తిరిగివచ్చారో ఈ కథ వివరిస్తుంది. మక్కా వాసులు మారారని వారూ విన్నారు. మహమ్మద్ హఠాత్తుగా ఈపని చేయలేదు. మక్కావాసుల మద్దతు కోసం జాగ్రత్తగా పథకం ప్రకారం చేసాడు. మహమ్మద్ చిత్తశుద్ధిని శంకించే విషయం కూడా ఇది. సైతాను నిజంగా ఆ మాట విని మహమ్మద్ చే చెప్పించినా, అంత సులభంగా కొట్టుకుపోయే వానిని ఎలా విశ్వసిస్తాం... దేవుడు అలా ఎందుకు చేయనిచ్చాడు... అలాగే మహమ్మద్ దారి తప్పిన ఉదంతాలు లేవని ఎలా అనుకోగలం...
హుదాబియాలో శాంతి
తన సూత్రాలను రాజీ పెట్టినందుకు మహమ్మద్ ను అనుచరులు మరోసారి కూడా విమర్శించారు. మదీనాలో తన స్థితి కుదుటబడిన తరువాత, మక్కాను స్వాధీన పరచుకోవచ్చని మహమ్మద్ భావించాడు. కాని సమయం ఆసన్నం కాలేదని, సూత్రాలు వాడరాదు. మక్కావారితో చేసుకున్న ఈ ఒప్పందాన్ని ఉత్తరోత్తరా మహమ్మద్ పక్కన బెట్టాడు.
డా.మార్గోలియత్ ప్రస్తావనలు ఈ సందర్భంగా మనం అవగాహన చేసుకోవచ్చు. ఇబ్న ఇషాక్ రాసిన మహమ్మద్ జీవితచరిత్ర గురించి రాస్తూ ఇలా అన్నాడు. (మహమ్మద్, రెలిజియన్ అండ్ ఎథిక్స్ ఎన్ సైక్లోపేడియా 8వ సంపుటి పుట 878 ఆర్ట్)
ఇబ్న ఇషాక్ రాసిన మహమ్మద్ జీవితంలో అతడి శీలాన్ని గురించి వ్యతిరేక ధోరణి కనబడుతుంది. లక్ష్యసాధనకు అతడు వక్రమార్గాలు అనుసరిస్తాడు. తన అనుచరుల్ని కూడా అలా చేయనిచ్చాడు. మక్కా వాసుల వీరోచిత స్వభావాన్ని బాగా వాడుకున్నాడు. హత్యలు మూకుమ్మడి మరణాలు చేయించాడు. దోపిడీ నాయకుడుగా మదీనాలో వ్యవహరించాడు. దోచిన సొత్తు పంచుకున్నాడు. అందులో అనుచరులకు న్యాయం చేకూర్చలేదు. తాను యధేచ్ఛగా విహరించి, అనుచరులనూ అలాగే ప్రోత్సహించాడు. చేసిన ప్రతిదానికి దైవ ప్రేరణగా చెప్పేవాడు. తన రాజకీయ లక్ష్య సాధనకోసం ఏ సిద్ధాంతానికైనా తిలోదకాలిచ్చేవాడు. మత స్థాపకుడికి ఇది తగిందికాదు. ఒకదశలో దైవ ఏకత్వం, ప్రవక్తననే మాట వదిలేశాడు. ఇదంతా శత్రువులు చెప్పింది కాదు. సంప్రదాయవాదులు ఇబ్న ఇషాక్ ను అంత గౌరవించకపోయినా, అతడు రాసిన ప్రవక్త జీవితాన్ని కాదనలేదు.
ఖురాన్ సిద్ధాంతాల పరిశీలనతో గాని మహమ్మద్ అంచనా పూర్తికాదు.
- - --
Thursday, March 13, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment